సాక్షి, అమరావతి: దేశంలో వివిధ ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్ట్స్ కోర్సులవైపే మొగ్గుచూపుతున్నారు. బీఏలో ఏకంగా 1.04 కోట్ల మంది చేరగా ఆ తర్వాత బీఎస్సీలో 49.12 లక్షల మంది, బీకాంలో 43.22 లక్షల మంది చేరారు. ఉన్నతవిద్యా కోర్సుల్లో చేరినవారిలో ఏకంగా 78.9 శాతం మంది అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోర్సుల్లోనే ఉండటం గమనార్హం.
ఇదే సమయంలో పీజీ కోర్సులు చదువుతున్నవారు కేవలం 11.4 శాతానికే పరిమితమయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హాట్ ఫేవరెట్ కోర్సులు అయిన బీటెక్‌లో 23.20 లక్షల మంది చేరగా, బీఈలో 13.42 లక్షల మంది ఉన్నారు. ఈ మేరకు దేశంలోని వివిధ కోర్సుల్లో చేరికలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదిక–2020–21 విడుదల చేసింది.
ఇందులోని గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ కోర్సుల్లో మొత్తం 4,13,80,713 మంది విద్యార్థులు చేరగా.. అందులో 3.26 కోట్ల మంది (78.9 శాతం) యూజీ కోర్సులు చదువుతున్నారు. ఇక పోస్ట్రుగాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో 47.16 లక్షలు (11.4 శాతం) మంది ఉన్నారు. ఇక డిప్లొమా కోర్సుల్లో చేరికలు తక్కువగానే నమోదయ్యాయని.. మొత్తం విద్యార్థుల్లో వీరి సంఖ్య 29.79 లక్షలే (7.2 శాతం)నని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ డిప్లొమా కోర్సుల్లో చేరినవారిలో అత్యధికులు టెక్నికల్, పాలిటెక్నిక్, నర్సింగ్, టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదువుతున్నారు. అలాగే పీజీ డిప్లొమా కోర్సులను కేవలం 2.57 లక్షల మంది మాత్రమే అభ్యసిస్తున్నారు. ఇక సర్టిఫికెట్ కోర్సుల్లో చేరినవారు 1.55 లక్షల మంది మాత్రమేనని ఐష్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం విద్యార్థుల్లో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల వాటా వరుసగా 0.62, 0.38 శాతాలు మాత్రమేనని నివేదిక పేర్కొంది.
బీఏ, బీకాంల్లో మహిళలు.. బీటెక్, బీఈల్లో పురుషులు..
జాతీయ స్థాయిలో పలు కోర్సుల్లో చేరికలను గమనిస్తే ఇంజనీరింగ్ కోర్సుల మినహా దాదాపు మిగిలిన అన్ని కోర్సుల్లోనూ పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీఏలో చేరిన వారిలో 52.7 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇక బీఎస్సీలో 52.2 శాతం, బీకాంలో 48.5 శాతం మంది మహిళలేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రం పురుషులతో పోలిస్తే మహిళల చేరికలు 28.5 శాతమే ఉన్నాయి. పీజీ సోషల్ సైన్సెస్ కోర్సుల్లోనూ 56.5 శాతం చేరికలతో మహిళలదే పైచేయిగా ఉంది. అలాగే పీజీ సైన్స్ కోర్సుల్లో 61.5 శాతం, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో 43.1 శాతం, కామర్స్‌లో 66.5 శాతం మంది మహిళలు ఉన్నారు.
ఎడ్యుకేషన్ విభాగంలోనూ 64.4 శాతంతో మహిళల చేరికలే అధికమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పీహెచ్‌డీ కోర్సుల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగంలో 33.3 శాతమే మహిళల వాటా. పీహెచ్‌డీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీల్లో 48.8 శాతం మంది మహిళలున్నారు.
పీహెచ్‌డీలో పెరిగిన చేరికలు
కాగా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరికలు పెరిగాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2.11 లక్షల మంది పీహెచ్‌డీ కోర్సుల్లో చేరినవారున్నారు. వీరిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో 56,625 మంది ఉన్నారు. ఇక మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ వంటి అంశాల్లో 48,600 మంది పరిశోధనలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు అభ్యసిస్తున్నవారు 2,255 మంది ఉన్నారు.
పీజీలో అత్యధికం ఈ కోర్సుల్లోనే..
దేశంలో పీజీ కోర్సుల్లో చేరినవారిలో అత్యధికంగా 9,41,648 మంది సోషల్ సైన్సు కోర్సులను చదువుతున్నారు. సైన్సు కోర్సులు అభ్యసిస్తున్నవారు 6,79,178 మంది ఉన్నారు. 68,60,001 మంది మేనేజ్‌మెంట్ కోర్సులు చదువుతున్నారు. కామర్స్ కోర్సులో 5,36,560 మంది చేరారు. పీజీ కోర్సుల్లోనే భాషా సంబంధిత కోర్సుల్లో 3,20,176 మంది ఉన్నారు. ఇక ఎడ్యుకేషన్ విభాగం కోర్సులను 2,06,394 మంది చదువుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment