లక్షల సంఖ్యలో ఉద్యోగార్థులు.. వీరికి అదనంగా ప్రతిఏటా పట్టాలు అందుకుంటున్న విద్యార్థులు వేలల్లోనే..! కోర్సు ఏదైనా ప్రతి ఒక్కరి లక్ష్యం.. మంచి ఉద్యోగం, మెరుగైన భవిష్యత్తు. ఈ క్రమంలో కచ్చితమైన కొలువులకు మార్గం వేస్తున్న ఈ-కామర్స్; ఎఫ్‌ఎంసీజీ; రిటైల్; బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలపై ఫోకస్..
ఎమర్జింగ్ ఫీల్డ్.. ఈ-కామర్స్
ముఖ్యాంశాలు
Mi3 కొనుగోలు కోసం వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. కొద్ది నిమిషాలపాటు స్తంభించిన ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్..
ఒక గదిలో ప్రారంభమైన ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ రెడ్‌బస్‌ను.. 135 మిలియన్ యూ.ఎస్ డాలర్లకు సొంతం చేసుకున్న ఐబీబో సంస్థ..
కేవలం ఇద్దరితో ప్రారంభమై నాలుగేళ్లలోనే రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పిస్తున్న స్నాప్‌డీల్. ఆన్‌లైన్ షాపింగ్‌పై పెరుగుతున్న మక్కువకు, ఈ-కామర్స్ వృద్ధి చెందుతున్న తీరుకు మూడు నిదర్శనాలు.
హైరింగ్ ట్రెండ్..
ఐఐఎంలు, ఐఐటీల్లో సైతం క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్పంచుకుంటున్న ఈ-కామర్స్ సంస్థలు..
2013-14 బ్యాచ్‌లో మొత్తం 137 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లను నియమించుకున్న ఫ్లిప్‌కార్ట్. ఇంకా ఈబే ఇండియా, స్నాప్‌డీల్, అమెజాన్ వంటివి భారీగా ఉద్యోగాలిస్తున్నాయి.
సగటున రూ.12 లక్షల వార్షిక వేతనం అందిస్తున్న కంపెనీలు..
కోర్ కంపెనీల కంటే ఈ-కామర్స్ సంస్థల వైపు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు.. ఈ-కామర్స్ రంగం ఉద్యోగావకాశాల పరంగా క్రేజీగా మారుతోందనడానికి ఉదాహరణలు.
ఇంటర్నెట్ లేదా మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా నిమిషాల్లో నచ్చిన వస్తువును కొనుగోలు చేసేందుకు దోహదపడుతోంది..ఈ-కామర్స్. 2013లో 88 శాతం వృద్ధి నమోదు కావడమే ఈ-కామర్స్‌కు లభిస్తున్న ఆదరణకు నిదర్శనం. ఈ-కామర్స్ రంగం వేగం ఇదే విధంగా కొనసాగుతుందని.. నియామకాలు భారీగా జరుగుతాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా 2016 చివరికి ప్రత్యక్షంగా 50 వేల మందికి, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.
పెరుగుతున్న ఆసక్తి: విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో సైతం ఈ-కామర్స్ రంగంలో కెరీర్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. నీల్సన్ ఇండియా.. ఐఐఎంలు, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో నిర్వహించిన సర్వేలో మొత్తం విద్యార్థుల్లో 25 శాతం మంది ఈ-కామర్స్‌ను తమ మొదటి ఆప్షన్‌గా పేర్కొనడం విశేషం.
అవకాశాలు: ప్రధానంగా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రైసింగ్/ప్రాఫిట్ మేనేజ్‌మెంట్; కస్టమర్ సెల్లింగ్ వంటివి సేల్స్, అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి ఎక్కువగా లభించే అవకాశాలు. టెక్నికల్‌గా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్‌సైట్ డిజైన్ మేనేజర్, కంటెంట్ డెవలపర్ వంటి వాటితోపాటు టెక్నికల్ సపోర్ట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎంట్రీలెవల్‌లో నెలకు రూ.10 వేల జీతం లభిస్తుంది. అనుభవంతో ఆకాశమే హద్దుగా ఎదగొచ్చు.
కోర్సులివే..
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
కోర్సు: ఈ-కామర్స్‌లో డిప్లొమా, ఎంఈ
అన్నా యూనివర్సిటీ
కోర్సు: ఈ-కామర్స్‌లో సర్టిఫైడ్ ప్రోగ్రామ్
ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్- స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
కోర్సు: ఈ-కామర్స్ అప్లికేషన్ ట్రైనింగ్
ఉస్మానియా యూనివర్సిటీ
కోర్సు: ఎంకాం (ఈ-కామర్స్)
ఇవేకాకుండా మరికొన్ని విద్యా సంస్థలు ఎంబీఏ, పీజీ డిప్లొమా స్థాయిలోఈ-బిజినెస్ పేరుతో పలు ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
బీఎఫ్‌ఎస్‌ఐ
కొలువుల కేరాఫ్‌గా నిలుస్తున్న రంగం.. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్). ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలోనే 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి, ఇప్పటికే ఉన్న బ్యాంకుల విస్తరణ వంటి కారణాలతో రానున్న ఐదేళ్లలో మరో 5 నుంచి 6 లక్షల నియామకాలు జరగనున్నాయి. మరోవైపు బీమా రంగంలో కంపెనీలు కూడా ఇదే రీతిలో ప్రగతి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్‌లలో విస్తరణ కార్యకలాపాలు పెరిగాయి. ఇన్సూరెన్స్ రంగం 2020 నాటికి 280 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించడం ఖాయం. మొత్తం మీద బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ రంగాల్లో 2020 నాటికి లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ సంస్థల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలతోపాటు.. నిపుణులను తీర్చిదిద్దేలా పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఔత్సాహిక విద్యార్థులకు ఇవి కెరీర్ పరంగా ఎంట్రీ పాస్‌లుగా పేర్కొనొచ్చు.
కోర్సులు
నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
కోర్సు: ఎంబీఏ యాక్చుయేరియల్ సైన్స్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్- చెన్నై
కోర్సు: పీజీ డిప్లొమా మేనేజ్‌మెంట్- ఫైనాన్షియల్ ఇంజనీరింగ్
నేషనల్ లా యూనివర్సిటీ - జోథ్‌పూర్
కోర్సు: ఎంబీఏ- ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్
ఐఐఆర్‌ఎం- హైదరాబాద్
కోర్సులు: పీజీ డిప్లొమాలో ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్; యాక్చుయేరియల్ సైన్స్‌తోపాటు సర్టిఫికెట్ కోర్సులు. ఇవేకాకుండా మరెన్నో సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.
రిటైల్ రంగం
రిటైల్ రంగం ప్రతి ఏటా దాదాపు పది శాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. 2020 నాటికి వేయి బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలోని మొత్తం నియామకాల్లో 8 శాతం వాటా రిటైల్‌దే అని అసోచామ్ నివేదిక తెలుపుతోంది. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ నుంచి ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకు ప్రతి ఒక్కరికీ కెరీర్ గమ్యంగా నిలుస్తోంది. స్టోర్ కీపర్ నుంచి సీఈఓ స్థాయి వరకు ఎన్నో అవకాశాలకు వేదికగా మారుతోంది. ఔట్‌లెట్స్, సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్‌ల్లో ఎన్నో ఉద్యోగాలున్నాయి. ప్రభుత్వం కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో బహుళ జాతి సంస్థలు ప్రవేశిస్తున్నాయి.
ఉద్యోగాలు
కస్టమర్ సేల్స్ అసోసియేట్: తమ సంస్థలోని ఉత్పత్తుల గురించి వినియోగదారులకు వివరించి కొనుగోలు చేసేలా మెప్పించడం కస్టమర్ సేల్స్ అసోసియేట్ ప్రధాన బాధ్యత. ఎంతో సహనం, ఓర్పు, వాక్చాతుర్యం అవసరం.
ఫ్లోర్ మేనేజర్/కేటగిరీ మేనేజర్: రిటైల్ ఔట్‌లెట్‌లో పర్యవేక్షణ బాధ్యతలతో కూడిన ఉద్యోగం ఫ్లోర్ మేనేజర్ / కేటగిరీ మేనేజర్. స్టోర్ మేనేజర్: వినియోగదారులకు అందుబాటులో ఉంచాల్సిన వస్తువులను నిక్షిప్తం చేసే గోడౌన్‌లలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి స్టోర్ మేనేజర్.
రిటైల్ మేనేజర్: ఔట్‌లెట్ పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన వ్యక్తి రిటైల్ మేనేజర్. వినియోగదారులను, ఉద్యోగులను సమన్వయం చేస్తూ విక్రయాలు పెరిగేలా చేయడం, అకౌంటింగ్, క్యాష్ మేనేజ్‌మెంట్ వంటి విధులు నిర్వర్తించాలి.
రిటైల్ బయ్యర్స్/మర్చండైజర్స్: రిటైల్ ఔట్‌లెట్ ఏర్పాటు చేసిన ప్రాంతం, ఆ ప్రాంతంలోని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అందుబాటులో ఉంచాల్సిన వస్తువులను గుర్తించడం, వాటికి సంబంధించి ఉత్పత్తిదారులతో సంప్రదింపులు చేయడం వీరి ప్రధాన విధులు. అదే విధంగా బ్యాక్ ఎండ్ విభాగంలో..
బ్యాక్ ఎండ్ మేనేజర్స్: రిటైల్ కమ్యూనికేషన్ మేనేజర్స్; ఫైనాన్స్ మేనేజర్స్ వంటి అవకాశాలుంటాయి. వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్‌లోని స్టోర్ కీపర్ ఉద్యోగాలకు నెలకు రూ.8 వేల జీతం లభిస్తోంది. స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు సగటున రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందుతోంది.
రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికెట్ ప్రోగ్రామ్ నుంచి పీజీ కోర్సుల వరకు అందిస్తున్నాయి.
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ)..
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ).. ఉదయాన్నే ఉపయోగించే టూత్ బ్రష్ మొదలు మన దినచర్యలో అవసరమైన వస్తువుల విక్రయాలకు సంబంధించిన రంగం! ముఖ్యంగా మన దేశంలో ఇటీవల కాలంలో ఈ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా సగటున పదిశాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. ఎఫ్‌ఎంసీజీలో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. మరోవైపు జోరుగా నియామకాలు జరుపుతూ ఉద్యోగార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నివేదికల ప్రకారం- ఈ రంగం మార్కెట్ విలువ 2018 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. తద్వారా ఎఫ్‌ఎంసీజీ రంగం దాదాపు 3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. బహుళ జాతి సంస్థలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించడంతో ఉద్యోగార్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఆయా ఉత్పత్తులకు సంబంధించి ముడిపదార్థాల సేకరణ నుంచి వినియోగదారుల అభిరుచులు, అవసరాలు పరిగణనలోకి తీసుకుంటూ తుది ప్రొడక్ట్‌ను రూపొందించేవరకూ.. విభాగాల వారీగా అనేక ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ఎఫ్‌ఎంసీజీ రంగంలో కీలక విభాగాలు..
సేల్స్: ఈ విభాగంలో అభ్యర్థులకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్స్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. సంస్థ ఉత్పత్తుల విక్రయంతోపాటు చక్కటి మార్కెటింగ్ ప్లాన్స్ రూపొందించడం కీలక విధులు. ఈ విభాగంలో ప్రారంభంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌తో కెరీర్ ప్రారంభించి మార్కెటింగ్ డెరైక్టర్ వంటి అత్యున్నత హోదాకు చేరుకోవచ్చు.
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్: సంస్థలోని ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణ, సంస్థకు అవసరమైన మానవ వనరుల సంఖ్యపై అంచనాలు, ఉద్యోగులను, యాజమాన్యాన్ని సమన్వయం చేస్తూ ఉత్పత్తి పెంచే విధంగా చేయడం హెచ్‌ఆర్ ప్రొఫెషనల్స్ విధులు.
ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్: ముడి పదార్థాల సేకరణ, వాటి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వంటి ఎన్నో బాధ్యతలతో కూడిన విభాగం ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.
ఫైనాన్‌స: ఈ విభాగంలో సంస్థ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన విధులు, అకౌంటింగ్ విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఈ రంగంలో పర్చేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర మార్కెటింగ్ విభాగాల్లోనూ పలు ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.
ఎఫ్‌ఎంసీజీ.. ఫాస్ట్ గ్రోత్
ఎఫ్‌ఎంసీజీ రంగంలో ప్రత్యేక కోర్సులు లేకపోయినప్పటికీ.. ఆయా విభాగాల్లో స్పెషలైజ్డ్ డిగ్రీలు పొందిన వారికి సంస్థలు నియామకంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉదాహరణకు పీజీ స్థాయిలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణులకు ఫైనాన్స్ విభాగం, హెచ్‌ఆర్ స్పెషలైజేషన్ అభ్యర్థులకు హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగాలుంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీతోనూ ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. వీరికి జనరల్ అడ్మినిస్ట్రేషన్, అకౌంటింగ్ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఎంట్రీ పోస్టులు లభిస్తాయి. సేల్స్, మార్కెటింగ్‌లో అడుగుపెట్టాలనుకునే వారికి అకడమిక్ అర్హతలకంటే ఇతరులను మెప్పించే వాక్చాతుర్యం, నలుగురిలో కలిసిపోయేతత్వం ప్రధాన అర్హతలు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు సగటున రూ.1.5 లక్షలు; స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌లు రూ.2 లక్షల వార్షిక వేతనం కచ్చితంగా పొందొచ్చు.
క్యాంపస్‌లకు టాప్ రిక్రూటర్స్
ఈ రంగంలో ఐటీసీ, నెస్ట్‌లే ఇండియా లిమిటెడ్, జాన్సన్ అండ్ జాన్సన్, క్యాడ్‌బరీ, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్ తదితర సంస్థలు ఐఐఎంల నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లోని కళాశాలల వరకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు చేసుకుంటున్నాయి.
ఈ-కామర్స్ ఔత్సాహికులకు సరైన సమయం ఇదే..
దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఆకర్షణీయ వేతనాలతోపాటు, సుస్థిర అభివృద్ధికి అవకాశం ఉన్న రంగం ఈ-కామర్స్. ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్ విభాగంలో కస్టమర్ సపోర్ట్, కస్టమర్ రిలేషన్, క్లయింట్ సర్వీస్, ప్రొడక్ట్ డెలివరీ వంటి విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన, ఆయా ఉత్పత్తుల గురించి వినియోగదారులకు వివరించే అనలిటికల్ స్కిల్స్ ఉంటే రాణించడం సులువు. ఇక బ్యాక్ ఎండ్ విభాగంలో వెబ్‌సైట్స్ నిర్వహణ, మేనేజీరియల్ విధులకు సంబంధించిన ఉద్యోగాలు లభిస్తాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఉత్తీర్ణులు ఈ విభాగంలో రాణించేందుకు వీలవుతుంది. అకడమిక్ స్థాయిలోనే సంబంధిత కోర్ అంశాలపై శిక్షణనిచ్చే విధంగా కోర్సులు రూపొందిస్తే పరిశ్రమ అవసరాలు తీరతాయి.
- కె. సందీప్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ - స్నాప్‌డీల్
అందరికీ అవకాశాలు కల్పించే రిటైల్, ఎఫ్‌ఎంసీజీ..
పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు ప్రతి ఒక్కరికీ వారి అర్హతల ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్న రంగాలు రిటైల్, ఎఫ్‌ఎంసీజీ. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో ఈ రంగాలు బాగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రిటైల్ ఆపరేటర్స్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు గ్రామీణ ప్రాంతాలను కూడా లక్ష్యంగా పెట్టుకుని విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నాయి. గత ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలో మానవ వనరుల పరంగానూ విస్తృత అవకాశాలు లభించడం గ్యారంటీ. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నియామకాలకు ఆయా సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అదే సమయంలో వేతనాలు కూడా గుర్తించదగిన స్థాయిలో పెరుగుతున్నాయి.
- రీతూపర్ణ చక్రవర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీమ్-లీజ్ సర్వీసెస్
బీఎఫ్‌ఎస్‌ఐ.. ఆ రెండు కారణాలే సోపానాలు
ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు అనుమతినివ్వడం, ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న రెండు కారణాలు బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో కెరీర్ సోపానాలుగా నిలుస్తున్నాయి. బ్యాంకింగ్‌కు సంబంధించి ఇటీవల కాలంలో పీజీ, బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అకడమిక్ అవేర్‌నెస్ పెరుగుతోంది. కానీ ఇన్సూరెన్స్ రంగంలోనే ఇది ఇంకా పెరగాల్సి ఉంది. అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా కొంత తక్కువగానే ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఐఐఆర్‌ఎం-హైదరాబాద్, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలు ఈ రంగంలో కోర్సుల పరంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలు. నిరంతర అధ్యయన నైపుణ్యం, మార్కెట్ పరిస్థితులపై అవగాహన వంటి లక్షణాలతో ఈ రంగంలో సుస్థిర కెరీర్‌ను ఆశించొచ్చు.
- సబా ఆదిల్ టాలెంట్ హెడ్- ఏగాన్ రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్
బెస్ట్ 4 బ్రైట్ ఫ్యూచర్
Published Mon, Sep 22 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement