hospitality
-
వామ్మో..! రాను రాను హోటల్లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!
బెంగళూరులోని ఒక హోటల్లోకి అడుగు పెట్టిన అనన్య నారంగ్‌కు రిసెప్షనిస్ట్ స్వాగతం పలికింది. అనన్యలో షాక్‌లాంటి ఆశ్చర్యం. ‘ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది!’ అనే కదా మీ డౌటు. అయితే సదరు ఈ రిసెప్షనిస్ట్ సాధారణ రిసెప్షనిస్ట్ కాదు... వర్చువల్ రిసెప్షనిస్ట్!‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో వర్చువల్ రిసెప్షనిస్ట్’ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన దేశంలో నవీన సాంకేతికత గురించి వివరంగా మాట్లాడుకునేలా చేస్తోంది. ‘సాంకేతికత సహాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులను ఏకకాలంలో సమన్వయం చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీలో తప్ప మన దేశంలో ఎక్కడా ఇలాంటి దృశ్యం కనిపించదు’ అంటూ ఈ ‘వర్చువల్ రిసెప్షనిస్ట్’ ఫొటోని షేర్ చేసింది అనన్య. ‘ఎంత సాంకేతిక ప్రగతి’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘అబ్బబ్బే! ఇదేం ప్రగతి. అందమైన మానవ రిసెప్షనిస్ట్ స్వాగతం పలకడానికి, వర్చువల్ రిసెప్షనిస్ట్ స్వాగతం పలకడానికి చా...లా తేడా ఉంటుంది’ అనే వాళ్లే ఎక్కువ! (చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!) -
2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగాలు! - అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: పరిశ్రమ, మౌలిక రంగ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న ఆతిథ్య, పర్యాటక రంగ సంస్థలకు భారతదేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ కీలక సూచన చేశారు. పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదా కల్పన కోసం సహాయం చేయాలని రాజకీయ నాయకులను ఒకపక్క కోరడంతోపాటే, మరోవైపు 2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగాల కల్పన గురించి కూడా వారికి భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) నిర్వహించిన 6వ హోటల్స్ కాంక్లేవ్‌లో కాంత్ మాట్లాడుతూ, పరిశ్రమ హోదా కోసం ఆతిథ్య, పర్యాటక రంగ డిమాండ్ సరైనదేనన్నారు. అయితే ఈ రంగం భారీ ఉపాధి అవకాశాలను అందిస్తుందని రాజకీయ నాయకులకు తెలియజేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ‘‘మీరు టూరిజం వైపు చూస్తే, రాజకీయ దృక్కోణం నుండి నేను ఆలోచిస్తాను. రాజకీయ నాయకులు ఒక విషయం మాత్రమే అర్థం చేసుకుంటారు. పర్యాటక రంగం ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తోంది అని మాత్రమే వారు ఆలోచిస్తారు. ఇక్కడ వారికి భరోసా లభిస్తే.. ఈ రంగం కోసం ఎటువంటి పెద్ద నిర్ణయమైనా ప్రభుత్వం నుంచి వెలువడుతుంది’’ అని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పర్యాటక రంగం సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి భారీ సానుకూల స్పందన ఉంటుంది. అయితే ఉద్యోగాల సృష్టికర్తలమని రాజకీయ నాయకులకు చెప్పడంలో పర్యాటక రంగం విఫలమైందని నేను భావిస్తున్నాను. ఉపాధి పరంగా, థాయ్‌లాండ్ దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు, మలేషియా 1.5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే... భారతదేశం పర్యాటక రంగం మాత్రమే 78 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తోంది. ఎంఐసీఎస్ (మీటింగ్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్) విభాగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ఆతిథ్య, పర్యాటక రంగం కృషి చేయాలి. యశోభూమి, భారత్ మండపం ఆవిష్కరణతో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ అలాగే ఎక్స్పో సెంటర్లను కలిగి ఉంది. ప్రపంచ మార్కెట్లో 500 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న ఎంఐసీఈ విభాగంలో భారత్ వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది విచారకరమైన అంశం. ఏడేళ్లలో ఐదుకోట్ల ఉద్యోగాలు: హెచ్ఏఐ కాగా, రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో 5 కోట్ల ప్రత్యక్ష –పరోక్ష ఉద్యోగాలను సృష్టించాలని పర్యాటక, ఆతిథ్య రంగం భావిస్తోంది. అయితే పూర్తి పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదా పొందేందుకు ప్రభుత్వ మద్దతు అవసరమని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) తెలిపింది. తాము కోరుకుంటున్న ప్రత్యేక హోదా కేవలం వసతులను సృష్టించడానికి మాత్రమే కాకుండా, ఈ రంగం ఆదాయం పరంగా, ఉపాధి కల్పనా పరంగా పురోగమించడానికి దోహదపడుతుందని హెచ్ఏఐ ప్రెసిడెంట్ పునీత్ ఛత్వాల్ 6వ హెచ్ఏఐ హోటల్స్ కాంక్లేవ్‌లో పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు
హైదరాబాద్,బిజినెస్ బ్యూరో: ఆఫీసు కార్యకలాపాలు, సమావేశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఈవెంట్ల నిర్వహణకు కూడా వేదికగా ఉపయోగపడేలా హైదరాబాద్‌లో ’డిస్ట్రిక్ట్150’ పేరిట కొత్త వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు కోరమ్ క్లబ్ వెల్లడించింది. దేవ్‌భూమి రియల్టర్స్ భాగస్వామ్యంలో రూ. 16.5 కోట్ల పెట్టుబడితో దీన్ని నెలకొల్పుతున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో వివేక్ నారాయణ్ వెల్లడించారు. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ ) దాదాపు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ’డిస్ట్రిక్ట్150’ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇందులో ఒపెరా తరహా హాల్, పాడ్‌కాస్ట్ రికార్డింగ్ స్టూడియో, కాన్ఫరెన్స్ రూమ్‌లు, థియేటర్, జిలా బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, సబ్కో కాఫీ బ్రాండ్ మొదలైనవి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో 8 పైగా ఇటువంటి వెంచర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి వెంచర్‌ను బెంగళూరులో నెలకొల్పుతున్నట్లు నారాయణ్ వివరించారు. (WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) -
ఆతిథ్య ఆంధ్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యాటకులకు ఆతిథ్య మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లకు పెట్టింది పేరైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్‌లతో పాటు దేశీయ సంస్థలైన గారిసన్, మేఫెయిర్ హోటళ్ల రాకతో సరికొత్త అనుభూతిని పంచనుంది. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), స్టార్ హోటళ్ల నిర్మాణంతో అతిథ్య రంగం విస్తరించనుంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర పర్యాటకానికి సంబంధించి మొత్తం రూ.19,345 కోట్ల పెట్టుబడులతో 117 ఎంవోలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 51 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 45 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)కి వచ్చాయి. ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఆతిథ్య రంగానికి చెందినవేనని అధి కా రులు తెలిపారు. 20 వరకు అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లు రాష్ట్రంలో రానున్నాయి. వీటి ద్వారా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో రూ.4949.41 కోట్ల పెట్టుబడులకు త్వరలో అన్ని అనుమతు లిచ్చి, పని ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఒబెరాయ్ రూ.1,350 కోట్ల పెట్టుబడి రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇప్ప టికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు)లో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండు వారాల్లోగా గండికోటలో కూడా హోటల్ నిర్మా ణానికి ఒప్పందాలు చేసుకుని జూలై చివరికి పను లు ప్రారంభించనుంది. అనంతరం రాజమండ్రి (పిచ్చుకలంక), హార్సిలీహిల్స్ ప్రాంతాల్లోనూ రిసార్ట్లు, కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయ నుంది. ఒబెరాయ్ సంస్థల ద్వారానే 10,900 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. హయత్, తాజ్ గ్రూప్ ఐదు నక్షత్రాల హోటళ్లు తాజ్ సంస్థ విశాఖలో రూ.1050 కోట్లతో 60 ఎకరాల్లో లగ్జరీ రిసార్టులు నిర్మించనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ పరిశీలనలో ఉంది. తాజ్ నిర్మించే టెక్నాలజీ స్పేస్‌లో రెస్టారెంట్లు, షాపు లు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒ లింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ రానున్నాయి. హయత్ సంస్థ విశాఖ శిల్పారా మంలో రూ.200 కోట్లతో 3 ఎకరాల్లో, తిరుపతి శిల్పారామంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటి ద్వారా 5,100 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే విజయవాడలో రూ.92.61 కోట్లతో నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మించింది. ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనర సింహస్వామి ఆలయం వద్ద రూ.100 కోట్లతో స్పిరుచ్యువల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ♦ ఏసీఈ అర్బన్ సంస్థ రూ.414 కోట్లతో 2,847 ఎకరాల్లో కాకినాడలో ఐదు నక్షత్రాల హోటల్‌తో పాటు కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి ♦ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ పేరూరులో రూ.218 కోట్లతో 5 ఎకరాల్లో, కడప శిల్పారామంలో 78.73 కోట్లతో రెండెకరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లు..ఎకో–ఐఎస్ఎల్ఈ రిసార్ట్స్ సంస్థ అనంతగిరి (అరకు)లో రూ.243 కోట్లతో 43.1 ఎకరాల్లో 5 స్టార్ హోటల్ ♦ గార్రిసన్ సంస్థ యండాడ (విశాఖ)లో రూ.122 కోట్లతో 3.87 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ – హోటల్ ♦ మైఫెయిర్ గ్రూప్ అన్నవరం (విశాఖ)లో రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో రిసార్టులు ♦ వైష్ణోవి వెర్సటైల్ వెంచర్స్ పేరూరులో రూ.125 కోట్లతో ఐదు నక్షత్రాల హోటల్ ♦ హిగ్గాని ఎంటర్ప్రైజెస్ విశాఖలో రూ.120 కోట్లతో టన్నెల్ అక్వేరియం – హోటల్ ♦ విశాఖ తెన్నేటి బీచ్‌లో ఎంవీ మా షిప్‌ను రూ.30 కోట్లతో షోర్ రిసార్టుగా తీర్చిదిద్ద ను న్నారు. శ్రీశైలంలో రూ.100 కోట్లతో రెండెకరాల్లో 3 నక్షత్రాల హోటల్, రూ.35.3 కోట్లతో రాయ చోటిలో రూ.45.5 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు రానున్నాయి. వీటికి డీపీఆర్‌లు సిద్ధంగా ఉండగా పీపీపీ గైడ్‌లైన్స్, అగ్రిమెంట్ పనులు వే గంగా పూర్తి చేసేలా కార్యచరణ రూపొందిస్తు న్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్న బాబు తెలిపారు. కాగా, ప్రభుత్వంతో ఆయా సంస్థలు కుదుర్చు కున్న ప్రతి ఒప్పందం అమలయ్యేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. -
రూ.150 కోట్లతో కామినేని ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడంటే?
వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్ తాజాగా కర్నూలులో నూతన ఆసుపత్రిని ప్రారంభించింది. జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్ పేరుతో రూ.150 కోట్లతో 150 పడకలతో ఇది ఏర్పాటైంది. ఈ ఏడాదే రూ.75 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో క్యాన్సర్ చికిత్స కేంద్రం సైతం స్థాపించనున్నారు. మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను ఈ కేంద్రం తదుపరి స్థాయికి మారుస్తుందని సంస్థ తెలిపింది. అందుబాటు ధరలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు కామినేని హాస్పిటల్స్ వివరించింది. కార్డియాక్, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్టీ, జనరల్, మినిమల్ యాక్సెస్ సర్జరీ, ప్లాస్టిక్/కాస్మెటిక్ సర్జరీ, రెనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, యూరాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కామినేని ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. -
టూరిజం కుదేలు...
కోల్‌కతా: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి దేశీ పర్యాటక, ఆతిథ్య రంగాలు ఊహించనంత వేగంగా కుదేలవుతున్నాయని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. టూరిజం శాఖ గణాంకాల ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో విదేశీ టూరిస్టుల రాక (ఎఫ్‌టీఏ) 67 శాతం, దేశీయంగా టూరిస్టుల ప్రయాణాలు 40 శాతం పడిపోయాయని వెల్లడించింది. ‘కరోనా వైరస్ ప్రతికూల ప్రభావంతో దేశవ్యాప్తంగా హాస్పిటాలిటీ రంగంలో ఆక్యుపెన్సీ 18–20 శాతం పడిపోయే అవకాశం ఉంది. మొత్తం 2020లో సగటు రోజువారీ రేట్లు 12–14 శాతం తగ్గిపోవచ్చు‘ అని ఐసీసీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సింగ్ చెప్పారు. సుమారు 2.67 కోట్ల ఉద్యోగాల కల్పనతో ట్రావెల్, టూరిజం రంగం 2018లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 9.2 శాతం వాటా దక్కించుకుందని ఆయన తెలిపారు. కరోనా సంక్షోభంలో చిక్కుకున్న చాలా మటుకు టూరిజం సంస్థలు కనీసం ఆరు నెలల పాటైనా ఈఎంఐలు, పన్నులు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల నుంచి తాత్కాలిక ఊరట కోసం ఎదురుచూస్తున్నాయని సింగ్ వివరించారు. ఈ నేపథ్యంలో టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ సంస్థలకు టర్మ్ రుణాల రీపేమెంట్‌పై మారటోరియం వ్యవధిని ఆరు నెలలకు వర్తింపచేయాలని, తదుపరి 12 నెలలకు జీఎస్టీ హాలిడే ప్రకటించి తోడ్పాటునివ్వాలని కేంద్రాన్ని ఐసీసీ కోరింది. ఆయా సంస్థలు ఆర్థికంగా నష్టపోకుండా, ఉద్యోగాల్లో కోత పడకుండా తోడ్పాటు కోసం ట్రావెల్ అండ్ టూరిజం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆ నిబంధనతో టూరిజం రంగానికి కష్టమే.. కరోనా కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకున్న కస్టమర్లకు రీఫండ్ చేయకుండా ఫోర్స్ మెజూర్ నిబంధన వాడుకునేలా విమానయాన సంస్థలకు అనుమతినిచ్చిన పక్షంలో టూరిజం, ట్రావెల్ రంగ సంస్థలపై భారీ ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభం నుంచి ఎయిర్‌లైన్స్ బైటపడేందుకు ఇది ఉపయోగపడవచ్చు గానీ వ్యవస్థలోని మిగతా రంగాలను దెబ్బతీస్తుందని, లక్షల మంది ఉపాధికి గండి కొడుతుందని పేర్కొంది -
వావ్.. వాట్ ఏ టేస్ట్
అనంతపురం సప్తగిరి సర్కిల్: రుచికరమైన వంటకాలు.. సువిశాల మైదానం.. ప్రోత్సహించే క్రీడాభిమానులు.. సకల సదుపాయాలు కల్పించే ఆర్డీటీ. అందుకే రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో ‘అనంత‘ క్రీడలకు చిరునామాగా మారింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లే కాకుండా.. విదేశాల జట్లు కూడా అనంతలో జరిగే టోర్నీలో పాల్గొంటున్నాయి. 2015 నుంచే విదేశీ జట్ల రాక 2015లో శ్రీలంకకు చెందిన జయసూర్య అకాడమీకి చెందిన 34 మంది బృందం సభ్యులు ఆర్డీటీలో జరిగిన టోర్నీలో పాల్గొన్నారు. ఇక 2016లో శ్రీలంకకు చెందిన కొలంబో స్కూల్‌కు చెందిన 100 మంది, 2017 జూలైలో న్యూజిలాండ్‌కు చెందిన హట్‌హాక్స్ క్లబ్ జూనియర్స్ 21 మంది, సీనియర్స్ 18 మంది సభ్యులు, 2017 డిసెంబర్లో అండర్–13 విభాగానికి చెందిన 37 మంది, అండర్–15 టీమ్‌లోని 39 మంది అనంతకు వచ్చారు. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలోనే న్యూజిలాండ్‌కు చెందిన హట్‌హాక్స్ క్లబ్ అండర్–15 విభాగంలోని క్రికెటర్లు వారి తల్లిదండ్రులతో కలిపి 37 మంది సభ్యులు హాజరయ్యారు. ప్రధానంగా వీరికి ఆతి«థ్యమిచ్చేందుకు ఆర్డీటీ హాస్పిటాలిటి డైరెక్టర్ విశాల ఫెర్రర్ ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిన్స్ మీట్ ఇది కేజీ రూ.1,200 దాకా ఉంటుంది. చికెన్ ఫ్రాంక్ ఫోర్టర్స్ కిలో రూ.1,800. వీటిని బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. వీటన్నింటిని చేసేందుకు వాడే కొన్ని దినుసులను సైతం అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారు. ఇక విదేశీ ఆటగాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వారి కోసం తయారు చేసే వంటకాలను పూర్తిగా మినరల్ వాటర్‌తోనే (వాటిని శుభ్రం చేసేందుకు సైతం) చేస్తున్నారు. మన వంటకాలూ రుచి చూపిస్తారు విదేశీ జట్ల సభ్యులకు వారి ఆహారపు అలవాట్ల ఆధారంగా వంటలు తయారు చేస్తారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇండియన్, సౌత్ ఇండియా రుచులను సైతం వారికి పరిచయం చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీని కోసం ఆర్డీటీ సంస్థ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ ప్రత్యేక శ్రద్ధ చూపి... వారి కోసం ప్రత్యేకమైన వంటకాలను చేయిస్తున్నారు. స్పెషల్‌టీం విదేశీ ఆటగాళ్లకు ఆహారాన్ని అందించేందుకే ఆర్డీటీ ప్రత్యేకంగా ఓ టీమ్‌ను నియమించింది. ఇందులో విశాల ఫెర్రర్, ఎస్టీఎల్(సీనియర్ టీం లీడర్) శ్రీధర్ చౌదరి(చిన్ని), రోషన్‌బీ, ప్రతిభలు ఉంటారు. వీరంతా విదేశీ జట్ల ఆహార అలవాట్లపై చర్చించి మరింత రుచికరమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ ఆటగాళ్ల మెనూ రోటీస్ : చపాతి, తందూరి, మేథి పరాఠా, ఫుల్కా, రింగ్ పరాఠా, బీఫ్ పరాఠా. పాస్తా : చికెన్ పాస్తా, వెజ్ పాస్తా, మీట్ రౌండ్ పాస్తా, మీట్ పాస్తా. నూడుల్స్ : వెజ్ నూడుల్స్, చికెన్ నూడుల్స్, ఎగ్ నూడుల్స్, ఫ్రైడ్ నూడుల్స్ స్టూవ్స్ : మటన్ స్టూవ్, చికెన్ స్టూవ్. బ్రెడ్స్ : వీట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, స్పానిష్ బ్రెడ్. వీటితోపాటు కార్న్ ఫ్లెక్స్, ముసెల్లి, ఓట్స్, బేక్డ్ బీన్స్, స్క్రాంబుల్డ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్, బుల్ సై, న్యూట్రెల్లా, మిన్స్ మీట్ బాల్ కర్రీ, స్పిన్యాచ్ లీఫ్ కర్రీ, చాకోలెట్ మఫింగ్. అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం మమ్మల్ని నమ్మి ఖండాతరాలు దాటి ఇక్కడికొచ్చే వారికి మంచి ఆతిథ్యం ఇవ్వడం మా బాధ్యత. అందుకే ఇంట్లో నా పిల్లలకు చేసినట్లుగానే ఇక్కడికొచ్చే విదేశీ ఆటగాళ్లకు వంటకాలను చేసి పెడుతున్నా. వారికి ఎలాంటి అసౌకర్యం కలిగినా అది అర్డీటీకే కాదు.. రాష్ట్రానికే చెడ్డపేరు వస్తుంది. దాన్ని గుర్తుంచుకునే ఆతిథ్యంలో రాజీపడడం లేదు. ప్రసుత్తం విదేశీ క్రికెట్ టీంలో వస్తున్నా...రానున్న రోజుల్లో మిగతా క్రీడల జట్లూ ఇక్కడికి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వారికి సేవలందించడమే మా విధి. – విశాల ఫెర్రర్, ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ మళ్లీ ఇక్కడకు రావాలని ఉంది నా ఇద్దరు కుమారులు ఆస్కార్ జాక్సన్, చార్లీ జాక్సన్‌లు న్యూజిలాండ్ జట్టులో సభ్యులు. వారితోపాటు అనంతకు వచ్చాను. ఇక్కడి ఆతిథ్యం, సదుపాయాలు చూశాక మళ్లీ అనంతకు రావాలని ఉంది. ఆర్డీటీ సిబ్బంది మాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. వివిధ రకాలైన వంటకాలను రుచి చూశాం. ఇక్కడి క్రీడాకారులతో మా పిల్లలకు స్నేహం ఏర్పడింది. – మర్సియా జాక్సన్, న్యూజిలాండ్ -
నాడు వైఎస్సార్.. నేడు కేసీఆర్
బాన్సువాడలో బస చేసిన ఇద్దరు సీఎంలు బాన్సువాడ : బాన్సువాడ ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆతిథ్యం వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాన్సువాడలో రాత్రి బస చేశారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి రాజీవ్ పల్లెబాటలో భాగంగా బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లో పర్యటించారు. రాత్రి బాన్సువాడలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఉదయం అప్పటి బాన్సువాడ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో వైఎస్సార్ రాక సందర్భంగా బాన్సువాడను ముస్తాబు చేసి, రోడ్లు వేశారు. వీధిలైట్లు బిగించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శుక్రవారం రాత్రి బాన్సువాడకు వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. శనివారం తిమ్మాపూర్ వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. సీఎం రాక సందర్భంగా బాన్సువాడను మరోసారి సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణ పొలిమేరల్లో ట్రాఫిక్ ఐలాండ్లు ఏర్పాటు చేశారు. మొక్కలు నాటారు. వీధిలైట్లు బిగించారు. రోడ్లను అభివృద్ధి చేశారు. ఆర్అండ్బీ, గ్రామపంచాయతీ గెస్ట్‌హౌస్‌లకు మరమ్మతు చేశారు. ఇలా ముఖ్యమంత్రుల రాకతో అభివృద్ధి జరుగుతోందని బాన్సువాడవాసులు పేర్కొంటున్నారు. -
అతిథి మర్యాద
పూర్వకాలంలో మానవులమధ్య సత్సంబంధాలు, ఆప్యాయత, ప్రేమానురాగాలు మెండుగా ఉండేవి. ఇప్పుడు లేవనికాదు, గతంతో పోల్చుకుంటే సన్నగిల్లా యి. ఆ రోజుల్లో ఎవరైనా అతిథి వస్తే సంతోషించేవారు. ఆప్యాయంగా స్వాగతం పలికేవారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం వారి కోసం కేటాయించేవారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. అతిథి మర్యాద ఇస్లామియ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన అంశం. ఒకసారి దైవప్రవక్త ముహ మ్మద్ (స) సన్నిధిలో ఒక వ్యక్తి హాజరై, ‘అయ్యా! నేను నిరుపేదను. ఆకలి దహించివేస్తోంది’ అని అభ్యర్థిం చాడు. ఆ రోజు ప్రవక్త వారి ఇంట కూడా పచ్చి మంచి నీళ్లు తప్ప మరేమీలేదు. అందుకని, ప్రవక్త మహనీ యులు అక్కడున్న సహచరులతో, ‘ఈ పూట ఇతని కెవరైనా ఆతిథ్యం ఇవ్వగలరా?’ అని అడిగారు. ఓ సహ చరుడు స్పందించి, ‘దైవ ప్రవక్తా! నేనిస్తాను’ అన్నాడు. అతిథిని వెంట బెట్టుకొని ఇంటికి వెళ్లాడు. ‘ఈ రోజు మన ఇంటికి ఓ అతిథి వచ్చారు. తినడానికి ఏమైనా ఉందా?’ అని శ్రీమతిని సంప్రదించారు. ‘పిల్లల కోసమని ఉంచిన కాస్తంత భోజనమే తప్ప మరేమీ లేదు. అది కూడా వచ్చిన అతిథి ఒక్కరికైతేనే సరిపోతుందేమో!’ అని బదులిచ్చారామె. ‘అతిథిని గౌర వించడం మన విధి. పిల్లలకు ఏదో ఒక సాకు చెప్పి నిద్రపుచ్చు. పిల్లలు నిద్రపోగానే భోజనం వడ్డించు. మేము భోజనానికి కూర్చున్న తరువాత, వడ్డన సమయంలో దీపాన్ని సరిచేస్తున్నట్టు నటించి, ఆర్పి వెయ్యి. చీకట్లో అతిథితోపాటు మనం కూడా తింటున్నట్లే నటిద్దాం’ అని చెప్పారాయన. అనుకున్నట్లుగానే ఆ ఇల్లాలు పిల్లలను నిద్ర పుచ్చి, భోజనం వడ్డించింది. అందరూ కూర్చున్నారు గాని, అతిథి మాత్రమే భోజనం చేశాడు. తాము కూడా తింటున్నట్లే నటించిన ఆ దంపతులిద్దరూ, పిల్లలతో సహా పస్తులే ఉన్నారు. మరునాడుదయం ఆతిథ్యం ఇచ్చిన సహచరుడు ప్రవక్త మహనీయుల వారి సన్నిధిలో హాజరైనప్పుడు, ప్రవక్త వారు ‘అబూతల్హా’ అంటూ ఆయన పేరును, ఆయన సతీమణి పేరునూ ఉచ్ఛరిస్తూ, ‘దైవానికి తన ఫలానా భక్తుడు, భక్తురాలి తీరు నచ్చింది. అతిథి పట్ల వారు చూపిన మర్యాద, త్యాగభావనకు అల్లాహ్ అమి తంగా సంతోషించాడు’ అని శుభవార్త వినిపించారు. ‘వారు స్వయంగా అగత్యపరులైనప్పటికీ, తమ కంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు’ అని పవిత్ర ఖురాన్ ఈ త్యాగగుణాన్ని అభివర్ణించింది. తమ అవస రాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యమివ్వడం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, అతిథులను గౌరవించడం అత్యున్నత పుణ్యకార్యాలు. కాని ఈనాడు అతిథి పట్ల మొహమాటపు పలకరింతలే కాని, ఆప్యాయత ఉట్టి పడటంలేదు. ఈ ఉరుకులు, పరుగుల మధ్య ఒకర్ని గురించి ఒకరు పట్టించుకునేంత తీరిక లభించడం లేదు. ఇలాంటి సుగుణాలు లోపించబట్టే శాంతి లేకుండా పోతోంది. అందుకని సాధ్యమైనంత ఎక్కువగా సత్సంబంధాలు నెరపడానికి, స్నేహధర్మా న్ని, అతిథి మర్యాదను గౌరవించడానికి ప్రాధాన్యతని వ్వాలి. అప్పుడే దైవ ప్రసన్నతా భాగ్యం కలుగుతుంది. - యం.డి.ఉస్మాన్‌ఖాన్ -
ఉజ్వల కెరీర్‌కు‘ఆతిథ్య’మిస్తోంది!
దేశ ఆర్థిక ప్రగతికి ఆతిథ్య రంగం ఊపిరిపోస్తోంది.. మిగిలిన రంగాలతో పోలిస్తే ప్రతి రూ.10 లక్షల పెట్టుబడికి, అత్యధిక సంఖ్యలో ఉద్యోగాల సృష్టి ఆతిథ్య రంగంలోనే జరుగుతోంది.. - ప్రణాళిక సంఘం. శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. అద్భుత అవకాశాలకు బాటలు వేస్తోంది. పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో.. అదే స్థాయిలో.. హాస్పిటాలిటీ రంగంలో మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. కోర్సులు.. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పలు ఇన్స్టిట్యూట్లు హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులు. అందిస్తున్న సంస్థలు: హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ (ఐహెచ్ఎం).. ఎకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. కాల వ్యవధి: ఏడాదిన్నర అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. ప్రవేశం: జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష, కేంద్రీకృత కౌన్సెలింగ్ ఆధారంగా. వెబ్సైట్: www.ihmhyd.org డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - హైదరాబాద్.. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, కలినరీ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వ్యవధి: ఆరు నెలలు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వెబ్సైట్: www.nithm.ac.in మన రాష్ట్రంలో సెట్విన్.. హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ డిప్లొమా (వ్యవధి: మూడేళ్లు), పీజీ డిప్లొమా (వ్యవధి:ఏడాది), హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజంలో పీజీ డిప్లొమా (వ్యవధి: ఏడాది) అందిస్తోంది. వివిధ ఉన్నత స్థాయి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: www.setwinapgov.org నైపుణ్యాలు: కమ్యూనికేషన్ స్కిల్స్. మేనేజీరియల్ నైపుణ్యాలు. సాఫ్ట్ స్కిల్స్. సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం. వేతనాలు: మేనేజ్మెంట్ ట్రైనీగా అరుుతే నెలకు రూ.15 నుంచి రూ.18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. కెరీర్: హోటల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్(ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా జాబ్స్ పొందొచ్చు. రెండు కోణాలు: కెరీర్ పరంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆతిథ్య రంగం ఒక ఆకర్షణీయ (Glamour) కెరీర్ ఆప్షన్. కార్యకలాపాల విస్తరణకు అవకాశమున్న రంగం ఆతిథ్యం. అందువల్ల ఈ రంగంలో పదోన్నతులు త్వరగా లభిస్తాయి. కొత్త శాఖల ఏర్పాటు ద్వారా ఈ అవకాశం దొరుకుతుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గినప్పుడు ఆతిథ్య రంగం కొంత ఒడిదుడుకులకు గురవుతుంది. అధిక పనివేళలతో పాటు ఒక్కోసారి అతిథుల (కస్టమర్స్) ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ‘కాలం’తోడుగా ఆతిథ్యం ఆతిథ్య రంగంలో మేనేజ్మెంట్; ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్; హౌస్ కీపింగ్; ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్; సేల్స్ అండ్ మార్కెటింగ్; అకౌంటింగ్ తదితర విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో ఒక్కోలా పని ఉంటుంది. ఉదాహరణకు హోటల్ మేనేజర్‌ను తీసుకుంటే.. 6 am - 7am: హౌస్‌కీపింగ్, కస్టమర్ సర్వీసులు, అతిథుల సంఖ్య, వారికందుతున్న సేవలపై ఆరా. 7 am - 10am: హోటల్లో సమావేశాలకు ఏర్పాట్లు, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారాలు. 10 am - 1pm: కొత్త అతిథులు-ఏర్పాట్లకు సంబంధించిన పనుల పర్యవేక్షణ 1 pm - 2pm: మధ్యాహ్న భోజనం. 2 pm - 5pm: ఆక్యుపెన్సీ పెంపు, అతిథుల భద్రత, సౌకర్యాలపై యాజమాన్యం, బృందంతో చర్చలు. 6 pm: షిఫ్ట్ విధులు పూర్తి. తక్కువ కాలవ్యవధిలో కోర్సు పూర్తిచేసి ఉపాధి పొందే అవకాశం డిప్లొమాల ద్వారానే సాధ్యం. నిథమ్‌లో ఎంబీఏ, బీబీఏ, బీహెచ్ఎంసీటీ కోర్సులతోపాటు స్వల్పకాలంలో పూర్తిచేసే డిప్లొమాలున్నాయి. అవి.. రూరల్ టూరిజం, ప్రాజెక్టు డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆయుర్వేద పంచకర్మ థెరపీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ. కాల వ్యవధి (3- 6 నెలలు), ఫీజు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. అర్హత: 10వ తరగతి. 6 నెలల వ్యవధి గల రూరల్ టూరిజంలో డిప్లొమాకు 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హోటళ్లు, టూరిజం సెంటర్లలో పనిచేసే కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రొడక్షన్, హౌస్‌కీపింగ్, సర్వీస్ అంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం. -డాక్టర్ పి.నారాయణరెడ్డి, డెరైక్టర్, డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్, హైదరాబాద్. ఎన్సీహెచ్ఎంసీటీ - జేఈఈ (2014) జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. ఈ సంస్థల్లో మొత్తం 7,454 సీట్లున్నాయి. జేఈఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు.. అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 2014, జూలై 1 నాటికి 22 ఏళ్లు మించరాదు. అభ్యర్థులు 1992, జూలై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు. వీరు1989, జూలై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎంపిక: జేఈఈ ర్యాంకు ఆధారంగా ప్రవేశం. పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 ప్రశ్నలు) ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. దరఖాస్తు వివరాలు: దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో.. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్ దరఖాస్తుల అమ్మకం ప్రారంభం: డిసెంబర్ 23, 2013 ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 5, 2013 దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014 అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: ఏప్రిల్ 19, 2014 నుంచి పరీక్ష తేదీ: ఏప్రిల్ 26, 2014, వెబ్సైట్: https://applyadmission.net/nchmjee2014/