International Level Employment Opportunities For The Youth Of Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు

Published Thu, Jul 6 2023 7:09 PM | Last Updated on Thu, Jul 6 2023 7:36 PM

International Level Employment Opportunities For The Youth Of AP - Sakshi

సాక్షి, అమరావతి:  జర్మనీలో ఉద్యోగం చేసేందుకు ఎంపికైన 150 మంది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు జులై 10వ తేదీ నుండి టక్ట్ ఇంటర్నేషనల్, ఆక్సిలా అకాడమీ బృందం సంయుక్తంగా జర్మన్ భాషలో రెండు నెలల  పాటు శిక్షణనిస్తుందని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ నాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్మనీ భాషలో శిక్షణ పొందిన అనంతరం B1 సర్టిఫికేట్ కు అర్హత సాధించాక జర్మనీలో వీసా పొందేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. 150 మంది అభ్యర్థుల శిక్షణ ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అభ్యర్థులు కేవలం వీసా ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్మన్ భాషా శిక్షణకు ఎంపికైన నర్సులందరికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారిణి బి.నవ్య మాట్లాడుతూ విదేశీ భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా మరిన్ని కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు.  జర్మనీలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు జర్మన్ భాషా శిక్షణా కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.  విద్యార్థులు భాషా వికాసం పెంపొందించుకోవాలన్నారు. 

టక్ట్ ఇంటర్నేషనల్ సీఈవో రాజ్ సింగ్  మాట్లాడుతూ ఆరుగురు జర్మన్ ట్రైనర్స్ తో  సోమవారం నుండి (జులై 10) 150 మంది నర్సులకు జర్మన్ భాషలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై జర్మనీ భాషను నేర్చుకొని బీ1 సర్టిఫికేట్ పొందాలని సూచించారు. జర్మనీకి చేరుకున్న తర్వాత మరో 6 నెలలు మరింత క్షుణ్ణంగా భాషాపరమైన శిక్షణ అందిస్తామని, అనంతరం బీ2 సర్టిఫికేట్ అందుకుంటారని తెలిపారు. జర్మనీకి వెళ్లాక 6 నెలల పాటు భాష నేర్చుకునే అభ్యర్థుల బస మరియు సంబంధిత అవసరాల బాధ్యతను టక్ట్ ఇంటర్నేషనల్ చూసుకుంటుందన్నారు.

నర్సింగ్ విభాగానికి చెందిన అభ్యర్థి వల్లి మాట్లాడుతూ క్లయింట్‌ను అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తమకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు వచ్చిన ఈ అవకాశం ముఖ్యమంత్రి దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో  నైపుణ్యాభివృద్ధి సంస్థ, కే.ఎల్ యూనివర్సిటీ అధికారులు, టక్ట్ ఇంటర్నేషనల్ బృందం తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement