లక్నో: చిరుతపులి దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పశుగ్రాసం తీసుకొచ్చేందుకు తల్లితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాలికపై.. చిరుత ఒక్కసారిగా దాడి చేసి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. నహ్తౌర్ ప్రాంతంలోని మల్కాపూర్ గ్రామానికి తాన్య(8) అనే చిన్నారి పశుగ్రాసం సేకరించేందుకు తల్లితో కలిసి ఉదయం 8 గంటల సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది.
అయితే అదే సమయంలో చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసి.. తాన్యను రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. వెంటనే చిన్నారి తల్లి, ఇతర గ్రామస్థులు కర్రలతో చిరుతను వెంబడించారు. దీంతో భయపడిన చిరుత.. చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపినట్లు నహ్తౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధీరజ్ సింగ్ తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్‌లను, థర్మల్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఇటీవల చిరుత దాడిలో యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment