నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష | Special examination for admissions in nursing courses | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష

Published Fri, Jun 17 2022 5:57 AM | Last Updated on Fri, Jun 17 2022 2:30 PM

Special examination for admissions in nursing courses - Sakshi

సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకోసం నర్సింగ్‌ సెట్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ లేఖ రాసింది. ఇంజనీరింగ్, మెడిసిన్‌ తరహాలోనే నర్సింగ్‌ విద్యలోనూ ప్రమాణాలు పెంచడానికి నీట్‌ లేదా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ 2020లోనే నిర్ణయించింది.

2021–22 విద్యా సంవత్సరం నుంచే నర్సింగ్‌ సెట్‌ నిర్వహించాల్సి ఉన్నా అప్పట్లో కరోనాతో మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి కూడా మినహాయింపు కోసం ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం ప్రయత్నించగా ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నిరాకరించింది. దీంతో ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని కోరుతూ వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి సుమారు 200 బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలలు ఉండగా 12 వేల వరకు సీట్లు ఉన్నాయి. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏపీలో నర్సింగ్‌ కోర్సులు చేయడానికి వస్తుంటారు. నాలుగేళ్ల నర్సింగ్‌ కోర్సులో ఇప్పటివరకు ఇంటర్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. 

ఈఏపీసెట్, నీట్‌ ఉన్నప్పటికీ..
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఈఏపీసెట్‌)ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్‌ ద్వారానే బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు చేపట్టడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈఏపీసెట్‌ దరఖాస్తుకు సమయం ముగిసింది. మరోవైపు నీట్‌ స్కోర్‌ ఆధారంగానూ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ అవకాశం కల్పించింది. అయితే నీట్‌కు కూడా దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి ప్రత్యేకంగా నర్సింగ్‌ సెట్‌ను నిర్వహించాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  

వంద మార్కులకు పరీక్ష
నాలుగేళ్ల నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నర్సింగ్‌ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ల్లో 20 మార్కుల చొప్పున ప్రశ్నలిస్తారు. జనరల్‌ విద్యార్థులు కనీసం 50, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 40, దివ్యాంగులు (జనరల్‌) 45, దివ్యాంగులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) 40 పర్సంటైల్‌ సాధించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు చేపడతారు. ఈ ఏడాదికి నర్సింగ్‌ సెట్‌ ద్వారా కన్వీనర్‌ కోటా సీట్లను, నీట్‌ యూజీ ద్వారా యాజమాన్యం కోటా సీట్లను భర్తీ చేస్తారు.  

వచ్చే ఏడాది నుంచి ఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశాలు
ఈ విద్యా సంవత్సరానికి నర్సింగ్‌ ప్రవేశాల కోసం నర్సింగ్‌ సెట్‌ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశాం. 2023–24 నుంచి ఈఏపీసెట్‌ ద్వారా నర్సింగ్‌ ప్రవేశాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశాం.
– డాక్టర్‌ కె.శంకర్, రిజిస్ట్రార్‌ ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement