Nursing course
-
ఎంసెట్ పరిధిలోకి నర్సింగ్ కోర్సులు
సాక్షి హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్ కోర్సు సీట్లను ఈ ఏడాది ఎంసెట్ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు. ఈ విషయాన్ని ఎంసెట్ నోటిఫికేషన్లో పొందుపరచనుండగా, నర్సింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీచేయాలని 2021లో నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాలిచ్చింది. దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలు వచ్చేసరికే ప్రవేశాలు పూర్తికావడంతో ఆ ఒక్క ఏడాది మినహాయింపునిచ్చింది. 2022లో ఎంసెట్‌లో చేర్చినా.. సీట్లు నిండకపోవడంతో ఎంసెట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండానే మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీచేశారు. తాజాగా ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన తరుణంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ఇటీవలే ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రికి లేఖ రాశారు. ఎంసెట్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సును సైతం చేర్చాలని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 85 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680, ప్రైవేట్ కాలేజీల్లో సుమారు 5వేల సీట్లున్నాయి. ఈ సీట్లను ఎంసెట్ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు. -
మేల్ నర్సులకు పెరుగుతున్న డిమాండ్.. ఆ ఒక్కటి మినహా అన్ని విభాగాల్లోనూ..
సాక్షి, కరీంనగర్: ‘నర్స్’... ఈ పదం వినగానే ఆస్పత్రుల్లో తెల్లని దుస్తులు ధరించి, నెట్టిన టోపి పెట్టుకున్న సిస్టర్సే అందరికీ గుర్తుకొస్తారు. కానీ, నర్స్ అంటే సిస్టర్స్ మాత్రమే కాదు... బ్రదర్స్ కూడా ఉంటారని చాలా తక్కువ మందికి తెలుసు. స్త్రీలకే ప్రత్యేకమనిపించే నర్సింగ్ రంగంలో పురుషులు కూడా రాణిస్తున్నారు. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా నర్సింగ్ కళాశాల్లో ప్రభుత్వం పురుషులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో మేల్నర్సుల సేవలు విస్తరిస్తున్నాయి. మెటర్నిటీ మినహా అన్ని విభాగాల్లో బ్రదర్స్ సేవలందిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల వీరిని నర్సింగ్ ఆఫీసర్స్ అని కూడా పిలుస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం బ్రదర్ అంటూ పిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో విశేష సేవలందిస్తున్న నర్సింగ్ బ్రదర్స్‌పై సండే స్పెషల్..!! అన్ని ఆస్పత్రుల్లో మేల్ నర్సులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 500 వరకు ప్రయివేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో మూడు వేల మంది వరకు ఫిమేల్ నర్సులు పనిచేస్తుండగా.. 450మంది వరకు మేల్ నర్సులు ఉన్నారు. వీరు ఎమర్జెన్సీ విభాగంలో, అత్యవసర పేషెంట్ల వద్ద విధులు నిర్వహిస్తుంటారు. రాత్రి డ్యూటీల్లో ఎక్కువగా బ్రదర్సే ఉంటారు. కరోనా సమయంలో ఐసోలేషన్ వార్డుల్లో ఫిమేల్ నర్సులతో పాటు మేల్నర్సులు తప్పనిసరి డ్యూటీలు చేయడం కనిపించింది. కరీంనగర్ జిల్లాలో 320మంది బ్రదర్స్ పనిచేస్తుండగా.. మేల్ నర్సింగ్ విద్యార్థులు 380 మంది చదువుతున్నారు. రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐదుగురు బ్రదర్స్ సేవలందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా మరో 50మంది, జగిత్యాల జిల్లాలో 15మంది, సిరిసిల్లలో 25 మంది వరకు సేవలందిస్తున్నారు. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లలో సహాయకులుగా ఎక్కువశాతం మేల్ నర్సులనే వైద్యులు ఉపయోగిస్తుంటారు. ఇటీవల వీఐపీల కాన్వాయ్ల్లోనూ మేల్నర్సులకే ప్రాధాన్యం ఉంటోంది. నర్సింగ్ వృత్తికి విదేశాలలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డిమాండ్ కారణంగా పురుషులను నియమించుకోవడం మరింత కీలకంగా మారింది. దీంతో ఎక్కువమంది ఈ కోర్సు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మామయ్య సూచనతో మాది ములుగు జిల్లా యేసునగర్ గ్రామం. ఇంటర్ తరువాత నర్సింగ్ కోర్సు చేస్తే బాగుంటుందని మా మేనమామ సూచించాడు. తానూ పర్కాలలోని సివిల్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. జీఎన్ఎం కోర్సు 2021 వరకు చదివాను. జీఎన్ఎం కాంట్రాక్ట్ పద్ధతిలో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూ కేంద్రంలో పనిచేస్తున్నా. నవజాత శిశువులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నెలరోజులపాటు నిలోఫర్ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చారు. – లంకదాసరి నవీన్‌కుమార్, జీఎన్ఎం, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సివిల్స్ కొట్టాలనుకున్నా మాది వరంగల్. నాన్న సత్యనారాయణ పరకాలలో ఏఎస్సై. సివిల్స్ జాబ్ కొట్టాలని ప్రిపేర్ అయ్యా. జాబ్స్ ప్రకటించకపోవడంతో నాన్న సూచనల మేరకు హైదరాబాద్‌లో 2013 బ్యాచ్‌లో నాలుగున్నరేళ్లు బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేశా. అక్కడే ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండున్నరేళ్లు స్టాఫ్‌నర్స్‌గా చేశా. ప్రభుత్వం నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడంతో స్టాఫ్‌నర్స్‌గా 2021లో ఉద్యోగం సాధించా. సిరిసిల్లలోని పీహెచ్సీలో తొలిపోస్టింగ్. బదిలీపై వచ్చి ప్రస్తుతం గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహిస్తున్నా. – టి. సతీశ్‌కుమార్, స్టాఫ్‌నర్స్, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి ఫ్రెండ్ ప్రోత్సాహంతో మాది జమ్మికుంట మండలం పోతిరెడ్డిపల్లి. ఇంటర్ తర్వాత నా ఫ్రెండ్ రాజు ప్రోత్సాహంతో నర్సింగ్ వైపు వచ్చా. ఇద్దరం కలిసి గుంటూరులోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాం. 2010 బ్యాచ్‌లో కోర్సు పూర్తిచేశాం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులు, హనుమకొండలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 10 ఏళ్లు పనిచేశా. 2018లో ప్రభుత్వ స్టాఫ్ నర్సింగ్ పోస్టుకు ఎంపికయ్యా. ప్రభుత్వం 2021లో పోస్టింగ్ ఇచ్చింది. తొలుత ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆరు నెలలు పనిచేశా. ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి బదిలీపై వచ్చాను. – తాళ్లపల్లి కిరణ్, స్టాఫ్‌నర్స్, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సంతోషంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో మొదటి బ్యాచ్‌లో మేల్ నర్సుగా వచ్చాను. 12 ఏళ్లుగా రోగులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కోవిడ్ కష్టకాలంలో పూర్తిస్థాయి ఐసోలేషన్‌లో సేవలు అందించాను. ఆపరేషన్ థియేటర్లో, క్యాజువాలిటీల్లో ఎక్కువ సర్వీసు చేశాను. ఇప్పుడిప్పుడే మేల్నర్సు ప్రాధాన్యత పెరుగుతోంది. – ఎండీ ఖలీద్, మేల్ నర్సు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కరీంనగర్ నర్సింగ్పై గౌరవంతో మాది ఖమ్మం జిల్లా. పదేళ్లుగా నర్సింగ్ వృత్తిలో ఉన్నాను. నా భార్య కూడా నర్సు. నర్సింగ్ వృత్తిలో రాణించాలనే బలమైన కోరికతోనే హైదరాబాద్‌లో నర్సింగ్ పూర్తిచేశాను. థియేటర్ అసిస్టెంట్‌గా పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నాను. రోగికి నయమై వెళ్తుంటే ఆనందంగా ఉంటుంది. వృత్తి మీద గౌరవంతో సంతోషంగా చేస్తున్నా. – పి.నాగరాజు, మేల్నర్సు, మెడికవర్ ఆసుపత్రి అత్యవసర సేవలు మేల్ నర్సింగ్ అవసరం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర సమయంలో అండగా ఉంటాం. హార్ట్ ఎటాక్ వచ్చిన వారు గానీ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స మేమే చేస్తుంటాం. నైట్ డ్యూటీలు, పేషెంట్ కేర్ తీసుకుంటాం. కానీ కోర్సు చేసేందుకు సీట్లు తక్కువగా ఉన్నాయి. – సురేందర్, జగిత్యాల -
నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకోసం నర్సింగ్ సెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లేఖ రాసింది. ఇంజనీరింగ్, మెడిసిన్ తరహాలోనే నర్సింగ్ విద్యలోనూ ప్రమాణాలు పెంచడానికి నీట్ లేదా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ 2020లోనే నిర్ణయించింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచే నర్సింగ్ సెట్ నిర్వహించాల్సి ఉన్నా అప్పట్లో కరోనాతో మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి కూడా మినహాయింపు కోసం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ప్రయత్నించగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిరాకరించింది. దీంతో ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని కోరుతూ వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి సుమారు 200 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలు ఉండగా 12 వేల వరకు సీట్లు ఉన్నాయి. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏపీలో నర్సింగ్ కోర్సులు చేయడానికి వస్తుంటారు. నాలుగేళ్ల నర్సింగ్ కోర్సులో ఇప్పటివరకు ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈఏపీసెట్, నీట్ ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు చేపట్టడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈఏపీసెట్ దరఖాస్తుకు సమయం ముగిసింది. మరోవైపు నీట్ స్కోర్ ఆధారంగానూ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అవకాశం కల్పించింది. అయితే నీట్‌కు కూడా దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి ప్రత్యేకంగా నర్సింగ్ సెట్‌ను నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వంద మార్కులకు పరీక్ష నాలుగేళ్ల నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నర్సింగ్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ల్లో 20 మార్కుల చొప్పున ప్రశ్నలిస్తారు. జనరల్ విద్యార్థులు కనీసం 50, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 40, దివ్యాంగులు (జనరల్) 45, దివ్యాంగులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) 40 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు చేపడతారు. ఈ ఏడాదికి నర్సింగ్ సెట్ ద్వారా కన్వీనర్ కోటా సీట్లను, నీట్ యూజీ ద్వారా యాజమాన్యం కోటా సీట్లను భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఈఏపీసెట్ ద్వారా ప్రవేశాలు ఈ విద్యా సంవత్సరానికి నర్సింగ్ ప్రవేశాల కోసం నర్సింగ్ సెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశాం. 2023–24 నుంచి ఈఏపీసెట్ ద్వారా నర్సింగ్ ప్రవేశాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశాం. – డాక్టర్ కె.శంకర్, రిజిస్ట్రార్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం -
జనరల్ నర్సింగ్ కోర్సు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సుకు ప్రభుత్వం ముగింపు పలికింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి జీఎన్ఎం కోర్సు నిర్వహించేదిలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లల్లో 6 వేలకు పైగా జీఎన్ఎం సీట్లు ఉన్నాయి. ఇన్ని వేల సీట్లను ఒకేసారి రద్దు చేస్తుండటంతో నర్సింగ్ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదముంది. కొన్ని రాష్ట్రాల్లో జీఎన్ఎం కోర్సు రద్దు చేసినా, వాటి స్థానే బీఎస్సీ నర్సింగ్ కోర్సు నిర్వహించేందుకు అనుమతించారు. దీంతో జీఎన్ఎం సీట్లు పోయినా బీఎస్సీ నర్సింగ్ సీట్లు వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం జీఎన్ఎం అర్హత కలిగినవారే ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్లకంటే, జీఎన్ఎం చేసిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఎస్సీ వాళ్ల కంటే తక్కువ వేతనాలకు పని చేయడమే ఇందుకు కారణమని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. నైపుణ్యం ఉండటం లేదు.. డీఎంఈ పరిధిలోకి జీఎన్ఎం కోర్సులు వస్తాయి. కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోకి బీఎస్సీ నర్సింగ్ కోర్సులు వస్తాయి. జీఎన్ఎం చేసినా చాలామంది నర్సుల్లో నైపుణ్యం ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పైగా జీఎన్ఎం డిప్లొమా కోర్సుగా కొనసాగుతోంది. ఈ కోర్సుతో నైపుణ్యం రావడం లేదన్న ఆరోపణలతోనే కోర్సు రద్దు చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక ‘నర్సింగ్’ వైపు కష్టమే.. ప్రస్తుతం రాష్ట్రంలో నర్సుల కొరత విపరీతంగా ఉంది. కానీ రాష్ట్రంలో 80 ప్రైవేటు, 6 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో కలిపి బీఎస్సీ నర్సింగ్ సీట్లు 5 వేల లోపే ఉన్నాయి. ప్రైవేటు బీఎస్సీ నర్సింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లు రాని విద్యార్థులంతా జీఎన్ఎం కోర్సుల్లో చేరుతున్నారు. జీఎన్ఎం కోర్సు ఎత్తేస్తుండటంతో నర్సింగ్ చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని నర్సింగ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో జీఎన్ఎం కోర్సులు అందించే నర్సింగ్ స్కూళ్లను, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయా లని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరుతోంది. -
విషాదం : ఇంగ్లీష్ అర్థం కావడం లేదని..
కోల్‌కతా : ఇంగ్లీష్ అర్థం కావడం లేదని ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంపతి అనే విద్యార్థిని కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. మొదటినుంచి బెంగాలీ భాషలోనే విద్యనభ్యసించిన సంపతి నర్సింగ్ కోర్సు ఆంగ్ల మాద్యమంలో ఉండేసరికి చదువు అర్థంకాక మనోవేదనకు గురయ్యేది. అయితే ఇటివలే దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన సంపతి చదువు ఆపేస్తానని చెప్పినా తండ్రి నచ్చచెప్పి తిరిగి కాలేజీకీ పంపించాడు. అయితే చదువుకు సంబంధించి రూ. 5లక్షలు రూపాయలు తండ్రి నుంచి తీసుకువచ్చిన సంపతి మరింత ఆందోళనను పెంచుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురైన సంపతి హాస్టల్లోని తన రూంలో ఎవరు లేని సమయంలో శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే శనివారం తోటి స్నేహితులు వచ్చి సంపతి రూం తలుపు కొట్టినా ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానంవచ్చి చూడగా ప్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. దీంతో ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకొని సంపతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సందర్భంగా సంపతి రాసిని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ' ఎంతో ఇష్టపడి జాయిన్ అయిన నర్సింగ్ కోర్సు ఇంగ్లీష్‌లో ఉండడంతో నాకు అర్థం కావడం లేదు. అలాగే నా తండ్రి చదువు పేరుతో రూ.5 లక్షలు పంపినా నేను న్యాయం చేయలేకపోతున్నా. అందుకే చనిపోవాలని నిర్ణయించుకఘాన్న' అని లేఖలో పేర్కొంది. -
ఆపరేషన్లు లేకుండా కాన్పులు!
సాక్షి, హైదరాబాద్: సహజ ప్రసవాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాన్పుల్లో శస్త్ర చికిత్సలను తగ్గించాలని భావి స్తోంది. కాన్పు సమయంలో శస్త్ర చికిత్స (ఆపరేషన్లు)ల తీరు రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉంది. వైద్య ప్రమాణాల ప్రకారం కాన్పు శస్త్రచికిత్సలు 15 శాతానికి మించొద్దు. కానీ, ఈ విషయంలో తెలంగాణ 58 శాతంతో దేశం లోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ ఆరో గ్య సంస్థసహా పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు మన రాష్ట్రంలో కాన్పు శస్త్ర చికిత్సల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తు న్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ శస్త్రచికిత్స కాన్పులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కొత్తగా ‘మిడ్ వైఫరీ నర్సు ప్రాక్టీషనర్ డిప్లొమా’కోర్సును ప్రారంభిస్తోంది. గ్రామాల్లో సంప్రదాయంగా ఉండి ఇప్పుడు కనుమరుగైన వ్యవస్థను శాస్త్రీయ కోర్సు రూపంలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటగా ఈ నెల 15న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కోర్సును ప్రారంభిస్తోంది. 18 నెలలపాటు శిక్షణ ‘మిడ్ వైఫరీ నర్సు ప్రాక్టీషనర్ డిప్లొమా’ కోర్సు 18 నెలలు ఉంటుంది. ఒక బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సౌకర్యాలను ప్రభుత్వమే భరిస్తుంది. జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న 40 ఏళ్లలోపు వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. కాన్పు చికిత్సలో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం కలిగి మిడ్ వైఫరీ కోర్సుపై ఆసక్తి ఉన్న స్టాఫ్ నర్సుల (రెగ్యులర్, కాంట్రాక్టు)ను ఈ కోర్సుకు ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం వీరిని జిల్లాలో ప్రస వాలు అధికంగా జరిగే ఆస్పత్రుల్లో నియ మిస్తారు. వీరికి రెగ్యులర్ వేతనానికి అదనంగా నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు. సహజ ప్రసవా లకు నమ్మకమైన నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కోర్సును నిర్వహించనున్నారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్యసహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాతశిశువుకు అందించాల్సిన సేవలపై శిక్షణ ఉంటుంది. ప్రసవ మరణాలను నిరోధించడమే లక్ష్యం గర్భధారణ, ప్రసవ సంబంధ కారణాలతో కలిగే అనారోగ్యాలను, మరణాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తల్లీ బిడ్డల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలను, జాగ్రత్తలను తీసుకునేలా చేయాలని, మాతృత్వం మధురమైన అనుభూతిగా మిగలాలని ప్రభుత్వం మిడ్ వైఫరీ కోర్సును ప్రవేశపెడుతోంది. సహజకాన్పుల కోసం వృత్తి నిపుణులను తీర్చిదిద్దడం దేశంలోనే మొదటిసారి. – వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
ప్రాణాలొదిలిన ఐదుగురు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ఆ ఐదుగురు బంధువులే కాదు.. ప్రాణస్నేహితులు కూడా. ఒకరిని వదలి మరొకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్లాలన్నా ఒక్కటిగానే వెళతారు. చివరకు మృత్యువులోనూ ఒక్కటయ్యా రు. ఒకరి ప్రాణం కాపాడడం కోసం మిగిలిన నలుగురు తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. అటవీప్రాంతమైన వెల్లంపాడు హరిజనవాడలో చదువుకున్న వారు తక్కువ. అయితే ఈ ఐదుగురిలో ముగ్గురు పదో తరగతి పూర్తి చేసి నర్సింగ్ కోర్సులో చేరడానికి దరఖాస్తు చేశారు. ఇంతలో ఆదివారం క్వారీగుంత రూపంలో మృత్యువు ఐదుగురిని కబళించింది. బట్టలు ఉతకాడానికెళ్లి గుంతలోపడి చనిపోయూరు. దీంతో శ్రీకాళహస్తి మండలంలోని వెల్లంపాడు హరిజనవాడ శోకసంద్రంలో మునిగిపోయింది. తమ కుటుంబంలో చదువుకున్న వారే లేరని, ఉన్నత చదువులు చదివి చెట్టంత ఎదుగుతారని, మమ్మల్ని ఉద్ధరిస్తారని కలలు కంటే మాచేతే కొరివి పెట్టుకుంటున్నారా అని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి మండలంలోని వెల్లంపాడు మన్నవరానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంది. గ్రామంలో ఒకరిద్దరికి సొంతబోర్లు ఉండడంతో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ ఇబ్బందులు లేవు. అయితే సమీపంలోని హరిజనవాడ, అరుంధతీవాడలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికి తోడు చెరువులు, బావులు, చేతిబోర్లు ఎండిపోవడంతో కిలోమీటరు దూరంలోని ఓ క్వారీగుంతలో నీరు పుష్కలంగా ఉంది. దీంతో వారంతా తాగునీటి కోసమే కాకుండా బట్టలు ఉతకడానికి కూడా క్వారీ గుంతనే వినియోగిస్తున్నారు. క్వారీ గుంతతోనే ప్రమాదం అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా క్వారీ గుంతలు తవ్వడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం వెల్లంపాడు హరిజనవాడకు చెందిన ఐదుగురు గంటా సునీత(23), వెలంపాటి మహాలక్ష్మి(15), తుంగాపోలమ్మ(18), పాముల లక్ష్మిదేవి(18), వెలంపాటి ఆశాలత(18) బట్టలు ఉతకడానికి క్వారీగుంత వద్దకు వెళ్లారు. వీరిలో గంటా సునీత అదువుతప్పి క్వారీ గుంతలో పడిపోయారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగిలిన నలుగురూ గుంతలో దిగి ప్రాణాలు కోల్పోయారు. క్వారీ గుంత 25 అడుగుల లోతు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలోతు వారికి తెలియక పోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఓ గొర్రెల కాపరి ప్రమాదాన్ని గుర్తించి స్థానికులకు తెలపడంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు.. మృతుల్లోని తుంగా పోలమ్మ, పాముల లక్ష్మిదేవి, వెలంపాటు ఆశాలత పదో తరగతి పూర్తిచేసి నర్సింగ్ కోర్సు కోసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దరఖాస్తు చేసుకున్నారు. వెలంపాటి మహాలక్ష్మి తొమ్మిదవ తరగతి చదువుతోంది. గంటా సునీతకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. శరణ్‌తేజ(3), ప్రసన్న (2)పిల్లలు ఉన్నారు. -
నర్సింగ్ కోర్సు.. ఇక కొత్తగా...
ఆస్పత్రిలో రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారు సిస్టర్లు. అలాంటి ఈ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే నర్సింగ్ కోర్సు చదవాల్సిందే. రోగులకు సేవలు అందించడంతో పాటు గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరిస్తూ వారిని చైతన్య పరిచేది కూడా సిస్టర్లే కావడం విశేషం. నర్సింగ్ కోర్సు బోధనలో కొంత మేరకు నాణ్యత కనబడకపోవడంతో పాటు, కళాశాలల్లో ప్రవేశం కూడా ప్రతిభకు తగిన విధంగా జరగటం లేదనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కొత్త నిబంధనలను అమలు చేయాలంటూ కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. 2014-2015 విద్యా సంవత్సరం నుంచి సిలబస్, ప్రవేశం, అర్హత, ఫీజుల నియంత్రణ, సీట్ల కేటాయింపును కఠినతరం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్సులు జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్‌లలో నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులు ఉన్నాయి. ఐదు కళాశాలల్లో ఏఎన్ఎం, మూడు కళాశాలల్లో జీఎన్ఎం, ఒక కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో ఇరవై నుంచి న లబై లోపు సీట్లను భర్తీ చేసుకోడానికి అనుమతి ఉంటుంది. కాల వ్యవధి బీఎస్సీ నర్సింగ్ కోర్సు నాలుగున్నర సంవత్సరాలు, జీఎన్ఎం కోర్సు మూడున్నర ఏళ్లు, ఏఎన్ఎం కోర్సు రెండేళ్లు చదవాల్సి ఉంటుంది. ఇంటర్లో బైపీసీ చదవకుండా ఎంపీహెచ్‌డబ్ల్యూ చేసిన వారు జీఎన్ఎం పూర్తి చేస్తేనే బీఎస్సీ నర్సింగ్ చదివే అవకాశం ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధిత యూనివర్సిటీ, జీఎన్ఎం కోర్సుకు మెడికల్ నర్సింగ్ డెరైక్టరు, ఏఎన్ఎం కోర్సుకు ఎంపీహెచ్‌డబ్ల్యూ బోర్డు కార్యదర్శి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తుంది. అర్హత బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులకు కచ్చితంగా ఇంటర్ బైపీసీ చదివి ఉండాలి. ఇంటర్లో 45 శాతం మార్కులు సాధించిన వారే దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. ఏఎన్ఎం కోర్సుకు ఇంటర్లో ఏ గ్రూపులో ఉత్తీర్ణులైనా సరిపోతుంది. మొదటి ప్రాధాన్యం మాత్రం బైపీసీ విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిభ ఆధారంగా ఈ విద్యా సంవత్సరం నుంచి సీటు కేటాయించాలని ఆదేశాలను స్పష్టంగా జారీ చేశారు. గత విద్యా సంవత్సరం వరకు ఇంటర్ ఉత్తీర్ణులైతే చాలు ఫీజు ఎక్కువ ఇచ్చన వారికే సీటు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. వయసు+ఫీజు చదువుతో పాటు వయసును కూడా అధికారులు క్రమబద్ధీకరించారు. 17 నుంచి 30 ఏళ్ల లోపు వారు మాత్రమే ఈ మూడు కోర్సుల్లో చేరడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఐదేళ్ల మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పరిధిలోని సీట్లకు ఈ మూడు కోర్సులకు నెలకు రూ.వెయ్యి రూపాయలు చెల్లించాలి. యాజమాన్యం కోటా కింద సీటు పొందిన వారు నెలకు ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సిలబస్ గత విద్యాసంవత్సరం వరకు కేటాయించిన సిలబస్ వృత్తి వరకే పరిమితమైనది. బీపీ తనిఖీ చేయడం, సూది వేసే విధానం, మందులు ఏ మోతాదులో వేసుకోవాలి, రోగి ఆస్పత్రిలో చేరిన తరువాత నుంచి డిశ్చార్జి అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆస్పత్రి పరిశుభ్రత అంశాలు గత సిలబస్‌లో ఉండేవి. మారిన సిలబస్‌లో వీటితో పాటు అత్యవసర వైద్యసేవలు, ప్రాథమిక వైద్య సేవలు, ప్రజారోగ్య విధి, విధానాలు, పుట్టిన పిల్లలతో పాటు బాలింత, గర్భవతుల ఆరోగ్య పరిరక్షణ అంశాలతో కూడిన సిలబస్‌ను అదనంగా చేర్చారు.