ఆపరేషన్లు లేకుండా కాన్పులు! | Deliveries without surgery | Sakshi
Sakshi News home page

ఆపరేషన్లు లేకుండా కాన్పులు!

Published Wed, Nov 8 2017 3:46 AM | Last Updated on Wed, Nov 8 2017 3:46 AM

Deliveries without surgery - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సహజ ప్రసవాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాన్పుల్లో శస్త్ర చికిత్సలను తగ్గించాలని భావి స్తోంది. కాన్పు సమయంలో శస్త్ర చికిత్స (ఆపరేషన్లు)ల తీరు రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉంది. వైద్య ప్రమాణాల ప్రకారం కాన్పు శస్త్రచికిత్సలు 15 శాతానికి మించొద్దు. కానీ, ఈ విషయంలో తెలంగాణ 58 శాతంతో దేశం లోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ ఆరో గ్య సంస్థసహా పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు మన రాష్ట్రంలో కాన్పు శస్త్ర చికిత్సల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తు న్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ శస్త్రచికిత్స కాన్పులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కొత్తగా ‘మిడ్‌ వైఫరీ నర్సు ప్రాక్టీషనర్‌ డిప్లొమా’కోర్సును ప్రారంభిస్తోంది. గ్రామాల్లో సంప్రదాయంగా ఉండి ఇప్పుడు కనుమరుగైన వ్యవస్థను శాస్త్రీయ కోర్సు రూపంలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటగా ఈ నెల 15న కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కోర్సును ప్రారంభిస్తోంది.

18 నెలలపాటు శిక్షణ
‘మిడ్‌ వైఫరీ నర్సు ప్రాక్టీషనర్‌ డిప్లొమా’ కోర్సు 18 నెలలు ఉంటుంది. ఒక బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సౌకర్యాలను ప్రభుత్వమే భరిస్తుంది. జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న 40 ఏళ్లలోపు వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. కాన్పు చికిత్సలో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం కలిగి మిడ్‌ వైఫరీ కోర్సుపై ఆసక్తి ఉన్న స్టాఫ్‌ నర్సుల (రెగ్యులర్, కాంట్రాక్టు)ను ఈ కోర్సుకు ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం వీరిని జిల్లాలో ప్రస వాలు అధికంగా జరిగే ఆస్పత్రుల్లో నియ మిస్తారు. వీరికి రెగ్యులర్‌ వేతనానికి అదనంగా నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు. సహజ ప్రసవా లకు నమ్మకమైన నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కోర్సును నిర్వహించనున్నారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్యసహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాతశిశువుకు అందించాల్సిన సేవలపై శిక్షణ ఉంటుంది.

ప్రసవ మరణాలను నిరోధించడమే లక్ష్యం
గర్భధారణ, ప్రసవ సంబంధ కారణాలతో కలిగే అనారోగ్యాలను, మరణాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తల్లీ బిడ్డల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలను, జాగ్రత్తలను తీసుకునేలా చేయాలని, మాతృత్వం మధురమైన అనుభూతిగా మిగలాలని ప్రభుత్వం మిడ్‌ వైఫరీ కోర్సును ప్రవేశపెడుతోంది. సహజకాన్పుల కోసం వృత్తి నిపుణులను తీర్చిదిద్దడం దేశంలోనే మొదటిసారి.          – వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement