
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కొత్త నర్సింగ్ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో విద్యార్ధినులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలోనే అడ్మిషన్లు పూర్తయినప్పటికీ, కొత్తగా ఏర్పాటైన 16 కళాశాలలకు గాను 9 చోట్ల ఇప్పటికీ ప్రత్యక్ష బోధన ప్రారంభం కాలేదు. వచ్చే మే–జూన్‌లో నర్సింగ్ మొదటి సంవత్సరం పరీక్షలు జరపాల్సి ఉండగా, విద్యార్థినులు ఆన్‌లైన్‌లో మొక్కుబడిగా పాఠాలు వింటున్నారు.
16 కాలేజీల్లో కాళోజీ వర్సిటీ ద్వారా అడ్మిషన్లు పూర్తికాగా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆయా కళాశాలలకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, టీచింగ్ స్టాఫ్‌ను నియమించింది. అయితే క్లరికల్ స్టాఫ్, నాలుగో తరగతి ఉద్యోగుల నియామకం జరగలేదు. ఆఫీస్ సబార్డినేట్, అటెండర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, క్లర్కులు, వాచ్‌మెన్, వార్డెన్లతో పాటు హౌస్‌కీపింగ్ స్టాఫ్ వంటి మానవ వనరులు కూడా ప్రభుత్వం సమకూర్చకపోవడంతో టీచింగ్ స్టాఫ్ ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో తాత్కాలిక స్టాఫ్
ఏడు కొత్త నర్సింగ్ కళాశాలల్లో ప్రస్తుతం తరగతి గది బోధన సాగుతోంది. నారాయణపేటలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా తాత్కాలిక స్టాఫ్‌ను నియమించి, ఆఫ్‌లైన్ తరగతులు కొనసాగిస్తున్నారు. కొడంగల్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, రామగుండం, జనగామలోని కళాశాలల్లో మెడికల్ కాలేజీలు, జిల్లా కలెక్టర్లు, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లు సమకూర్చిన తాత్కాలిక స్టాఫ్‌తో ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభించారు.
కళాశాలలు ఒకచోట– హాస్టళ్లు మరోచోట – హాస్పిటళ్లు ఇంకోచోట
హడావుడిగా నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసినప్పటికీ, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. తాత్కాలిక పద్ధతిలో కళాశాలలు ఒకచోట ఉంటే, హాస్టళ్లను మరోచోట ఏర్పాటు చేశారు. కాలేజీలు, హాస్టళ్లకు సంబంధం లేకుండా జిల్లా ఆసుపత్రులు ఇంకో చోట ఉన్నాయి. ప్రత్యక్ష బోధన సాగుతున్న ఏడు కళాశాలల్లో కూడా కాలేజీ, హాస్టల్‌కు మధ్య దూరం చాలా ఉండడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు.
డీఎంఈ కార్యాలయం టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్స్‌ను తాత్కాలికంగా అడ్జస్టు చేయడమే తప్ప విద్యార్థులు, ఫ్యాకల్టీ గురించి పట్టించుకోలేదు. ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, ఆందోల్ వంటి ప్రాంతాల్లో ఫ్యాకల్టీ స్థానికంగా నివాసం ఉండే పరిస్థితులు కూడా లేవు. విధులు నిర్వహించేందుకు కూడా భయపడే పరిస్థితి. వరంగల్, మంచిర్యాల నుంచి ఫ్యాకల్టీ ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వెళ్లి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేకపోవడంతో వారి బాధలు వర్ణణాతీతం.
విద్యార్థులు కూడా అంతంతే
సాధారణంగా బీఎస్‌సీ నర్సింగ్‌కు డిమాండ్ ఎక్కువే. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో చేరనివారు నర్సింగ్ విద్య వైపు మొగ్గు చూపుతారు. అయితే, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో సౌకర్యాలు లేకపోవటంతో వాటిల్లో చేరేందుకు విద్యార్థినులు ఇష్టపడటంలేదు. ప్రతి కాలేజీకి 60 సీట్లు కేటాయించగా.. ఆసిఫాబాద్‌లో 39 మంది విద్యార్థులే చేరారు. భూపాలపల్లిలో 45 మంది, ములుగులో 56 మంది ప్రవేశం పొందారు.
కాలేజీల సొంత భవనాల నిర్మాణానికి ప్రతి జిల్లాకు రూ.26 కోట్లు కేటాయించినప్పటికీ.. నారాయణపేట, కొడంగల్ వంటి కొన్ని జిల్లాల్లో మాత్రమే స్థల సేకరణ పూర్తయి నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. అన్ని జిల్లాల్లో కాలేజీ, హాస్టల్ జిల్లా ఆసుపత్రికి సమీపంలో వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తిచేయాలని విద్యార్ధినులు, స్టాఫ్ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment