డేటా అనలిస్టులకు ఎంఎన్‌సీల బంపర్‌ ఆఫర్స్‌ | What Does Data Analyst Do: Responsibilities, Skills, Job Description in Telugu | Sakshi
Sakshi News home page

డేటా అనలిస్టులకు ఎంఎన్‌సీల బంపర్‌ ఆఫర్స్‌

Published Wed, Jun 16 2021 5:00 PM | Last Updated on Wed, Jun 16 2021 5:09 PM

What Does Data Analyst Do: Responsibilities, Skills, Job Description in Telugu - Sakshi

డేటా సైన్స్‌.. బిగ్‌ డేటా.. డేటా అనలిటిక్స్‌.. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విభాగాలు! కారణం.. డేటాకు ఎనలేని ప్రాధాన్యం పెరగడమే!! నేటి ఈ కామర్స్‌ ప్రపంచంలో డేటా భారీగా తయారవుతోంది. ఈ డేటా తిరిగి మళ్లీ బిజినెస్‌ నిర్ణయాలకు దోహదపడుతోంది. విస్తృతమైన డేటాను విశ్లేషించి.. ఉపయుక్తమైన ప్యాట్రన్స్‌ గుర్తించి.. దాని ఆధారంగా కంపెనీలు కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో డేటా విశ్లేషణ నైపుణ్యం ఉన్న నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్‌ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్‌ అభ్యర్థులకు డేటా అనలిటిక్స్‌ అద్భుతమైన కెరీర్‌ అవకాశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. డేటా అనలిస్టుల విధులు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం...

అపరిమితమైన, విస్తృతంగా ఉండే సమాచారాన్ని బిగ్‌ డేటా అంటారు. ఇది చాలా సంక్షిష్టంగా ఉంటుంది. రోజురోజుకూ భారీగా పోగవుతున్న ఇలాంటి టెరాబైట్ల డేటా నుంచి బిజినెస్‌ నిర్ణయాలకు అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని, ప్యాట్రన్స్‌(నమూనాలు)ను గుర్తించి,సంగ్రహించే టెక్నిక్‌ లేదా టెక్నాలజీనే డేటా అనలిటిక్స్‌ అంటున్నారు. డేటా అనలిటిక్స్‌ నిపుణులు.. క్లిష్టమైన భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించి.. అందులోంచి ఉపయోగకరమైన సమాచారాన్ని వెలికి తీసి.. ఆయా కంపెనీలు సరైన వ్యాపార నిర్ణయం తీసుకునేలా సహకరిస్తారు. డేటా అనలిస్ట్‌లు డేటా సేకరణ, సంగ్రహణ, విశ్లేషణను విజయవంతంగా, ఖచ్చితత్వంతో పూర్తిచేసే నైపుణ్యాలు కలిగి ఉంటారు. 

సేకరణ.. విశ్లేషణ
► గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌ వంటి టాప్‌ కంపెనీలెన్నో డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్స్‌ నిర్వహిస్తున్నాయి. కస్టమర్స్‌ ఎలాంటి వస్తువులు కొంటున్నారు.. వేటికోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.. వారి ఆసక్తులు, అభిరుచులు.. ఇలాంటి సమాచారాన్ని సంస్థలు సేకరించి భద్రపరుస్తుంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ ఈ డేటాను బయటకు తీసి.. సాంకేతిక పద్ధతుల ద్వారా విశ్లేషించి.. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు తగ్గ వస్తు,సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వ్యాపార విస్తరణలో ముందుంటాయి. 

► డేటా అనలిటిక్స్‌ నిపుణులు.. భద్రపరిచిన డేటా నుంచి ఉపయుక్తమైన ప్యాట్రన్‌లను గుర్తించి విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీలు మరింత సమర్థమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉపయుక్తమైన డేటాను గుర్తించడం, సేకరించడం, విశ్లేషించడం, విజువలైజ్‌ చేయడం, కమ్యూనికేట్‌ చేయడంతోపాటు మార్కెట్‌ని అధ్యయనం చేయడం బిగ్‌ డేటా అనలిస్ట్‌ ప్రధాన బాధ్యతలుగా చెప్పొచ్చు. 


విభిన్న నైపుణ్యాలు
బిగ్‌ డేటా నిపుణుడు ఏకకాలంలో వివిధ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. నిత్యం అధ్యయనం చేయడం.. వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో ఉన్న డేటాను సేకరించడం(డేటా మైనింగ్‌).. డేటాను స్టోర్‌ చేయడం.. అవసరమైనప్పుడు సదరు డేటాను విశ్లేషించే నైపుణ్యం ఎంతో అవసరం. వినియోగదారులను ఆకట్టుకునేలా ఓ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో డేటా ఆధారితంగా ఆలోచించి, తార్కికంగా ప్రజెంట్‌ చేయగలగాలి. అందుకోసం డేటా అనలిస్టులకు సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఉండాలి. వీటితోపాటు ప్రోగ్రామింగ్‌ నాలెడ్జ్, క్వాంటిటేటివ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, విభిన్న టెక్నాలజీలపై పట్టు అవసరం. 

ప్రోగ్రామింగ్‌పై పట్టు
డేటా అనలిస్టులుగా పనిచేయాలంటే.. మొదట కొన్ని సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌పై పట్టు పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంచకున్న విభాగంలో ఏ పని చేస్తున్నారో అందుకు అవసరమైన టూల్స్‌పై శిక్షణ పొందాలి. సంబంధిత టూల్స్‌ను ముందుగానే నేర్చుకోవడం ద్వారా.. ‘ఆన్‌ ది జాబ్‌ ప్రాజెక్ట్‌’ను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు. డేటా అనలిస్ట్‌లకు ప్రధానంగా పైథాన్, సీ++, ఎస్‌క్యూల్, పెర్ల్, ఆర్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌ వంటి ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ తెలిసుండాలి. 


అనలిస్ట్‌ కావడం ఎలా
► ఐటీ, కంప్యూటర్‌ సైన్స్, మ్యాథ«మెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ/పీజీ చేసినవారికి డేటా అనలిస్టు కెరీర్‌ అనుకూలంగా ఉంటుంది. ఆసక్తిని బట్టి సంబంధిత సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేసినవారు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినా ఈ విభాగంలో రాణించవచ్చు. ముఖ్యంగా డేటాపై ఇష్టం ఉండాలి. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతోంది. కాబట్టి మార్పులకు అనుగుణంగా సరికొత్త టూల్స్‌ను నేర్చుకుంటూ,అప్‌డేట్‌గా ఉండాలి. 

► ప్రస్తుతం చాలామంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులు తమ కెరీర్‌ను మార్చుకునేందుకు అవసరాన్ని బట్టి ఆయా సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేసి.. డేటా అనలిస్టులుగా రాణిస్తున్నారు. ఇందులో హడూప్‌ అండ్‌ స్పార్క్‌ బిగ్‌ డేటా ఫ్రేమ్‌ వర్క్స్‌ను కవర్‌ చేయడంతోపాటు రియల్‌ టైమ్‌ డేటా అండ్‌ ప్యారలల్‌ ప్రాసెసింగ్, ఫంక్షనల్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ స్పార్క్‌ అప్లికేషన్స్‌ ఉంటాయి. వీటిల్లో పట్టు సాధించాలంటే.. మొదట అభ్యర్థులకు కోర్‌ జావా, పైథాన్, ఎస్‌క్యూఎల్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి. 


సర్టిఫైడ్‌ డేటా ఇంజనీర్‌
ప్రపంచ వ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్‌ పెరుగుతోంది. దాంతో చాలామంది సర్టిఫికెట్‌ కోర్సులు చేసి కెరీర్‌ ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి డేటా అనలిటిక్స్‌లో రాణించాలంటే.. డేటాపై ఆసక్తితోపాటు ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఐబీఎం లాంటి సంస్థలు సర్టిఫైడ్‌ బిగ్‌ డేటా ఇంజనీర్స్‌ కోసం ప్రత్యేకంగా మాస్టర్స్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్‌డేటా అప్లికేషన్స్‌లో హడూప్‌తోపాటు మ్యాప్‌ డిప్, హైవ్, స్క్రూప్, ఫ్రేమ్‌ వర్క్, ఇంపాలా, పిగ్, హెచ్‌బేస్, స్పార్క్, హెచ్‌డీఎఫ్‌ఎస్, యార్న్, ఫ్లూమ్‌ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి కోర్సులతోపాటు కొంత రియల్‌ టైమ్‌ అనుభవం పొందినవారు డేటా అనలిటిక్స్‌లో మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. 

పెరుగుతున్న మార్కెట్‌
ప్రస్తుతం డేటా అనలిటిక్స్‌ అనేది చక్కటి కెరీర్‌గా మారింది. డేటా అనలిస్టులకు మంచి డిమాండ్‌ ఉంది. అలైడ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ ప్రకారం–డేటా అనలిటిక్స్‌ మార్కెట్‌.. 2021 చివరి నాటికి 84.6 బిలియన్‌ డాలర్లను చేరుతుందని అంచనా. ఇంటర్నేషనల్‌ డేటా కార్ప్‌ అండ్‌ బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం–ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం 2022 నాటికి 274.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క అమెరికాలోనే లక్షన్నర మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలోనూ ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. కాబట్టి ఆయా నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు అందుకోవచ్చు. 


బిగ్‌ డేటా అనలిస్ట్‌ వేతనాలు
ఏదైనా కెరీర్‌ ఎంచుకునే ముందు వేతనంతోపాటు భవిష్యత్‌ ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. భవిష్యత్‌లోనూ డేటా అనలిస్ట్‌లకు చక్కటి అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. డేటా అనలిస్టులకు ఎంట్రీ లెవెల్‌లో సగటు వార్షిక వేతనం రూ.6.5 లక్షలుగా ఉంది. అనుభవం ఉన్నవారికి సుమారు రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement