PG hostels
-
సామాన్యులకు మరో షాక్.. పీజీ హాస్టళ్లపై జీఎస్టీ, ఇక బాదుడు షురూ!
శివాజీనగర(బెంగళూరు): ఇప్పటికే పలు రకాల భారాలతో అయ్యో అంటున్న సామాన్య ప్రజలకు మరో భారం పొంచి ఉంది. ప్రైవేటు హాస్టళ్లు (పీజీ)ల బాడుగ ఫీజుకు జీఎస్టీ సెగ తగలనుంది. విద్యార్థులు, బ్యాచిలర్లు, ఒంటరి ఉద్యోగులకు ఆదరువుగా పీజీలు ఉండడం తెలిసిందే. నగరంలో వేలాది మంది పీజీల్లో వసతి పొందుతూ వృత్తి ఉద్యోగాలను, చదువులను కొనసాగిస్తున్నారు. కొత్త జీఎస్టీ నియమాల ప్రకారం రోజు బాడుగ రూ. వెయ్యి కంటే తక్కువ అయితే 12 శాతం జీఎస్టీ, వెయ్యి కంటే ఎక్కువైతే 18 శాతం జీఎస్టీ విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. బెంగళూరులోని జీఎస్టీ పీఠం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా బాడుగల్ని పెంచడం తప్పదని బెంగళూరు పీజీ యజమానుల క్షేమాభివృద్ధి సంఘం వెల్లడించింది. జీఎస్టీని వసతిదారుల నుంచే వసూలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో పీజీల బాడుగ ఎక్కువగా ఉందని వసతిదారులు చెబుతున్నారు. చదవండి సైకో టెక్కీ.. ప్రియురాలిపై ఉన్మాదం.. -
హాస్టళ్లలో భద్రత కట్టుదిట్టం చేయాలి
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో కొనసాగుతున్న వర్కింగ్ పీజీ హాస్టళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హాస్టళ్ల నిర్వాహకులు, పోలీసులకు సూచించారు. శనివారం గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్‌లో నిర్వహించిన ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ హాస్టల్స్‌లో ఉంటున్న వారికి భద్రత కల్పించడం నిర్వాహకుల బాధ్యత అన్నారు. 24 గంటలు పని చేసేలా హాస్టల్ ఎగ్జిట్, ఎంట్రీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాంపౌండ్ వాల్ ఐదు అడుగులు ఉండాలని, వాచ్మెన్లను నియమించాలన్నారు. విజిటర్స్ వివరాలపై రిజిస్టర్ నమోదు చేయాలన్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించాలని, నోటీసు బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సజేషన్స్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వ్యక్తిగత లాకర్ల సదుపాయం ఉండాలన్నారు. స్టాఫ్ ఐడీ ప్రూఫ్‌లతో పాటు కొత్తగా వచ్చే వారి ఐడీ ప్రూఫ్‌లు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.ఐదు వేల జరిమానా లేదా సీజ్ చేస్తామన్నారు. అనంతరం ప్రాజెక్ట్ సేఫ్ స్టే పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీలు కవిత, శిల్పవల్లీ, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, మహిళా ఫోరం జాయింట్ సెక్రటరీ ప్రత్యూష, ట్రాఫిక్ ఫోరం కార్యదర్శి శ్రీనివాస్, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.అమరనాథ్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి రఘు నాయుడు, గౌరవ అధ్యక్షులు చంద్ర శేఖర్, సంజయ్ చౌదరీ పాల్గొన్నారు. -
వీరిపై వారు.. వారిపై వీరు!
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): పీజీ హాస్టల్స్ ఓపెన్ చేస్తే తరగతులకు హాజరవుతామని విద్యార్థులు... విద్యార్థులు వస్తే హాస్టళ్లు తెరుస్తామని రాయలసీమ వర్సిటీ అధికారులు.. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉండడంతో పీజీ తరగతులు ప్రారంభమై వారం గడిచినా అత్తెసరు హాజరే నమోదవుతోంది. వచ్చే నెలలో వర్సిటీలో న్యాక్ అధికారుల పర్యటన ఉండడం, అధికారులు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్సిటీలో హాజరు తక్కువగా ఉండడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్సిటీ కళాశాల పీజీ సెమిస్టర్ –3,5 తరగతులు ఈనెల 18వ తేదీ ప్రారంభమయ్యాయి. అయితే హాస్టల్స్ మాత్రం తెరుచుకోవడంలేదు. విద్యార్థులు వస్తే హాస్టళ్లు తెరుస్తామని అధికారులు అంటుండగా.. హాస్టళ్లు తెరిస్తే వస్తామని విద్యార్థులు చెబుతున్నారు. మొత్తానికి ఆర్యూ హాస్టళ్ల పరిస్థితి గందరగోళంగా మారింది. ఎప్పు డు తెరుస్తారో కూడా ప్రకటించలేని çపరిస్థితిలో అధికారులున్నారు. మరో వైపు న్యాక్ పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూలై 5,67, తేదీల్లో ఆర్‌యూను న్యాక్ సభ్యులు సంద ర్శించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో న్యాక్ సభ్యులు ఇంటరాక్ట్ అవుతారు. వారి నుంచి తీసుకునే ఫీడ్ బ్యాక్‌ను బట్టే యూజీసీ న్యాక్ గ్రేడ్ ఇస్తుంది. అత్యంత కీలక సమయంలో వర్సిటీ అధికారులు హాస్టళ్లు తెరవకపోవడం, విద్యార్థులు తరగతులకు రాకపోవడం లాంటి పరిస్థితి న్యాక్ పర్యటనపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదీ పరిస్థితి.. రాయలసీమ వర్సిటీలో ఐదు హాస్టళ్లున్నాయి. ఇందులో తుంగభద్ర, కృష్ణ, సంఘమేశ్వర హాస్టళ్లు అబ్బాయిలకు, భ్రమరాంబ, జోగుళాంబ హాస్టళ్లు అమ్మాయిలకు సంబంధించినవి. మెన్ హాస్టళ్లలో 330 మంది, ఉమెన్ హాస్టళ్లలో 335 మంది ఉంటారు. వర్సిటీ కళాశాల పీజీ తరగతులు ప్రారంభమై వారం రోజులవుతున్నా ఇప్పటి వరకు 25 మంది అబ్బాయిలు మాత్రమే హాస్టల్లో రిపోర్ట్ చేశారు. వీరిలో 10 మంది కూడా హాస్టల్లో లేరు. అమ్మాయిలు 40 మంది దాకా రిపోర్ట్ చేసినా 10 మంది కూడా హాజరు కావడం లేదు. వర్సిటీకి వచ్చి బిల్లులు చెల్లించి రూమ్ అలాట్ చేసుకొని వారి ఊర్లకు వెళ్లి పోతున్నారు. హాస్టల్ తెరిచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం తయారు చేసి పెడితే హాస్టల్లోనే ఉంటామని విద్యార్థులు చెబుతున్నారు. ఇవన్నీ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది.. విద్యార్థుల కంటే సిబ్బంది, బయటి విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో బిల్లు మొత్తం ఉన్న విద్యార్థులపైనే పడుతుందని వర్సిటీ వార్డన్లు పేర్కొంటున్నారు. హాస్టల్లో వసతి కల్పించాలి సోమవారం పరీక్షలున్నందు వల్ల వర్సిటీకి వచ్చాను. ఇక్కడ చూస్తే విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంది. టిఫన్, అన్నం వడ్డించడం లేదు. ఇక్కడ ఉండడం కష్టం కాబట్టి మళ్లీ మా ఊరికి వెళ్తున్నాను. పూర్తిస్థాయిలో హాస్టల్ నడుస్తున్నప్పుడు వస్తాను.– లోకేష్, ఎంబీఏ విద్యార్థి,ఆలూరు మండలం బిల్లేకల్ ఊరికి వెళ్లి పోతున్నా.. సోమవారమే విశ్వవిద్యాలయానికి వచ్చాను. విద్యార్థులు 20 మంది కూడా లేరు. ఇక్కడ ఉండాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దీంతో హాస్టల్ పూర్తి స్థాయిలో నడిచినప్పుడే వద్దామనుకుంటున్నాను. అంత వరకు మా ఊర్లోనే ఉంటాను.–శివశంకర్, ఇంగ్లిష్ విభాగంవిద్యార్థి, ఆదోని విద్యార్థులంతా హాజరు కావాలి.. నాలుగు రోజుల క్రితం వర్సిటీకి వచ్చాను. విద్యార్థులు పూర్తిస్థాయిలో రాలేదంటూ హాస్టల్లో అన్నం పెట్టడం లేదు. మూడు పూటలా బయట తినడం వల్ల రోజుకు రూ.200 వరకు ఖర్చవుతోంది. తరగతులు ప్రారంభమయ్యాయి కాబట్టి విద్యార్థులందరూ హాజరు కావాలి. నేను కూడా నా స్నేహితులకు ఫోన్ చేసి రావాలని చెబుతున్నాను. – విష్ణుచరణ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం, రామాపురం, అవుకు మండలం -
హాస్టళ్లు లేక అవస్థలు
న్యూఢిల్లీ: ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుంటే తప్ప ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో సీటు సంపాదించడం సాధ్యం కాదు. అంతగా శ్రమించి అడ్మిషన్ సంపాదించిన విద్యార్థులకు కనీస వసతి కల్పించడంలో డీయూ విఫలమయింది. హాస్టళ్లలో తగినన్ని సీట్లు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు పీజీ హాస్టళ్లు లేదా గదులు కిరాయికి తీసుకుంటున్నారు. డీయూకు 15 ఆఫ్-క్యాంపస్ హాస్టళ్లు ఉండగా, తొమ్మిది కాలేజీల్లో వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఐదు కాలేజీల్లో మాత్రమే మహిళలకు వసతి ఉంటుంది. డీయూలో 1.8 లక్షల మంది అండర్గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులు ఉండగా, వీరందరికీ అందుబాటులో ఉన్న హాస్టల్ సీట్లు తొమ్మిది వేలు మాత్రమే. డీయూ ఏటా కొత్తగా 55 వేల మంది విద్యార్థులు చేరుతుంటారు. హాస్టళ్లలో సీటు దొరకడం సాధ్యం కాకపోవడంతో మెజారిటీ విద్యార్థులు ప్రత్యామ్నాయ వసతి వెతుక్కోక తప్పదు. ఫలితంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావడమే గాక, భద్రత కూడా సరిగ్గా లేని ప్రదేశంలో ఉండాల్సి వస్తోందని. ‘భారీగా ఉన్న కటాఫ్ జాబితాల్లో సీటు సంపాదించుకొని కాలేజీలో అడుగుపెడితే హాస్టల్ వసతి లేదు. దాదాపు పక్షం రోజులుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ కిరాయికి గది దొరకలేదు’ అని ఈ ఏడాది డీయూలో చేరిన ఖ్యాతిశర్మ చెప్పింది. డీయూ హాస్టళ్లు కూడా ప్రతిభ ఆధారంగానే సీట్లు ఇస్తాయి. మంచి కాలేజీలోనే కాదు, హాస్టల్ సీటు రావాలన్నా సదరు విద్యార్థులకు భారీగా మార్కులు రావాల్సిందే. అయితే కిరాయి గదులు/హాస్టళ్లలో ఉండే యువతులకు భద్రత ప్రధాన సమస్యగా మారింది. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థినులు హాస్టల్ వసతి కోసం తక్కువ కటాఫ్‌లు ఉన్న కాలేజీల్లో చేరాల్సి వస్తోందని ఇషానీ బెనర్జీ అనే యువతి తెలిపింది. విజయ్‌నగర్, హడ్సన్లేన్, బంగ్లారోడ్డు, కమలానగర్ ప్రాంతాల్లో ప్రైవేటు హాస్టళ్లలో ఒక్కొక్కరికి నెలకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.తొమ్మిది వేల దాకా వసూలు చేస్తున్నారు. ‘మేం వై-ఫై, లాండ్రీ, వంటమనిషి వంటి అన్ని సదుపాయాలూ కల్పిస్తాం కాబట్టి రేట్లు ఎక్కువగానే ఉంటాయి. మేం వ్యాపారం కొనసాగించాలంటే ఈ మాత్రం వసూలు చేయకతప్పదు’ అని హడ్సన్లేన్లో పీజీ హాస్టల్ నిర్వహించే శివానంద్ ఖేరా అన్నారు. డీయూ మరిన్ని హాస్టళ్లు నిర్మించాలనే డిమాండ్‌తో విద్యార్థులు గత ఏడాది ఆందోళనలకు దిగారు. డీయూ యాజమాన్యం హామీ మేరకు ఉద్యమాన్ని విరమించినా, ఇప్పటి వరకు హాస్టళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం లేదని ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థిసంఘం నాయకుడు అన్నారు. డీయూ విద్యార్థుల సంఘం (డూసూ), డీయూ అధ్యాపకుల సంఘం (డూటా), యూనివర్సిటీ విభాగాలు కూడా నూతన హాస్టళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘డీయూలో ఉన్న ఐదుశాతం మంది విద్యార్థులకు కూడా హాస్టళ్లు సరిపోవడం లేదు. వసతి కల్పించాలంటూ విద్యార్థులు ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. కొత్తగా ఒకటిరెండు హాస్టళ్లు నిర్మించినా అవి ఏ మూలకూ చాలవు’ అని డూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ అన్నారు. ఈ విషయమై డీయూ వర్గాలు స్పందిస్తూ కొత్త హాస్టళ్ల కోసం ఇది వరకే ప్రతిపాదనలు పంపామని, ఈ విషయంలో యూనివర్సిటీ నిర్లక్ష్యం ఏదీ లేదని చెప్పాయి. కొత్త హాస్టళ్లు నిర్మించడానికి డీడీఏ, ఉద్యానవనశాఖ వంటి విభాగాల అనుమతి తప్పనిసరని అధికారులు అంటున్నారు. తాము నిధులు కేటాయించినా, నిర్మాణ పనులు మొదలు కావడానికి చాలా సమయం పడుతుందని డీయూ విద్యార్థుల సంక్షేమ విభాగం డీన్ జె.ఎం.ఖురానా అన్నారు.