స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీలో జాప్యం | The delay in recruitment for the posts of Staff Nurse | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీలో జాప్యం

Published Thu, Feb 27 2014 5:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

The delay in recruitment for the posts of Staff Nurse

ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల ఆరోగ్య కేంద్రాల్లో   కాంట్రాక్టు పద్ధతిపై స్టాఫ్‌నర్సులుగా పనిచేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గత ఏడాది డిసెంబర్ 8న 50 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియెట్, జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేసి నర్సింగ్ కౌన్సిల్‌లో తమ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తులు పూర్తిచేసి ఇచ్చేందుకు గత ఏడాది డిసెంబర్ 21 తుది గడువుగా ప్రకటించారు. మొత్తం 50 పోస్టులకు గానూ 650 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు  చేసుకున్నారు.

 ఎంపిక విధానాన్ని ప్రకటించని అధికారులు
 పోస్టుల ఎంపిక ప్రకటనలో ఎంపిక విధానాన్ని అధికారులు పేర్కొనలేదు. ఇదే అక్రమార్కులు, అవినీతిపరులకు ఊతమిచ్చింది. పోస్టులిప్పిస్తామంటూ అమాయకులైన అభ్యర్థుల నుంచి లక్షల్లో దోచుకుంటున్నారు. ఈ పోస్టుల ఎంపికలో అభ్యర్థులు అర్హత పరీక్షలో అంటే జీఎస్‌ఎంలో సాధించిన మార్కులు, అర్హత పరీక్ష పూర్తయిన అనంతరం సీనియారిటీకి ఒక్కో సంవత్సరానికి ఒక్కో మార్కు చొప్పున గరిష్టంగా పదేళ్లకు పది మార్కుల చొప్పున కేటాయిస్తారు. అయితే ఈ విషయాన్ని ప్రకటనలో తెలపకపోవడంతో కొందరు పోస్టులు ఇప్పిస్తామని బేరాలాడుతున్నారు.

   ఈ నేపథ్యంలోనే జనవరి 6వ తేదీన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని నోటీసుబోర్డులో ఉంచారు. దాదాపు 18 మంది అభ్యర్థుల వరకు తమకు సంబంధించిన జాబితాలో పొరపాట్లు జరిగాయని, మార్పులు చేయాలని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థుల జాబితా కంప్యూటరైజ్ చేసిన అనంతరం ఏ అభ్యర్థికి మెరిట్ ఉందో తెలుసుకుని, ఎవరికైతే ఉద్యోగం వస్తుందో అటువంటి అభ్యర్థులకు ఫోన్ చేసి మూడు లక్షలిస్తే పోస్టు మీకే ఇప్పిస్తామని కొందరు బేరాలాడుతున్నారు. వైద్య సిబ్బంది పాత్ర లేనిదే అభ్యర్థుల జాబితా బయట వ్యక్తులకు చేరే అవకాశం లేదు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి చెందిన గ్రూపు నంబర్ నుంచే ఈ కాల్స్ వెళ్లడం గమనార్హం. ఈ విషయం డీఎంహెచ్‌ఓ దృష్టికి వెళ్లినా..ప్రాథమిక విచారణ సైతం చేయలేదు. ఏ సెల్ నంబర్ ఏ సిబ్బందికి కేటాయించారో..అధికారుల వద్ద జాబితా ఉంటుంది. ఈ జాబితా పరిశీలిస్తే ఏ సిబ్బంది సెల్ నంబరు నుంచి అభ్యర్థులకు ఫోన్ వెళ్లిందో తెలిసిపోతుంది. అయినా దాని గురించి పట్టించుకోలేదు.

 ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్
 ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను రెండోసారి అధికారులతో పరిశీలించి సవరణలుంటే సరి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. దీంతో జాబి తాను పరిశీలించిన అధికారులు మరో డజను వరకూ తప్పులు దొర్లినట్లు డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకొచ్చారు.

 అభ్యర్థులు ఎవరి మాటలూ నమ్మొద్దు ఆర్ రామతులశమ్మ, డీఎంహెచ్‌వో
 ఎంపిక ప్రక్రియ చూసే క్లర్క్ సమ్మెలో ఉండటం వల్ల కొద్దిరోజులు జాప్యం జరిగింది. ప్రస్తుతం ఫైల్ తయారైంది. ఉన్నతాధికారులకు పంపుతున్నాం. మా కార్యాలయం నుంచి అభ్యర్థులకు ఫోన్ చేసిన విషయంపై సిబ్బందిని ప్రశ్నించాం. అయితే ఎవరూ తాము చేశామని చెప్పలేదు. అభ్యర్థులు ఎవరి మాటలూ నమ్మవద్దు. త్వరలోనే ఎంపిక పూర్తిచేస్తాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement