Degree Results
-
ఆటంకాలు అధిగమించి.. పీహెచ్డీ సాధించి..
గుంటూరు: తనకు చదువుల దాహం... సహకరించని ఆర్థిక పరిస్థితులు.. పెళ్లితో డిగ్రీ ఫస్టియర్‌లోనే చదువుకు బ్రేక్ పడింది. ఆటోడ్రైవర్ భర్త భరో సాతో చదువు ఆరంభించినా అదే సమస్యపై మళ్లీ అవాంతరం. అయినా నిరాశతో కుంగిపోలేదు. ఇద్దరి బిడ్డల ఆలనపాలనా చూస్తునే అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ, ఏదొక ఉద్యోగం చేస్తూ డిగ్రీ, పీజీనే కాదు.. ఏకంగా పీహెచ్డీ సాధించింది.అధ్యాపకురాలిగా పనిచేస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం జరిగిన 40వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ను స్వీకరించింది. ఆ మహిళ విజయప్రస్థానమిది... ఆ చదువుల తల్లి పేరు ఈపూరి షీల. తెనాలి రూరల్ మండల గ్రామం పెదరావూరు. చిన్నతనంలోనే తల్లి మరణించారు. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదివింది. తెనాలిలో ఇంటర్ తర్వాత జేఎంజే మహిళా కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుండగా, 2003లో ఆటోడ్రైవర్ రావూరి కరుణాకర్‌తో పెద్దలు వివాహం చేశారు. చదువుకుంటానని అడిగిన భార్య కోరికను మన్నించిన భర్త ప్రోత్సహించాడు. రెండేళ్లు చదివాక ఫైనలియర్లో మళ్లీ ఆర్థిక ఇబ్బందులు సహ కరించ లేదు. ఉపాధికోసం 2004లో అక్షరదీప్తి పథకంలో ప్రేరక్‌గా చేరారు. అయినా చదువు‘కొన’లేకపోయారు. 2008లో ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన కంప్యూటర్ శిక్షణలో చేరి, పీజీడీసీఏ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, డిగ్రీ అర్హత లేకపోవటంతో వెనుదిరగాల్సి వచ్చింది. అర్థం చేసుకున్న భర్త, పిల్లలతోపాటు భార్యనూ చదివించారు. ఫలితంగా 2009లో డిగ్రీ ఫైనలియర్ పూర్తిచేశారు షీల. తెనాలిలో గుప్తా కాలేజీలో కామర్స్‌లో పీజీ చేశారు. ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేస్తే, పీహెచ్డీ తప్పనిసరిగా చెప్పటంతో పీజీ చేసిన కాలేజీలోనే అధ్యాపకురాలిగా పనిచేయసాగారు. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్‌యూఆర్‌సీటీ నోటిఫికేషన్ వచ్చింది. భర్త కరుణాకర్ ప్రోత్సాహంతో దరఖాస్తు చేసింది. యూనివర్సిటీలో డాక్టర్ ఎన్.రత్నకిషోర్ గైడ్‌గా ఫుల్‌టైం రీసెర్చ్ స్కాలర్‌గా చేరారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఆర్థిక సమస్యలతో ఆగిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ 2016లో రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికవటం కలిసొచ్చింది. రోజూ యూనివర్సిటీకి వెళుతూ అక్కడి లైబ్రరీలో చదువుకుంటూ 2016 సెప్టెంబరులో ఏపీసెట్ అర్హత సాధించారు. దూరవిద్యలో మాస్టర్ డిగ్రీ ఎంహెచ్ఆర్ఎంను 2017లో పూర్తిశారు. అదే ఏడాది ఎంఫిల్ నుంచి పీహెచ్‌డీకి కన్వర్షన్ జరిగిందని షీల చెప్పారు. గతేడాది ఆఖరులో ‘సర్వీస్ క్వాలిటీ ఇన్ హెల్త్‌కేర్ సెక్టార్’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఆ థీసిస్‌కు గత జులై 4న పీహెచ్డీ లభించింది. యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో మంగళవారం డాక్టరేట్‌ను అందుకోనున్నారు. ప్రస్తుతం షీల స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో కామర్స్ అధ్యాపకురాలిగా చేస్తున్నారు. ఆగిపోయిన చదువు ఇక్కడిదాకా వస్తుందనీ, డాక్టరేటు సాధిస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలన్నదే తన ఆశయంగా వివరించారు. సందర్భంగా... ‘గమ్యం సాధించాలనుకునే వ్యక్తి అలుపెరగడు. విజయం సాధించాలనుకునే వ్యక్తి నిరాశ చెందడు’. అలాగే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం / ప్రతి నీడకు ఒక వెలుగు / ప్రతి బాధకు ఓ ఓదార్పు ఉంటుంది / కాకపోతే విశ్వాసం కోల్పోకుండా మనవంతు ప్రయత్నం చేయాలి’ అని పెద్దల మాట. ఈ మాటలు చక్కగా అన్వయమవుతాయి పెదరావూరుకు చెందిన ఈపూరి షీల విషయంలో. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో చదువును కొనసాగించింది. తట్టుకోలేని కష్టాలు తారసపడ్డా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న పీహెచ్‌డీని సాధించింది. ‘పాండిత్యం ఉన్నవాడు శిఖరాన్ని చేరతాడు/వ్యక్తిత్వం ఉన్నవాడు శిఖరం మీద చిరస్థాయిగా నిలుస్తాడు’ అని చెప్పినట్లుగా ఆమె ప్రస్థానం అభినందనీయం. ఆమె చేరిన శిఖరం గురించి అందిస్తున్న కథనం. -
డిగ్రీ మార్కులతోనే ఎంబీఏ ప్రవేశాలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా మేనేజ్మెంట్ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపించకపోవడంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ, పీజీడీఎం కోర్సులకు ఆన్లైన్ ద్వారా ఎంట్రన్స్‌లో పాల్గొన్న వారికి డిగ్రీ పరీక్షల్లో మార్కులే ప్రాతిపదికగా ప్రవేశాలు చేపట్టేందుకు కళాశాలలకు అనుమతినిచ్చింది. ఈ వెసులుబాటు 2020–21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎంబీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం)లకు అఖిల భారత స్థాయిలో క్యాట్, సీమ్యాట్, మ్యాట్, జీమ్యాట్, ఎక్స్‌మ్యాట్, ఏటీఎంఏతోపాటు రాష్ట్రాలు వేరుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు చేపడతాయి. కరోనా కారణంగా ఈ ప్రవేశ పరీక్షల్లో చాలా మటుకు జరగలేదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పీజీడీఎం, ఎంబీఏ విద్యాసంస్థలు ఎంపిక పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తున్నాం. అయితే, ఏవైనా ప్రవేశ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వీరు డిగ్రీ లో కనీసం మార్కులు సాధించినా సరిపోతుంది’ అని అని ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. సీట్లు ఖాళీగా ఉన్నట్లయితే డిగ్రీ పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఎంబీఏ ప్రవేశాల కోసం ఆన్లైన్లోనే మ్యాట్, ఏటీఎంఏ, జీమ్యాట్ పూర్తయ్యాయి. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
సాక్షి, వరంగల్ అర్బన్ : డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నయీమ్ నగర్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించిన అనతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ధర్నాకు దిగారు. విదార్థుల గుంపును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాజు ముక్కలు కోసుకుపోవడంతో ఓ విద్యార్థి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీతో కొట్టాడంతో గాజు ముక్కలపై పడ్డాడని విద్యార్థి ఆరోపించాడు. ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ విద్యార్థులు యూనివర్సిటీలో బైఠాయించారు. -
అనుమానమా? నమ్మకమా?
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఫలితాలపై అనుమానమో లేక తాము రాసిన పరీక్షలకు ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకమో గానీ రీవాల్యుయేషన్‌కు భారీసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి కంటే ఎక్కువ మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో వర్సిటీ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రెండు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్లు, ఇయర్ ఎండ్ విద్యార్థులు మొత్తం 26,815 మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడంగమనార్హం. ఫలితాలపై అనుమానమేనా? డిగ్రీ ఫలితాలు విడుదలైనప్పటి నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాల్లో టాపర్ల జాబితా మారటం, విద్యార్థులు ఆందోళన చేయటం, పరీక్షల వ్యవహారాన్ని నిర్వహిస్తూ తప్పిదానికి కారణమైన విభా సొల్యూషన్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, ఫలితాల పరిశీలనపై కమిటీ వేయటం లాంటి ఘటనలతో విద్యార్థుల్లో పలు అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది. ఈ కారణంగానే వేల సంఖ్యలోరీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు రీవాల్యుయేషన్‌కు అవకాశం ఇవ్వాలని, రూ.300 ఉన్న ఫీజును తగ్గించాలని వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టారు. స్పందించిన వర్సిటీ రిజిస్ట్రార్ రూ.300 నుంచి రూ.200లకు ఫీజు తగ్గించారు. దీంతో ఎక్కువ మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అత్యధికంగా దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టులు సెమిస్టర్ –2లో ఇంగ్లిష్‌కు 1,179, గణితానికి 1,236, కంప్యూటర్ సైన్స్‌కు 1,440, ప్రోగ్రామ్ ఇన్ సీకి 1,473 మంది, సెమిస్టర్–4లో గణితానికి 1,170, ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్‌కు 1130 మంది, ఆఫీస్ అటోమేషన్ టూల్స్‌కు 1,052, ఇన్‌కమ్‌ట్యాక్స్ సబ్జెక్టుకు 965 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు తగ్గించడం వల్లే.. రీవాల్యుయేషన్ ఫీజును రూ.300 నుంచి రూ.200లకు తగ్గించటం వల్లే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. గత ఏడాది సుమారు 16,000 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది 26,815 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. – డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు,పరీక్షల నియంత్రణాధికారి -
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
వైవీయూ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. సుబ్బనరసయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ ప్రథమ సంవత్సరం 68 శాతం, ద్వితీయ సంవత్సరం 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. పూర్తి ఫలితాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జీసీఎంకడప.ఓఆర్జీ అనే వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. అదే విధంగా డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమయ్యాయన్నారు. అడ్మిషన్లు పొందగోరు విద్యార్థులు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఐఎల్ఎన్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఎస్. రామచంద్రయ్య, ఎల్ఎంబీ భక్షు పాల్గొన్నారు.