bright future
-
ఐటీ కంపెనీలకు ఉజ్వల భవిష్యత్తు
ముంబై: ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన పాలనలో భారతీయ ఐటీ కంపెనీలకు ఎలాంటి ముప్పు లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో భారత ఐటీ కంపెనీలకు అక్కడ ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందంటూ భరోసా ఇచ్చారు. వినూత్న పథకాలతో అమెరికాలోని కొత్త ప్రభుత్వం అద్భుత అవకాశాలను సృష్టింస్తోందన్నారు. ఐటి సంక్షోభంలో పడిందన్న నివేదికలను ఆయన తిరస్కరించారు. మరిన్ని అవకాశాలు రానున్నాయని ఒక ఇంటర్వ్యూలో పిటిఐకి చెప్పారు. ట్రంప్ పరిపాలన లో భారతీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లపై పీటీఐ ప్రశ్నించినట్టు తాను ఆ విధంగా భావించడం లేదని సిక్కా చెప్పారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి కొనసాగినంతవరకూ, నూతన రంగాల్లో విలువైన సేవలు అందించినంతవరకు ఇది పెద్ద సమస్యకాదని తాను భావిస్తున్నాన్నారు. బిజినెస్ ఫ్రెండ్లీ, పారిశ్రామికవేత్త ట్రంప్ ఆధ్వర్యంలో అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయని విశాల్ సిక్కా చెప్పారు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. గమెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాపై పట్టుసాధిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికాలో ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని ఆయన హామీ ఇచ్చారు. తన మూడు సంవత్సరాల అనుభవం (ఇన్ఫోసిస్‌లో) భారతీయ యువత ఈ మార్పుకోసం సిద్ధంగా ఉందనే విశ్వాసాన్ని విశాల్ సిక్కా వ్యక్తం చేశారు. గత మూడున్నర దశాబ్దాల్లో భారతీయ ఐటి కంపెనీలు అసాధారణ పురోగతి సాధించాయన్నారు. -
స్మార్ట్ సాంకేతికతతోనే బంగారు భవిష్యత్తు
- సంస్కృతీ విద్యాసంస్థల అంతర్జాతీయ సదస్సులో వక్తులు - ఎస్ఎస్బీలో ఘనంగా స్మార్ట్ సదస్సు ప్రారంభం పుట్టపర్తి టౌన్ : అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ సాంకేతికతను అలవర్చుకున్నప్పుడే ఆధునిక మానవుడు ఉజ్వల భవిష్యత్తును పొందగలడని వివిధ దేశాల నిర్మాణ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఆధునిక కాలంలోఅభివృద్ధి చెందిన దేశాల పట్టణీకరణ, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్ సిటీస్ టెక్నాలజీపై సంస్కృతీ విద్యాసంస్థలలో రెండురోజుల అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. విద్యాసంస్థల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేసిన జపాన్‌లోని టోక్యో యూనివర్శిటీ డైరెక్టర్ అజ్బే బ్రౌన్ జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం అజ్బే బ్రౌన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడి ప్రభుత్వాలు స్మార్ట్ పరిజ్ఙానంతో తక్కువ ఖర్చుతో నిర్మాణాలు, భద్రత, మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే భారతదేశంలో నిర్మాణ రంగంలో స్మార్ట్ టెక్నాలజీ వినియోగం అత్యవసరమన్నారు. పారిస్‌కు చెందిన నిర్మాణ రంగ నిపుణురాలు క్లారిసెస్టన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే స్మార్ట్ నగరాల సాంకేతికత, ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మార్పులకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను అందించే దిశగా విద్యార్థులు ముందడుగు వేయాలని కొలరాడో స్టేట్ యూనివర్శిటీకి చెందిన బో బ్లాడ్జెట్ సూచించారు. ఆధునిక మానవుని అవసరాలకు అనుగుణంగా యువత నూతన అవిష్కరణలవైపు దృష్టి సారించాలని వర్క్‌బెంచ్ ప్రాజెక్ట్స్ సీఈఓ పవన్‌కుమార్ అన్నారు. బెంగళూరుకు చెందిన సామాజిక అవిష్కరణల నిపుణుడు అభిజిత్ సిన్హా మాట్లాడుతూ నీటి అవసరం లేని మూత్రాశాలలను, తక్కువ ఖర్చుతో నిర్మించగలిగే అంబులెన్స్‌లను రూపొందించే కృషి చేస్తున్నామన్నారు. కళాశాలలో ఇంజనీరింగ్ విభాగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వియన్నా యూనివర్శిటీ సైంటిస్ట్ పౌల్స్పెసిబెర్గ్, స్మార్ట్ డిజైనర్ చోలే జిమ్మర్మెన్, మంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ నిపుణుడు చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బిగ్ డేటా ఫర్ బ్రైట్ ఫ్యూచర్
విశ్లేషణ సామర్థ్యం ఆధునిక యుగంలో అత్యాధునిక ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం. డిగ్రీ ఏదైనా ఫర్వాలేదు.. మ్యాథమెటికల్ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం ఉంటే చాలు.. కళకళలాడే కెరీర్‌కు మార్గం వేస్తోంది.. బిగ్ డేటా. ఇ-కామర్స్ సంస్థల నుంచి మల్టీ నేషనల్ ఐటీ సంస్థల వరకు.. సాఫ్ట్వేర్ నుంచి కోర్ ప్రొడక్షన్ సంస్థల వరకు.. బెస్ట్ ఫ్యూచర్‌కు బిగ్ డేటా మార్గంగా నిలుస్తోంది. బిగ్ డేటా అనలిటిక్స్ ప్రధాన ఉద్దేశం విస్తృతంగా ఉండే డేటాను క్రమపద్ధతిలో అమర్చడం, విశ్లేషించడం.. దాని ఆధారంగా వినియోగదారులు కోరుకుంటున్న సేవలు, వస్తువుల గురించి నివేదికలు రూపొందించి సంస్థలోని ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ విభాగాలకు అందించడం. ఈ విధులు నిర్వహించడానికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం. కంప్యుటేషనల్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్న వారు ఈ రంగంలో అడుగుపెట్టేందుకు అవకాశం ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్‌తో మెరుగ్గా బిగ్ డేటా అనలిటిక్స్ విభాగంలో మ్యాథ్స్, సైన్స్ విభాగాల విద్యార్థులకు ఇతర విద్యార్థులతో పోల్చితే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉంటాయని నిపుణుల అభిప్రాయం. ఈ రంగంలో సైన్స్ విధ్యార్థుల హవా సాగుతోందని ఇటీవలే అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ కేర్ రేటింగ్ ఏజెన్సీ సైతం స్పష్టం చేసింది. బిగ్ డేటా రంగంలో అత్యంత కీలకమైనవి అంకెలు, గణాంకాల విశ్లేషణ. అందుకే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు సైతం కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఎందుకంటే వీరికి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అకడమిక్ స్థాయిలోనే డేటా అనాలిసిస్, డేటా మేనేజ్మెంట్ తదితర అంశాల్లో నైపుణ్యం లభిస్తుందనే అభిప్రాయం. అమెరికా తర్వాత స్థానం భారత్‌దే బిగ్ డేటా అనాలిసిస్, మేనేజ్మెంట్ పరంగా అమెరికా తర్వాత భారత్ నిలుస్తోంది. 2016లో బిగ్ డేటా నిర్వహణకు భారత సంస్థలు వెచ్చించే మొత్తం 46 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అదే విధంగా 2019 నాటికి బిగ్ డేటా మార్కెట్ విలువ 60 నుంచి 65 బిలియన్ డాలర్ల మేరకు చేరనుంది. బిగ్ డేటా మార్కెట్ పరంగా ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. అంతే స్థాయిలో నిపుణులైన మానవ వనరుల అవసరం కూడా శరవేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా స్టార్టప్ సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థలు సైతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో భాగంగా తమ సేవలను ఆటోమేషన్‌లోకి మార్చడం వంటి కారణాలతో బిగ్ డేటా నిపుణుల అవసరం ఎంట్రీ లెవల్ నుంచి టాప్ లెవల్ వరకు లక్షల్లోనే ఉంది. రాండ్ స్టాండ్ ఇండియా నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ఐటీ నిపుణుల కంటే 50 శాతం అధికంగా బిగ్ డేటా అనలిటిక్స్ నిపుణుల అవసరం ఏర్పడనుంది. 2018 నాటికి దాదాపు 1.8 లక్షల ఉద్యోగావకాశాలు ఈ విభాగంలో పలు హోదాల్లో లభించనున్నాయి. ప్రత్యేక కోర్సులు బిగ్ డేటా విభాగంలో రాణించడానికి ప్రాథమికంగా మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ నేపథ్యం అవసరమైనప్పటికీ ఈ విభాగంలో మరింత మెరుగైన నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ప్రత్యేక కోర్సులు సైతం ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్ స్ట్రక్చర్డ్ పేరిట ఉండే డేటా విశ్లేషణలో భాగంగా ఈ ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. వీటి కోసం ప్రత్యేక కోర్సులు రూపొందుతున్నాయి. అవి.. హడూప్ టెక్నాలజీ, జావా, పైథాన్, అ, రూబీ డెవలపర్. యూనివర్సిటీల స్థాయిలోనూ ప్రత్యేక సబ్జెక్ట్‌లుగా ప్రస్తుతం బిగ్‌డేటాకు సంబంధించి నిపుణుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న యూనివర్సిటీలు ఇటీవల కాలంలో బీటెక్, ఇతర సైన్స్, మ్యాథ్స్ సంబంధిత డిగ్రీల్లో బిగ్ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్ కోర్సులను ప్రత్యేక సబ్జెక్ట్‌లుగా రూపొందిస్తున్నాయి. జేఎన్టీయూ-హైదరాబాద్, అనంతపురంలలో డేటా అనలిటిక్స్‌ను కోర్సులో భాగంగా చేర్చాయి. ఐఐఎం, ఇతర జాతీయ స్థాయిలోని ఉన్నత విద్యా సంస్థల్లో బిగ్ డేటా అనలిటిక్స్‌కు సంబంధించి ప్రత్యేక కోర్సుల రూపకల్పన జరిగింది. ఐఎస్బీ-హైదరాబాద్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఐఐఎం-లక్నో: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఐఐఎం-బెంగళూరు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఎన్ఎంఐఎంఎస్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ పలు ఐఐటీలు సైతం పీజీ స్థాయిలో డేటా సైన్స్ పేరుతో ప్రత్యేకంగా ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. లభించే హోదాలు డేటా సైంటిస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ డేటా ఇంజనీర్ స్టాటిస్టిషియన్ గ్రిడ్ కంప్యూటింగ్ ఇంజనీర్స్ వేతనాలు.. ఆకర్షణీయం బిగ్ డేటా ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్యాలు ఉన్న వారికి, కొలువులను సొంతం చేసుకున్న వారికి వేతనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్లో కనీసం తొమ్మిది లక్షల రూపాయల వేతనం ఖాయం. తర్వాత అనుభవం, పనితీరు ప్రాతిపదికగా ఈ మొత్తం రూ.25 లక్షల నుంచి ముప్పై లక్షలకు చేరుకునే అవకాశాలు ఖాయం. ఈ స్కిల్స్మరింత మెరుగ్గా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఎస్పీఎస్ఎస్, ఎస్ఏఎస్పోగ్రామింగ్ లాంగ్వేజెస్ (జావా, సి, సి++) అత్యంత ఆకర్షణీయంగా, శరవేగంగా వృద్ధి చెందుతున్న బిగ్ డేటా విభాగంలో కెరీర్ అన్వేషణకు ఇదే సరైన సమయం. రానున్న రెండేళ్లలో దేశంలో బిగ్ డేటా నిపుణుల అవసరం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆయా కోర్సుల చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఈ దిశగా దృష్టి పెట్టి ఇందులో హడూప్, పైథాన్, రూబీ తదితర సంస్థలు అందిస్తున్న షార్ట్‌టర్మ్ కోర్సులను పూర్తి చేస్తే ఉద్యోగ సాధనలో ముందంజలో నిలవొచ్చు. ఔత్సాహికులకు ఇచ్చే సలహా ఏంటంటే కేవలం క్రేజ్‌తో ఈ విభాగంలో అడుగుపెట్టాలనుకునే దృక్పథం సరికాదు. ఆసక్తితోనే ఇందులో ప్రవేశించాలి. ఎందుకంటే ప్రస్తుతం బిగ్ డేటా విభాగంలోని సిబ్బంది ఇచ్చే సమాచారంపైనే సంస్థలు తమ కార్యకలాపాల దిశగా మార్పు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అపారమైన డేటాను ఓపిగ్గా విశ్లేషించే నైపుణ్యం, సహనం వంటివి ఉంటేనే ఈ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్ గీత, సీఎస్ఈ, బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్ పూర్తి స్థాయి కోర్సులో మరింత ఉన్నతంగా బిగ్ డేటాలో కెరీర్ కోరుకునే అభ్యర్థులు పూర్తి స్థాయి కోర్సుల దిశగా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇప్పటికే పలు ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా మేనేజ్మెంట్, డేటా సైన్స్ వంటి పేర్లతో ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. బిగ్ డేటా రంగంలో నిపుణుల అవసరం దీర్ఘ కాలంలోనూ పెరగనుంది. అందువల్ల విద్యార్థులు పూర్తి స్థాయి కోర్సులు అభ్యసిస్తే మరిన్ని నైపుణ్యాలు లభించి మరింత మెరుగైన కెరీర్‌ను అందుకునే అవకాశం లభిస్తుంది. - ప్రొఫెసర్ కృష్ణమోహన్, సీఎస్ఈ-ఐఐటీ హైదరాబాద్ -
నానో టెక్నాలజీకి ఉజ్వల భవిష్యత్తు
ఏయూ క్యాంపస్: నానో టెక్నాలజీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్.అవధాని అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాలల సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ నిర్వహించిన ‘నానో ఫ్యూయిడ్స్ అప్లికేషన్స్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్, సిమ్యులేషన్ యూజింగ్ డీఎఫ్‌డీ’ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు ప్రపంచ ప్రగతిని మార్చివేస్తున్నాయన్నారు. చిన్నపాటి ఆవిష్కరణలే ఎంతో పేరు తీసుకువస్తాయన్నారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య కె.రాంజీ మాట్లాడుతూ నానో ఫ్లూయిడ్స్ అనువర్తనాలను వివరించారు. చైనా, జపాన్‌లు నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ముందుంటున్నాయన్నారు. మూడు రోజుల సదస్సు ముఖ్యాంశాలను వివరించారు. పాలకమండలి సభ్యుడు ఆచార్య జి.శశిభూషణరావు మాట్లాడుతూ స్టెల్త్ టెక్నాలజీ, సబ్మెరైన్లలో వినియోగిస్తున్న నూతన సాంకేతికతను వివరించారు. పాలక మండలి సభ్యులు ఆచార్య సురేష్ చిట్టినేని మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల దిశగా పనిచేయడం ఎంతో అవసరమన్నారు. సాంకేతిక మార్పులు, ఆవిష్కరణలకు అవకాశం ఉన్న అంశాలను వివరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ట్రిచి) ఆచార్యుడు సురేష్ మాట్లాడుతూ నానో ఫ్లూయిడ్స్‌కు రక్తం మంచి ఉదాహరణన్నారు. శరీర వ్యవస్థలను నానో సాంకేతికతతో అనుసంధానించి వివరించారు. శిక్షణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతనిధులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
మామునూరు ఏసీపీ మహేందర్ ముగిసిన నవోదయ క్లస్టర్ స్థాయి క్రీడోత్సవాలు మామునూరు : విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మామునూరు ఏసీపీ మహేందర్ అన్నారు. హన్మకొండ మండలం మామునూరులోని నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న క్లస్టర్ బాల్‌గేమ్స్ క్రీడలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. అండర్ 14, 17, 19 విభాగాల్లో రాష్ట్రంలోని తొమ్మిది నవోదయ విద్యాలయాలకు చెందిన 320 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా 225మంది బాలబాలికలు రీజినల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో ఏసీపీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలపై మక్కువ పెంచుకుంటే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణించొచ్చన్నారు. ప్రిన్సిపాల్ పడాల సత్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడి పోటీల్లో ప్రతిభ చూపిన 225 మంది బాలబాలికలు రీజినల్ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో నవోదయ అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్
కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, విమాన ప్రయాణ చార్జీలు తగ్గడం, వ్యాపార నిర్వహణకు సంబంధించి రాకపోకలు పెరగడం, పర్యాటక రంగ అభివృద్ధి తదితర కారణాల వల్ల విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఏవియేషన్ రంగం విస్తరిస్తూ యువతకు సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఏవియేషన్ కోర్సులు, వాటిని అందిస్తున్న సంస్థలు, అర్హతలు తదితర వివరాలు.. ఏవియేషన్ రంగంలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోర్సుకు క్రేజ్ ఎక్కువ. దీనికి ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే, అత్యున్నత వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. కమర్షియల్ పైలట్ కావాలనుకునే వారికి కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) తప్పనిసరి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పూర్తిచేసిన వారికి ఈ లెసైన్స్ లభిస్తుంది. తొలుత స్టూడెంట్ పైలట్ లెసైన్స్, అనంతరం ప్రైవేట్ పైలట్ లెసైన్స్, ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఇస్తారు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. ఇంటర్లో వీటిని చదవనివారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా అభ్యసించవచ్చు. ఈ కోర్సులో చేరే వారికి నిర్ణీత శారీరక, ఆరోగ్య ప్రమాణాలు ఉండాలి. అలాగే నిర్దిష్ట వయోపరిమితి కలిగి ఉండాలి. కోర్సులో ప్రవేశాలకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. వేతనం: కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పైలట్ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - భువనేశ్వర్, న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ - బెంగళూరు, రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ - తిరువనంతపురం, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్‌బరేలీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ క్యాబిన్ క్రూ/ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఇందులో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది మధ్యలో ఉంటుంది. కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ (కోర్సులు: డిప్లొమా ఇన్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా కోర్స ఇన్ హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ కస్టమర్ సర్వీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్), ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ (కోర్సు: క్యాబిన్ క్రూ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - ఎయిర్ హోస్టెస్/ఫ్లైట్ స్టీవార్‌డ). అర్హతలు: ఇంటర్/+2 పూర్తిచేసిన మహిళా, పురుష అభ్యర్థులిద్దరూ అర్హులు. ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీసెస్, ఇన్ ఫ్లైట్ ట్రైనింగ్, సేఫ్టీ అండ్ ఫస్డ్ ఎయిడ్ ప్రొసీజర్, ఫుడ్ అండ్ బేవరేజ్ ప్రొడక్షన్ అండ్ సర్వింగ్ తదితర అంశాలు నేర్పిస్తారు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.4 నుంచి రూ.6 లక్షలు ఉంటుంది. ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇది నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ. ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిజైన్, రూపకల్పన, నిర్వహణ తదితరాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో చీఫ్ ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్/+2 పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ఇందులో ప్రవేశాలకు అభ్యర్థులు జాతీయ/రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుంది. సంస్థలు: జేఎన్టీయూ - కాకినాడ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బీఎస్సీ ఏవియేషన్ బీఎస్సీ ఏవియేషన్ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఎయిర్ రెగ్యులేషన్స్, నేవిగేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ఇంజిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏవియేషన్ సెక్యూరిటీ, ఫ్లైట్ సేఫ్టీ తదితర అంశాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దీన్ని పూర్తిచేసిన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, గ్రౌండ్ ఆపరేషన్స్ స్టాఫ్, కార్గో మేనేజ్మెంట్ స్టాఫ్, టికెటింగ్ స్టాఫ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్లతో ఇంటర్/+2. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్‌బరేలీ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ) కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు, ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి డీజీసీఏ.. ఏఎంఈ లెసైన్స్‌ను అందిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తనిఖీ, నిర్వహణ, సర్వీసింగ్‌పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ సంస్థలు, ఫ్లయింగ్ స్కూళ్లలో కూడా ఉద్యోగాలు సాధించొచ్చు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. అలాగే నిర్ణీత వయోపరిమితి, వైద్య ప్రమాణాలు ఉండాలి. చివరి 6 నెలల పాటు విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయాలి. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్. బీబీఏ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు కరిక్యులంలో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్ తదితర అంశాలు ఉంటాయి. ఈ కోర్సును పూర్తిచేసిన వారు విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించొచ్చు. అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూపులో ఇంటర్/+2. అందిస్తున్న సంస్థలు: ఎయిమ్ఫిల్ ఇంటర్నేషనల్ - హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) - డెహ్రాడూన్ (బీబీఏ ఏవియేషన్ ఆపరేషన్స). వేతనం: ప్రారంభంలో 3 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఔత్సాహికులు ఎంబీఏ కూడా చేయొచ్చు. గ్రౌండ్ స్టాఫ్ మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఈ కోర్సులుంటాయి. ఏదైనా గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరొచ్చు. ఎయిర్పోర్ట్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనింగ్, కార్గో మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్, స్టాఫ్ మేనేజ్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ తదితర అంశాలను ఇందులో నేర్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారు ప్రాంతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, కార్గో డిపార్ట్మెంట్ మేనేజర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి ఉంటుంది. అయితే ఈ కోర్సు తర్వాత ఐఏటీఏ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. కోర్సులు - అందిస్తున్న సంస్థలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఫెమిలియరైజేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ (కోర్సు: ఎయిర్ కార్గో అండ్ కొరియర్ మేనేజ్మెంట్). ఇంకా ఎన్నో.. ఇవే కాకుండా డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ అండ్ ఇన్ ఫ్లైట్ సర్వీస్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో ప్రాక్టీసెస్ అండ్ డాక్యుమెంటేషన్, డిప్లొమా ఇన్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ తదితర ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఇంటర్ విద్యార్హతతో ఈ కోర్సులు చేయొచ్చు. నల్సార్ వర్సిటీలో.. నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)... ఏవియేషన్ అండ్ స్పేస్లా కోర్సులను అందిస్తోంది. కోర్సుల వివరాలు... ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (రెండేళ్లు) ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పేస్ అండ్ టెలీకమ్యూనికేషన్ ‘లా’స్ (రెండేళ్లు) ⇒ పీజీ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (ఏడాది) ⇒ పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ లా (ఏడాది) అర్హతలు: మూడేళ్ల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. -
రేసింగ్ యమ డేంజర్
చిలకలూరిపేట: హైదరాబాద్ వంటి మహా నగరాల్లో జరిగే బైక్, కారు రేసింగ్‌లు గుంటూరు జిల్లాలోనూ కనిపిస్తున్నా యి. ప్రాణాంతకంగా మారిన ఈ పందాలు ప్రజల్లోనూ భయాందోళనలు రేపుతున్నాయి. అతి వేగంగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతరం తమ బంగరు భవితను కోల్పోతున్నారు. పందాల సందర్భంగా జరుగుతున్న ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయాలపాలై వికలాంగులుగా మారుతు న్నారు. ఆదివారం యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన కారు రేసింగ్‌ను చూసిన ప్రజలే భయాందోళనకు గురయ్యారంటే వాహనాల వేగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఎప్పుడు రద్దీగా ఉండే 16వ నంబరు జాతీయ రహదారిపై తిమ్మాపురం పరిధిలో ఆది వారం కొంతమేర ట్రాఫిక్ తక్కువగానే ఉంది. విద్యాసంస్థలకు సెలవు కావడం, వాహన రాకపోకలు పెద్దగా లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్టయింది. జాతీయ రహదారి విస్తరణ కూడా వాహనాల వేగం పెరగటానికి కారణమైంది. గతంలో నాలుగు లేన్లగా ఉన్న జాతీయరహదారిని ఆరు లేన్లగా విస్తరించిన క్రమంలో వాహనాలు అతి వేగంతో దూసుకువెళుతున్నాయి. ఆదివారం జరిగిన కారు రేస్‌లో ముందుగా విద్యార్థులు నిర్ణయించుకున్న టార్గెట్‌కు సమీప దూరంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి రెండు కారుల్లో వస్తున్న విద్యార్థులు గుంటూరు నగరం దాటిన తరు వాతే రేస్ ఆడాలని ప్లాన్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కారు రేసులో ప్రమాదానికి గురైన గురైన ఏపీ 37 బీఏ 4646 వాహనం ఏలూరుకు చెందిన వ్యక్తి పేరుపై, మరో వాహనం ఏపీ31 సీపీ 0999 వాహనం విశాఖపట్నానికి చెందిన వ్యక్తిపేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారుల వేగం 140 కిలోమీటర్ల పైగా ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అతి వేగమే... రేసింగ్ కాదు : పోలీసులు తిమ్మాపురం సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదం అతివేగం వల్ల జరిగిందేనని కారుల రేస్ కాదని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై రూరల్ సీఐ సంజీవ్‌కుమార్ మాట్లాడు తూ ఎంతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై కారుల రేస్ జరిగే అవకాశమే లేదన్నారు. ఓవర్ టేక్ చేసే సమయంలో జరిగిన ప్రమాదంగా ఆయన అభివర్ణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బెస్ట్ 4 బ్రైట్ ఫ్యూచర్
లక్షల సంఖ్యలో ఉద్యోగార్థులు.. వీరికి అదనంగా ప్రతిఏటా పట్టాలు అందుకుంటున్న విద్యార్థులు వేలల్లోనే..! కోర్సు ఏదైనా ప్రతి ఒక్కరి లక్ష్యం.. మంచి ఉద్యోగం, మెరుగైన భవిష్యత్తు. ఈ క్రమంలో కచ్చితమైన కొలువులకు మార్గం వేస్తున్న ఈ-కామర్స్; ఎఫ్ఎంసీజీ; రిటైల్; బీఎఫ్ఎస్ఐ రంగాలపై ఫోకస్.. ఎమర్జింగ్ ఫీల్డ్.. ఈ-కామర్స్ ముఖ్యాంశాలు Mi3 కొనుగోలు కోసం వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. కొద్ది నిమిషాలపాటు స్తంభించిన ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్.. ఒక గదిలో ప్రారంభమైన ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ రెడ్‌బస్‌ను.. 135 మిలియన్ యూ.ఎస్ డాలర్లకు సొంతం చేసుకున్న ఐబీబో సంస్థ.. కేవలం ఇద్దరితో ప్రారంభమై నాలుగేళ్లలోనే రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పిస్తున్న స్నాప్‌డీల్. ఆన్లైన్ షాపింగ్‌పై పెరుగుతున్న మక్కువకు, ఈ-కామర్స్ వృద్ధి చెందుతున్న తీరుకు మూడు నిదర్శనాలు. హైరింగ్ ట్రెండ్.. ఐఐఎంలు, ఐఐటీల్లో సైతం క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్పంచుకుంటున్న ఈ-కామర్స్ సంస్థలు.. 2013-14 బ్యాచ్‌లో మొత్తం 137 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లను నియమించుకున్న ఫ్లిప్‌కార్ట్. ఇంకా ఈబే ఇండియా, స్నాప్‌డీల్, అమెజాన్ వంటివి భారీగా ఉద్యోగాలిస్తున్నాయి. సగటున రూ.12 లక్షల వార్షిక వేతనం అందిస్తున్న కంపెనీలు.. కోర్ కంపెనీల కంటే ఈ-కామర్స్ సంస్థల వైపు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు.. ఈ-కామర్స్ రంగం ఉద్యోగావకాశాల పరంగా క్రేజీగా మారుతోందనడానికి ఉదాహరణలు. ఇంటర్నెట్ లేదా మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ఆన్లైన్ షాపింగ్ ద్వారా నిమిషాల్లో నచ్చిన వస్తువును కొనుగోలు చేసేందుకు దోహదపడుతోంది..ఈ-కామర్స్. 2013లో 88 శాతం వృద్ధి నమోదు కావడమే ఈ-కామర్స్‌కు లభిస్తున్న ఆదరణకు నిదర్శనం. ఈ-కామర్స్ రంగం వేగం ఇదే విధంగా కొనసాగుతుందని.. నియామకాలు భారీగా జరుగుతాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా 2016 చివరికి ప్రత్యక్షంగా 50 వేల మందికి, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. పెరుగుతున్న ఆసక్తి: విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో సైతం ఈ-కామర్స్ రంగంలో కెరీర్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. నీల్సన్ ఇండియా.. ఐఐఎంలు, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో నిర్వహించిన సర్వేలో మొత్తం విద్యార్థుల్లో 25 శాతం మంది ఈ-కామర్స్‌ను తమ మొదటి ఆప్షన్‌గా పేర్కొనడం విశేషం. అవకాశాలు: ప్రధానంగా ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రైసింగ్/ప్రాఫిట్ మేనేజ్మెంట్; కస్టమర్ సెల్లింగ్ వంటివి సేల్స్, అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి ఎక్కువగా లభించే అవకాశాలు. టెక్నికల్‌గా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్సైట్ డిజైన్ మేనేజర్, కంటెంట్ డెవలపర్ వంటి వాటితోపాటు టెక్నికల్ సపోర్ట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎంట్రీలెవల్లో నెలకు రూ.10 వేల జీతం లభిస్తుంది. అనుభవంతో ఆకాశమే హద్దుగా ఎదగొచ్చు. కోర్సులివే.. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సు: ఈ-కామర్స్‌లో డిప్లొమా, ఎంఈ అన్నా యూనివర్సిటీ కోర్సు: ఈ-కామర్స్‌లో సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్- స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోర్సు: ఈ-కామర్స్ అప్లికేషన్ ట్రైనింగ్ ఉస్మానియా యూనివర్సిటీ కోర్సు: ఎంకాం (ఈ-కామర్స్) ఇవేకాకుండా మరికొన్ని విద్యా సంస్థలు ఎంబీఏ, పీజీ డిప్లొమా స్థాయిలోఈ-బిజినెస్ పేరుతో పలు ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. బీఎఫ్ఎస్ఐ కొలువుల కేరాఫ్‌గా నిలుస్తున్న రంగం.. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్). ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలోనే 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి, ఇప్పటికే ఉన్న బ్యాంకుల విస్తరణ వంటి కారణాలతో రానున్న ఐదేళ్లలో మరో 5 నుంచి 6 లక్షల నియామకాలు జరగనున్నాయి. మరోవైపు బీమా రంగంలో కంపెనీలు కూడా ఇదే రీతిలో ప్రగతి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్‌లలో విస్తరణ కార్యకలాపాలు పెరిగాయి. ఇన్సూరెన్స్ రంగం 2020 నాటికి 280 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించడం ఖాయం. మొత్తం మీద బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ రంగాల్లో 2020 నాటికి లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ సంస్థల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలతోపాటు.. నిపుణులను తీర్చిదిద్దేలా పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఔత్సాహిక విద్యార్థులకు ఇవి కెరీర్ పరంగా ఎంట్రీ పాస్లుగా పేర్కొనొచ్చు. కోర్సులు నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ కోర్సు: ఎంబీఏ యాక్చుయేరియల్ సైన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రీసెర్చ్- చెన్నై కోర్సు: పీజీ డిప్లొమా మేనేజ్మెంట్- ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ నేషనల్ లా యూనివర్సిటీ - జోథ్‌పూర్ కోర్సు: ఎంబీఏ- ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఐఐఆర్ఎం- హైదరాబాద్ కోర్సులు: పీజీ డిప్లొమాలో ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్; యాక్చుయేరియల్ సైన్స్‌తోపాటు సర్టిఫికెట్ కోర్సులు. ఇవేకాకుండా మరెన్నో సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. రిటైల్ రంగం రిటైల్ రంగం ప్రతి ఏటా దాదాపు పది శాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. 2020 నాటికి వేయి బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలోని మొత్తం నియామకాల్లో 8 శాతం వాటా రిటైల్‌దే అని అసోచామ్ నివేదిక తెలుపుతోంది. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ నుంచి ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకు ప్రతి ఒక్కరికీ కెరీర్ గమ్యంగా నిలుస్తోంది. స్టోర్ కీపర్ నుంచి సీఈఓ స్థాయి వరకు ఎన్నో అవకాశాలకు వేదికగా మారుతోంది. ఔట్లెట్స్, సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్‌ల్లో ఎన్నో ఉద్యోగాలున్నాయి. ప్రభుత్వం కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో బహుళ జాతి సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఉద్యోగాలు కస్టమర్ సేల్స్ అసోసియేట్: తమ సంస్థలోని ఉత్పత్తుల గురించి వినియోగదారులకు వివరించి కొనుగోలు చేసేలా మెప్పించడం కస్టమర్ సేల్స్ అసోసియేట్ ప్రధాన బాధ్యత. ఎంతో సహనం, ఓర్పు, వాక్చాతుర్యం అవసరం. ఫ్లోర్ మేనేజర్/కేటగిరీ మేనేజర్: రిటైల్ ఔట్లెట్లో పర్యవేక్షణ బాధ్యతలతో కూడిన ఉద్యోగం ఫ్లోర్ మేనేజర్ / కేటగిరీ మేనేజర్. స్టోర్ మేనేజర్: వినియోగదారులకు అందుబాటులో ఉంచాల్సిన వస్తువులను నిక్షిప్తం చేసే గోడౌన్లలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి స్టోర్ మేనేజర్. రిటైల్ మేనేజర్: ఔట్లెట్ పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన వ్యక్తి రిటైల్ మేనేజర్. వినియోగదారులను, ఉద్యోగులను సమన్వయం చేస్తూ విక్రయాలు పెరిగేలా చేయడం, అకౌంటింగ్, క్యాష్ మేనేజ్మెంట్ వంటి విధులు నిర్వర్తించాలి. రిటైల్ బయ్యర్స్/మర్చండైజర్స్: రిటైల్ ఔట్లెట్ ఏర్పాటు చేసిన ప్రాంతం, ఆ ప్రాంతంలోని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అందుబాటులో ఉంచాల్సిన వస్తువులను గుర్తించడం, వాటికి సంబంధించి ఉత్పత్తిదారులతో సంప్రదింపులు చేయడం వీరి ప్రధాన విధులు. అదే విధంగా బ్యాక్ ఎండ్ విభాగంలో.. బ్యాక్ ఎండ్ మేనేజర్స్: రిటైల్ కమ్యూనికేషన్ మేనేజర్స్; ఫైనాన్స్ మేనేజర్స్ వంటి అవకాశాలుంటాయి. వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్లోని స్టోర్ కీపర్ ఉద్యోగాలకు నెలకు రూ.8 వేల జీతం లభిస్తోంది. స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు సగటున రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందుతోంది. రిటైల్ మేనేజ్మెంట్లో పలు ఇన్స్టిట్యూట్లు సర్టిఫికెట్ ప్రోగ్రామ్ నుంచి పీజీ కోర్సుల వరకు అందిస్తున్నాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ).. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ).. ఉదయాన్నే ఉపయోగించే టూత్ బ్రష్ మొదలు మన దినచర్యలో అవసరమైన వస్తువుల విక్రయాలకు సంబంధించిన రంగం! ముఖ్యంగా మన దేశంలో ఇటీవల కాలంలో ఈ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా సగటున పదిశాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. ఎఫ్ఎంసీజీలో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. మరోవైపు జోరుగా నియామకాలు జరుపుతూ ఉద్యోగార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నివేదికల ప్రకారం- ఈ రంగం మార్కెట్ విలువ 2018 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. తద్వారా ఎఫ్ఎంసీజీ రంగం దాదాపు 3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. బహుళ జాతి సంస్థలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించడంతో ఉద్యోగార్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఆయా ఉత్పత్తులకు సంబంధించి ముడిపదార్థాల సేకరణ నుంచి వినియోగదారుల అభిరుచులు, అవసరాలు పరిగణనలోకి తీసుకుంటూ తుది ప్రొడక్ట్‌ను రూపొందించేవరకూ.. విభాగాల వారీగా అనేక ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో కీలక విభాగాలు.. సేల్స్: ఈ విభాగంలో అభ్యర్థులకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్స్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. సంస్థ ఉత్పత్తుల విక్రయంతోపాటు చక్కటి మార్కెటింగ్ ప్లాన్స్ రూపొందించడం కీలక విధులు. ఈ విభాగంలో ప్రారంభంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌తో కెరీర్ ప్రారంభించి మార్కెటింగ్ డెరైక్టర్ వంటి అత్యున్నత హోదాకు చేరుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్: సంస్థలోని ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణ, సంస్థకు అవసరమైన మానవ వనరుల సంఖ్యపై అంచనాలు, ఉద్యోగులను, యాజమాన్యాన్ని సమన్వయం చేస్తూ ఉత్పత్తి పెంచే విధంగా చేయడం హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ విధులు. ఆపరేషన్స్ మేనేజ్మెంట్: ముడి పదార్థాల సేకరణ, వాటి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వంటి ఎన్నో బాధ్యతలతో కూడిన విభాగం ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఫైనాన్స: ఈ విభాగంలో సంస్థ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన విధులు, అకౌంటింగ్ విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఈ రంగంలో పర్చేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వంటి ఇతర మార్కెటింగ్ విభాగాల్లోనూ పలు ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఎఫ్ఎంసీజీ.. ఫాస్ట్ గ్రోత్ ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రత్యేక కోర్సులు లేకపోయినప్పటికీ.. ఆయా విభాగాల్లో స్పెషలైజ్డ్ డిగ్రీలు పొందిన వారికి సంస్థలు నియామకంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉదాహరణకు పీజీ స్థాయిలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణులకు ఫైనాన్స్ విభాగం, హెచ్ఆర్ స్పెషలైజేషన్ అభ్యర్థులకు హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగాలుంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీతోనూ ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. వీరికి జనరల్ అడ్మినిస్ట్రేషన్, అకౌంటింగ్ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఎంట్రీ పోస్టులు లభిస్తాయి. సేల్స్, మార్కెటింగ్‌లో అడుగుపెట్టాలనుకునే వారికి అకడమిక్ అర్హతలకంటే ఇతరులను మెప్పించే వాక్చాతుర్యం, నలుగురిలో కలిసిపోయేతత్వం ప్రధాన అర్హతలు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు సగటున రూ.1.5 లక్షలు; స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్లు రూ.2 లక్షల వార్షిక వేతనం కచ్చితంగా పొందొచ్చు. క్యాంపస్‌లకు టాప్ రిక్రూటర్స్ ఈ రంగంలో ఐటీసీ, నెస్ట్లే ఇండియా లిమిటెడ్, జాన్సన్ అండ్ జాన్సన్, క్యాడ్బరీ, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్ తదితర సంస్థలు ఐఐఎంల నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లోని కళాశాలల వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేసుకుంటున్నాయి. ఈ-కామర్స్ ఔత్సాహికులకు సరైన సమయం ఇదే.. దేశంలో ఆన్లైన్ షాపింగ్ కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఆకర్షణీయ వేతనాలతోపాటు, సుస్థిర అభివృద్ధికి అవకాశం ఉన్న రంగం ఈ-కామర్స్. ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్ విభాగంలో కస్టమర్ సపోర్ట్, కస్టమర్ రిలేషన్, క్లయింట్ సర్వీస్, ప్రొడక్ట్ డెలివరీ వంటి విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన, ఆయా ఉత్పత్తుల గురించి వినియోగదారులకు వివరించే అనలిటికల్ స్కిల్స్ ఉంటే రాణించడం సులువు. ఇక బ్యాక్ ఎండ్ విభాగంలో వెబ్‌సైట్స్ నిర్వహణ, మేనేజీరియల్ విధులకు సంబంధించిన ఉద్యోగాలు లభిస్తాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఉత్తీర్ణులు ఈ విభాగంలో రాణించేందుకు వీలవుతుంది. అకడమిక్ స్థాయిలోనే సంబంధిత కోర్ అంశాలపై శిక్షణనిచ్చే విధంగా కోర్సులు రూపొందిస్తే పరిశ్రమ అవసరాలు తీరతాయి. - కె. సందీప్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ - స్నాప్‌డీల్ అందరికీ అవకాశాలు కల్పించే రిటైల్, ఎఫ్ఎంసీజీ.. పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు ప్రతి ఒక్కరికీ వారి అర్హతల ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్న రంగాలు రిటైల్, ఎఫ్ఎంసీజీ. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో ఈ రంగాలు బాగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రిటైల్ ఆపరేటర్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు గ్రామీణ ప్రాంతాలను కూడా లక్ష్యంగా పెట్టుకుని విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నాయి. గత ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలో మానవ వనరుల పరంగానూ విస్తృత అవకాశాలు లభించడం గ్యారంటీ. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నియామకాలకు ఆయా సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అదే సమయంలో వేతనాలు కూడా గుర్తించదగిన స్థాయిలో పెరుగుతున్నాయి. - రీతూపర్ణ చక్రవర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీమ్-లీజ్ సర్వీసెస్ బీఎఫ్ఎస్ఐ.. ఆ రెండు కారణాలే సోపానాలు ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు అనుమతినివ్వడం, ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న రెండు కారణాలు బీఎఫ్ఎస్ఐ రంగంలో కెరీర్ సోపానాలుగా నిలుస్తున్నాయి. బ్యాంకింగ్‌కు సంబంధించి ఇటీవల కాలంలో పీజీ, బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అకడమిక్ అవేర్నెస్ పెరుగుతోంది. కానీ ఇన్సూరెన్స్ రంగంలోనే ఇది ఇంకా పెరగాల్సి ఉంది. అకడమిక్ ఇన్స్టిట్యూట్లు కూడా కొంత తక్కువగానే ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఐఐఆర్ఎం-హైదరాబాద్, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలు ఈ రంగంలో కోర్సుల పరంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలు. నిరంతర అధ్యయన నైపుణ్యం, మార్కెట్ పరిస్థితులపై అవగాహన వంటి లక్షణాలతో ఈ రంగంలో సుస్థిర కెరీర్‌ను ఆశించొచ్చు. - సబా ఆదిల్ టాలెంట్ హెడ్- ఏగాన్ రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్ -
జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేంద్రమంత్రిగా జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి అయిన తరువాత తొలిసారిగా నెల్లూరుకు వచ్చిన ఆయన్ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి నారాయణ కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారని, ఆయనకు తన పూర్తి సహకారాన్ని అందజేస్తానని తెలిపారు. గతంలో ఆచరణకు నోచు కోని పథకాలను పూర్తి చేయడానికి తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల రెండు పార్టీలు లాభం పొందాయని తెలిపారు. అయితే నెల్లూరు ప్రజలే తమకు న్యాయం చేయలేదన్నారు. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ-బీజేపీకి రాలేదని తెలిపారు. తిరుపతి, నెల్లూరు ఎంపీ స్థానాలు బీజేపీకి దక్కకపోవడం బాధాకరమన్నారు. అయితే ఆ ఎంపీలు కూడా సమర్థులేనని తెలిపారు నెల్లూరును అభివృద్ధి చేయడానికి తన సంపూర్ణ సహకారం అందజేస్తానని తెలిపారు. జిల్లాలోని సమస్యలపై కలెక్టరును వివరాలు అడిగానని, నివేదిక అందిన వెంటనే ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తానని తెలిపారు. సమస్యలెదురైనా పోలవరం ఆర్డినెన్స్ తెచ్చాం కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రాష్ట్రానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని, ఇందులో భాగంగానే సమస్యలు ఎదురైనా పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో తీసుకొచ్చామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. విభజనకు కట్టుబడ్డా, విభజన తీరును వ్యతిరేకించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని విభజించిందని తెలిపారు. ఇందులో భాగంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దేశ సమస్యలు అనేకం ఉన్నా, వాటిని చర్చించ కుండా పాలస్తీనాపై చర్చించమని గొడవకు దిగడం సమంజసం కాదన్నారు. రైలు చార్జీలను పెంచకుండా అభివృద్ధి అసాధ్యమన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైలు ప్రాజెక్టులు విలువ ఐదు లక్షల కోట్ల రూపాయలని తెలిపారు. అంత ఆదాయం రైల్వేలో లేనందున రైలు చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రానికి ఇంకా అనేక విద్యా సంస్థలు, రాష్ట్రం కోరిన ప్రాజెక్టులు తెప్పిస్తామని చెప్పారు. అన్ని అంశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరం ఉందన్నారు. అభివృద్ధి విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలు ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఘనసన్మానం: నెల్లూరు (దర్గామిట్ట): కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన మువ్పవరపు వెంకయ్యనాయుడుకు సింహపురి ప్రజలు ఘనంగా సన్మానించారు. అనిల్ గార్డెన్స్‌లో శుక్రవారం రాత్రి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి మాణిక్యరావు, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మాత్యులు నారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. తనకు ఇద్దరు గురువులున్నారని, మొదటి గురువు చంద్రబాబు అయితే రెండో గురువు వెంకయ్యనాయుడని చెప్పారు. కేంద్రంలో వెంకయ్యనాయుడుకు, రాష్ట్రంలో తనకు ఒకే శాఖ రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన సహకారంతో నెల్లూరును పూర్తిగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు వల్లే ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా 900 వైద్య సీట్లు వచ్చాయని కొనియాడారు. వెంకయ్యనాయుడు సింహపురి ముద్దు బిడ్డ కాదని, తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డగా ఎదిగారన్నారు. ఆయన స్నేహితుడుగా తాను గర్వపడుతున్నాని తెలిపారు. మంత్రి మాణిక్యరావు మాట్లాడుతూ అధికారంతో సంబంధం లేకుండా నమ్మిన సిద్దాంతంతో పనిచేసే తత్వం వెంకయ్యనాయుడుకు ఉందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి భానుప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు కృష్ణయ్య, దారా సాంబయ్య, ఎప్సీఐ మాజీ డెరైక్టర్ రాధాకృష్ణారెడ్డి, బీజీపీ నేతలు కందుకూరి సత్యనారాయణ, కప్పిర శ్రీనివాసులు, ఆంజనేయరెడ్డి, వరదయ్య, రమేష్, మండల ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లరెడ్డి, రంగినేని కృష్ణయ్య, టీడీపీ నేత విజయకృష్ణారెడ్డి, రత్నం విద్యాసంస్థల అధినేత కిషోర్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యకు ఘన స్వాగతం నెల్లూరు (సెంట్రల్): జిల్లా ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి అయిన తరువాత మొదటిసారి సొంతగడ్డపై అడుగుపెట్టడంతో బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయ్యప్పగుడి వద్ద పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అయ్యప్పగుడి వద్ద నుంచి వేదాయపాళెం, నిప్పోసెంటరు, కరెంటుఆఫీస్, వెంకటరమణ హాల్ సెంటరు, కేవీఆర్ పెట్రోలు బంకు మీదుగా ర్యాలీ నిర్వహించి నగరంలోకి ప్రవేశించారు. బ్యాండు, కీలుగుర్రాలు, మహిళలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాండు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
ఎన్నికల తర్వాతే మంచిరోజులు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం, డాలర్ ప్రభావం.. ఇలా ఒకదాని వెంట మరొకటి చొప్పున సమస్యలు చుట్టుముట్టడంతో 2013 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఇక కోలుకునేది సార్వత్రిక ఎన్నికల తర్వాతే’’ అని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికల సమయంలో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు, విదేశీ సంస్థలు వెనుకడుగు వేస్తాయని, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఎన్నికలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయని వారు పేర్కొన్నారు. అందుకే ఇలాంటి సమయంలో కోట్ల రూపాయల పెట్టుబడులంటే ఆలోచిస్తారన్నారు. ‘సీఐఐ ఎస్టేట్ సౌత్-మేకింగ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ రియల్ ఎస్టేట్’ రెండు రోజుల సదస్సు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోట ల్లో జరిగింది. ఈ సదస్సులో ఎస్టేట్ సౌత్ 2013 చైర్మన్, మంజీరా కన్స్ట్రక్షన్స్ సీఎండీ జి.యోగానంద్ మాట్లాడుతూ... ఏటా జీడీపీ పెరుగుదలలో 25 శాతం రియల్ ఎస్టేట్ మార్కెట్ నుంచే వస్తోందన్నారు. ‘వచ్చే 30-40 ఏళ్లలో జనాభా రెండింతలవుతుంది. ఈ జనాభాకు ఇళ్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఆసుపత్రులు అవసరముంటాయి. అందుకే భవిష్యత్తులో మాల్స్, హోటళ్లు, ఆసుపత్రులకు మంచి గిరాకీ ఉంటుంది’ అని చెప్పారు. అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం, అక్కడి స్థానిక సంస్థలు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని ఎస్టేట్ సౌత్ 2013 కో-చైర్మన్, అక్షయ ప్రై.లి. సీఎండీ టి.చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. ప్రి-ఇంజనీరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయిందని సీబీఆర్ఈ దక్షిణాసియా సీఎండీ అన్షుమన్ మేగజైన్ చెప్పారు. ‘‘ఈ టెక్నాలజీతో సమయం ఆదా ఆవటమే కాక ఫ్లాట్ల ధరలు కూడా తక్కువగా ఉంటాయి. ఇంటి విస్తీర్ణం కూడా పెరుగుతుంది’’ అని చెప్పారాయన. సదస్సులో సీఐఐ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్, శ్రీనివాస హేచరీస్ వైస్ చైర్మన్ సురేష్ చిట్టూరి, ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్, అప్రెడా అధ్యక్షుడు దశరథ్‌రెడ్డి, ఏపీ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉజ్వల కెరీర్‌కు‘ఆతిథ్య’మిస్తోంది!
దేశ ఆర్థిక ప్రగతికి ఆతిథ్య రంగం ఊపిరిపోస్తోంది.. మిగిలిన రంగాలతో పోలిస్తే ప్రతి రూ.10 లక్షల పెట్టుబడికి, అత్యధిక సంఖ్యలో ఉద్యోగాల సృష్టి ఆతిథ్య రంగంలోనే జరుగుతోంది.. - ప్రణాళిక సంఘం. శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. అద్భుత అవకాశాలకు బాటలు వేస్తోంది. పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో.. అదే స్థాయిలో.. హాస్పిటాలిటీ రంగంలో మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. కోర్సులు.. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పలు ఇన్స్టిట్యూట్లు హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులు. అందిస్తున్న సంస్థలు: హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ (ఐహెచ్ఎం).. ఎకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. కాల వ్యవధి: ఏడాదిన్నర అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. ప్రవేశం: జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష, కేంద్రీకృత కౌన్సెలింగ్ ఆధారంగా. వెబ్సైట్: www.ihmhyd.org డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - హైదరాబాద్.. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, కలినరీ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వ్యవధి: ఆరు నెలలు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వెబ్సైట్: www.nithm.ac.in మన రాష్ట్రంలో సెట్విన్.. హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ డిప్లొమా (వ్యవధి: మూడేళ్లు), పీజీ డిప్లొమా (వ్యవధి:ఏడాది), హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజంలో పీజీ డిప్లొమా (వ్యవధి: ఏడాది) అందిస్తోంది. వివిధ ఉన్నత స్థాయి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: www.setwinapgov.org నైపుణ్యాలు: కమ్యూనికేషన్ స్కిల్స్. మేనేజీరియల్ నైపుణ్యాలు. సాఫ్ట్ స్కిల్స్. సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం. వేతనాలు: మేనేజ్మెంట్ ట్రైనీగా అరుుతే నెలకు రూ.15 నుంచి రూ.18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. కెరీర్: హోటల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్(ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా జాబ్స్ పొందొచ్చు. రెండు కోణాలు: కెరీర్ పరంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆతిథ్య రంగం ఒక ఆకర్షణీయ (Glamour) కెరీర్ ఆప్షన్. కార్యకలాపాల విస్తరణకు అవకాశమున్న రంగం ఆతిథ్యం. అందువల్ల ఈ రంగంలో పదోన్నతులు త్వరగా లభిస్తాయి. కొత్త శాఖల ఏర్పాటు ద్వారా ఈ అవకాశం దొరుకుతుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గినప్పుడు ఆతిథ్య రంగం కొంత ఒడిదుడుకులకు గురవుతుంది. అధిక పనివేళలతో పాటు ఒక్కోసారి అతిథుల (కస్టమర్స్) ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ‘కాలం’తోడుగా ఆతిథ్యం ఆతిథ్య రంగంలో మేనేజ్మెంట్; ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్; హౌస్ కీపింగ్; ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్; సేల్స్ అండ్ మార్కెటింగ్; అకౌంటింగ్ తదితర విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో ఒక్కోలా పని ఉంటుంది. ఉదాహరణకు హోటల్ మేనేజర్‌ను తీసుకుంటే.. 6 am - 7am: హౌస్‌కీపింగ్, కస్టమర్ సర్వీసులు, అతిథుల సంఖ్య, వారికందుతున్న సేవలపై ఆరా. 7 am - 10am: హోటల్లో సమావేశాలకు ఏర్పాట్లు, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారాలు. 10 am - 1pm: కొత్త అతిథులు-ఏర్పాట్లకు సంబంధించిన పనుల పర్యవేక్షణ 1 pm - 2pm: మధ్యాహ్న భోజనం. 2 pm - 5pm: ఆక్యుపెన్సీ పెంపు, అతిథుల భద్రత, సౌకర్యాలపై యాజమాన్యం, బృందంతో చర్చలు. 6 pm: షిఫ్ట్ విధులు పూర్తి. తక్కువ కాలవ్యవధిలో కోర్సు పూర్తిచేసి ఉపాధి పొందే అవకాశం డిప్లొమాల ద్వారానే సాధ్యం. నిథమ్‌లో ఎంబీఏ, బీబీఏ, బీహెచ్ఎంసీటీ కోర్సులతోపాటు స్వల్పకాలంలో పూర్తిచేసే డిప్లొమాలున్నాయి. అవి.. రూరల్ టూరిజం, ప్రాజెక్టు డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆయుర్వేద పంచకర్మ థెరపీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ. కాల వ్యవధి (3- 6 నెలలు), ఫీజు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. అర్హత: 10వ తరగతి. 6 నెలల వ్యవధి గల రూరల్ టూరిజంలో డిప్లొమాకు 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హోటళ్లు, టూరిజం సెంటర్లలో పనిచేసే కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రొడక్షన్, హౌస్‌కీపింగ్, సర్వీస్ అంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం. -డాక్టర్ పి.నారాయణరెడ్డి, డెరైక్టర్, డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్, హైదరాబాద్. ఎన్సీహెచ్ఎంసీటీ - జేఈఈ (2014) జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. ఈ సంస్థల్లో మొత్తం 7,454 సీట్లున్నాయి. జేఈఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు.. అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 2014, జూలై 1 నాటికి 22 ఏళ్లు మించరాదు. అభ్యర్థులు 1992, జూలై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు. వీరు1989, జూలై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎంపిక: జేఈఈ ర్యాంకు ఆధారంగా ప్రవేశం. పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 ప్రశ్నలు) ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. దరఖాస్తు వివరాలు: దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో.. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్ దరఖాస్తుల అమ్మకం ప్రారంభం: డిసెంబర్ 23, 2013 ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 5, 2013 దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014 అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: ఏప్రిల్ 19, 2014 నుంచి పరీక్ష తేదీ: ఏప్రిల్ 26, 2014, వెబ్సైట్: https://applyadmission.net/nchmjee2014/