సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటాను క్లినికల్ కోర్సుల్లో 15 నుంచి 20 శాతానికి పెంచుతామని పీహెచ్‌సీ వైద్యులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బుధవారం పీహెచ్ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చర్చించారు. ఆ వివరాలను మంత్రి కార్యాలయం వెల్లడించింది. కోటాను 15 నుంచి 20 శాతానికి పెంచడంతోపాటు అన్ని కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొంది.
భవిష్యత్‌లో కోటాలో మార్పులు చేయాల్సివస్తే ముందు వైద్యులతో చర్చిస్తామన్నట్టు తెలిపింది. సర్వీస్‌లోకి రాకముందు పీజీ చేసినవారికి రెండో పీజీ చేయడానికి ప్రభుత్వం మీద భారం లేకుండా అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఇవే చివరి చర్చలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగీకరించి వైద్యులు సమ్మెను విరమించాలని స్పష్టం చేసింది. అలా కాకుండా జీవో రద్దుచేయాలని మొండిపట్టుతో సమ్మె కొనసాగిస్తే జీవో 85లో ఎటువంటి సవరణలు లేకుండానే పీజీ ప్రవేశాలు చేపడతామని హెచ్చరించింది.
ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం 14కు వాయిదా
202425 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు వచ్చే నెల (అక్టోబర్) 14 నుంచి ప్రారంభమవుతాయని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రకటించారు. అయితే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) సవరించిన మార్గదర్శకాలను ఎన్‌ఎంసీ విడుదల చేసిందని, దాని ప్రకారం తరగతుల ప్రారంభం 14కు వాయిదా పడినట్టు వివరించారు.
నర్సింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు
బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నర్సింగ్ విద్యా సంస్థల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధికారెడ్డి తెలిపారు. ఇకపై పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment