ఆందోళనలో వేలాదిమంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు ఇంకా నోటిఫికేషన్ జారీ కాలేదు. నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో నర్సింగ్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో 68 నర్సింగ్ కాలేజీలున్నాయి. వాటిల్లో ఐదు ప్రభుత్వ కాలేజీలున్నాయి. దాదాపు 2 వేల సీట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇంటర్మీడియెట్ సైన్స్ గ్రూపు పూర్తి చేసినవారు బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు అర్హులు. ఇంటర్ పూర్తయి అనేకమంది వివిధ కోర్సుల్లో చేరిపోయారు. కానీ బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలనుకునేవారు మాత్రం నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
దేశవ్యాప్తంగా చాలావరకు నర్సింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తుండగా రాష్ట్రంలో ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌లో సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేయాల్సిందిగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ లేఖ రాయకపోవడం వల్లే స్తబ్దత నెలకొందని పలువురు విద్యార్థులు అంటున్నారు. ప్రతీ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే నర్సింగ్ కోర్సుల భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తయి, నవంబర్‌లోనే తరగతులు ప్రారంభమవుతాయని సామాజిక కార్యకర్త పుల్లా భాస్కర్‌రావు అంటున్నారు. ఇప్పటికైనా నోటిఫికేషన్ జారీచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.