ఆస్పత్రిలో రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారు సిస్టర్లు. అలాంటి ఈ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే నర్సింగ్ కోర్సు చదవాల్సిందే. రోగులకు సేవలు అందించడంతో పాటు గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరిస్తూ వారిని చైతన్య పరిచేది కూడా సిస్టర్లే కావడం విశేషం. నర్సింగ్ కోర్సు బోధనలో కొంత మేరకు నాణ్యత కనబడకపోవడంతో పాటు, కళాశాలల్లో ప్రవేశం కూడా ప్రతిభకు తగిన విధంగా జరగటం లేదనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కొత్త నిబంధనలను అమలు చేయాలంటూ కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. 2014-2015 విద్యా సంవత్సరం నుంచి సిలబస్, ప్రవేశం, అర్హత, ఫీజుల నియంత్రణ, సీట్ల కేటాయింపును కఠినతరం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కోర్సులు
జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్‌లలో నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సులు ఉన్నాయి. ఐదు కళాశాలల్లో ఏఎన్‌ఎం, మూడు కళాశాలల్లో జీఎన్‌ఎం, ఒక కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో ఇరవై నుంచి న లబై లోపు సీట్లను భర్తీ చేసుకోడానికి అనుమతి ఉంటుంది.
కాల వ్యవధి
బీఎస్సీ నర్సింగ్ కోర్సు నాలుగున్నర సంవత్సరాలు, జీఎన్‌ఎం కోర్సు మూడున్నర ఏళ్లు, ఏఎన్‌ఎం కోర్సు రెండేళ్లు చదవాల్సి ఉంటుంది. ఇంటర్‌లో బైపీసీ చదవకుండా ఎంపీహెచ్‌డబ్ల్యూ చేసిన వారు జీఎన్‌ఎం పూర్తి చేస్తేనే బీఎస్సీ నర్సింగ్ చదివే అవకాశం ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధిత యూనివర్సిటీ, జీఎన్‌ఎం కోర్సుకు మెడికల్ నర్సింగ్ డెరైక్టరు, ఏఎన్‌ఎం కోర్సుకు ఎంపీహెచ్‌డబ్ల్యూ బోర్డు కార్యదర్శి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తుంది.
అర్హత
బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులకు కచ్చితంగా ఇంటర్ బైపీసీ చదివి ఉండాలి. ఇంటర్‌లో 45 శాతం మార్కులు సాధించిన వారే దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. ఏఎన్‌ఎం కోర్సుకు ఇంటర్‌లో ఏ గ్రూపులో ఉత్తీర్ణులైనా సరిపోతుంది. మొదటి ప్రాధాన్యం మాత్రం బైపీసీ విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిభ ఆధారంగా ఈ విద్యా సంవత్సరం నుంచి సీటు కేటాయించాలని ఆదేశాలను స్పష్టంగా జారీ చేశారు. గత విద్యా సంవత్సరం వరకు ఇంటర్ ఉత్తీర్ణులైతే చాలు ఫీజు ఎక్కువ ఇచ్చన వారికే సీటు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి.
వయసు+ఫీజు
చదువుతో పాటు వయసును కూడా అధికారులు క్రమబద్ధీకరించారు. 17 నుంచి 30 ఏళ్ల లోపు వారు మాత్రమే ఈ మూడు కోర్సుల్లో చేరడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఐదేళ్ల మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పరిధిలోని సీట్లకు ఈ మూడు కోర్సులకు నెలకు రూ.వెయ్యి రూపాయలు చెల్లించాలి. యాజమాన్యం కోటా కింద సీటు పొందిన వారు నెలకు ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
సిలబస్
గత విద్యాసంవత్సరం వరకు కేటాయించిన సిలబస్ వృత్తి వరకే పరిమితమైనది. బీపీ తనిఖీ చేయడం, సూది వేసే విధానం, మందులు ఏ మోతాదులో వేసుకోవాలి, రోగి ఆస్పత్రిలో చేరిన తరువాత నుంచి డిశ్చార్జి అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆస్పత్రి పరిశుభ్రత అంశాలు గత సిలబస్‌లో ఉండేవి. మారిన సిలబస్‌లో వీటితో పాటు అత్యవసర వైద్యసేవలు, ప్రాథమిక వైద్య సేవలు, ప్రజారోగ్య విధి, విధానాలు, పుట్టిన పిల్లలతో పాటు బాలింత, గర్భవతుల ఆరోగ్య పరిరక్షణ అంశాలతో కూడిన సిలబస్‌ను అదనంగా చేర్చారు.
నర్సింగ్ కోర్సు.. ఇక కొత్తగా...
Published Thu, May 29 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement
Advertisement