bsc nursing
-
పీజీ వైద్యవిద్యలో క్లినికల్ కోర్సుల్లో రిజర్వేషన్ 15 నుంచి 20% పెంపు
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటాను క్లినికల్ కోర్సుల్లో 15 నుంచి 20 శాతానికి పెంచుతామని పీహెచ్సీ వైద్యులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బుధవారం పీహెచ్ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చర్చించారు. ఆ వివరాలను మంత్రి కార్యాలయం వెల్లడించింది. కోటాను 15 నుంచి 20 శాతానికి పెంచడంతోపాటు అన్ని కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొంది.భవిష్యత్‌లో కోటాలో మార్పులు చేయాల్సివస్తే ముందు వైద్యులతో చర్చిస్తామన్నట్టు తెలిపింది. సర్వీస్‌లోకి రాకముందు పీజీ చేసినవారికి రెండో పీజీ చేయడానికి ప్రభుత్వం మీద భారం లేకుండా అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఇవే చివరి చర్చలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగీకరించి వైద్యులు సమ్మెను విరమించాలని స్పష్టం చేసింది. అలా కాకుండా జీవో రద్దుచేయాలని మొండిపట్టుతో సమ్మె కొనసాగిస్తే జీవో 85లో ఎటువంటి సవరణలు లేకుండానే పీజీ ప్రవేశాలు చేపడతామని హెచ్చరించింది. ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం 14కు వాయిదా202425 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు వచ్చే నెల (అక్టోబర్) 14 నుంచి ప్రారంభమవుతాయని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రకటించారు. అయితే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) సవరించిన మార్గదర్శకాలను ఎన్ఎంసీ విడుదల చేసిందని, దాని ప్రకారం తరగతుల ప్రారంభం 14కు వాయిదా పడినట్టు వివరించారు.నర్సింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపుబీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నర్సింగ్ విద్యా సంస్థల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధికారెడ్డి తెలిపారు. ఇకపై పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. -
ఏపీ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు
సాక్షి, అమరావతి: జర్మనీలో ఉద్యోగం చేసేందుకు ఎంపికైన 150 మంది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు జులై 10వ తేదీ నుండి టక్ట్ ఇంటర్నేషనల్, ఆక్సిలా అకాడమీ బృందం సంయుక్తంగా జర్మన్ భాషలో రెండు నెలల పాటు శిక్షణనిస్తుందని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ నాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్మనీ భాషలో శిక్షణ పొందిన అనంతరం B1 సర్టిఫికేట్ కు అర్హత సాధించాక జర్మనీలో వీసా పొందేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. 150 మంది అభ్యర్థుల శిక్షణ ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అభ్యర్థులు కేవలం వీసా ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్మన్ భాషా శిక్షణకు ఎంపికైన నర్సులందరికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారిణి బి.నవ్య మాట్లాడుతూ విదేశీ భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా మరిన్ని కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. జర్మనీలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు జర్మన్ భాషా శిక్షణా కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు భాషా వికాసం పెంపొందించుకోవాలన్నారు. టక్ట్ ఇంటర్నేషనల్ సీఈవో రాజ్ సింగ్ మాట్లాడుతూ ఆరుగురు జర్మన్ ట్రైనర్స్ తో సోమవారం నుండి (జులై 10) 150 మంది నర్సులకు జర్మన్ భాషలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై జర్మనీ భాషను నేర్చుకొని బీ1 సర్టిఫికేట్ పొందాలని సూచించారు. జర్మనీకి చేరుకున్న తర్వాత మరో 6 నెలలు మరింత క్షుణ్ణంగా భాషాపరమైన శిక్షణ అందిస్తామని, అనంతరం బీ2 సర్టిఫికేట్ అందుకుంటారని తెలిపారు. జర్మనీకి వెళ్లాక 6 నెలల పాటు భాష నేర్చుకునే అభ్యర్థుల బస మరియు సంబంధిత అవసరాల బాధ్యతను టక్ట్ ఇంటర్నేషనల్ చూసుకుంటుందన్నారు. నర్సింగ్ విభాగానికి చెందిన అభ్యర్థి వల్లి మాట్లాడుతూ క్లయింట్‌ను అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తమకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు వచ్చిన ఈ అవకాశం ముఖ్యమంత్రి దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ, కే.ఎల్ యూనివర్సిటీ అధికారులు, టక్ట్ ఇంటర్నేషనల్ బృందం తదితరులు పాల్గొన్నారు. -
ఈఏపీ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2023కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుల సమర్పణకు అపరాధ రుసుం లేకుండా చివరి గడువైన ఏప్రిల్ 15వ తేదీ నాటికే గత ఏడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు మించి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. ఆ తరువాత కూడా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటికి దరఖాస్తుల సంఖ్య 3,37,500కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే.. 12 శాతం మేర అభ్యర్థుల సంఖ్య పెరుగుతోందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌తో పాటు అగ్రికల్చర్ స్ట్రీమ్‌లోనూ దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా దాఖలయ్యాయి. గత ఏడాది రూ.10 వేల అపరాధ రుసుంతో చివరి గడువు నాటికి మొత్తం దరఖాస్తులు 2.90 లక్షల వరకు మాత్రమే రాగా.. ఈసారి ఎక్కువగా దాఖలు అయ్యాయి. అపరాధ రుసుంతో 14 వరకు గడువు అపరాధ రుసుం రూ.వెయ్యితో ఈ నెల 5వ తేదీ వరకు గడువు ఉండగా.. రూ.5 వేల అపరాధ రుసుంతో మే 12 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు గడువు విధించారు. మే 15వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు పెద్దఎత్తున దరఖాస్తులు అందడంతో పరీక్ష కేంద్రాల సంఖ్య, సీటింగ్ పరిస్థితిని అనుసరించి పరీక్షల షెడ్యూల్‌ను ఒకరోజు అదనంగా ఇంతకు ముందే పొడిగించారు. వాస్తవానికి 15 నుంచి 18 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున మొత్తం 8 సెషన్లలో పరీక్షలను ముగించాలని ముందు భావించారు. అయితే, దరఖాస్తుల సంఖ్య పెరగడంతో పరీక్ష రాసేందుకు ఏర్పాటైన కంప్యూటర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థులను సర్దుబాటు చేసినా ఇంకా అదనంగా వేలాది మంది అభ్యర్థులు మిగిలి ఉంటున్నారు. ఈ తరుణంలో పరీక్షలను మరో రోజుకు కూడా పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో గతంలో 80వేల వరకు దరఖాస్తులు అందగా.. ఈసారి వాటి సంఖ్య 96 వేలకు చేరుకుంది. అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలను మే 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. కాగా, ఈఏపీ సెట్లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కలి్పంచి ర్యాంకులను ఇవ్వనున్నారు. బీఎస్సీ నర్సింగ్ సీట్లూ ఈఏపీ సెట్ ద్వారానే భర్తీ ఇప్పటివరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా భర్తీ అవుతున్న బీఎస్సీ నర్సింగ్ సీట్లను కూడా 2023–24 విద్యాసంవత్సరం నుంచి ఈఏపీ సెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. దీంతో ఈ సీట్ల కోసం పోటీపడే విద్యార్థులు కూడా ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరుకానున్నారు. -
461 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బుధవారం నుంచి డిసెంబర్ 5 వరకు http://cfw.ap.nic.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా వైద్య, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 42 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్మెన్లకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయోపరిమితి నుంచి సడలింపు ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.300గా నిర్దేశించారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వైద్య శాఖ తెలిపింది. కోవిడ్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ తదితర ఇతర వెయిటేజ్‌లు వర్తిస్తాయని పేర్కొంది. భవిష్యత్‌లో ఖాళీ అయ్యే నర్సింగ్ పోస్టుల భర్తీకి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావివ్వకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2019 నుంచి 46 వేలకు పైగా పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంట్రాక్ట్ పద్ధతిలో 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. -
ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీకి తొలి దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయింది. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. యాజమాన్య కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న 3,021 మందితో తుది మెరిట్ జాబితా విడుదల చేయగా ఇందులో 1,042 మందికి సీట్లు కేటాయించారు. తొలి దశలోనే బీ కేటగిరీ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇందులో 233 సీట్లలో ఏపీతో పాటు, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించారు. మిగిలిన 809 సీట్లలో కేవలం ఏపీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు లభించాయి. బీఎస్సీ నర్సింగ్‌లో నేటి నుంచి వెబ్ ఆప్షన్లు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌కు బుధవారం నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. https://ugpostbasic.ntruhs admi ssions.com వెబ్సైట్లో తుది జాబితాలో పేర్లు న్న విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఇదిలా ఉండగా నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్లకు అనుమతులు లభించాయి. రిపోర్ట్ చేయని వారు 208 మంది.. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,289 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 208 మంది విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదు. వీరి వివరాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. -
నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకోసం నర్సింగ్ సెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లేఖ రాసింది. ఇంజనీరింగ్, మెడిసిన్ తరహాలోనే నర్సింగ్ విద్యలోనూ ప్రమాణాలు పెంచడానికి నీట్ లేదా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ 2020లోనే నిర్ణయించింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచే నర్సింగ్ సెట్ నిర్వహించాల్సి ఉన్నా అప్పట్లో కరోనాతో మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి కూడా మినహాయింపు కోసం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ప్రయత్నించగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిరాకరించింది. దీంతో ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని కోరుతూ వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి సుమారు 200 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలు ఉండగా 12 వేల వరకు సీట్లు ఉన్నాయి. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏపీలో నర్సింగ్ కోర్సులు చేయడానికి వస్తుంటారు. నాలుగేళ్ల నర్సింగ్ కోర్సులో ఇప్పటివరకు ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈఏపీసెట్, నీట్ ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు చేపట్టడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈఏపీసెట్ దరఖాస్తుకు సమయం ముగిసింది. మరోవైపు నీట్ స్కోర్ ఆధారంగానూ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అవకాశం కల్పించింది. అయితే నీట్‌కు కూడా దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి ప్రత్యేకంగా నర్సింగ్ సెట్‌ను నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వంద మార్కులకు పరీక్ష నాలుగేళ్ల నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నర్సింగ్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ల్లో 20 మార్కుల చొప్పున ప్రశ్నలిస్తారు. జనరల్ విద్యార్థులు కనీసం 50, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 40, దివ్యాంగులు (జనరల్) 45, దివ్యాంగులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) 40 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు చేపడతారు. ఈ ఏడాదికి నర్సింగ్ సెట్ ద్వారా కన్వీనర్ కోటా సీట్లను, నీట్ యూజీ ద్వారా యాజమాన్యం కోటా సీట్లను భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఈఏపీసెట్ ద్వారా ప్రవేశాలు ఈ విద్యా సంవత్సరానికి నర్సింగ్ ప్రవేశాల కోసం నర్సింగ్ సెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశాం. 2023–24 నుంచి ఈఏపీసెట్ ద్వారా నర్సింగ్ ప్రవేశాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశాం. – డాక్టర్ కె.శంకర్, రిజిస్ట్రార్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం -
ఇక ఎంసెట్ ద్వారా నర్సింగ్ కోర్సులో ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడినట్టు చెప్పారు. ఈ విధానం 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించారు. మండలి కార్యాలయంలో లింబాద్రి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)తో పనిలేదని పేర్కొంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గద ర్శకాలు విడుదల చేసిందని, రాష్ట్రాల ఇష్టానుసారం వివిధ పరీక్షల ద్వారా ప్రవేశాలు చేపట్టవచ్చని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ర్యాంకుల ద్వారా ఆయా సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్ల నర్సింగ్ కోర్సులో ఇప్పటివరకు ఇంటర్ (బైపీసీ) మార్కులను బట్టి ప్రవేశం కల్పించేవారని చైర్మన్ వివరించారు. మే 28 వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 28 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగానికి, బైపీసీ చేసిన వారు అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులు అందరికీ ఒకే పరీక్ష ఉంటుందని, ర్యాంకులు ప్రకటించిన తర్వాత వారు నర్సింగ్ కోర్సును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని లింబాద్రి తెలిపారు. ఎంసెట్ దరఖాస్తు గడువు మే 28 వరకూ ఉన్నందున ఇందుకోసం ప్రత్యేకంగా గడువు పొడిగించాల్సిన అవసరం లేదని చెప్పారు. ర్యాంకులు ప్రకటించిన తర్వాత సంబంధిత కాలేజీలు ప్రవేశ ప్రక్రియ మొదలు పెడతాయని వివరించారు. నర్సింగ్‌లో 5,300 సీట్లు రాష్ట్రవ్యాప్తంగా 81 నర్సింగ్ కాలేజీలున్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు 9 అయితే, 81 ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 4,620 సీట్లు కలిపి మొత్తం 5,300 ఉన్నాయని మండలి ప్రకటించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. నర్సింగ్ కోర్సుల్లో మాత్రం ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 60 శాతం కన్వీనర్, 40 శాతం మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా, ఇతర రిజర్వేషన్లన్నీ నిబంధనల ప్రకారమే అమలు చేస్తామని, దీనికి సంబంధించిన నియమ నిబంధనలను పరిశీలిస్తున్నామని లింబాద్రి తెలిపారు. -
తానే జీత ఇస్తానని యువతికి హామీ ఇచ్చిన మంత్రి పేర్నినాని
-
నర్సింగ్ సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వండి
బరంపురం ఒరిస్సా : బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని విద్యార్థి సంఘం ప్రతినిధి జితిన్ సింగ్‌దేవ్ కోరారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం స్థానిక ఉత్కళ్ ఆశ్రమ రోడ్ ప్రాంగణంలో గల గంజాం కళాపరిషత్ సమావేశం హాల్లో ఎంకేసీజీ మెడికల్ కళాశాల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల సంఘం, ఆలిం డియా డీఎస్ఓ సయుక్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం ప్రతినిధి జితిన్ సింగ్‌దేవ్ మాట్లాడుతూ గత 2017–18 పాస్ ఔట్ అయిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల సర్టిఫికెట్లను మూడు నెలలు గడుస్తున్నా కూడా కళాశాల ప్రిన్సిపాల్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ, ఇతర పై చదులువు చదివేందుకు జాయిన్ వ్యవధి గడిచిపోతున్నా కూడా తమ సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమను మానసికంగా వేదనకు గురి చేస్తున్నట్లు ఆందోళన వెలిబుచ్చారు. సర్టిఫికెట్లు దొరకనందున ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోలేకపోతున్నామని వాపోయారు. రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఎంకేసీజీ మెడికల్ కళాశాల క్యాంపస్‌లో ఉండగా పర్లాకిమిడిలో ప్రైవేట్ నర్సింగ్ కళాశాల ఉందని ఈ రెండు నర్సింగ్ కళాశాలలు బరంపురం విశ్వ విద్యాలయం అధీనంలో ఉన్నాయని చెప్పారు. అయితే ఈ రెండు కళాశాలల 2017–18 నర్సింగ్ విద్యార్థులకు మే నెలలో బరంపురం విశ్వవిద్యాలయం సర్టిఫికెట్లు ఇచ్చిందని, పర్లాకిమిడిలో ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదివిన 2017–18 విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వగా ఎంకేసీజీలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల 3 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు తమ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బరంపురం సబ్‌కలెక్టర్, కలెక్టర్, రాష్ట్ర మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చినా ఫలితం లేకపోయిందని చివరికి మీడియా ముందుకు రావలసి వచ్చిందని చెప్పారు. డీఎస్ఓ రాష్ట్ర కన్వీనర్ సోమనాథ్ బెహరా మాట్లాడుతూ వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ దృష్టి సారించి నర్సరీ విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వాలని లేనిపక్షంలో డీఎస్ఓ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు శివాని మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
'బీఎస్సీ నర్సింగ్' నోటిఫికేషన్ జారీలో జాప్యం
ఆందోళనలో వేలాదిమంది విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు ఇంకా నోటిఫికేషన్ జారీ కాలేదు. నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో నర్సింగ్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో 68 నర్సింగ్ కాలేజీలున్నాయి. వాటిల్లో ఐదు ప్రభుత్వ కాలేజీలున్నాయి. దాదాపు 2 వేల సీట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇంటర్మీడియెట్ సైన్స్ గ్రూపు పూర్తి చేసినవారు బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు అర్హులు. ఇంటర్ పూర్తయి అనేకమంది వివిధ కోర్సుల్లో చేరిపోయారు. కానీ బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలనుకునేవారు మాత్రం నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలావరకు నర్సింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తుండగా రాష్ట్రంలో ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌లో సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేయాల్సిందిగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ లేఖ రాయకపోవడం వల్లే స్తబ్దత నెలకొందని పలువురు విద్యార్థులు అంటున్నారు. ప్రతీ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే నర్సింగ్ కోర్సుల భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తయి, నవంబర్లోనే తరగతులు ప్రారంభమవుతాయని సామాజిక కార్యకర్త పుల్లా భాస్కర్‌రావు అంటున్నారు. ఇప్పటికైనా నోటిఫికేషన్ జారీచేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
పారా మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ: బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజియోథెరపీ), బీఎస్సీ (ఎంఎల్టీ) కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 5 ఆన్లైన్ కేంద్రాల్లో శుక్రవారం తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిరోజు ఒకటి నుంచి 2,800 ర్యాంకు వరకు బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పిలిచారు. రాత్రి 8.30 వరకు 1,400 ర్యాంకు వరకే కౌన్సెలింగ్ జరిగింది. ఐదు (విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్) కేంద్రాల్లో జరుగుతుండడంతో అభ్యర్థులు సీట్లు ఎంపిక చేసుకునే విషయంలో ఆలస్యమవుతోంది. ఓపెన్, రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు సమాంతరంగా కౌన్సెలింగ్ జరుగుతోంది. శనివారం జరిగే కౌన్సెలింగ్‌కు 2,801 నుంచి చివరి మెరిట్ ఆర్డర్ వరకు అభ్యర్థులను పిలిచారు. -
స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీలో జాప్యం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు పద్ధతిపై స్టాఫ్‌నర్సులుగా పనిచేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గత ఏడాది డిసెంబర్ 8న 50 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియెట్, జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేసి నర్సింగ్ కౌన్సిల్లో తమ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తులు పూర్తిచేసి ఇచ్చేందుకు గత ఏడాది డిసెంబర్ 21 తుది గడువుగా ప్రకటించారు. మొత్తం 50 పోస్టులకు గానూ 650 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక విధానాన్ని ప్రకటించని అధికారులు పోస్టుల ఎంపిక ప్రకటనలో ఎంపిక విధానాన్ని అధికారులు పేర్కొనలేదు. ఇదే అక్రమార్కులు, అవినీతిపరులకు ఊతమిచ్చింది. పోస్టులిప్పిస్తామంటూ అమాయకులైన అభ్యర్థుల నుంచి లక్షల్లో దోచుకుంటున్నారు. ఈ పోస్టుల ఎంపికలో అభ్యర్థులు అర్హత పరీక్షలో అంటే జీఎస్‌ఎంలో సాధించిన మార్కులు, అర్హత పరీక్ష పూర్తయిన అనంతరం సీనియారిటీకి ఒక్కో సంవత్సరానికి ఒక్కో మార్కు చొప్పున గరిష్టంగా పదేళ్లకు పది మార్కుల చొప్పున కేటాయిస్తారు. అయితే ఈ విషయాన్ని ప్రకటనలో తెలపకపోవడంతో కొందరు పోస్టులు ఇప్పిస్తామని బేరాలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 6వ తేదీన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని నోటీసుబోర్డులో ఉంచారు. దాదాపు 18 మంది అభ్యర్థుల వరకు తమకు సంబంధించిన జాబితాలో పొరపాట్లు జరిగాయని, మార్పులు చేయాలని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థుల జాబితా కంప్యూటరైజ్ చేసిన అనంతరం ఏ అభ్యర్థికి మెరిట్ ఉందో తెలుసుకుని, ఎవరికైతే ఉద్యోగం వస్తుందో అటువంటి అభ్యర్థులకు ఫోన్ చేసి మూడు లక్షలిస్తే పోస్టు మీకే ఇప్పిస్తామని కొందరు బేరాలాడుతున్నారు. వైద్య సిబ్బంది పాత్ర లేనిదే అభ్యర్థుల జాబితా బయట వ్యక్తులకు చేరే అవకాశం లేదు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి చెందిన గ్రూపు నంబర్ నుంచే ఈ కాల్స్ వెళ్లడం గమనార్హం. ఈ విషయం డీఎంహెచ్ఓ దృష్టికి వెళ్లినా..ప్రాథమిక విచారణ సైతం చేయలేదు. ఏ సెల్ నంబర్ ఏ సిబ్బందికి కేటాయించారో..అధికారుల వద్ద జాబితా ఉంటుంది. ఈ జాబితా పరిశీలిస్తే ఏ సిబ్బంది సెల్ నంబరు నుంచి అభ్యర్థులకు ఫోన్ వెళ్లిందో తెలిసిపోతుంది. అయినా దాని గురించి పట్టించుకోలేదు. ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను రెండోసారి అధికారులతో పరిశీలించి సవరణలుంటే సరి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. దీంతో జాబి తాను పరిశీలించిన అధికారులు మరో డజను వరకూ తప్పులు దొర్లినట్లు డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థులు ఎవరి మాటలూ నమ్మొద్దు ఆర్ రామతులశమ్మ, డీఎంహెచ్‌వో ఎంపిక ప్రక్రియ చూసే క్లర్క్ సమ్మెలో ఉండటం వల్ల కొద్దిరోజులు జాప్యం జరిగింది. ప్రస్తుతం ఫైల్ తయారైంది. ఉన్నతాధికారులకు పంపుతున్నాం. మా కార్యాలయం నుంచి అభ్యర్థులకు ఫోన్ చేసిన విషయంపై సిబ్బందిని ప్రశ్నించాం. అయితే ఎవరూ తాము చేశామని చెప్పలేదు. అభ్యర్థులు ఎవరి మాటలూ నమ్మవద్దు. త్వరలోనే ఎంపిక పూర్తిచేస్తాం.