అమెరికాలోనూ ‘చాయ్‌.. సమోసా’ | New hospitality etiquette for Indians | Sakshi
Sakshi News home page

అమెరికాలోనూ ‘చాయ్‌.. సమోసా’

Published Fri, Jan 3 2025 5:36 AM | Last Updated on Fri, Jan 3 2025 5:36 AM

New hospitality etiquette for Indians

భారతీయులకు సరికొత్త ‘అతిథి’ మర్యాదలు 

ప్రస్తుతం మందకొడిగా అమెరికా పర్యాటక పరిశ్రమ 

కోవిడ్‌ మునుపటి స్థాయికి చేరుకునేందుకు అష్టకష్టాలు 

తూర్పు ఆసియా దేశాల నుంచి తగ్గిన పర్యాటకులు 

ఆ ఖాళీని భారతీయులతో భర్తీ చేసేందుకు కొత్త మార్గాలు 

60 శాతానికి పైగా హోటళ్లలో ‘చాయ్‌.. సమోసా’ రుచులు 

‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు అమెరికా కొత్త పల్లవి అందుకుంది. అక్కడి పర్యాటక పరిశ్రమ భారతీయుల కోసం రెడ్‌ కార్పెట్‌ పరుస్తోంది. 

ఇతర దేశాల నుంచి అమెరికాకు టూరిస్టుల రాక భారీగా తగ్గడం.. అదే సందర్భంలో భారత్‌ నుంచి పర్యాటకుల సందడి పెరుగుతుండటం అగ్రరాజ్యానికి ఆశాకిరణంగా మారింది. ఫలితంగా అక్కడి పర్యాటక పరిశ్రమ మన సంప్రదాయాలను పుణికిపుచ్చుకుని ‘రండి.. రండి.. రండి’ అంటూ భారతీయులకు చక్కటి అతిథి మర్యాదలు చేస్తోంది.

సాక్షి, అమరావతి: అమెరికా పర్యాటక పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. కోవిడ్‌ మునుపటి స్థాయిని అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. నిరంతర ద్రవ్యోల్బణం కారణంగా అమెరికన్లు విశ్రాంతి ఖర్చులను తగ్గించుకుంటున్నారు. తూర్పు ఆసియా దేశాల నుంచి పర్యాటకుల రాక గణనీయంగా పడిపోయింది. 

ఈ ఖాళీని భారతీయ పర్యాటకులతో భర్తీ చేయాలని అమెరికా భావిస్తోంది. అగ్రరాజ్యానికి ఆతిథ్య పరిశ్రమ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఇందుకే అమెరికా హోటళ్లు భారతీయ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఆతిథి మర్యాదలు చేస్తున్నాయి.

భారతీయ టీవీ చానళ్ల మోత
అమెరికా పర్యాటక పరిశ్రమలో ఆదాయాన్ని పునరుద్ధరించడానికి హోటళ్లు, ట్రావెల్‌ కంపెనీలు భారతీయ పర్యాటకులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా అగ్రరాజ్య హోటళ్లు ‘చాయ్‌.. సమోసా’లను ప్రవేశపెట్టాయి. దీనికితోడు లాంజ్‌లు, గెస్ట్‌ రూమ్స్‌లో భారతీయ టీవీ చానళ్ల ప్రసారాల మోత మోగిస్తున్నాయి. యూఎస్‌ నేషనల్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఆఫీస్‌ (ఎన్టీటీవో) డేటా ప్రకారం గతేడాది తొలి పది నెలల్లో సుమారు 20 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు.

ఇది కోవిడ్‌ పూర్వపు స్థాయి కంటే 48 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా వ్యాపార సందర్శనల కోసం జారీ చేసిన వీసాలలో 50 శాతం, హాలిడే వీసాలు 43.50 శాతం వృద్ధి చెందాయి. విస్తరిస్తున్న భారతీయ మధ్యతరగతి జనాభా, అధిక ప్రయాణ బడ్జెట్లు, పెరిగిన విమాన సామర్థ్యం భారతీయుల్లో అంతర్జాతీయ ప్రయాణ ఒరవడిని చూపిస్తున్నాయి. 

చైనా, జపాన్‌ నుంచి తగ్గుదల
ఆర్థిక, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య అమెరికాలో భారీగా తగ్గింది. ఇందులో చైనా నుంచి 44.50 శాతం, జపాన్‌ నుంచి 50.8 శాతం, దక్షిణ కొరియా నుంచి 23.90 శాతం క్షీణత నమోదైంది. వీరి స్థానాన్ని భారతీయులు భర్తీ చేస్తున్నట్టు ఆసియా అమెరికన్‌ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. యూరోపియన్‌ పర్యాటకులు అమెరికాకు మళ్లీ తిరిగి వస్తున్నారు. 

అయితే యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశీయుల సందర్శన 2019 ముందుతో పోలిస్తే తక్కువగా ఉంది. గతేడాది భారతీయ ప్రయాణికులు చేసిన యూఎస్‌ బుకింగ్‌లు 50 శాతంపైనే పెరిగాయి. ఇది 2019 కోవిడ్‌ మహమ్మారి స్థాయితో పోలిస్తే మూడు రెట్లు వృద్ధిని సూచిస్తోంది. ఓఏజీ ఏవియేషన్‌ డేటా ప్రకారం 2019తో పోలిస్తే గతేడాది భారత్‌–యూఎస్‌ మధ్య షెడ్యూల్డ్‌ విమాన సామర్థ్యం 42.3 శాతం పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement