న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా మేనేజ్‌మెంట్ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపించకపోవడంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ, పీజీడీఎం కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా ఎంట్రన్స్‌లో పాల్గొన్న వారికి డిగ్రీ పరీక్షల్లో మార్కులే ప్రాతిపదికగా ప్రవేశాలు చేపట్టేందుకు కళాశాలలకు అనుమతినిచ్చింది. ఈ వెసులుబాటు 2020–21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎంబీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం)లకు అఖిల భారత స్థాయిలో క్యాట్, సీమ్యాట్, మ్యాట్, జీమ్యాట్, ఎక్స్‌మ్యాట్, ఏటీఎంఏతోపాటు రాష్ట్రాలు వేరుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు చేపడతాయి.
కరోనా కారణంగా ఈ ప్రవేశ పరీక్షల్లో చాలా మటుకు జరగలేదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పీజీడీఎం, ఎంబీఏ విద్యాసంస్థలు ఎంపిక పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తున్నాం. అయితే, ఏవైనా ప్రవేశ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వీరు డిగ్రీ లో కనీసం మార్కులు సాధించినా సరిపోతుంది’ అని అని ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. సీట్లు ఖాళీగా ఉన్నట్లయితే డిగ్రీ పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఎంబీఏ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లోనే మ్యాట్, ఏటీఎంఏ, జీమ్యాట్ పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment