వీరిపై వారు.. వారిపై వీరు! | Hostel PG Students Vs Officials In Kurnool | Sakshi
Sakshi News home page

వీరిపై వారు.. వారిపై వీరు!

Published Tue, Jun 26 2018 12:05 PM | Last Updated on Tue, Jun 26 2018 12:05 PM

Hostel PG Students Vs Officials In Kurnool - Sakshi

భ్రమరాంబ హాస్టల్‌

కర్నూలు(గాయత్రీ ఎస్టేట్‌): పీజీ హాస్టల్స్‌ ఓపెన్‌ చేస్తే తరగతులకు హాజరవుతామని విద్యార్థులు... విద్యార్థులు వస్తే హాస్టళ్లు తెరుస్తామని రాయలసీమ వర్సిటీ అధికారులు.. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉండడంతో పీజీ తరగతులు ప్రారంభమై వారం గడిచినా అత్తెసరు హాజరే నమోదవుతోంది. వచ్చే నెలలో వర్సిటీలో న్యాక్‌ అధికారుల పర్యటన ఉండడం,  అధికారులు విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్సిటీలో హాజరు తక్కువగా ఉండడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్సిటీ  కళాశాల పీజీ సెమిస్టర్‌ –3,5 తరగతులు ఈనెల 18వ తేదీ  ప్రారంభమయ్యాయి. అయితే హాస్టల్స్‌ మాత్రం తెరుచుకోవడంలేదు. విద్యార్థులు వస్తే హాస్టళ్లు తెరుస్తామని అధికారులు అంటుండగా..

హాస్టళ్లు తెరిస్తే  వస్తామని విద్యార్థులు చెబుతున్నారు.  మొత్తానికి ఆర్‌యూ హాస్టళ్ల పరిస్థితి గందరగోళంగా మారింది. ఎప్పు డు తెరుస్తారో కూడా ప్రకటించలేని çపరిస్థితిలో అధికారులున్నారు.  మరో వైపు న్యాక్‌ పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూలై 5,67, తేదీల్లో ఆర్‌యూను న్యాక్‌ సభ్యులు సంద ర్శించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో న్యాక్‌ సభ్యులు ఇంటరాక్ట్‌ అవుతారు. వారి నుంచి తీసుకునే ఫీడ్‌ బ్యాక్‌ను బట్టే యూజీసీ న్యాక్‌ గ్రేడ్‌ ఇస్తుంది. అత్యంత కీలక సమయంలో వర్సిటీ అధికారులు హాస్టళ్లు తెరవకపోవడం, విద్యార్థులు తరగతులకు రాకపోవడం లాంటి పరిస్థితి న్యాక్‌  పర్యటనపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇదీ పరిస్థితి..  
రాయలసీమ వర్సిటీలో ఐదు హాస్టళ్లున్నాయి. ఇందులో  తుంగభద్ర, కృష్ణ, సంఘమేశ్వర హాస్టళ్లు అబ్బాయిలకు, భ్రమరాంబ, జోగుళాంబ హాస్టళ్లు అమ్మాయిలకు సంబంధించినవి. మెన్‌ హాస్టళ్లలో 330 మంది, ఉమెన్‌ హాస్టళ్లలో 335 మంది ఉంటారు. వర్సిటీ కళాశాల పీజీ తరగతులు ప్రారంభమై వారం రోజులవుతున్నా ఇప్పటి వరకు 25 మంది అబ్బాయిలు మాత్రమే హాస్టల్లో రిపోర్ట్‌ చేశారు. వీరిలో 10 మంది కూడా హాస్టల్లో లేరు. అమ్మాయిలు 40 మంది దాకా రిపోర్ట్‌ చేసినా 10 మంది కూడా హాజరు కావడం లేదు. వర్సిటీకి వచ్చి బిల్లులు చెల్లించి రూమ్‌ అలాట్‌ చేసుకొని వారి ఊర్లకు వెళ్లి పోతున్నారు. హాస్టల్‌ తెరిచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం తయారు చేసి పెడితే హాస్టల్లోనే ఉంటామని విద్యార్థులు చెబుతున్నారు.  ఇవన్నీ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది.. విద్యార్థుల కంటే సిబ్బంది, బయటి విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో బిల్లు మొత్తం ఉన్న విద్యార్థులపైనే పడుతుందని వర్సిటీ వార్డన్లు  పేర్కొంటున్నారు.

హాస్టల్లో వసతి కల్పించాలి
సోమవారం పరీక్షలున్నందు వల్ల వర్సిటీకి వచ్చాను. ఇక్కడ చూస్తే విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంది. టిఫన్, అన్నం వడ్డించడం లేదు. ఇక్కడ ఉండడం కష్టం కాబట్టి  మళ్లీ మా ఊరికి వెళ్తున్నాను. పూర్తిస్థాయిలో హాస్టల్‌ నడుస్తున్నప్పుడు వస్తాను.– లోకేష్, ఎంబీఏ విద్యార్థి,ఆలూరు మండలం బిల్లేకల్‌

ఊరికి వెళ్లి పోతున్నా..  
సోమవారమే విశ్వవిద్యాలయానికి వచ్చాను. విద్యార్థులు 20 మంది కూడా లేరు. ఇక్కడ ఉండాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దీంతో హాస్టల్‌ పూర్తి స్థాయిలో నడిచినప్పుడే వద్దామనుకుంటున్నాను. అంత వరకు మా ఊర్లోనే ఉంటాను.–శివశంకర్, ఇంగ్లిష్‌ విభాగంవిద్యార్థి, ఆదోని   

విద్యార్థులంతా హాజరు కావాలి..
నాలుగు రోజుల క్రితం వర్సిటీకి వచ్చాను. విద్యార్థులు పూర్తిస్థాయిలో రాలేదంటూ హాస్టల్లో అన్నం పెట్టడం లేదు. మూడు పూటలా బయట తినడం వల్ల రోజుకు రూ.200 వరకు ఖర్చవుతోంది. తరగతులు ప్రారంభమయ్యాయి కాబట్టి విద్యార్థులందరూ హాజరు కావాలి. నేను కూడా నా స్నేహితులకు ఫోన్‌ చేసి రావాలని చెబుతున్నాను.
– విష్ణుచరణ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం, రామాపురం, అవుకు మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement