Quarry pit
-
హారిక మృతి కేసు: విచారణ.. రూ.25 లక్షలు డిమాండ్
వంగర: శ్రీకాకుళం జిల్లా వంగర మండల పరిధి నీలయ్యవలస సమీపంలో బేతిన్ గ్రానైట్ క్వారీ ప్రదేశాన్ని పాలకొండ ఆర్డీవో టి.వి.ఎస్.జి.కుమార్, డీఎస్పీ మల్లంపాటి శ్రావణి గురువారం పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన దుస్తులు ఉతికేందుకు తల్లి తొగరాపు సంతోషికుమారితో వెళ్లిన కుమార్తె హారిక క్వారీ గొయ్యిలో పడి మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై సమగ్ర సమాచారం సేకరణకు క్వారీ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. క్వారీ లీజు సమయం, నిర్వహణ కాలం, ఎప్పటి నుంచి మూసివేశారు, హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు వంటివి తనిఖీ చేశారు. క్వారీకి సంబంధించి సమగ్ర సమాచారంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ డి.ఐజాక్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అంశాలపై డీఎస్పీ ఆరా తీశారు. రాజాం రూరల్ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్సై సంచాన చిరంజీవి, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన) రూ.25 లక్షలు చెల్లించాలి.. హారిక కుటుంబానికి క్వారీ యాజమాన్యం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుతోపాటు సర్పంచ్ ప్రతినిధి చింతగుంట రామారావు, పలు పార్టీలకు చెందిన నాయకులు బెజ్జిపురం రవి, ఉత్తరావెల్లి మోహనరావు, మజ్జి గణపతిరావు డిమాండ్ చేశారు. హారిక కుటుంబ సభ్యులను క్వారీ యాజమాన్య ప్రతినిధులు కనీసం ఓదార్చలేదని, ఇప్పటివరకు పరామర్శించలేదని మండిపడ్డారు. క్వారీ గుంత వద్ద హారిక మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి, కుటుంబసభ్యులు (ఫైల్) -
‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన
ఆ తండ్రికి కుమార్తె అంటే పంచప్రాణాలు. అందుకే ఏదడిగినా కాదనడు. సరదాగా అమ్మతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్తానని చెబితే అడ్డుచెప్పకుండా బైక్‌పై ఇద్దరినీ క్వారీ (చెరువు) వద్దకు తీసుకెళ్లి తాను ఇంటికెళ్లిపోయాడు. అయితే తన గారాలపట్టి చివరి చూపు అదేనని తెలుసుకోలేకపోయాడు. కుమార్తె ఇక లేదని తెలుసుకుని మృతదేహంపై పడి ‘హారికా లేవమ్మా..’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. మరోవైపు తన కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో తల్లి అపస్మారక స్థితికి చేరుకుంది. వంగర(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని నీలయ్యవలస సమీపంలో గ్రానైట్ క్వారీ గొయ్యిలో పడి తొగరాపు హారిక (13) అనే బాలిక మంగళవారం మృతిచెందింది. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వంగర ఎస్సై సంచాన చిరంజీవి తెలిపి వివరాల ప్రకారం.. నీలయ్యవలస సమీపంలో కొన్నాళ్ల కిందట బేతిన్ గ్రానైట్ పరిశ్రమ ఉండేది. అప్పట్లో జరిగిన తవ్వకాల్లో భాగంగా భారీ గొయ్యి (చెరువును తలపించేలా..) ఏర్పడింది. అందులో బట్టలు ఉతికేందుకు గ్రామానికి చెందిన తొగరాపు ఈశ్వరరావు తన భార్య సంతోషకుమారి, కుమార్తె హారికను బైక్‌పై తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వచ్చేశాడు. కొద్దిసేపటికే హారిక ప్రమాదవశాత్తు గోతిలోకి జారిపోయింది. అక్కడే ఉన్న తల్లి కుమార్తెను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా గోతిలో జారిపోయి కాపాడాలంటూ కేకలు వేసింది. అటువైపుగా వెళుతున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. హుటాహుటిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సంతోషకుమారిని కాపాడారు. హారిక కోసం నీటిలో గాలించగా కొద్దిసేపటికి శవమై కనిపింది. తల్లి సంతోషకుమారి అపస్మారక స్థితిలో ఉండగా, తండ్రి ఈశ్వరరావు గుండెలవిసేలే రోదించారు. ‘నా కలల హారిక.. లేవమ్మా..’ అంటూ మృతదేహాన్ని పట్టుకొని తండ్రి విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. హారిక బాగెంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తమ్ముడు చంద్రశేఖరరావు అంటే ఎంతో ఇష్టం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోషు్టమార్టం నిమిత్తం రాజాం తరలించామని ఎస్సై తెలిపారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం.. 2017 ముందు మూతపడిన బేతిన్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, స్థానికులు మండిపడ్డారు. క్వారీ మూత వేసినప్పటి నుంచి ఈ ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టలేదని, చిన్నారి మృతికి క్వారీ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లీజు సమ యం ఉన్నప్పటికీ క్వారీ వద్ద రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య 15వ అంతస్తు నుంచి దూకి వైద్యుడు -
ఈతకు వెళ్లి యువకుడు మృతి
హైదరాబాద్ : ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. శంషాబాద్ విమానాశ్రయం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండలం బండ్లగూడకు చెందిన ప్రవీణ్(19) సోమవారం మధ్యాహ్నం మిత్రులతో కలిసి కొత్వాల్‌గూడ సమీపంలోని క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ఈత సరిగా రాని ప్రవీణ్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
క్వారీగుంతలో పడి యువకుడు గల్లంతు
గంగాధర్‌నెల్లూరు (చిత్తూరు జిల్లా) : క్వారీగుంతలో ఈతకెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండల కేంద్రానికి చెందిన చంద్ర(21) అనే యువకుడు స్నేహితులతో కలిసి సమీపంలోని క్వారీ గుంతకు ఈతకెళ్లాడు. ఈ క్రమంలోనే క్వారీ గుంతలో దూకిన చంద్ర గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు పోలీసులకు తెలిపారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. -
క్వారీ గుంతలో గుర్తుతెలియని మృతదేహం
గుంటూరు (ఎడ్లపాడు) : గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామంలో ఉన్న కొండ క్వారీ గుంతలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. క్వారీ కూలీలు ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసే పనిలో ఉన్నారు. కాగా గుర్తుతెలియని ఆ యువకుడి వయసు సుమారు 14 ఏళ్లు ఉంటుంది. రెండు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. -
ప్రాణాలను బలితీసుకున్న ఈత సరదా
కూకట్పల్లి (హైదరాబాద్) : ఈత సరదా ఆ చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్ కూకట్పల్లి ఎల్లమ్మబండ ప్రాంతంలోని సీజేఆర్ నగర్లో నీళ్లతో నిండిన ఓ క్వారీ గుంతలో ఈత కోసం దిగిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. క్వారీ సమీపంలో వస్త్రాలు కనిపించడంతో స్థానికులు సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను గుర్తించి, వెలికితీసే చర్యలు చేపట్టారు. మృతులు 12 నుంచి 14 ఏళ్లలోపు వారని సమాచారం. -
ప్రాణాలొదిలిన ఐదుగురు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ఆ ఐదుగురు బంధువులే కాదు.. ప్రాణస్నేహితులు కూడా. ఒకరిని వదలి మరొకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్లాలన్నా ఒక్కటిగానే వెళతారు. చివరకు మృత్యువులోనూ ఒక్కటయ్యా రు. ఒకరి ప్రాణం కాపాడడం కోసం మిగిలిన నలుగురు తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. అటవీప్రాంతమైన వెల్లంపాడు హరిజనవాడలో చదువుకున్న వారు తక్కువ. అయితే ఈ ఐదుగురిలో ముగ్గురు పదో తరగతి పూర్తి చేసి నర్సింగ్ కోర్సులో చేరడానికి దరఖాస్తు చేశారు. ఇంతలో ఆదివారం క్వారీగుంత రూపంలో మృత్యువు ఐదుగురిని కబళించింది. బట్టలు ఉతకాడానికెళ్లి గుంతలోపడి చనిపోయూరు. దీంతో శ్రీకాళహస్తి మండలంలోని వెల్లంపాడు హరిజనవాడ శోకసంద్రంలో మునిగిపోయింది. తమ కుటుంబంలో చదువుకున్న వారే లేరని, ఉన్నత చదువులు చదివి చెట్టంత ఎదుగుతారని, మమ్మల్ని ఉద్ధరిస్తారని కలలు కంటే మాచేతే కొరివి పెట్టుకుంటున్నారా అని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి మండలంలోని వెల్లంపాడు మన్నవరానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంది. గ్రామంలో ఒకరిద్దరికి సొంతబోర్లు ఉండడంతో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ ఇబ్బందులు లేవు. అయితే సమీపంలోని హరిజనవాడ, అరుంధతీవాడలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికి తోడు చెరువులు, బావులు, చేతిబోర్లు ఎండిపోవడంతో కిలోమీటరు దూరంలోని ఓ క్వారీగుంతలో నీరు పుష్కలంగా ఉంది. దీంతో వారంతా తాగునీటి కోసమే కాకుండా బట్టలు ఉతకడానికి కూడా క్వారీ గుంతనే వినియోగిస్తున్నారు. క్వారీ గుంతతోనే ప్రమాదం అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా క్వారీ గుంతలు తవ్వడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం వెల్లంపాడు హరిజనవాడకు చెందిన ఐదుగురు గంటా సునీత(23), వెలంపాటి మహాలక్ష్మి(15), తుంగాపోలమ్మ(18), పాముల లక్ష్మిదేవి(18), వెలంపాటి ఆశాలత(18) బట్టలు ఉతకడానికి క్వారీగుంత వద్దకు వెళ్లారు. వీరిలో గంటా సునీత అదువుతప్పి క్వారీ గుంతలో పడిపోయారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగిలిన నలుగురూ గుంతలో దిగి ప్రాణాలు కోల్పోయారు. క్వారీ గుంత 25 అడుగుల లోతు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలోతు వారికి తెలియక పోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఓ గొర్రెల కాపరి ప్రమాదాన్ని గుర్తించి స్థానికులకు తెలపడంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు.. మృతుల్లోని తుంగా పోలమ్మ, పాముల లక్ష్మిదేవి, వెలంపాటు ఆశాలత పదో తరగతి పూర్తిచేసి నర్సింగ్ కోర్సు కోసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దరఖాస్తు చేసుకున్నారు. వెలంపాటి మహాలక్ష్మి తొమ్మిదవ తరగతి చదువుతోంది. గంటా సునీతకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. శరణ్‌తేజ(3), ప్రసన్న (2)పిల్లలు ఉన్నారు. -
క్వారీ గుంతలో పడి చిన్నారులు మృతి