management courses
-
ఆర్ట్స్ కోర్సులకే అందలం! దేశంలో యూజీ కోర్సుల్లోనే అత్యధిక చేరికలు
సాక్షి, అమరావతి: దేశంలో వివిధ ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్ట్స్ కోర్సులవైపే మొగ్గుచూపుతున్నారు. బీఏలో ఏకంగా 1.04 కోట్ల మంది చేరగా ఆ తర్వాత బీఎస్సీలో 49.12 లక్షల మంది, బీకాంలో 43.22 లక్షల మంది చేరారు. ఉన్నతవిద్యా కోర్సుల్లో చేరినవారిలో ఏకంగా 78.9 శాతం మంది అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోర్సుల్లోనే ఉండటం గమనార్హం. ఇదే సమయంలో పీజీ కోర్సులు చదువుతున్నవారు కేవలం 11.4 శాతానికే పరిమితమయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హాట్ ఫేవరెట్ కోర్సులు అయిన బీటెక్‌లో 23.20 లక్షల మంది చేరగా, బీఈలో 13.42 లక్షల మంది ఉన్నారు. ఈ మేరకు దేశంలోని వివిధ కోర్సుల్లో చేరికలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదిక–2020–21 విడుదల చేసింది. ఇందులోని గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ కోర్సుల్లో మొత్తం 4,13,80,713 మంది విద్యార్థులు చేరగా.. అందులో 3.26 కోట్ల మంది (78.9 శాతం) యూజీ కోర్సులు చదువుతున్నారు. ఇక పోస్ట్రుగాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో 47.16 లక్షలు (11.4 శాతం) మంది ఉన్నారు. ఇక డిప్లొమా కోర్సుల్లో చేరికలు తక్కువగానే నమోదయ్యాయని.. మొత్తం విద్యార్థుల్లో వీరి సంఖ్య 29.79 లక్షలే (7.2 శాతం)నని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరినవారిలో అత్యధికులు టెక్నికల్, పాలిటెక్నిక్, నర్సింగ్, టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదువుతున్నారు. అలాగే పీజీ డిప్లొమా కోర్సులను కేవలం 2.57 లక్షల మంది మాత్రమే అభ్యసిస్తున్నారు. ఇక సర్టిఫికెట్ కోర్సుల్లో చేరినవారు 1.55 లక్షల మంది మాత్రమేనని ఐష్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం విద్యార్థుల్లో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల వాటా వరుసగా 0.62, 0.38 శాతాలు మాత్రమేనని నివేదిక పేర్కొంది. బీఏ, బీకాంల్లో మహిళలు.. బీటెక్, బీఈల్లో పురుషులు.. జాతీయ స్థాయిలో పలు కోర్సుల్లో చేరికలను గమనిస్తే ఇంజనీరింగ్ కోర్సుల మినహా దాదాపు మిగిలిన అన్ని కోర్సుల్లోనూ పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీఏలో చేరిన వారిలో 52.7 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇక బీఎస్సీలో 52.2 శాతం, బీకాంలో 48.5 శాతం మంది మహిళలేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రం పురుషులతో పోలిస్తే మహిళల చేరికలు 28.5 శాతమే ఉన్నాయి. పీజీ సోషల్ సైన్సెస్ కోర్సుల్లోనూ 56.5 శాతం చేరికలతో మహిళలదే పైచేయిగా ఉంది. అలాగే పీజీ సైన్స్ కోర్సుల్లో 61.5 శాతం, మేనేజ్మెంట్ కోర్సుల్లో 43.1 శాతం, కామర్స్‌లో 66.5 శాతం మంది మహిళలు ఉన్నారు. ఎడ్యుకేషన్ విభాగంలోనూ 64.4 శాతంతో మహిళల చేరికలే అధికమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పీహెచ్డీ కోర్సుల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగంలో 33.3 శాతమే మహిళల వాటా. పీహెచ్డీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీల్లో 48.8 శాతం మంది మహిళలున్నారు. పీహెచ్‌డీలో పెరిగిన చేరికలు కాగా పీహెచ్డీ కోర్సుల్లో చేరికలు పెరిగాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2.11 లక్షల మంది పీహెచ్డీ కోర్సుల్లో చేరినవారున్నారు. వీరిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో 56,625 మంది ఉన్నారు. ఇక మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ వంటి అంశాల్లో 48,600 మంది పరిశోధనలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులు అభ్యసిస్తున్నవారు 2,255 మంది ఉన్నారు. పీజీలో అత్యధికం ఈ కోర్సుల్లోనే.. దేశంలో పీజీ కోర్సుల్లో చేరినవారిలో అత్యధికంగా 9,41,648 మంది సోషల్ సైన్సు కోర్సులను చదువుతున్నారు. సైన్సు కోర్సులు అభ్యసిస్తున్నవారు 6,79,178 మంది ఉన్నారు. 68,60,001 మంది మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్నారు. కామర్స్ కోర్సులో 5,36,560 మంది చేరారు. పీజీ కోర్సుల్లోనే భాషా సంబంధిత కోర్సుల్లో 3,20,176 మంది ఉన్నారు. ఇక ఎడ్యుకేషన్ విభాగం కోర్సులను 2,06,394 మంది చదువుతున్నారు. -
ఏఐసీటీఈ పచ్చ జెండా.. భారీగా పెరగనున్న సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక ఉన్నత విద్యా మండలి (ఏఐసీటీఈ) తాజాగా పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి 2015లో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ)లను ఆదేశించింది. దీనితో విద్యార్థులపై ఫీజుల భారం పెరిగిపోనుంది. ఫీజులు పెంచాలన్న ఏఐసీటీఈ నిర్ణయంపై అంతటా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండింతలకుపైగా..: ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో దాదాపు అన్ని సాంకేతిక, మేనేజ్మెంట్ కోర్సుల ఫీజులు రెండింతలకుపైగా పెరగనున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్య మరింత భారం కానుంది. ఉదాహరణకు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్ట వార్షిక ఫీజు రూ.35 వేలుగా ఉండగా.. ఏఐసీటీఈ ఆదేశాలు అమలైతే ఏకంగా రూ. 67 వేలకు పెరగనుంది. గరిష్ట ఫీజు రూ.1.35 లక్షల నుంచి ఏకంగా రూ. 1.89 లక్షలకు చేరనుంది. పెంపుపై రాష్ట్ర ఎఫ్ఆర్సీ తర్జనభర్జన రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొద్దినెలలుగా కసరత్తు చేస్తోంది. 2019లో నిర్ధారించిన ఫీజులకు మరో 10 శాతం పెంచి ఆదేశాలు ఇస్తారని ఇప్పటిదాకా అంతా భావించారు. కానీ ఏఐసీటీఈ పిడుగులాంటి ఆదేశాలు జారీ చేయడంతో.. ఏం చేయాలన్న దానిపై ఎఫ్ఆర్సీ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితుల్లో.. ఫీజుల పెంపు సమస్యగా మారుతుందేమోనని భావించిన ఎఫ్ఆర్సీ.. శనివారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేసినట్టు సమాచారం. ఫీజులు పెంచితే ఉద్యమమే.. రెండేళ్లుగా కరోనాతో పేద, మధ్య తరగతి వర్గా లు ఆర్థికంగా చితికిపోయాయి. జీవనమే దుర్భరమైన కుటుంబాలూ ఉన్నా యి. బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఫీజు లు పెంచి పేదలకు ఉరి బిగించాలనే నిర్ణయం దారుణం. ఫీజులు పెంచితే ఉద్యమం తప్పదు. – నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పెంచాల్సిన అవసరమేంటి? అధ్యాపకులకు ఏడో వేతన ఒప్పందం అమలు చేస్తున్నామని ప్రైవేటు కాలేజీలు ఏఐసీటీఈని నమ్మించాయి. అందుకే శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇది ముమ్మాటికీ అన్యాయమే. అధ్యాపకులకు ఇప్పటికీ ఐదో వేతన ఒప్పందం మేర వేతనాలే అందడం లేదు. కరోనా సమయం నుంచి అధ్యాపకులకు జీతాలు ఇవ్వని కాలేజీలూ ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ఫీజులు పెంచడం దారుణం. – సంతోష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక కాలేజీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు -
ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులు.. వివరాలివిగో..
బిజినెస్ స్కూల్స్.. మరో మాటలో చెప్పాలంటే.. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్! పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్‌ల ద్వారా.. మేనేజ్మెంట్ నైపుణ్యాలు అందించే విద్యాసంస్థలు! ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. టెక్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో ప్రత్యేకంగా టెక్నికల్ కోర్సులు బోధిస్తున్నాయి. దేశంలో.. ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ బీస్కూల్స్.. పీజీ ప్రోగ్రామ్స్ కరిక్యలంలో.. టెక్నికల్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తుండటం నయా ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. బీస్కూల్స్‌లో టెక్ కోర్సుల బోధనకు కారణాలు.. వాటితో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం... సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. సంక్షిప్తంగా స్టెమ్ కోర్సులుగా గుర్తింపు. వీటిని సైన్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు, మూడేళ్లుగా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు సైతం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. డేటా సైన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్న ఇన్స్టిట్యూట్లు ప్రధానంగా.. డేటాసైన్స్, డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కార్పొరేట్ ప్రపంచంలో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెరగడమే! అనలిటిక్స్ ఆధారంగా బిజినెస్ వ్యూహాలు రూపొందించే మేనేజ్మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. అనలిటిక్స్ నైపుణ్యాలకు టెక్ స్కిల్స్ పునాదిగా నిలుస్తున్నాయి. దీంతో మేనేజ్మెంట్ విద్యార్థులకే డేటాసైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్పై అవగాహన కల్పిస్తే.. కార్పొరేట్ వర్గాల నుంచి చక్కటి ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఏఐ–ఎంఎల్ కూడా ►మేనేజ్మెంట్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు అన్నింటా ముఖ్యంగా వస్తు సేవల్లో.. ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక ఉత్పత్తి లేదా సర్వీస్‌ను ఏఐ ఆధారంగా రూపొందించాలనుకుంటే.. సదరు నిర్వహణ అధికారులకు దీనిపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా కంపెనీల రోజువారీ విధుల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్స్,ప్రొడక్షన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. ఏఐ ఆధారంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ►ఏఐ ఆధారంగా..పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. అందుకు అయ్యే వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. అదే విధంగా.. సంస్థకు కీలకమైన హెచ్ఆర్ విభాగంలో సైతం నూతన నియామకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏఐ–ఎంఎల్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, అర్హులను గుర్తించడం సులభం అవుతోంది. దీంతో.. మేనేజ్మెంట్ విభాగాల్లో పని చేసే వారికి సైతం టెక్నికల్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన ఆశ్యకత నెలకొంది. అందుకే ఇప్పుడు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. ఏఐ, ఎంఎల్ వంటి టెక్ స్కిల్స్‌ను బోధిస్తున్నాయి. బిజినెస్ అనలిటిక్స్ మేనేజ్మెంట్ విభాగంలో టెక్నికల్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. బిజినెస్ అనలిటిక్స్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. సంస్థకు సంబంధించి రా మెటీరియల్ సేకరణ నుంచి ప్రొడక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వరకూ.. అన్ని అంశాలు కంప్యూటరీకరణ జరుగుతోంది. ఒక్కో దశలో ఆయా అంశాల నిర్వహణకు సంబంధించిన విషయాలు(ఖర్చులు, నిర్వహణ వ్యయం, అనుసరించిన విధానం తదితర)ను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి మేనేజ్మెంట్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై స్పష్టతకు రావలసి ఉంటుంది. దీంతో క్షేత్ర స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలు ఆవశ్యకంగా మారుతున్నాయి. దీంతో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ బిజినెస్ అనలిటిక్స్‌ను తమ కరిక్యులంలో భాగంగా చేర్చుతున్నాయి. ప్రత్యేక ప్రోగ్రామ్‌లు సైతం ►మేనేజ్మెంట్ కోర్సుల్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సులను బోధిస్తుండగా.. మరికొన్ని ఇన్స్టిట్యూట్లు పూర్తి స్థాయిలో ప్రత్యేక టెక్ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి. ►ఐఐఎం–అహ్మదాబాద్.. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 16 నెలల అడ్వాన్స్డ్ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ►ఐఐఎం–బెంగళూరు.. బిజినెస్ అనలిటిక్స్‌లో రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ►ఐఐఎం–కోల్‌కత.. ఏడాది వ్యవధిలో బిజినెస్ అనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా డేటా సైన్సెస్‌లో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్‌లో సైతం ప్రవేశం కల్పిస్తోంది. ►ఐఐఎం–కాశీపూర్ కూడా అనలిటిక్స్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది. ఇతర బీ–స్కూల్స్ కూడా ► ఐఐఎంలే కాకుండా.. దేశంలోని ఇతర ప్రముఖ బీ–స్కూల్స్ కూడా మేనేజ్మెంట్ పీజీ లేదా పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయి. ► ఐఎస్బీ–హైదరాబాద్ బిజినెస్ అనలిటిక్స్‌లో హైబ్రీడ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ప్రత్యేక రీసెర్చ్ కేంద్రాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను అందిస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. సంబంధిత విభాగాల్లో ప్రత్యేకంగా రీసెర్చ్ కేంద్రాలను కూడా నెలకొల్పుతున్నాయి. ►ఐఐఎం అహ్మదాబాద్ కొద్ది రోజుల క్రితం సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధనలు నిర్వహించి.. వ్యాపారాలకు, పాలనకు, విధాన నిర్ణయాలకు సహకరించడం లక్ష్యంగా చేసుకుంది. ►ఐఐఎం–రాయ్‌పూర్ కూడా సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పేరుతో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, టెక్నాలజీ అడాప్షన్, ఆన్లైన్ సెక్యూరిటీ, డిజిటైజేషన్ స్ట్రాటజీ విభాగాల్లో పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ వర్గాలు టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కార్పొరేట్ వర్గాలు సైతం పెద్దపీట వేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే.. టెక్, మేనేజ్మెంట్ రెండు నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషణ సాగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 70 శాతం వారే టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. టెక్ కంపెనీల నియామకాల్లో సైతం 70 శాతం మేరకు మేనేజ్మెంట్ విద్యార్థులే ఉంటున్నారు. ►జీమ్యాక్ సర్వే ప్రకారం–గత ఏడాది టెక్ ఆధారిత సేవలందిస్తున్న సంస్థల్లో 89 శాతం ఎంబీఏ ఉత్తీర్ణులను నియమించుకున్నాయి. ►మేనేజ్మెంట్ సంస్థల విషయానికొస్తే.. టెక్, మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న విద్యార్థులను నియమించుకున్న సంస్థల సంఖ్య 60 శాతంగా నిలిచింది. టెక్.. మేనేజ్మెంట్ ► ఒకవైపు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు టెక్ కోర్సులను అందిస్తుండగా.. మరోవైపు.. టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు సైతం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తుండటం విశేషం. ►ఐఐటీ హైదరాబాద్.. ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ డేటాసైన్స్ కోర్సును అందిస్తోంది. ►ఐఐటీ–ఢిల్లీ,ఐఐటీ–కాన్పూర్,ఐఐటీ–ఖరగ్‌పూర్ వంటి ప్రముఖ ఐఐటీలు, ఇతర ఎన్ఐటీలు ఎంటెక్ (సీఎస్ఈ)లో బిగ్ డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్‌తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ► వీటితోపాటు పలు ఇతర ఐఐటీలు, మరెన్నో ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా అనలిటిక్స్‌ను అందిస్తున్నాయి. ప్రయోజనం ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐ బాట పడుతున్నాయి. దీంతో సంస్థల స్థాయిలో సాంకేతిక విభాగాల నుంచి కార్యాలయంలో పని చేసే మేనేజీరియల్ సిబ్బంది వరకూ.. ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన ఉంటేనే సంస్థ లక్ష్యాలు నెరవేరుతాయి. వీటికి అనుగుణంగా అకడమిక్ స్థాయిలోనే టెక్ నైపుణ్యాలు అందిస్తే కెరీర్ పరంగా రాణించగలుగుతారు. అదేసమయంలో కంపెనీలకు అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా లభిస్తాయి. టెక్ కోర్సులు–ముఖ్యాంశాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో టెక్ కోర్సులను అందిస్తున్న ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీ–స్కూల్స్. ► బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లకు ప్రాధాన్యం. ► కోర్సు కరిక్యులంతో పాటు ప్రత్యేక ప్రోగ్రామ్‌లకు రూపకల్పన. ►ఏఐ–ఎంఎల్, డేటా అనలిటిక్స్‌లో రీసెర్చ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు. ►ఈ నైపుణ్యాలతో సంస్థల్లో విధుల నిర్వహణలో మరింత సమర్థంగా రాణించే అవకాశం. ►టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ విద్యార్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్న టెక్ కంపెనీలు. ►టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్ వంటి కోర్సులు. ► ఇండస్ట్రీలో.. ఐఓటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహణ పెరగడమే ప్రధాన కారణం. డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం అన్ని రంగాల్లోనూ డేటా విశ్లేషణ.. ఆయా సంస్థల భవిష్యత్తు వ్యూహాలకు, మార్కెట్ ప్రణాళికలకు కీలకంగా మారింది. వీటి ఆధారంగానే ఉత్పత్తుల రూపకల్పన, నిర్వహణ తదితర కార్యకలాపాలు చేపట్టాల్సి వస్తోంది. ఇంత కీలకమైన డేటాను విశ్లేషించాలంటే.. మేనేజ్‌మెంట్‌తోపాటు డేటా మైనింగ్, డేటాసైన్స్ నైపుణ్యాలు కూడా అవసరమే. అందుకే మేనేజ్మెంట్ విద్యలోనే వీటిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరుగుతోంది. –ప్రొ‘‘ యు.దినేశ్ కుమార్, డేటాసెంటర్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్ చైర్మన్, ఐఐఎం–బెంగళూరు -
బాబోయ్ ఇంజనీరింగ్ మాకొద్దు..
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే యమ క్రేజ్. ఇలా చేరడం, అలా పూర్తి చేయడం, ఉద్యోగం తెచ్చుకోవడం అన్నట్టుగా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంజనీరింగ్ విద్య పట్ల విద్యార్థుల్లో మోజు తగ్గుతోంది. ఏ ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో... లేదంటే పేరున్న కాలేజీలోనో ఇంజనీరింగ్ చేస్తే ఓకే. లేకుంటే పెద్దగా ఉపయోగం లేదని విద్యార్థులు భావిస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత కోర్సులు మినహా ఇతర వాటి జోలికెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇక సివిల్, మెకానికల్ అంటేనే చాలామంది ఊహూ అంటున్నారు. ప్రత్యామ్నాయంగా బీబీఏ, ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సుల వైపు దృష్టి పెడుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. చాలావరకు కాలేజీలు మూతపడుతున్నాయి. ఉన్న కాలేజీల్లోనూ డిమాండ్ ఉన్న బ్రాంచ్‌లనే నిర్వహిస్తున్నారు. ఫలితంగా తెలంగాణ సహా జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ సంఖ్య ఏటా పడిపోతోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గణాంకాలే ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. సీట్లు భర్తీ అయ్యే పరిస్థితే లేదు 2014–15లో దేశవ్యాప్తంగా 31.8 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉంటే.. 2021–22 నాటికి ఇవి 23.6 లక్షలకు తగ్గాయి. అంటే దాదాపు 8.2 లక్షల సీట్లు తగ్గిపోయాయి. మరోవైపు మేనేజ్మెంట్ కోర్సుల్లో సీట్లు ఐదేళ్ళ క్రితం 3.74 లక్షలుంటే.. ప్రస్తుతం ఇవి 4.04 లక్షలున్నాయి. చాలా కాలేజీలు ఇంజనీరింగ్ సీట్లను తగ్గించుకుంటూ, మేనేజ్మెంట్ కోర్సుల సీట్లు పెంచుకుంటున్నాయి. తెలంగాణలోనూ పేరున్న కాలేజీలు మినహా మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. గడచిన ఏడేళ్ళుగా దాదాపు 74 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 20 కాలేజీలు బంద్ అయ్యాయి. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణం. కొన్ని కాలేజీలను జిల్లాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మార్చుకున్నారు. 2014లో నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 250 వరకూ కాలేజీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్‌లో ఈ జాబితా 175కు చేరడం గమనార్హం. తాజాగా మరో నాలుగు కాలేజీలు మూత వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులు పెంచుకుంటే తప్ప కాలేజీలు మనుగడ సాగించే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, మెకానికల్ బ్రాంచ్‌లలో 2 వేల సీట్లు కోత పెట్టారు. కంప్యూటర్ ఆధారిత కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ బ్రాంచీల్లో 1,800 సీట్లు పెంచారు. అయినా 80 శాతం కాలేజీల్లో అన్ని బ్రాంచీల్లో సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. 46.82 శాతం మందికే ఉద్యోగాలు! దేశవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు. వీరిలో సీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళే 60 శాతం ఉంటున్నారు. వీరితో పాటు ఇతర బ్రాంచ్‌ల వారికి సంబంధిత ఉద్యోగాలు లభించడం లేదు. ఇతరత్రా సాధారణ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంటోంది. సీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు సాంకేతికత మారుతోంది. దీన్ని అందుకోవడానికి కొత్త కోర్సులు చేయాలి. ఇది పూర్తయ్యేలోగా పోటీ మరింత పెరుగుతోంది. సివిల్, మెకానికల్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ వైపుకు మళ్ళడం కష్టంగా ఉంది. ఆ రంగంలోనూ పూర్తిస్థాయిలో ఉపాధి లభించడం లేదు. ఇండియా స్కిల్స్ తాజా నివేదికల ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 46.82 శాతం మందికే ఉద్యోగాలొస్తున్నాయని తేలింది. మార్కెట్‌కు కావాల్సిన స్కిల్స్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొరవడటమే ఉపాధి అవకాశాలు సన్నగిల్లడానికి కారణంగా పేర్కొంది. అయితే మేనేజ్మెంట్ కోర్సులైన బీబీఏ, ఎంబీఏ పూర్తి చేసిన వారిలోనూ 46.59 శాతమే ఉపాధి పొందుతున్నారని తెలిపింది. ఈ కోర్సుల్లోనూ నాణ్యత పెరగాల్సిన అవసరాన్ని నివేదిక స్పష్టం చేసింది. ఆదరణ కొరవడిన సివిల్, మెకానికల్.. పరిశ్రమల్లో ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ రాజ్యమేలుతోంది. సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ అనుసంధానమై పనిచేస్తున్నాయి. సివిల్, మెకానికల్ కోర్సులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేవనే అభిప్రాయం బలపడుతోంది. ఫలితంగా ఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తెలంగాణలో తాజాగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సీఎస్సీలో 38,796 సీట్లు అందుబాటులో ఉంటే, 37,073 (95.56 శాతం) భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్‌లో 13,935 సీట్లు ఉంటే, 12,308 (88.32 శాతం) భర్తీ అయ్యాయి. ఈఈఈ, సివిల్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో తక్కువ సీట్లే ఉన్నా.. వాటిల్లోనూ భర్తీ 50 శాతం మించలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను సంస్కరించాల్సిన అవసరం ఉందని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
డిగ్రీ మార్కులతోనే ఎంబీఏ ప్రవేశాలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా మేనేజ్మెంట్ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపించకపోవడంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ, పీజీడీఎం కోర్సులకు ఆన్లైన్ ద్వారా ఎంట్రన్స్‌లో పాల్గొన్న వారికి డిగ్రీ పరీక్షల్లో మార్కులే ప్రాతిపదికగా ప్రవేశాలు చేపట్టేందుకు కళాశాలలకు అనుమతినిచ్చింది. ఈ వెసులుబాటు 2020–21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎంబీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం)లకు అఖిల భారత స్థాయిలో క్యాట్, సీమ్యాట్, మ్యాట్, జీమ్యాట్, ఎక్స్‌మ్యాట్, ఏటీఎంఏతోపాటు రాష్ట్రాలు వేరుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు చేపడతాయి. కరోనా కారణంగా ఈ ప్రవేశ పరీక్షల్లో చాలా మటుకు జరగలేదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పీజీడీఎం, ఎంబీఏ విద్యాసంస్థలు ఎంపిక పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తున్నాం. అయితే, ఏవైనా ప్రవేశ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వీరు డిగ్రీ లో కనీసం మార్కులు సాధించినా సరిపోతుంది’ అని అని ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. సీట్లు ఖాళీగా ఉన్నట్లయితే డిగ్రీ పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఎంబీఏ ప్రవేశాల కోసం ఆన్లైన్లోనే మ్యాట్, ఏటీఎంఏ, జీమ్యాట్ పూర్తయ్యాయి. -
ఏప్రిల్ 30లోగానే ఏఐసీటీఈ అనుమతులు
♦ ఆ తరువాత అనుమతులు నో ♦ 2016-17 షెడ్యూల్‌ను జారీ చేసిన ఏఐసీటీఈ ♦ వర్సిటీలు మే 31లోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలి ♦ జూన్ 30లోగా మొదటిదశ ప్రవేశాలు పూర్తి చేయాల్సిందే ♦ ఆగస్టు 1 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తరగతులు ♦ పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సులకు ఏప్రిల్ 30లోగా అనుమతులు ఇస్తామని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కరాఖండిగా చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో యూనివర్సిటీలు కూడా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో మే 31లోగా పూర్తి చేయాల్సిందేనని, ఆ తరువాత ఒక్క కాలేజీకి కూడా అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 2016-17 విద్యా సంవత్సరం కోసం కాలేజీలకు అనుమతులు, అనుబంధ గుర్తింపు, ప్రవేశాల కౌన్సెలింగ్, తరగతుల ప్రారంభం తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఏఐసీటీఈ ప్రకటించింది. కొత్త కాలేజీల అనుమతులకు సంబంధించి 2016-17 ప్రొసీజర్ హ్యాండ్ బుక్ విడుదల చేసింది. వీటిని అమలు చేయాలని ఆదేశించింది. ఏఐసీటీఈ షెడ్యూల్ ఇలా... ► కొత్త కాలేజీలకు అనుమతులు, అదనపు సీట్ల పెంపు, సీట్ల రద్దు, కోర్సుల రద్దు, కాలేజీల మూసివేత వంటి అన్నింటికీ వచ్చే నెల 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► వాటన్నింటికి తాము ఏప్రిల్ 10లోగా అనుమతులిస్తాం.. ఒకవేళ ఆలస్యమైనా గరిష్టంగా ఏప్రిల్ 30లోగా పూర్తి చేస్తాం. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఎంసీఏ, ఫార్మసీ, ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సుల అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అన్ని రాష్ట్రాల్లో జూన్ 30లోగా మొదటిదశ ప్రవేశాల కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును పూర్తి చేయాలి. ► రెండో దశ ప్రవేశాల కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును జూలై 10లోగా, చివరి దశ ప్రవేశాలను జూలై 20 లోగా పూర్తి చేయాలి. ► ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలి. ► యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్లో 75 రోజులపాటు రోజుకు 7 గంటల చొప్పున 525 గంటల పాటు బోధన, ప్రాక్టికల్స్ నిర్వహించాలి. ► వీటికి అదనంగా మరో 15 రోజులు పరీక్షల ప్రిపరేషన్, నిర్వహణకు కేటాయించాలి. మొత్తంగా 90 రోజులు ఉండాలి. ► ఫస్టియర్‌లో మొదటి సెమిస్టర్‌ను ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు, రెండో సెమిస్టర్ జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించాలి. ► ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థులకు జూలై 15న మొదటి సెమిస్టర్‌ను ప్రారంభించి, నవంబరు 15 నాటికి పూర్తి చేయాలి. రెండో సెమిస్టర్‌ను డిసెంబరు 15న ప్రారంభించి ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలి. -
ఎంబీఏ.. ఎందుకు? ఎలా?
ఏ కోర్సు చదివినాదాని అంతిమ లక్ష్యం.. ఉద్యోగమే. జాబ్ మార్కెట్ కోణంలో.. కొన్ని కోర్సుల ఎంపికలో ముఖ్యంగా ఎంబీఏ విషయంలో ప్రస్తుతం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇతర కోర్సులతో పోల్చితే ఎంబీఏకు ఎక్కువ వ్యయం కావడం, కోర్సును పూర్తి చేయడానికి పట్టే సమయం, బాగా పేరున్న కాలేజీలో చదివితేనే ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలు ఈ కోర్సు విశ్వసనీయతకు పరీక్షగా నిలుస్తున్నాయి. మరో వైపు మన హైదరాబాద్ విద్యార్థుల్లో ఎక్కువమంది మేనేజ్మెంట్ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఐఎస్బీ, ఐపీఈ, ఓయూ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లలో ఎంబీఏ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రతిష్టాత్మక బీ స్కూల్స్ ఐఐఎంలలో ప్రవేశం కోసం అక్టోబర్‌లో జరిగే క్యాట్‌కు నగరంలోని విద్యార్థులు అప్పుడే సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఎంబీఏకు ఉన్న డిమాండ్, కోర్సు చేస్తే వచ్చే ప్రయోజనాలపై నిపుణుల విశ్లేషణ.. జీమ్యాక్ అధ్యయనం: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏకు జాబ్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది? ఎంతమంది ఎంప్లాయర్స్ ఎంబీఏ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారనే విషయంపై గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (జీమ్యాక్, ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా పరిగణించే జీమ్యాట్ పరీక్షను నిర్వహించే సంస్థ) ఒక సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనం మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడొంతుల మంది ఎంప్లాయర్స్ అంటే దాదాపు 87 శాతం కంపెనీలు.. బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం లేదా గతంతో పోల్చితే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునేందుకు సుముఖంగా ఉన్నాయి. అందుకనుగుణంగా హైరింగ్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇతర సంస్థల అంచనాలు కూడా దాదాపు జీమ్యాక్ అంచనాలతో సరిపోతున్నాయి. పే ప్యాకేజ్: వేతనాల విషయానికొస్తే.. హైరింగ్- పేప్యాకేజ్ అనే అంశాలు ఒకదానితో ఒకటి సహ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. జీమ్యాక్ అంచనా ప్రకారం ఈ ఏడాది 42 శాతం కంపెనీలు ఎంబీఏ అభ్యర్థుల జీతాలను స్థిరంగా కొనసాగించే అవకాశముంది. 56 శాతం కంపెనీలు మాత్రం ద్రవ్యోల్బణ రేటు లేదా అంతకంటే ఎక్కువ శాతంతో ఎంబీఏల వేతనాలను పెంచే ఉద్దేశంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంబీఏ విద్యార్థులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే.. కోర్సు పూర్తయ్యే నాటికి మంచి వేతనం లభిస్తుందా? లేదా? అనే ఆలోచనను పక్కనపెట్టండి. మీ నైపుణ్యాలకు తగిన ంత ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకంతో ఉండండి. నెట్వర్క్ కీలకం: చాలా మంది తాము చేసిన వ్యయానికి ప్రతిఫలం దక్కుతుందా? లేదా? అనే భావనలో ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎంబీఏతో ప్రతిఫలం ఆశించడమనేది మీరు ఏర్పర్చుకునే నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కోర్సులో భాగంగా సహ విద్యార్థులు, ప్రొఫెసర్లు తదితరులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. వీరే భవిష్యత్‌లో మీ క్లైంట్లు లేదా భాగస్వాములుగా, రెఫరెన్సగా మారే అవకాశం ఉంది. ఇది ఎంబీఏకు ఉన్న విలక్షణత. కాబట్టి గతంలో మాదిరిగా బిజినెస్ స్కూల్లోనే అంతా నేర్పిస్తారనే భావనతో కాకుండా మీ చుట్టూ ఉన్న వారందరితో మంచి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. గతంలో మీరు చదువుకున్న సహచరులతో సంబంధాలను కొనసాగించాలి. తద్వారా అవకాశాలు మెరుగవుతాయి. అందుకే బిజినెస్ స్కూల్స్ అలూమ్నీ అసోసియేషన్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాయి. ప్రస్తుతం ఎంబీఏ తప్పనిసరి: ఎలాంటి బీ-స్కూల్స్‌కు వెళ్లకుండా, మేనేజ్మెంట్ డిగ్రీ లేకుండానే విజయం సాధించిన వ్యాపారవేత్తలు ఎందరో కనిపి స్తుంటారు. అలా అనీ ఎంబీఏతో ప్రయోజనం లేదనే భావన సరికాదు. కాలంతోపాటు వ్యాపార నిర్వహణలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తదనుగుణంగా ఆయా వ్యవహారాలను పర్యవేక్షించడానికి నిపుణుల అవసరం పెరిగింది. ప్రస్తుత ప్రపంచంలో బిజినెస్ పరంగా తలెత్తే నిర్వహణ సమస్యలను తగ్గించడానికి ఎంబీఏ మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. బీ-స్కూల్‌కు హాజరవడం ద్వారా వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన పొందొచ్చు. ఈ క్రమంలో ఫైనాన్స్, మార్కెటింగ్, అకౌంటింగ్, స్ట్రాటజీ, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి అంశాలను బోధిస్తారు. అంతేకాకుండా ఆయా రంగాల్లోని వాస్తవిక