కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఫలితాలపై అనుమానమో లేక తాము రాసిన పరీక్షలకు ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకమో గానీ రీవాల్యుయేషన్‌కు భారీసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి కంటే ఎక్కువ మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో వర్సిటీ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రెండు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్లు, ఇయర్ ఎండ్ విద్యార్థులు మొత్తం 26,815 మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడంగమనార్హం.
ఫలితాలపై అనుమానమేనా?
డిగ్రీ ఫలితాలు విడుదలైనప్పటి నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాల్లో టాపర్ల జాబితా మారటం, విద్యార్థులు ఆందోళన చేయటం, పరీక్షల వ్యవహారాన్ని నిర్వహిస్తూ తప్పిదానికి కారణమైన విభా సొల్యూషన్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, ఫలితాల పరిశీలనపై కమిటీ వేయటం లాంటి ఘటనలతో విద్యార్థుల్లో పలు అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది. ఈ కారణంగానే వేల సంఖ్యలోరీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు రీవాల్యుయేషన్‌కు అవకాశం ఇవ్వాలని, రూ.300 ఉన్న ఫీజును తగ్గించాలని వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టారు. స్పందించిన వర్సిటీ రిజిస్ట్రార్ రూ.300 నుంచి రూ.200లకు ఫీజు తగ్గించారు. దీంతో ఎక్కువ మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అత్యధికంగా దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టులు
సెమిస్టర్ –2లో ఇంగ్లిష్‌కు 1,179, గణితానికి 1,236, కంప్యూటర్ సైన్స్‌కు 1,440, ప్రోగ్రామ్ ఇన్ సీకి 1,473 మంది, సెమిస్టర్–4లో గణితానికి 1,170, ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్‌కు 1130 మంది, ఆఫీస్ అటోమేషన్ టూల్స్‌కు 1,052, ఇన్‌కమ్‌ట్యాక్స్ సబ్జెక్టుకు 965 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఫీజు తగ్గించడం వల్లే..
రీవాల్యుయేషన్ ఫీజును రూ.300 నుంచి రూ.200లకు తగ్గించటం వల్లే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. గత ఏడాది సుమారు 16,000 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది 26,815 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. – డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు,పరీక్షల నియంత్రణాధికారి
Comments
Please login to add a commentAdd a comment