Big Data
-
డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్
డేటా సైన్స్.. బిగ్ డేటా.. డేటా అనలిటిక్స్.. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విభాగాలు! కారణం.. డేటాకు ఎనలేని ప్రాధాన్యం పెరగడమే!! నేటి ఈ కామర్స్ ప్రపంచంలో డేటా భారీగా తయారవుతోంది. ఈ డేటా తిరిగి మళ్లీ బిజినెస్ నిర్ణయాలకు దోహదపడుతోంది. విస్తృతమైన డేటాను విశ్లేషించి.. ఉపయుక్తమైన ప్యాట్రన్స్ గుర్తించి.. దాని ఆధారంగా కంపెనీలు కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో డేటా విశ్లేషణ నైపుణ్యం ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు డేటా అనలిటిక్స్ అద్భుతమైన కెరీర్ అవకాశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. డేటా అనలిస్టుల విధులు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం... అపరిమితమైన, విస్తృతంగా ఉండే సమాచారాన్ని బిగ్ డేటా అంటారు. ఇది చాలా సంక్షిష్టంగా ఉంటుంది. రోజురోజుకూ భారీగా పోగవుతున్న ఇలాంటి టెరాబైట్ల డేటా నుంచి బిజినెస్ నిర్ణయాలకు అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని, ప్యాట్రన్స్(నమూనాలు)ను గుర్తించి,సంగ్రహించే టెక్నిక్ లేదా టెక్నాలజీనే డేటా అనలిటిక్స్ అంటున్నారు. డేటా అనలిటిక్స్ నిపుణులు.. క్లిష్టమైన భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించి.. అందులోంచి ఉపయోగకరమైన సమాచారాన్ని వెలికి తీసి.. ఆయా కంపెనీలు సరైన వ్యాపార నిర్ణయం తీసుకునేలా సహకరిస్తారు. డేటా అనలిస్ట్‌లు డేటా సేకరణ, సంగ్రహణ, విశ్లేషణను విజయవంతంగా, ఖచ్చితత్వంతో పూర్తిచేసే నైపుణ్యాలు కలిగి ఉంటారు. సేకరణ.. విశ్లేషణ ► గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి టాప్ కంపెనీలెన్నో డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్స్ నిర్వహిస్తున్నాయి. కస్టమర్స్ ఎలాంటి వస్తువులు కొంటున్నారు.. వేటికోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు.. వారి ఆసక్తులు, అభిరుచులు.. ఇలాంటి సమాచారాన్ని సంస్థలు సేకరించి భద్రపరుస్తుంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ ఈ డేటాను బయటకు తీసి.. సాంకేతిక పద్ధతుల ద్వారా విశ్లేషించి.. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు తగ్గ వస్తు,సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వ్యాపార విస్తరణలో ముందుంటాయి. ► డేటా అనలిటిక్స్ నిపుణులు.. భద్రపరిచిన డేటా నుంచి ఉపయుక్తమైన ప్యాట్రన్లను గుర్తించి విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీలు మరింత సమర్థమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉపయుక్తమైన డేటాను గుర్తించడం, సేకరించడం, విశ్లేషించడం, విజువలైజ్ చేయడం, కమ్యూనికేట్ చేయడంతోపాటు మార్కెట్‌ని అధ్యయనం చేయడం బిగ్ డేటా అనలిస్ట్ ప్రధాన బాధ్యతలుగా చెప్పొచ్చు. విభిన్న నైపుణ్యాలు బిగ్ డేటా నిపుణుడు ఏకకాలంలో వివిధ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. నిత్యం అధ్యయనం చేయడం.. వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో ఉన్న డేటాను సేకరించడం(డేటా మైనింగ్).. డేటాను స్టోర్ చేయడం.. అవసరమైనప్పుడు సదరు డేటాను విశ్లేషించే నైపుణ్యం ఎంతో అవసరం. వినియోగదారులను ఆకట్టుకునేలా ఓ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో డేటా ఆధారితంగా ఆలోచించి, తార్కికంగా ప్రజెంట్ చేయగలగాలి. అందుకోసం డేటా అనలిస్టులకు సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఉండాలి. వీటితోపాటు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విభిన్న టెక్నాలజీలపై పట్టు అవసరం. ప్రోగ్రామింగ్‌పై పట్టు డేటా అనలిస్టులుగా పనిచేయాలంటే.. మొదట కొన్ని సాఫ్ట్వేర్ స్కిల్స్‌పై పట్టు పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంచకున్న విభాగంలో ఏ పని చేస్తున్నారో అందుకు అవసరమైన టూల్స్‌పై శిక్షణ పొందాలి. సంబంధిత టూల్స్‌ను ముందుగానే నేర్చుకోవడం ద్వారా.. ‘ఆన్ ది జాబ్ ప్రాజెక్ట్’ను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు. డేటా అనలిస్ట్‌లకు ప్రధానంగా పైథాన్, సీ++, ఎస్‌క్యూల్, పెర్ల్, ఆర్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసుండాలి. అనలిస్ట్ కావడం ఎలా ► ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ«మెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ/పీజీ చేసినవారికి డేటా అనలిస్టు కెరీర్ అనుకూలంగా ఉంటుంది. ఆసక్తిని బట్టి సంబంధిత సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసినవారు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినా ఈ విభాగంలో రాణించవచ్చు. ముఖ్యంగా డేటాపై ఇష్టం ఉండాలి. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతోంది. కాబట్టి మార్పులకు అనుగుణంగా సరికొత్త టూల్స్‌ను నేర్చుకుంటూ,అప్డేట్గా ఉండాలి. ► ప్రస్తుతం చాలామంది సాఫ్ట్వేర్ నిపుణులు తమ కెరీర్‌ను మార్చుకునేందుకు అవసరాన్ని బట్టి ఆయా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసి.. డేటా అనలిస్టులుగా రాణిస్తున్నారు. ఇందులో హడూప్ అండ్ స్పార్క్ బిగ్ డేటా ఫ్రేమ్ వర్క్స్‌ను కవర్ చేయడంతోపాటు రియల్ టైమ్ డేటా అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ స్పార్క్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిల్లో పట్టు సాధించాలంటే.. మొదట అభ్యర్థులకు కోర్ జావా, పైథాన్, ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి. సర్టిఫైడ్ డేటా ఇంజనీర్ ప్రపంచ వ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. దాంతో చాలామంది సర్టిఫికెట్ కోర్సులు చేసి కెరీర్ ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి డేటా అనలిటిక్స్‌లో రాణించాలంటే.. డేటాపై ఆసక్తితోపాటు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఐబీఎం లాంటి సంస్థలు సర్టిఫైడ్ బిగ్ డేటా ఇంజనీర్స్ కోసం ప్రత్యేకంగా మాస్టర్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్‌డేటా అప్లికేషన్స్‌లో హడూప్తోపాటు మ్యాప్ డిప్, హైవ్, స్క్రూప్, ఫ్రేమ్ వర్క్, ఇంపాలా, పిగ్, హెచ్‌బేస్, స్పార్క్, హెచ్‌డీఎఫ్‌ఎస్, యార్న్, ఫ్లూమ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి కోర్సులతోపాటు కొంత రియల్ టైమ్ అనుభవం పొందినవారు డేటా అనలిటిక్స్‌లో మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. పెరుగుతున్న మార్కెట్ ప్రస్తుతం డేటా అనలిటిక్స్ అనేది చక్కటి కెరీర్‌గా మారింది. డేటా అనలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. అలైడ్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం–డేటా అనలిటిక్స్ మార్కెట్.. 2021 చివరి నాటికి 84.6 బిలియన్ డాలర్లను చేరుతుందని అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్ప్ అండ్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం–ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం 2022 నాటికి 274.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క అమెరికాలోనే లక్షన్నర మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలోనూ ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. కాబట్టి ఆయా నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు అందుకోవచ్చు. బిగ్ డేటా అనలిస్ట్ వేతనాలు ఏదైనా కెరీర్ ఎంచుకునే ముందు వేతనంతోపాటు భవిష్యత్ ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. భవిష్యత్‌లోనూ డేటా అనలిస్ట్‌లకు చక్కటి అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. డేటా అనలిస్టులకు ఎంట్రీ లెవెల్లో సగటు వార్షిక వేతనం రూ.6.5 లక్షలుగా ఉంది. అనుభవం ఉన్నవారికి సుమారు రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నారు. -
బిగ్ డేటా, ఎనలిస్టులకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన నేపథ్యంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలు ఊరట నిస్తున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేల ఉద్యోగాలు రానున్నాయని ఆన్లైన్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో అమెజాన్, సిటీ, హెచ్‌సీఎల్, గోల్డ్ మాన్ సాచ్స్ , ఐబిఎం లాంటి ప్రముఖ సంస్థల్లో ఈ ఎనలిటిక్స్ ఉద్యోగాలకు మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయని పేర్కొంది. ఎనలటిక్స్, బిగ్ డేటా ,డేటా సైన్స్ ప్లాట్‌ఫాం, ఎనలటిక్స్ అండ్ మ్యాగజైన్ , ఆన్లైన్ ఎనలిటిక్స్ శిక్షణా సంస్థ ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ సంయుక్తంగా ది ఎనలటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ 2017 పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. భారతదేశంలో ఎనలిస్టులు, డేటా సైన్స్, బిగ్ డేటాలో నియామకాలు పెరుగుతాయని ఈ అధ్యయనం తేల్చింది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో డేటా ఎనలిస్టులు ఉద్యోగాలు లభించనున్నాయిని అనలాటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ స్టడీ 2017 ప్రకారం తేలింది. దాదాపు 50వేల ఎనలిస్టు జాబ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఐటీలో తగ్గిన నియామకాలకారణంగా కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆందోళనలో ఉన్నారు. తక్కువ ఐటి నియామకం ఈ 42 శాతం మంది బీఈ / బీటెక్ గ్రాడ్యుయేట్లకు కేటాయిస్తుండగా, మరో 40 శాతం ఎంబీఏ, ఎంటెక్ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కోసం చూస్తున్నారట. దీంతో ఈ ఉద్యోగ నియామకాల్లో టైర్ -బి నగరాల్లో 2016 లో 5 శాతం నుంచి ఈ ఏడాది 7 శాతం వరకు పెరిగిందిని ఈ సర్వే తెలిపింది. అమెరికా తరువాత ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణ మరియు డేటా సైన్స్ ఉద్యోగాల్లో అవకాశాలలో 12 శాతం వాటాతో ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద విశ్లేషణ కేంద్రంగా ఉంది. వీటిల్లో అమెజాన్, సీటీ, ఐబీఎం , హెచ్‌సీఎల్ లాంటివి ఎక్కువ సంఖ్యలో ఎనలిక్స్ ఉద్యోగాలను కల్పించాయి. నగరాల పరంగా, బెంగళూరు అన్ని ఎనలిటిక్స్ ఉద్యోగాల్లో దాదాపు 25 శాతం ఉద్యోగాలతో టాప్ లోనూ, ఢిల్లీలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇక ఫెషర్స్ విషయానికి వస్తే , చెన్నై మొత్తం ఓపెనింగ్స్‌లో టాప్ లోఉంది. 2-7 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో దాదాపు 50 శాతం ఉద్యోగాలు అన్ని నగరాల్లోనూ ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అంతేకాదు ఈ ఎనలిటిక్స్, డేటా సైన్స్ ఉద్యోగాల్లో సంవత్సరానికి సగటు జీతం రూ. 10.5 లక్షలు. దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో సంవత్సరానికి రూ.10 లక్షల ఎక్కువ జీతం లభిస్తోంది. తద్వారా ఇది అత్యధిక వేతనం చెల్లిస్తున్న రంగాలలో ఒకటిగా నిలిచింది. వివిధ పరిశ్రమల్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలో నైపుణ్యం కలిగిన విశ్లేషకుల నిపుణుల డిమాండ్ పెరిగిందని ఎనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ స్థాపకుడు, సీఈవో భాస్కర్ గుప్తా చెప్పారు. ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ స్థాపకుడు, సీఈవో ఆతాష్ షా మాట్లాడుతూ డేటా సైన్స్, ఎనలిటిక్స్ విభాగం ఉద్యోగాల్లో దాదాపు 100 శాతం వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ బూం ను అందిపుచ్చుకోవాడానికి ఐటీ ఉద్యోగులు డేటా సైన్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. -
బిగ్ డేటా ఫర్ బ్రైట్ ఫ్యూచర్
విశ్లేషణ సామర్థ్యం ఆధునిక యుగంలో అత్యాధునిక ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం. డిగ్రీ ఏదైనా ఫర్వాలేదు.. మ్యాథమెటికల్ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం ఉంటే చాలు.. కళకళలాడే కెరీర్‌కు మార్గం వేస్తోంది.. బిగ్ డేటా. ఇ-కామర్స్ సంస్థల నుంచి మల్టీ నేషనల్ ఐటీ సంస్థల వరకు.. సాఫ్ట్వేర్ నుంచి కోర్ ప్రొడక్షన్ సంస్థల వరకు.. బెస్ట్ ఫ్యూచర్‌కు బిగ్ డేటా మార్గంగా నిలుస్తోంది. బిగ్ డేటా అనలిటిక్స్ ప్రధాన ఉద్దేశం విస్తృతంగా ఉండే డేటాను క్రమపద్ధతిలో అమర్చడం, విశ్లేషించడం.. దాని ఆధారంగా వినియోగదారులు కోరుకుంటున్న సేవలు, వస్తువుల గురించి నివేదికలు రూపొందించి సంస్థలోని ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ విభాగాలకు అందించడం. ఈ విధులు నిర్వహించడానికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం. కంప్యుటేషనల్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్న వారు ఈ రంగంలో అడుగుపెట్టేందుకు అవకాశం ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్‌తో మెరుగ్గా బిగ్ డేటా అనలిటిక్స్ విభాగంలో మ్యాథ్స్, సైన్స్ విభాగాల విద్యార్థులకు ఇతర విద్యార్థులతో పోల్చితే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉంటాయని నిపుణుల అభిప్రాయం. ఈ రంగంలో సైన్స్ విధ్యార్థుల హవా సాగుతోందని ఇటీవలే అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ కేర్ రేటింగ్ ఏజెన్సీ సైతం స్పష్టం చేసింది. బిగ్ డేటా రంగంలో అత్యంత కీలకమైనవి అంకెలు, గణాంకాల విశ్లేషణ. అందుకే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు సైతం కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఎందుకంటే వీరికి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అకడమిక్ స్థాయిలోనే డేటా అనాలిసిస్, డేటా మేనేజ్మెంట్ తదితర అంశాల్లో నైపుణ్యం లభిస్తుందనే అభిప్రాయం. అమెరికా తర్వాత స్థానం భారత్‌దే బిగ్ డేటా అనాలిసిస్, మేనేజ్మెంట్ పరంగా అమెరికా తర్వాత భారత్ నిలుస్తోంది. 2016లో బిగ్ డేటా నిర్వహణకు భారత సంస్థలు వెచ్చించే మొత్తం 46 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అదే విధంగా 2019 నాటికి బిగ్ డేటా మార్కెట్ విలువ 60 నుంచి 65 బిలియన్ డాలర్ల మేరకు చేరనుంది. బిగ్ డేటా మార్కెట్ పరంగా ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. అంతే స్థాయిలో నిపుణులైన మానవ వనరుల అవసరం కూడా శరవేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా స్టార్టప్ సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థలు సైతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో భాగంగా తమ సేవలను ఆటోమేషన్‌లోకి మార్చడం వంటి కారణాలతో బిగ్ డేటా నిపుణుల అవసరం ఎంట్రీ లెవల్ నుంచి టాప్ లెవల్ వరకు లక్షల్లోనే ఉంది. రాండ్ స్టాండ్ ఇండియా నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ఐటీ నిపుణుల కంటే 50 శాతం అధికంగా బిగ్ డేటా అనలిటిక్స్ నిపుణుల అవసరం ఏర్పడనుంది. 2018 నాటికి దాదాపు 1.8 లక్షల ఉద్యోగావకాశాలు ఈ విభాగంలో పలు హోదాల్లో లభించనున్నాయి. ప్రత్యేక కోర్సులు బిగ్ డేటా విభాగంలో రాణించడానికి ప్రాథమికంగా మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ నేపథ్యం అవసరమైనప్పటికీ ఈ విభాగంలో మరింత మెరుగైన నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ప్రత్యేక కోర్సులు సైతం ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్ స్ట్రక్చర్డ్ పేరిట ఉండే డేటా విశ్లేషణలో భాగంగా ఈ ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. వీటి కోసం ప్రత్యేక కోర్సులు రూపొందుతున్నాయి. అవి.. హడూప్ టెక్నాలజీ, జావా, పైథాన్, అ, రూబీ డెవలపర్. యూనివర్సిటీల స్థాయిలోనూ ప్రత్యేక సబ్జెక్ట్‌లుగా ప్రస్తుతం బిగ్‌డేటాకు సంబంధించి నిపుణుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న యూనివర్సిటీలు ఇటీవల కాలంలో బీటెక్, ఇతర సైన్స్, మ్యాథ్స్ సంబంధిత డిగ్రీల్లో బిగ్ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్ కోర్సులను ప్రత్యేక సబ్జెక్ట్‌లుగా రూపొందిస్తున్నాయి. జేఎన్టీయూ-హైదరాబాద్, అనంతపురంలలో డేటా అనలిటిక్స్‌ను కోర్సులో భాగంగా చేర్చాయి. ఐఐఎం, ఇతర జాతీయ స్థాయిలోని ఉన్నత విద్యా సంస్థల్లో బిగ్ డేటా అనలిటిక్స్‌కు సంబంధించి ప్రత్యేక కోర్సుల రూపకల్పన జరిగింది. ఐఎస్బీ-హైదరాబాద్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఐఐఎం-లక్నో: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఐఐఎం-బెంగళూరు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఎన్ఎంఐఎంఎస్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ పలు ఐఐటీలు సైతం పీజీ స్థాయిలో డేటా సైన్స్ పేరుతో ప్రత్యేకంగా ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. లభించే హోదాలు డేటా సైంటిస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ డేటా ఇంజనీర్ స్టాటిస్టిషియన్ గ్రిడ్ కంప్యూటింగ్ ఇంజనీర్స్ వేతనాలు.. ఆకర్షణీయం బిగ్ డేటా ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్యాలు ఉన్న వారికి, కొలువులను సొంతం చేసుకున్న వారికి వేతనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్లో కనీసం తొమ్మిది లక్షల రూపాయల వేతనం ఖాయం. తర్వాత అనుభవం, పనితీరు ప్రాతిపదికగా ఈ మొత్తం రూ.25 లక్షల నుంచి ముప్పై లక్షలకు చేరుకునే అవకాశాలు ఖాయం. ఈ స్కిల్స్మరింత మెరుగ్గా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఎస్పీఎస్ఎస్, ఎస్ఏఎస్పోగ్రామింగ్ లాంగ్వేజెస్ (జావా, సి, సి++) అత్యంత ఆకర్షణీయంగా, శరవేగంగా వృద్ధి చెందుతున్న బిగ్ డేటా విభాగంలో కెరీర్ అన్వేషణకు ఇదే సరైన సమయం. రానున్న రెండేళ్లలో దేశంలో బిగ్ డేటా నిపుణుల అవసరం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆయా కోర్సుల చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఈ దిశగా దృష్టి పెట్టి ఇందులో హడూప్, పైథాన్, రూబీ తదితర సంస్థలు అందిస్తున్న షార్ట్‌టర్మ్ కోర్సులను పూర్తి చేస్తే ఉద్యోగ సాధనలో ముందంజలో నిలవొచ్చు. ఔత్సాహికులకు ఇచ్చే సలహా ఏంటంటే కేవలం క్రేజ్‌తో ఈ విభాగంలో అడుగుపెట్టాలనుకునే దృక్పథం సరికాదు. ఆసక్తితోనే ఇందులో ప్రవేశించాలి. ఎందుకంటే ప్రస్తుతం బిగ్ డేటా విభాగంలోని సిబ్బంది ఇచ్చే సమాచారంపైనే సంస్థలు తమ కార్యకలాపాల దిశగా మార్పు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అపారమైన డేటాను ఓపిగ్గా విశ్లేషించే నైపుణ్యం, సహనం వంటివి ఉంటేనే ఈ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్ గీత, సీఎస్ఈ, బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్ పూర్తి స్థాయి కోర్సులో మరింత ఉన్నతంగా బిగ్ డేటాలో కెరీర్ కోరుకునే అభ్యర్థులు పూర్తి స్థాయి కోర్సుల దిశగా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇప్పటికే పలు ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా మేనేజ్మెంట్, డేటా సైన్స్ వంటి పేర్లతో ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. బిగ్ డేటా రంగంలో నిపుణుల అవసరం దీర్ఘ కాలంలోనూ పెరగనుంది. అందువల్ల విద్యార్థులు పూర్తి స్థాయి కోర్సులు అభ్యసిస్తే మరిన్ని నైపుణ్యాలు లభించి మరింత మెరుగైన కెరీర్‌ను అందుకునే అవకాశం లభిస్తుంది. - ప్రొఫెసర్ కృష్ణమోహన్, సీఎస్ఈ-ఐఐటీ హైదరాబాద్ -
25 శాతం ఉద్యోగాలు రోబోట్స్ చేస్తాయ్!
ముంబైః మరో పదేళ్ళలో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఉద్యోగాల్లో నాలుగో వంతు ఉద్యోగాలు రోబోట్స్, స్మార్ట్ సాఫ్టవేర్లతో నిర్వహించే అవకాశం కనిపిస్తోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేస్తోంది. మరోవైపు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ.. 'ఎమోజీ'ల రూపకల్పన కూడ మరో దశాబ్ద కాలంలో అతి పెద్ద ఉద్యోగంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ వెనుక బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషించనుంది. రోబోట్స్, స్మార్ట్ సాఫ్ట్ వేర్ లు.. పావుశాతం ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. దీంతో కేవలం జాబ్స్ స్వభావం మారడమే కాక, సంస్థల పనితీరులో కూడ ప్రధాన మార్పు సంభవించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ప్రతి విషయంలోనూ బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్ కీలకాంశమైపోయింది. దీంతో ప్రఖ్యాత విద్యా సంస్థలు సైతం డేటా సైన్స్, బిగ్ డేటా ను అందుబాటులోకి తెస్తున్నాయి. యువ శ్రామికులను నిపుణులుగా తీర్చిదిద్దడంలో 'బిగ్ డేటా' కీలకంగా మారింది. ప్రస్తుతం నగరాల్లో బిగ్ డేటా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోందని బిగ్ డేటా ను బోధించే మహేంద్రా మెహతా చెప్తున్నారు. ఒకప్పుడు బిగ్ డేటా విశ్లేషణలను అభివృద్ధి పరిచేందుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యేవని, ఇప్పుడు ఆ పరిస్థితిలో తీవ్ర మార్పు సంభవించినట్లు ఆయన చెప్తున్నారు. చిన్న పెట్టుబడితో కూడ అభివృద్ధి చేసే అవకాశం రావడంతో ఇప్పుడు చిన్నపాటి కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడ సాఫ్ట్ వేర్ జోలికి పోకుండా బిగ్ డేటాను ఆశ్రయిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. పరిశోధనాత్మక విధానాలకు, సంస్థల్లో ప్రావీణ్యతను అభివృద్ధి పరిచేందుకు బిగ్ డేటా ఎనలటిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. నిజానికి అత్యాధునిక విషయాలను అందుబాటులోకి తెచ్చే బిగ్ డేటా ప్రయోజనాలను వినియోగించుకోలేని సంస్థలు.. వారి పోటీతత్వాన్ని సైతం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ డేటా లో శిక్షణ, తర్ఫీదుపొందడం కూడ..భవిష్యత్తు కెరీర్ కు భారీ ప్రయోజనాలను కల్పిచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విప్లవాత్మక డేటా సైన్స్ పావు వంతు ఉద్యోగాలను తన పేరులో వేసుకునే అవకాశం కూడ ఉంది.