పరిస్థితులను వివరిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి క్రమంలో మీ బలాలు- బలహీనతలపై విశ్లేషణ కూడా ఉంటుంది. అవసరం: చదువు పూర్తయిన తర్వాత కెరీర్ క్రమంలో క్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి పరిష్కారం కనుక్కునే క్రమంలో విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒక పరిమితికి మించి ఆలోచనలు ఏమాత్రం ముందుకు సాగవు. అటువంటి పరిస్థితిలో మేనేజ్మెంట్ కోర్సు చేయడం మంచి ప్రేరణగా ఉపయోగపడుతుంది. తిరిగి గాడిలో పడడానికి పలు విధాలుగా దోహదం చేస్తుంది. అంతేకాకుండా సృజనాత్మక శక్తిని తిరిగి తెచ్చుకోవడంతోపాటు సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలపై అవగాహన కల్పిస్తుంది. పరిష్కారాలను పరీక్షించడం, తప్పుల నుంచి నేర్చుకోవడం వంటివి లక్షణాలు అలవడుతాయి. తద్వారా భవిష్యత్‌లో నిర్వహణ చాతుర్యంతోపాటు సహోద్యోగులతో సమన్వయం చేసుకునే నైపుణ్యం పెరుగుతుంది. స్పెషలైజ్డ్కు అవకాశాలెక్కువ: ఎంబీఏతో పోల్చితే స్పెషలైజ్డ్ ఎంబీఏ కోర్సు చేసిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మేనేజ్మెంట్, లీడర్ షిప్ నైపుణ్యాలతోపాటు ఒక రంగానికి సంబంధించిన స్పెష లైజ్డ్ ఎంబీఏ కోర్సులను ఎంచుకోవడం కెరీర్ పరంగా ప్రయో జనంగా ఉంటుంది. ఉదాహరణకు హెల్త్‌కేర్ మేనేజ్మెంట్. సాధారణ ఎంబీఏ కంటే.. ఇలాంటి స్పెషలైజ్డ్ కోర్సులు చేసిన వారికే అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. అంతేకాకుండా నచ్చిన రంగంలో స్థిరపడే అవకాశం ఉంటోంది. ఇటీవలి కాలంలో స్పెషలైజ్డ్ ఎంబీఏ చేసిన అభ్యర్థుల అవసరం 22 శాతం మేర పెరిగింది. అయితే స్పెషలైజ్డ్ ఎంబీఏ కోర్సుల్లో చేరే ముందు కొన్ని సూచనలను పాటించాలి. అవి.. సదరు స్పెషలైజ్డ్ కోర్సుకు సంబంధించి మార్కెట్ వాస్తవిక అవసరాలకనుగుణంగా నైపుణ్యాలను అందించే దిశగా బోధన సాగించే ఫ్యాకల్టీలు ఉన్న ఇన్స్టిట్యూట్లను ఎంచుకోవాలి. వేగంగా ఉన్నత స్థానాలకు: చాలా మంది తాము పని చేస్తున్న రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఎంబీఏ కోర్సు చేస్తే స్వల్ప కాలంలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. ఎంబీఏ కోర్సు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. తద్వారా టీమ్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా నడిపించే స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే.. తరగతి గదిలో మీ పనితీరును సమీక్షించడం, స్టూడెంట్ క్లబ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా సంబంధిత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యక్తిగత నైపుణ్యాలతోపాటు సమిష్టితత్వం అలవడుతుంది. బలాలు-బలహీనతలను విశ్లేషించుకోవడంతోపాటు పనితీరు మేరకు ఉత్తమమైన కెరీర్‌ను ఎంచుకోవడానికి ఎంబీఏ కోర్సు ఇతోధికంగా సహాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు! ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో ఉన్నత అవకాశాలందించే కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్మెంట్ కోర్సులు ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఈ కోర్సులకు డిమాండ్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఎంబీఏ కోర్సులో ఏటా సుమారు 100 మంది విదేశీ విద్యార్థులు ప్రవేశం పొందుతుండడమే దీనికి నిదర్శనం. ఉస్మానియా రెగ్యులర్ ఎంబీఏతోపాటు టెక్నికల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తోంది. అలాగే ఇతర యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు ఎంబీఏకు సమానమైన ఇతర మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈవెంట్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ఎంబీఏ కోర్సులో రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. విద్యానేపథ్యాన్ని అనుసరించి కూడా సంబంధిత మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే అవకాశం ఏర్పడుతోంది. ఉదాహరణకు ‘మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్’, ‘మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్’ కోర్సులను బీఫార్మసీ పూర్తి చేసిన వారు అభ్యసిస్తే మంచి అవకాశాలుంటాయి. ఎంబీఏ కోర్సులో రాణించాలంటే మంచి కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ స్కిల్స్‌తో పాటు అదనపు నైపుణ్యాలు తప్పనిసరి. ప్రతి అంశాన్ని మార్కెటింగ్ కోణంలో ఆలోచించే వారు ఎంబీఏ మార్కెటింగ్ విభాగంలో రాణిస్తారు. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు సేవలు, రిటైల్, మౌలిక రంగాలతోపాటు సాఫ్ట్వేర్ తదితర రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు లభిస్తున్నాయి. - ప్రొఫెసర్. వి. శేఖర్, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ. -
ఉజ్వల కెరీర్‌కు‘ఆతిథ్య’మిస్తోంది!
దేశ ఆర్థిక ప్రగతికి ఆతిథ్య రంగం ఊపిరిపోస్తోంది.. మిగిలిన రంగాలతో పోలిస్తే ప్రతి రూ.10 లక్షల పెట్టుబడికి, అత్యధిక సంఖ్యలో ఉద్యోగాల సృష్టి ఆతిథ్య రంగంలోనే జరుగుతోంది.. - ప్రణాళిక సంఘం. శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. అద్భుత అవకాశాలకు బాటలు వేస్తోంది. పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో.. అదే స్థాయిలో.. హాస్పిటాలిటీ రంగంలో మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. కోర్సులు.. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పలు ఇన్స్టిట్యూట్లు హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులు. అందిస్తున్న సంస్థలు: హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ (ఐహెచ్ఎం).. ఎకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. కాల వ్యవధి: ఏడాదిన్నర అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. ప్రవేశం: జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష, కేంద్రీకృత కౌన్సెలింగ్ ఆధారంగా. వెబ్సైట్: www.ihmhyd.org డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - హైదరాబాద్.. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, కలినరీ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వ్యవధి: ఆరు నెలలు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వెబ్సైట్: www.nithm.ac.in మన రాష్ట్రంలో సెట్విన్.. హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ డిప్లొమా (వ్యవధి: మూడేళ్లు), పీజీ డిప్లొమా (వ్యవధి:ఏడాది), హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజంలో పీజీ డిప్లొమా (వ్యవధి: ఏడాది) అందిస్తోంది. వివిధ ఉన్నత స్థాయి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: www.setwinapgov.org నైపుణ్యాలు: కమ్యూనికేషన్ స్కిల్స్. మేనేజీరియల్ నైపుణ్యాలు. సాఫ్ట్ స్కిల్స్. సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం. వేతనాలు: మేనేజ్మెంట్ ట్రైనీగా అరుుతే నెలకు రూ.15 నుంచి రూ.18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. కెరీర్: హోటల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్(ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా జాబ్స్ పొందొచ్చు. రెండు కోణాలు: కెరీర్ పరంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆతిథ్య రంగం ఒక ఆకర్షణీయ (Glamour) కెరీర్ ఆప్షన్. కార్యకలాపాల విస్తరణకు అవకాశమున్న రంగం ఆతిథ్యం. అందువల్ల ఈ రంగంలో పదోన్నతులు త్వరగా లభిస్తాయి. కొత్త శాఖల ఏర్పాటు ద్వారా ఈ అవకాశం దొరుకుతుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గినప్పుడు ఆతిథ్య రంగం కొంత ఒడిదుడుకులకు గురవుతుంది. అధిక పనివేళలతో పాటు ఒక్కోసారి అతిథుల (కస్టమర్స్) ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ‘కాలం’తోడుగా ఆతిథ్యం ఆతిథ్య రంగంలో మేనేజ్మెంట్; ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్; హౌస్ కీపింగ్; ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్; సేల్స్ అండ్ మార్కెటింగ్; అకౌంటింగ్ తదితర విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో ఒక్కోలా పని ఉంటుంది. ఉదాహరణకు హోటల్ మేనేజర్‌ను తీసుకుంటే.. 6 am - 7am: హౌస్‌కీపింగ్, కస్టమర్ సర్వీసులు, అతిథుల సంఖ్య, వారికందుతున్న సేవలపై ఆరా. 7 am - 10am: హోటల్లో సమావేశాలకు ఏర్పాట్లు, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారాలు. 10 am - 1pm: కొత్త అతిథులు-ఏర్పాట్లకు సంబంధించిన పనుల పర్యవేక్షణ 1 pm - 2pm: మధ్యాహ్న భోజనం. 2 pm - 5pm: ఆక్యుపెన్సీ పెంపు, అతిథుల భద్రత, సౌకర్యాలపై యాజమాన్యం, బృందంతో చర్చలు. 6 pm: షిఫ్ట్ విధులు పూర్తి. తక్కువ కాలవ్యవధిలో కోర్సు పూర్తిచేసి ఉపాధి పొందే అవకాశం డిప్లొమాల ద్వారానే సాధ్యం. నిథమ్‌లో ఎంబీఏ, బీబీఏ, బీహెచ్ఎంసీటీ కోర్సులతోపాటు స్వల్పకాలంలో పూర్తిచేసే డిప్లొమాలున్నాయి. అవి.. రూరల్ టూరిజం, ప్రాజెక్టు డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆయుర్వేద పంచకర్మ థెరపీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ. కాల వ్యవధి (3- 6 నెలలు), ఫీజు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. అర్హత: 10వ తరగతి. 6 నెలల వ్యవధి గల రూరల్ టూరిజంలో డిప్లొమాకు 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హోటళ్లు, టూరిజం సెంటర్లలో పనిచేసే కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రొడక్షన్, హౌస్‌కీపింగ్, సర్వీస్ అంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం. -డాక్టర్ పి.నారాయణరెడ్డి, డెరైక్టర్, డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్, హైదరాబాద్. ఎన్సీహెచ్ఎంసీటీ - జేఈఈ (2014) జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. ఈ సంస్థల్లో మొత్తం 7,454 సీట్లున్నాయి. జేఈఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు.. అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 2014, జూలై 1 నాటికి 22 ఏళ్లు మించరాదు. అభ్యర్థులు 1992, జూలై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు. వీరు1989, జూలై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎంపిక: జేఈఈ ర్యాంకు ఆధారంగా ప్రవేశం. పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 ప్రశ్నలు) ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. దరఖాస్తు వివరాలు: దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో.. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్ దరఖాస్తుల అమ్మకం ప్రారంభం: డిసెంబర్ 23, 2013 ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 5, 2013 దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014 అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: ఏప్రిల్ 19, 2014 నుంచి పరీక్ష తేదీ: ఏప్రిల్ 26, 2014, వెబ్సైట్: https://applyadmission.net/nchmjee2014/