లక్నో : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఉత్తరప్రదేశ్‌లో వరుస హత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఆమేథీ ఎంపీ స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత ఘటన మరువక ముందే బీఎస్పీ, ఎస్పీ నేతల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నాయకుడు హజీ అహ్సన్(55), ఆయన మేనల్లుడు తమ ఆఫీసులోనే దారుణ హత్యకు గురయ్యారు. స్వీటు బాక్సులో తుపాకీ పెట్టుకుని లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు హజీని అతి సమీపం నుంచి కాల్చారు. ఈ క్రమంలో హజీని కాపాడేందుకు ప్రయత్నించిన అతడి మేనల్లుడు కూడా వారి తూటాలకు బలయ్యాడు. ఈ ఘటన బిజ్నూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ..‘ ఈ హత్యల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులకు ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నాం. హజీని అభినందించాలంటూ స్వీటు బాక్సుతో ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్లగా ముగ్గురు బయట కాపుకాశారు. పథకం ప్రకారమే హజీని హత్య చేశారు. నిందితులకు మృతులతో వ్యక్తిగత కక్షలేమీ లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసుపై లోతుగా విచారణ జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు. కాగా బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి దుండగులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అదే విధంగా సోమవారం సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా బీఎస్పీ నాయకుడిపై కాల్పులు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment