ప్రాణాలొదిలిన ఐదుగురు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ఆ ఐదుగురు బంధువులే కాదు.. ప్రాణస్నేహితులు కూడా. ఒకరిని వదలి మరొకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్లాలన్నా ఒక్కటిగానే వెళతారు. చివరకు మృత్యువులోనూ ఒక్కటయ్యా రు. ఒకరి ప్రాణం కాపాడడం కోసం మిగిలిన నలుగురు తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. అటవీప్రాంతమైన వెల్లంపాడు హరిజనవాడలో చదువుకున్న వారు తక్కువ. అయితే ఈ ఐదుగురిలో ముగ్గురు పదో తరగతి పూర్తి చేసి నర్సింగ్ కోర్సులో చేరడానికి దరఖాస్తు చేశారు. ఇంతలో ఆదివారం క్వారీగుంత రూపంలో మృత్యువు ఐదుగురిని కబళించింది.
బట్టలు ఉతకాడానికెళ్లి గుంతలోపడి చనిపోయూరు. దీంతో శ్రీకాళహస్తి మండలంలోని వెల్లంపాడు హరిజనవాడ శోకసంద్రంలో మునిగిపోయింది. తమ కుటుంబంలో చదువుకున్న వారే లేరని, ఉన్నత చదువులు చదివి చెట్టంత ఎదుగుతారని, మమ్మల్ని ఉద్ధరిస్తారని కలలు కంటే మాచేతే కొరివి పెట్టుకుంటున్నారా అని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.
స్థానికుల కథనం మేరకు..
శ్రీకాళహస్తి మండలంలోని వెల్లంపాడు మన్నవరానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంది. గ్రామంలో ఒకరిద్దరికి సొంతబోర్లు ఉండడంతో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ ఇబ్బందులు లేవు. అయితే సమీపంలోని హరిజనవాడ, అరుంధతీవాడలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికి తోడు చెరువులు, బావులు, చేతిబోర్లు ఎండిపోవడంతో కిలోమీటరు దూరంలోని ఓ క్వారీగుంతలో నీరు పుష్కలంగా ఉంది. దీంతో వారంతా తాగునీటి కోసమే కాకుండా బట్టలు ఉతకడానికి కూడా క్వారీ గుంతనే వినియోగిస్తున్నారు.
క్వారీ గుంతతోనే ప్రమాదం
అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా క్వారీ గుంతలు తవ్వడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం వెల్లంపాడు హరిజనవాడకు చెందిన ఐదుగురు గంటా సునీత(23), వెలంపాటి మహాలక్ష్మి(15), తుంగాపోలమ్మ(18), పాముల లక్ష్మిదేవి(18), వెలంపాటి ఆశాలత(18) బట్టలు ఉతకడానికి క్వారీగుంత వద్దకు వెళ్లారు. వీరిలో గంటా సునీత అదువుతప్పి క్వారీ గుంతలో పడిపోయారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగిలిన నలుగురూ గుంతలో దిగి ప్రాణాలు కోల్పోయారు.
క్వారీ గుంత 25 అడుగుల లోతు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలోతు వారికి తెలియక పోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఓ గొర్రెల కాపరి ప్రమాదాన్ని గుర్తించి స్థానికులకు తెలపడంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.
నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు..
మృతుల్లోని తుంగా పోలమ్మ, పాముల లక్ష్మిదేవి, వెలంపాటు ఆశాలత పదో తరగతి పూర్తిచేసి నర్సింగ్ కోర్సు కోసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దరఖాస్తు చేసుకున్నారు. వెలంపాటి మహాలక్ష్మి తొమ్మిదవ తరగతి చదువుతోంది. గంటా సునీతకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. శరణ్‌తేజ(3), ప్రసన్న (2)పిల్లలు ఉన్నారు.