సాక్షి, కరీంనగర్: ‘నర్స్’... ఈ పదం వినగానే ఆస్పత్రుల్లో తెల్లని దుస్తులు ధరించి, నెట్టిన టోపి పెట్టుకున్న సిస్టర్సే అందరికీ గుర్తుకొస్తారు. కానీ, నర్స్ అంటే సిస్టర్స్ మాత్రమే కాదు... బ్రదర్స్ కూడా ఉంటారని చాలా తక్కువ మందికి తెలుసు. స్త్రీలకే ప్రత్యేకమనిపించే నర్సింగ్ రంగంలో పురుషులు కూడా రాణిస్తున్నారు. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా నర్సింగ్ కళాశాల్లో ప్రభుత్వం పురుషులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో మేల్‌నర్సుల సేవలు విస్తరిస్తున్నాయి. మెటర్నిటీ మినహా అన్ని విభాగాల్లో బ్రదర్స్ సేవలందిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల వీరిని నర్సింగ్ ఆఫీసర్స్ అని కూడా పిలుస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం బ్రదర్ అంటూ పిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో విశేష సేవలందిస్తున్న నర్సింగ్ బ్రదర్స్‌పై సండే స్పెషల్..!!
అన్ని ఆస్పత్రుల్లో మేల్ నర్సులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 500 వరకు ప్రయివేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో మూడు వేల మంది వరకు ఫిమేల్ నర్సులు పనిచేస్తుండగా.. 450మంది వరకు మేల్ నర్సులు ఉన్నారు. వీరు ఎమర్జెన్సీ విభాగంలో, అత్యవసర పేషెంట్ల వద్ద విధులు నిర్వహిస్తుంటారు. రాత్రి డ్యూటీల్లో ఎక్కువగా బ్రదర్సే ఉంటారు. కరోనా సమయంలో ఐసోలేషన్ వార్డుల్లో ఫిమేల్ నర్సులతో పాటు మేల్‌నర్సులు తప్పనిసరి డ్యూటీలు చేయడం కనిపించింది. కరీంనగర్ జిల్లాలో 320మంది బ్రదర్స్ పనిచేస్తుండగా.. మేల్ నర్సింగ్ విద్యార్థులు 380 మంది చదువుతున్నారు.
రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐదుగురు బ్రదర్స్ సేవలందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా మరో 50మంది, జగిత్యాల జిల్లాలో 15మంది, సిరిసిల్లలో 25 మంది వరకు సేవలందిస్తున్నారు. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లలో సహాయకులుగా ఎక్కువశాతం మేల్ నర్సులనే వైద్యులు ఉపయోగిస్తుంటారు. ఇటీవల వీఐపీల కాన్వాయ్‌ల్లోనూ మేల్‌నర్సులకే ప్రాధాన్యం ఉంటోంది. నర్సింగ్ వృత్తికి విదేశాలలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డిమాండ్ కారణంగా పురుషులను నియమించుకోవడం మరింత కీలకంగా మారింది. దీంతో ఎక్కువమంది ఈ కోర్సు చేసేందుకు ఇష్టపడుతున్నారు.
మామయ్య సూచనతో
మాది ములుగు జిల్లా యేసునగర్ గ్రామం. ఇంటర్ తరువాత నర్సింగ్ కోర్సు చేస్తే బాగుంటుందని మా మేనమామ సూచించాడు. తానూ పర్కాలలోని సివిల్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. జీఎన్‌ఎం కోర్సు 2021 వరకు చదివాను. జీఎన్‌ఎం కాంట్రాక్ట్ పద్ధతిలో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ కేంద్రంలో పనిచేస్తున్నా. నవజాత శిశువులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నెలరోజులపాటు నిలోఫర్ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చారు.
– లంకదాసరి నవీన్‌కుమార్, జీఎన్‌ఎం, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి
సివిల్స్ కొట్టాలనుకున్నా
మాది వరంగల్. నాన్న సత్యనారాయణ పరకాలలో ఏఎస్సై. సివిల్స్ జాబ్ కొట్టాలని ప్రిపేర్ అయ్యా. జాబ్స్ ప్రకటించకపోవడంతో నాన్న సూచనల మేరకు హైదరాబాద్‌లో 2013 బ్యాచ్‌లో నాలుగున్నరేళ్లు బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేశా. అక్కడే ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండున్నరేళ్లు స్టాఫ్‌నర్స్‌గా చేశా. ప్రభుత్వం నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడంతో స్టాఫ్‌నర్స్‌గా 2021లో ఉద్యోగం సాధించా. సిరిసిల్లలోని పీహెచ్‌సీలో తొలిపోస్టింగ్. బదిలీపై వచ్చి ప్రస్తుతం గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో విధులు నిర్వహిస్తున్నా.
– టి. సతీశ్‌కుమార్, స్టాఫ్‌నర్స్, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి
ఫ్రెండ్ ప్రోత్సాహంతో
మాది జమ్మికుంట మండలం పోతిరెడ్డిపల్లి. ఇంటర్ తర్వాత నా ఫ్రెండ్ రాజు ప్రోత్సాహంతో నర్సింగ్ వైపు వచ్చా. ఇద్దరం కలిసి గుంటూరులోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాం. 2010 బ్యాచ్‌లో కోర్సు పూర్తిచేశాం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులు, హనుమకొండలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 10 ఏళ్లు పనిచేశా. 2018లో ప్రభుత్వ స్టాఫ్ నర్సింగ్ పోస్టుకు ఎంపికయ్యా. ప్రభుత్వం 2021లో పోస్టింగ్ ఇచ్చింది. తొలుత ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆరు నెలలు పనిచేశా. ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి బదిలీపై వచ్చాను.
– తాళ్లపల్లి కిరణ్, స్టాఫ్‌నర్స్, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి
సంతోషంగా ఉంది
తెలుగు రాష్ట్రాల్లో మొదటి బ్యాచ్‌లో మేల్ నర్సుగా వచ్చాను. 12 ఏళ్లుగా రోగులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కోవిడ్ కష్టకాలంలో పూర్తిస్థాయి ఐసోలేషన్‌లో సేవలు అందించాను. ఆపరేషన్ థియేటర్‌లో, క్యాజువాలిటీల్లో ఎక్కువ సర్వీసు చేశాను. ఇప్పుడిప్పుడే మేల్‌నర్సు ప్రాధాన్యత పెరుగుతోంది.
– ఎండీ ఖలీద్, మేల్ నర్సు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కరీంనగర్
నర్సింగ్‌పై గౌరవంతో
మాది ఖమ్మం జిల్లా. పదేళ్లుగా నర్సింగ్ వృత్తిలో ఉన్నాను. నా భార్య కూడా నర్సు. నర్సింగ్ వృత్తిలో రాణించాలనే బలమైన కోరికతోనే హైదరాబాద్‌లో నర్సింగ్ పూర్తిచేశాను. థియేటర్ అసిస్టెంట్‌గా పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నాను. రోగికి నయమై వెళ్తుంటే ఆనందంగా ఉంటుంది. వృత్తి మీద గౌరవంతో సంతోషంగా చేస్తున్నా.
– పి.నాగరాజు, మేల్‌నర్సు, మెడికవర్ ఆసుపత్రి
అత్యవసర సేవలు
మేల్ నర్సింగ్ అవసరం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర సమయంలో అండగా ఉంటాం. హార్ట్ ఎటాక్ వచ్చిన వారు గానీ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స మేమే చేస్తుంటాం. నైట్ డ్యూటీలు, పేషెంట్ కేర్ తీసుకుంటాం. కానీ కోర్సు చేసేందుకు సీట్లు తక్కువగా ఉన్నాయి.
– సురేందర్, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment