విద్యార్థుల ప్రాణాలు పణంగా పెడతారా? | High Court questioned the government decision to conduct UG and PG examinations | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రాణాలు పణంగా పెడతారా?

Published Fri, Sep 11 2020 1:24 AM | Last Updated on Fri, Sep 11 2020 1:24 AM

High Court questioned the government decision to conduct UG and PG examinations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నగరంలో కోవిడ్‌ కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారా?’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్‌తో సొంతూర్లకు వెళ్లిన విద్యార్థులు హైదరాబాద్‌కు ఎలా రావాలని, ఒకవేళ వచ్చినా వసతి గృహాల్లోకి ప్రవేశం లేదని, అందువల్ల వారు ఎక్కడుండాలని నిలదీసింది. అలాగే సిటీ బస్సు సర్వీసులు లేవని, అలాంటప్పుడు వారు పరీక్షా కేంద్రాలకు ఎలా చేరుకోవాలని ఏజీని ప్రశ్నించింది. కోవిడ్‌ విజృంభిస్తున్నందున ఎంట్రన్స్‌ టెస్ట్‌లతోపాటు యూజీ, పీజీ పరీక్షలనూ ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ–తెలంగాణ శాఖ అధ్యక్షుడు బల్మూరి వెంకట నరసింగరావు, గరీబ్‌ గైడ్‌ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థులు సొంతూర్లకు వెళ్లిపోయారని, ఇప్పుడు పరీక్షలు రాసేందుకు తిరిగి హైదరాబాద్‌కు రావాలనుకున్నా.. రవాణా సౌకర్యాలు లేవని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి.దామోదర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. నగరంలోని హాస్టల్స్‌లోకి ప్రవేశం లేదని, ఇటీవల కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కూడా ఈ నెల 30 వరకు కళాశాలలు, పాఠశాలలు తెరవడానికి వీల్లేదని గుర్తుచేశారు. యూనివర్సిటీ గ్రాం ట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికే 194 విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించాయని, మెజారిటీ వర్సిటీలు ఆన్‌లైన్‌లోనే వాటిని జరిపాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఇటీవల వరకు పరీక్షలు ఉంటాయో లేదో అనే సందే హం ఉందని, అకస్మాత్తుగా పరీక్షలు అంటే వి ద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పారు. గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకే హాజరుకాలేకపోతున్నారని వివరించారు.

మరి ఆన్‌లైన్‌లో పరీక్షలు ఎలా రాస్తారని ధర్మాస నం దామోదర్‌రెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన వివరణ ఇస్తూ అందుకే పరీక్షలను మూడు వారాలు వాయిదా వేసి, విద్యార్థులకు గడువు ఇస్తే పరీక్షలకు సమాయత్తం అవుతారని చెప్పారు. ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేందుకు సమీపంలోని పట్టణాల్లో ఏర్పాట్లు చేసుకుంటారని నివేదించారు. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని ధర్మాసనానికి నివేదించారు. అలా గే ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్‌లైన్‌లో పరీ క్షలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపా రు. ఈ నెల 16 నుంచి ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, వీటిని ఆపే లా ఆదేశించాలని మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి నివేదించా రు. విద్యార్థులు ఒక్క దగ్గర చేరితే వారిని ఆప డం సాధ్యం కాదని, కరచాలనం చేస్తారని, తద్వారా వారికి, వారి తల్లిదండ్రులకు కూడా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందన్నారు.  

ఫుట్‌పాత్‌లపై ఎండలో నిలబడుతున్నారు
‘కామన్‌ ఎంట్రన్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షల కోసం విద్యార్థుల వెంట వచ్చే వారి తల్లిదండ్రులు ఫుట్‌పాత్‌ల మీద ఎండలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. భౌతిక దూరం పాటించకుండా పక్కపక్కనే నిలబడాల్సిన దుస్థితి. వారికి కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నిర్వహించబోయే పరీక్షలకు హాజరుకాలేని వారికి మళ్లీ నిర్వహిస్తారా? వాటిని సప్లిమెంటరీ అని కాకుండా మరోసారి నిర్వహిస్తారా? హాస్టల్స్‌ మూతపడ్డాయి కాబట్టి విద్యార్థులకు వసతి ఎలా కల్పిస్తారు? రవాణా సౌకర్యం ఎలా కల్పిస్తారు? ఇంజనీరింగ్‌ కోర్సులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడానికి అభ్యంతరం ఏంటి?’అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ధర్మాసనం సందేహాలపై ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకొని తెలియజేస్తానని, దీనికి గడువు కావాలని ఏజీ కోరడంతో అనుమతిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement