బిగ్ డేటా ఫర్ బ్రైట్ ఫ్యూచర్
విశ్లేషణ సామర్థ్యం
ఆధునిక యుగంలో అత్యాధునిక ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం. డిగ్రీ ఏదైనా ఫర్వాలేదు.. మ్యాథమెటికల్ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం ఉంటే చాలు.. కళకళలాడే కెరీర్‌కు మార్గం వేస్తోంది.. బిగ్ డేటా. ఇ-కామర్స్ సంస్థల నుంచి మల్టీ నేషనల్ ఐటీ సంస్థల వరకు.. సాఫ్ట్‌వేర్ నుంచి కోర్ ప్రొడక్షన్ సంస్థల వరకు.. బెస్ట్ ఫ్యూచర్‌కు బిగ్ డేటా మార్గంగా నిలుస్తోంది. బిగ్ డేటా అనలిటిక్స్ ప్రధాన ఉద్దేశం విస్తృతంగా ఉండే డేటాను క్రమపద్ధతిలో అమర్చడం, విశ్లేషించడం.. దాని ఆధారంగా వినియోగదారులు కోరుకుంటున్న సేవలు, వస్తువుల గురించి నివేదికలు రూపొందించి సంస్థలోని ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ విభాగాలకు అందించడం. ఈ విధులు నిర్వహించడానికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం. కంప్యుటేషనల్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్న వారు ఈ రంగంలో అడుగుపెట్టేందుకు అవకాశం ఉంటుంది.
మ్యాథ్స్, సైన్స్‌తో మెరుగ్గా
బిగ్ డేటా అనలిటిక్స్ విభాగంలో మ్యాథ్స్, సైన్స్ విభాగాల విద్యార్థులకు ఇతర విద్యార్థులతో పోల్చితే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉంటాయని నిపుణుల అభిప్రాయం. ఈ రంగంలో సైన్స్ విధ్యార్థుల హవా సాగుతోందని ఇటీవలే అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ కేర్ రేటింగ్ ఏజెన్సీ సైతం స్పష్టం చేసింది. బిగ్ డేటా రంగంలో అత్యంత కీలకమైనవి అంకెలు, గణాంకాల విశ్లేషణ. అందుకే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు సైతం కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఎందుకంటే వీరికి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అకడమిక్ స్థాయిలోనే డేటా అనాలిసిస్, డేటా మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో నైపుణ్యం లభిస్తుందనే అభిప్రాయం.
అమెరికా తర్వాత స్థానం భారత్‌దే
బిగ్ డేటా అనాలిసిస్, మేనేజ్‌మెంట్ పరంగా అమెరికా తర్వాత భారత్ నిలుస్తోంది. 2016లో బిగ్ డేటా నిర్వహణకు భారత సంస్థలు వెచ్చించే మొత్తం 46 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అదే విధంగా 2019 నాటికి బిగ్ డేటా మార్కెట్ విలువ 60 నుంచి 65 బిలియన్ డాలర్ల మేరకు చేరనుంది. బిగ్ డేటా మార్కెట్ పరంగా ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. అంతే స్థాయిలో నిపుణులైన మానవ వనరుల అవసరం కూడా శరవేగంగా పెరుగుతోంది.
ముఖ్యంగా స్టార్టప్ సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ సంస్థలు సైతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో భాగంగా తమ సేవలను ఆటోమేషన్‌లోకి మార్చడం వంటి కారణాలతో బిగ్ డేటా నిపుణుల అవసరం ఎంట్రీ లెవల్ నుంచి టాప్ లెవల్ వరకు లక్షల్లోనే ఉంది. రాండ్ స్టాండ్ ఇండియా నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ఐటీ నిపుణుల కంటే 50 శాతం అధికంగా బిగ్ డేటా అనలిటిక్స్ నిపుణుల అవసరం ఏర్పడనుంది. 2018 నాటికి దాదాపు 1.8 లక్షల ఉద్యోగావకాశాలు ఈ విభాగంలో పలు హోదాల్లో లభించనున్నాయి.
ప్రత్యేక కోర్సులు
బిగ్ డేటా విభాగంలో రాణించడానికి ప్రాథమికంగా మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ నేపథ్యం అవసరమైనప్పటికీ ఈ విభాగంలో మరింత మెరుగైన నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ప్రత్యేక కోర్సులు సైతం ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్ స్ట్రక్చర్డ్ పేరిట ఉండే డేటా విశ్లేషణలో భాగంగా ఈ ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. వీటి కోసం ప్రత్యేక కోర్సులు రూపొందుతున్నాయి. అవి.. హడూప్ టెక్నాలజీ, జావా, పైథాన్, అ, రూబీ డెవలపర్.
యూనివర్సిటీల స్థాయిలోనూ ప్రత్యేక సబ్జెక్ట్‌లుగా
ప్రస్తుతం బిగ్‌డేటాకు సంబంధించి నిపుణుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న యూనివర్సిటీలు ఇటీవల కాలంలో బీటెక్, ఇతర సైన్స్, మ్యాథ్స్ సంబంధిత డిగ్రీల్లో బిగ్ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రత్యేక సబ్జెక్ట్‌లుగా రూపొందిస్తున్నాయి. జేఎన్‌టీయూ-హైదరాబాద్, అనంతపురంలలో డేటా అనలిటిక్స్‌ను కోర్సులో భాగంగా చేర్చాయి. ఐఐఎం, ఇతర జాతీయ స్థాయిలోని ఉన్నత విద్యా సంస్థల్లో బిగ్ డేటా అనలిటిక్స్‌కు సంబంధించి ప్రత్యేక కోర్సుల రూపకల్పన జరిగింది.
ఐఎస్‌బీ-హైదరాబాద్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్
ఐఐఎం-లక్నో: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్
ఐఐఎం-బెంగళూరు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్
ఎన్‌ఎంఐఎంఎస్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్
పలు ఐఐటీలు సైతం పీజీ స్థాయిలో డేటా సైన్స్ పేరుతో ప్రత్యేకంగా ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
లభించే హోదాలు
డేటా సైంటిస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
టెక్నికల్ ఆర్కిటెక్ట్ డేటా ఇంజనీర్
స్టాటిస్టిషియన్ గ్రిడ్ కంప్యూటింగ్ ఇంజనీర్స్
వేతనాలు.. ఆకర్షణీయం
బిగ్ డేటా ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్యాలు ఉన్న వారికి, కొలువులను సొంతం చేసుకున్న వారికి వేతనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్‌లో కనీసం తొమ్మిది లక్షల రూపాయల వేతనం ఖాయం. తర్వాత అనుభవం, పనితీరు ప్రాతిపదికగా ఈ మొత్తం రూ.25 లక్షల నుంచి ముప్పై లక్షలకు చేరుకునే అవకాశాలు ఖాయం.
ఈ స్కిల్స్‌మరింత మెరుగ్గా
ఇంటర్ పర్సనల్ స్కిల్స్
క్వాంటిటేటివ్ రీజనింగ్ ఎస్‌పీఎస్‌ఎస్, ఎస్‌ఏఎస్‌పోగ్రామింగ్ లాంగ్వేజెస్ (జావా, సి, సి++)
అత్యంత ఆకర్షణీయంగా, శరవేగంగా వృద్ధి చెందుతున్న బిగ్ డేటా విభాగంలో కెరీర్ అన్వేషణకు ఇదే సరైన సమయం. రానున్న రెండేళ్లలో దేశంలో బిగ్ డేటా నిపుణుల అవసరం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆయా కోర్సుల చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఈ దిశగా దృష్టి పెట్టి ఇందులో హడూప్, పైథాన్, రూబీ తదితర సంస్థలు అందిస్తున్న షార్ట్‌టర్మ్ కోర్సులను పూర్తి చేస్తే ఉద్యోగ సాధనలో ముందంజలో నిలవొచ్చు. ఔత్సాహికులకు ఇచ్చే సలహా ఏంటంటే కేవలం క్రేజ్‌తో ఈ విభాగంలో అడుగుపెట్టాలనుకునే దృక్పథం సరికాదు. ఆసక్తితోనే ఇందులో ప్రవేశించాలి. ఎందుకంటే ప్రస్తుతం బిగ్ డేటా విభాగంలోని సిబ్బంది ఇచ్చే సమాచారంపైనే సంస్థలు తమ కార్యకలాపాల దిశగా మార్పు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అపారమైన డేటాను ఓపిగ్గా విశ్లేషించే నైపుణ్యం, సహనం వంటివి ఉంటేనే ఈ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్ గీత, సీఎస్‌ఈ,
బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్
పూర్తి స్థాయి కోర్సులో మరింత ఉన్నతంగా
బిగ్ డేటాలో కెరీర్ కోరుకునే అభ్యర్థులు పూర్తి స్థాయి కోర్సుల దిశగా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇప్పటికే పలు ప్రముఖ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా మేనేజ్‌మెంట్, డేటా సైన్స్ వంటి పేర్లతో ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. బిగ్ డేటా రంగంలో నిపుణుల అవసరం దీర్ఘ కాలంలోనూ పెరగనుంది. అందువల్ల విద్యార్థులు పూర్తి స్థాయి కోర్సులు అభ్యసిస్తే మరిన్ని నైపుణ్యాలు లభించి మరింత మెరుగైన కెరీర్‌ను అందుకునే అవకాశం లభిస్తుంది.
- ప్రొఫెసర్ కృష్ణమోహన్,
సీఎస్‌ఈ-ఐఐటీ హైదరాబాద్