న్యూజిలాండ్ జట్టు సహాయకుడికి మెహందీ పెడుతున్న ఆర్డీటీ సిబ్బంది
అనంతపురం సప్తగిరి సర్కిల్: రుచికరమైన వంటకాలు.. సువిశాల మైదానం.. ప్రోత్సహించే క్రీడాభిమానులు.. సకల సదుపాయాలు కల్పించే ఆర్డీటీ. అందుకే రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో ‘అనంత‘ క్రీడలకు చిరునామాగా మారింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లే కాకుండా.. విదేశాల జట్లు కూడా అనంతలో జరిగే టోర్నీలో పాల్గొంటున్నాయి.
2015 నుంచే విదేశీ జట్ల రాక
2015లో శ్రీలంకకు చెందిన జయసూర్య అకాడమీకి చెందిన 34 మంది బృందం సభ్యులు ఆర్డీటీలో జరిగిన టోర్నీలో పాల్గొన్నారు. ఇక 2016లో శ్రీలంకకు చెందిన కొలంబో స్కూల్‌కు చెందిన 100 మంది, 2017 జూలైలో న్యూజిలాండ్‌కు చెందిన హట్‌హాక్స్ క్లబ్ జూనియర్స్ 21 మంది, సీనియర్స్ 18 మంది సభ్యులు, 2017 డిసెంబర్‌లో అండర్–13 విభాగానికి చెందిన 37 మంది, అండర్–15 టీమ్‌లోని 39 మంది అనంతకు వచ్చారు. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలోనే న్యూజిలాండ్‌కు చెందిన హట్‌హాక్స్ క్లబ్ అండర్–15 విభాగంలోని క్రికెటర్లు వారి తల్లిదండ్రులతో కలిపి 37 మంది సభ్యులు హాజరయ్యారు. ప్రధానంగా వీరికి ఆతి«థ్యమిచ్చేందుకు ఆర్డీటీ హాస్పిటాలిటి డైరెక్టర్ విశాల ఫెర్రర్ ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మిన్స్ మీట్
ఇది కేజీ రూ.1,200 దాకా ఉంటుంది. చికెన్ ఫ్రాంక్ ఫోర్టర్స్ కిలో రూ.1,800. వీటిని బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. వీటన్నింటిని చేసేందుకు వాడే కొన్ని దినుసులను సైతం అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారు. ఇక విదేశీ ఆటగాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వారి కోసం తయారు చేసే వంటకాలను పూర్తిగా మినరల్ వాటర్‌తోనే (వాటిని శుభ్రం చేసేందుకు సైతం) చేస్తున్నారు.
మన వంటకాలూ రుచి చూపిస్తారు
విదేశీ జట్ల సభ్యులకు వారి ఆహారపు అలవాట్ల ఆధారంగా వంటలు తయారు చేస్తారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇండియన్, సౌత్ ఇండియా రుచులను సైతం వారికి పరిచయం చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీని కోసం ఆర్డీటీ సంస్థ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ ప్రత్యేక శ్రద్ధ చూపి... వారి కోసం ప్రత్యేకమైన వంటకాలను చేయిస్తున్నారు.
స్పెషల్‌టీం
విదేశీ ఆటగాళ్లకు ఆహారాన్ని అందించేందుకే ఆర్డీటీ ప్రత్యేకంగా ఓ టీమ్‌ను నియమించింది. ఇందులో విశాల ఫెర్రర్, ఎస్‌టీఎల్(సీనియర్ టీం లీడర్) శ్రీధర్ చౌదరి(చిన్ని), రోషన్‌బీ, ప్రతిభలు ఉంటారు. వీరంతా విదేశీ జట్ల ఆహార అలవాట్లపై చర్చించి మరింత రుచికరమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
విదేశీ ఆటగాళ్ల మెనూ
రోటీస్ : చపాతి, తందూరి, మేథి పరాఠా, ఫుల్కా, రింగ్ పరాఠా, బీఫ్ పరాఠా.
పాస్తా : చికెన్ పాస్తా, వెజ్ పాస్తా, మీట్ రౌండ్ పాస్తా, మీట్ పాస్తా.
నూడుల్స్ : వెజ్ నూడుల్స్, చికెన్ నూడుల్స్, ఎగ్ నూడుల్స్, ఫ్రైడ్ నూడుల్స్
స్టూవ్స్ : మటన్ స్టూవ్, చికెన్ స్టూవ్.
బ్రెడ్స్ : వీట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, స్పానిష్ బ్రెడ్.
వీటితోపాటు కార్న్ ఫ్లెక్స్, ముసెల్లి, ఓట్స్, బేక్డ్ బీన్స్, స్క్రాంబుల్డ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్, బుల్ సై, న్యూట్రెల్లా, మిన్స్ మీట్ బాల్ కర్రీ, స్పిన్యాచ్ లీఫ్ కర్రీ, చాకోలెట్ మఫింగ్.
అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం
మమ్మల్ని నమ్మి ఖండాతరాలు దాటి ఇక్కడికొచ్చే వారికి మంచి ఆతిథ్యం ఇవ్వడం మా బాధ్యత. అందుకే ఇంట్లో నా పిల్లలకు చేసినట్లుగానే ఇక్కడికొచ్చే విదేశీ ఆటగాళ్లకు వంటకాలను చేసి పెడుతున్నా. వారికి ఎలాంటి అసౌకర్యం కలిగినా అది అర్డీటీకే కాదు.. రాష్ట్రానికే చెడ్డపేరు వస్తుంది. దాన్ని గుర్తుంచుకునే ఆతిథ్యంలో రాజీపడడం లేదు. ప్రసుత్తం విదేశీ క్రికెట్ టీంలో వస్తున్నా...రానున్న రోజుల్లో మిగతా క్రీడల జట్లూ ఇక్కడికి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వారికి సేవలందించడమే మా విధి. – విశాల ఫెర్రర్, ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్
మళ్లీ ఇక్కడకు రావాలని ఉంది
నా ఇద్దరు కుమారులు ఆస్కార్ జాక్సన్, చార్లీ జాక్సన్‌లు న్యూజిలాండ్ జట్టులో సభ్యులు. వారితోపాటు అనంతకు వచ్చాను. ఇక్కడి ఆతిథ్యం, సదుపాయాలు చూశాక మళ్లీ అనంతకు రావాలని ఉంది. ఆర్డీటీ సిబ్బంది మాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. వివిధ రకాలైన వంటకాలను రుచి చూశాం. ఇక్కడి క్రీడాకారులతో మా పిల్లలకు స్నేహం ఏర్పడింది. – మర్సియా జాక్సన్, న్యూజిలాండ్
Comments
Please login to add a commentAdd a comment