25 శాతం ఉద్యోగాలు రోబోట్స్ చేస్తాయ్!
ముంబైః మరో పదేళ్ళలో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఉద్యోగాల్లో నాలుగో వంతు ఉద్యోగాలు రోబోట్స్, స్మార్ట్ సాఫ్టవేర్లతో నిర్వహించే అవకాశం కనిపిస్తోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేస్తోంది. మరోవైపు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ.. 'ఎమోజీ'ల రూపకల్పన కూడ మరో దశాబ్ద కాలంలో అతి పెద్ద ఉద్యోగంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ వెనుక బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషించనుంది.
రోబోట్స్, స్మార్ట్ సాఫ్ట్ వేర్ లు.. పావుశాతం ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. దీంతో కేవలం జాబ్స్ స్వభావం మారడమే కాక, సంస్థల పనితీరులో కూడ ప్రధాన మార్పు సంభవించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ప్రతి విషయంలోనూ బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్ కీలకాంశమైపోయింది. దీంతో ప్రఖ్యాత విద్యా సంస్థలు సైతం డేటా సైన్స్, బిగ్ డేటా ను అందుబాటులోకి తెస్తున్నాయి. యువ శ్రామికులను నిపుణులుగా తీర్చిదిద్దడంలో 'బిగ్ డేటా' కీలకంగా మారింది. ప్రస్తుతం నగరాల్లో బిగ్ డేటా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోందని బిగ్ డేటా ను బోధించే మహేంద్రా మెహతా చెప్తున్నారు. ఒకప్పుడు బిగ్ డేటా విశ్లేషణలను అభివృద్ధి పరిచేందుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యేవని, ఇప్పుడు ఆ పరిస్థితిలో తీవ్ర మార్పు సంభవించినట్లు ఆయన చెప్తున్నారు.
చిన్న పెట్టుబడితో కూడ అభివృద్ధి చేసే అవకాశం రావడంతో ఇప్పుడు చిన్నపాటి కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడ సాఫ్ట్ వేర్ జోలికి పోకుండా బిగ్ డేటాను ఆశ్రయిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. పరిశోధనాత్మక విధానాలకు, సంస్థల్లో ప్రావీణ్యతను అభివృద్ధి పరిచేందుకు బిగ్ డేటా ఎనలటిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. నిజానికి అత్యాధునిక విషయాలను అందుబాటులోకి తెచ్చే బిగ్ డేటా ప్రయోజనాలను వినియోగించుకోలేని సంస్థలు.. వారి పోటీతత్వాన్ని సైతం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ డేటా లో శిక్షణ, తర్ఫీదుపొందడం కూడ..భవిష్యత్తు కెరీర్ కు భారీ ప్రయోజనాలను కల్పిచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విప్లవాత్మక డేటా సైన్స్ పావు వంతు ఉద్యోగాలను తన పేరులో వేసుకునే అవకాశం కూడ ఉంది.