ఉజ్వల కెరీర్‌కు‘ఆతిథ్య’మిస్తోంది! | Bright future with hospitality and management courses | Sakshi
Sakshi News home page

ఉజ్వల కెరీర్‌కు‘ఆతిథ్య’మిస్తోంది!

Published Thu, Dec 19 2013 1:27 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Bright future with hospitality and management courses

దేశ ఆర్థిక ప్రగతికి ఆతిథ్య రంగం ఊపిరిపోస్తోంది.. మిగిలిన రంగాలతో పోలిస్తే ప్రతి రూ.10 లక్షల పెట్టుబడికి, అత్యధిక సంఖ్యలో ఉద్యోగాల సృష్టి ఆతిథ్య రంగంలోనే జరుగుతోంది..
 - ప్రణాళిక సంఘం.
 
 శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. అద్భుత అవకాశాలకు బాటలు వేస్తోంది. పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో.. అదే స్థాయిలో.. హాస్పిటాలిటీ రంగంలో మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతోంది.


 కోర్సులు..
 హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు హోటల్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులు.
 
 అందిస్తున్న సంస్థలు:
 హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ (ఐహెచ్‌ఎం).. ఎకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది.
 కాల వ్యవధి: ఏడాదిన్నర
 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు.
 ప్రవేశం: జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష, కేంద్రీకృత కౌన్సెలింగ్ ఆధారంగా.
 వెబ్‌సైట్: www.ihmhyd.org
 డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్.. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, కలినరీ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వ్యవధి: ఆరు నెలలు.
 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
 వెబ్‌సైట్: www.nithm.ac.in
 మన రాష్ట్రంలో సెట్విన్.. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా (వ్యవధి: మూడేళ్లు), పీజీ డిప్లొమా (వ్యవధి:ఏడాది), హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజంలో పీజీ డిప్లొమా (వ్యవధి: ఏడాది) అందిస్తోంది. వివిధ ఉన్నత స్థాయి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
 వెబ్‌సైట్: www.setwinapgov.org
 
 నైపుణ్యాలు:
 కమ్యూనికేషన్ స్కిల్స్.
 మేనేజీరియల్ నైపుణ్యాలు.
 సాఫ్ట్ స్కిల్స్.
 సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్.
 ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం.
 
 వేతనాలు:
 మేనేజ్‌మెంట్ ట్రైనీగా అరుుతే నెలకు రూ.15 నుంచి రూ.18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు.
 
 కెరీర్:
 హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి..  ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్(ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా జాబ్స్ పొందొచ్చు.
 
 
 రెండు కోణాలు:
 కెరీర్ పరంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆతిథ్య రంగం ఒక ఆకర్షణీయ (Glamour) కెరీర్ ఆప్షన్.
 కార్యకలాపాల విస్తరణకు అవకాశమున్న రంగం ఆతిథ్యం. అందువల్ల ఈ రంగంలో పదోన్నతులు త్వరగా లభిస్తాయి. కొత్త శాఖల ఏర్పాటు ద్వారా ఈ అవకాశం దొరుకుతుంది.
 ఆర్థిక సంక్షోభం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గినప్పుడు ఆతిథ్య రంగం కొంత ఒడిదుడుకులకు గురవుతుంది.
 అధిక పనివేళలతో పాటు ఒక్కోసారి అతిథుల (కస్టమర్స్) ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.
 
 
 ‘కాలం’తోడుగా ఆతిథ్యం
 ఆతిథ్య రంగంలో మేనేజ్‌మెంట్; ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్; హౌస్ కీపింగ్; ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్; సేల్స్ అండ్ మార్కెటింగ్; అకౌంటింగ్ తదితర విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో ఒక్కోలా పని ఉంటుంది.
 
 ఉదాహరణకు హోటల్ మేనేజర్‌ను తీసుకుంటే..
 6 am - 7am:    హౌస్‌కీపింగ్, కస్టమర్ సర్వీసులు, అతిథుల సంఖ్య, వారికందుతున్న సేవలపై ఆరా.
 7 am - 10am:    హోటల్‌లో సమావేశాలకు ఏర్పాట్లు, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారాలు.
 10 am - 1pm:    కొత్త అతిథులు-ఏర్పాట్లకు సంబంధించిన పనుల పర్యవేక్షణ
 1 pm - 2pm:    మధ్యాహ్న భోజనం.
 2 pm - 5pm:    ఆక్యుపెన్సీ పెంపు, అతిథుల భద్రత, సౌకర్యాలపై యాజమాన్యం, బృందంతో చర్చలు.
 6 pm:    షిఫ్ట్ విధులు పూర్తి.
 
 
 తక్కువ కాలవ్యవధిలో కోర్సు పూర్తిచేసి ఉపాధి పొందే అవకాశం డిప్లొమాల ద్వారానే సాధ్యం. నిథమ్‌లో ఎంబీఏ, బీబీఏ, బీహెచ్‌ఎంసీటీ కోర్సులతోపాటు స్వల్పకాలంలో పూర్తిచేసే డిప్లొమాలున్నాయి. అవి.. రూరల్ టూరిజం, ప్రాజెక్టు డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఆయుర్వేద పంచకర్మ థెరపీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ. కాల వ్యవధి (3- 6 నెలలు), ఫీజు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. అర్హత: 10వ తరగతి.
 
 6 నెలల వ్యవధి గల రూరల్ టూరిజంలో డిప్లొమాకు 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హోటళ్లు, టూరిజం సెంటర్లలో పనిచేసే కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రొడక్షన్, హౌస్‌కీపింగ్, సర్వీస్ అంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం.
 -డాక్టర్ పి.నారాయణరెడ్డి,
  డెరైక్టర్, డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్, హైదరాబాద్.
 
 
 ఎన్‌సీహెచ్‌ఎంసీటీ - జేఈఈ (2014)
 జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. ఈ సంస్థల్లో మొత్తం 7,454 సీట్లున్నాయి.
 జేఈఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు..
 అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
 వయోపరిమితి: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 2014, జూలై 1 నాటికి 22 ఏళ్లు మించరాదు. అభ్యర్థులు
 1992, జూలై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు. వీరు1989, జూలై
 1 తర్వాత జన్మించి ఉండాలి.
 ఎంపిక: జేఈఈ ర్యాంకు ఆధారంగా ప్రవేశం.
 
 పరీక్ష విధానం:
 మూడు గంటల వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 ప్రశ్నలు) ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.
 
 దరఖాస్తు వివరాలు:
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో..
 మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
 దరఖాస్తుల అమ్మకం ప్రారంభం: డిసెంబర్ 23, 2013
 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 5, 2013
 దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014
 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: ఏప్రిల్ 19, 2014 నుంచి
 పరీక్ష తేదీ: ఏప్రిల్ 26, 2014,    
 వెబ్‌సైట్:
 https://applyadmission.net/nchmjee2014/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement