ఆ తండ్రికి కుమార్తె అంటే పంచప్రాణాలు. అందుకే ఏదడిగినా కాదనడు. సరదాగా అమ్మతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్తానని చెబితే అడ్డుచెప్పకుండా బైక్‌పై ఇద్దరినీ క్వారీ (చెరువు) వద్దకు తీసుకెళ్లి తాను ఇంటికెళ్లిపోయాడు. అయితే తన గారాలపట్టి చివరి చూపు అదేనని తెలుసుకోలేకపోయాడు. కుమార్తె ఇక లేదని తెలుసుకుని మృతదేహంపై పడి ‘హారికా లేవమ్మా..’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. మరోవైపు తన కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో తల్లి అపస్మారక స్థితికి చేరుకుంది.
వంగర(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని నీలయ్యవలస సమీపంలో గ్రానైట్ క్వారీ గొయ్యిలో పడి తొగరాపు హారిక (13) అనే బాలిక మంగళవారం మృతిచెందింది. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వంగర ఎస్సై సంచాన చిరంజీవి తెలిపి వివరాల ప్రకారం.. నీలయ్యవలస సమీపంలో కొన్నాళ్ల కిందట బేతిన్ గ్రానైట్ పరిశ్రమ ఉండేది. అప్పట్లో జరిగిన తవ్వకాల్లో భాగంగా భారీ గొయ్యి (చెరువును తలపించేలా..) ఏర్పడింది. అందులో బట్టలు ఉతికేందుకు గ్రామానికి చెందిన తొగరాపు ఈశ్వరరావు తన భార్య సంతోషకుమారి, కుమార్తె హారికను బైక్‌పై తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వచ్చేశాడు.
కొద్దిసేపటికే హారిక ప్రమాదవశాత్తు గోతిలోకి జారిపోయింది. అక్కడే ఉన్న తల్లి కుమార్తెను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా గోతిలో జారిపోయి కాపాడాలంటూ కేకలు వేసింది. అటువైపుగా వెళుతున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. హుటాహుటిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సంతోషకుమారిని కాపాడారు. హారిక కోసం నీటిలో గాలించగా కొద్దిసేపటికి శవమై కనిపింది. తల్లి సంతోషకుమారి అపస్మారక స్థితిలో ఉండగా, తండ్రి ఈశ్వరరావు గుండెలవిసేలే రోదించారు.
‘నా కలల హారిక.. లేవమ్మా..’ అంటూ మృతదేహాన్ని పట్టుకొని తండ్రి విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. హారిక బాగెంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తమ్ముడు చంద్రశేఖరరావు అంటే ఎంతో ఇష్టం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోషు్టమార్టం నిమిత్తం రాజాం తరలించామని ఎస్సై తెలిపారు.
క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం..
2017 ముందు మూతపడిన బేతిన్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, స్థానికులు మండిపడ్డారు. క్వారీ మూత వేసినప్పటి నుంచి ఈ ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టలేదని, చిన్నారి మృతికి క్వారీ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లీజు సమ యం ఉన్నప్పటికీ క్వారీ వద్ద రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చదవండి:
లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment