New Syllabus
-
ఇంటర్ సిలబస్ మార్పు
ఇంటర్మీడియెట్‌లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి.వాస్తవానికి ఇంటర్ సిలబస్‌పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని వైఎస్సార్ సీపీ హయాంలోనే నిర్ణయించగా ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. – సాక్షి, అమరావతి పుష్కర కాలంగా పాత సిలబస్సేరాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్‌ను మార్చారు. అయితే ఇంటర్మీడియట్లో దాదాపు పుష్కర కాలంగా పాత సిలబస్సే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్ఈపీ, వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను సవరించి 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండో ఏడాది సిలబస్‌ను మార్చనున్నారు.పరీక్షల సరళిలో మరిన్ని మార్పులుఇంటర్ విద్యా మండలి కమిషనర్, కార్యదర్శిగా కృతికా శుక్లా బాధ్యతలు చేపట్టాక కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. యూనిట్ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్ టెస్ట్‌ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్ టెస్ట్ మాత్రం రాష్ట్రవాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకునేటప్పుడు సిలబస్ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.సైన్స్‌లో జాతీయ స్థాయి ఆర్ట్స్‌లో స్టేట్ సిలబస్ప్రస్తుతం ఇంటర్లో బోధిస్తున్న సిలబస్‌ను 2011–12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు పాతబడిపోవడం, సైన్స్ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్డేట్ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్ బోధిస్తూ, పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లల్లో 6–10 తరగతుల వరకు సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇంటర్ సిలబస్‌ను జాతీయ సిలబస్‌కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇంటర్ స్థాయిలో నీట్, ఐఐటీ లాంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్‌ను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఐఐటీ, నీట్ సిలబస్‌కు అనుగుణంగా సిద్ధం చేస్తూ సిలబస్ మార్చనున్నారు. దీంతోపాటు హెచ్‌సీఈలో ఏపీ చరిత్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్థిక శాస్త్రంలోను వర్తమాన మార్పులు జోడించనున్నారు. సిలబస్ అధ్యయన కమిటీల్లో ఇంటర్మీడియట్ సబ్జెక్టు లెక్చరర్లు నలుగురు నుంచి ఎనిమిది మంది, డిగ్రీ కాలేజీ సబ్జెక్టు లెక్చరర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటారు. -
గ్రీన్విచ్ కంటే ముందే మనకో కాలమానం!
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆరో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానం కంటే ముందే మన దేశానికి సొంత కాలమానం ఉందని, దీనిని ‘మధ్య రేఖ’ అని పిలుస్తారని పేర్కొంది. బీఆర్ అంబేద్కర్ అనుభవాలను, ఎదుర్కొన్న కుల వివక్ష పాఠాన్ని కూడా కుదించింది. హరప్పా నాగరికతను కొత్త పాఠ్య పుస్తకంలో ‘సింధు–సరస్వతి’గా పేర్కొంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్–2023కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానమే ప్రధాన కాలమానం కాదని, దానికంటే శతాబ్దాల ముందు యూరప్, భారత్‌లకు సొంత కాలమానాలున్నాయని పేర్కొంది. దానిని మధ్య రేఖ (మిడిల్ లైన్) అని పిలిచేవారని, అది ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఉజ్జయినీ నగరం (ఉజ్జయిన్) గుండా వెళ్లిందని వివరించింది. అలాగే కొత్త పాఠ్యపుస్తకంలో ‘భారత నాగరికత ప్రారంభం’ అనే అధ్యాయంలో సరస్వతి నదికి ప్రముఖ స్థానం ఉందని, ప్రజలను వర్ణాలుగా విభజించారని, శూద్రులను, స్త్రీలను వేదాలను అధ్యయనం చేయనీయలేదని పాత పాఠ్య పుస్తకంలో ఉండగా.. వ్యవసాయదారుడు, నేత, కుమ్మరి, బిల్డర్, వడ్రంగి, వైద్యుడు, నర్తకి, మంగలి, పూజారివంటి వృత్తులను వేదాల్లో పేర్కొన్నట్లు కొత్త పుస్తకాల్లో పేర్కొంది. పాత పుస్తకంలోని నాలుగు అధ్యాయాల్లో ఉన్న చాణక్యుడి అర్థశాస్త్రం, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల రాజవంశాలు, అశోకుడు చంద్రగుప్త మౌర్యుల రాజ్యాల కథనాలను కొత్త పుస్తకంలో తొలగించింది. -
సీబీఎస్ఈ 3, 6వ తరగతులకు కొత్త సిలబస్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పాఠశాలల్లో 3, 6వ తరగతుల పాఠ్యప్రణాళిక మారింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. 3, 6వ తరగతులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఆర్టీ) ప్రకటించింది. 3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. పుస్తకాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. 4, 5, 9, 11వ తరగతుల పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ వెబ్‌సైట్‌తో పాటు దీక్షా, ఈ–పాఠశాల పోర్టల్, యాప్‌లలో అందుబాటులో ఉంటాయి. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ సిలబస్‌ను జాయింట్ అడ్మిషన్ల బోర్డు (జేఏబీ) సరళీకరించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌ను భవిష్యత్ పారిశ్రామిక అవసరాలు, ఇంజనీరింగ్ కోర్సుల్లోని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిపుణుల కమిటీ సూచనల మేరకు విద్యార్థులపై సిలబస్ భారం తగ్గించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల బోర్డులు రూపొందించిన సిలబస్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ అంశాల్లో పలు అంశాలను చేర్చారు. సవరించిన సిలబస్ 2023 జేఈఈ అడ్వాన్స్డ్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఇంటర్ విద్యార్థులకు ఊరట ఈ మార్పుల వల్ల ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు ఒకింత ఊరట కలగనుంది. వారు చదువుతున్న సబ్జెక్టులకు సంబంధించిన అంశాలే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌లోనూ ఉండటంతో వారు ప్రత్యేకంగా వేరే అంశాలపై సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు. ఇంటర్మీడియెట్ సబ్జెక్టులతో పాటే అడ్వాన్స్డ్ అంశాలను కూడా ఒకే సమయంలో వారు నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఇంటర్మీడియెట్‌కు, జేఈఈకి వేర్వేరుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఇపుడు రెండింటికీ కలిపి ఒకే సిలబస్‌ను అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు జేఈఈ మెయిన్‌లో బోర్డు పరీక్షలలో ఉన్న అంశాలను కవర్ చేసినా, అడ్వాన్స్‌డ్‌లో మాత్రం వాటిని కలపలేదు. వేర్వేరు ఇతర అంశాలను ఉంచగా.. ఇప్పుడు వాటి స్థానంలో బోర్డు అంశాలను, ఇంజనీరింగ్ విద్యలో వచ్చే సంబంధిత అంశాలను సిలబస్‌లో చేర్చారు. దీనివల్ల విద్యార్థుల్లో గందరగోళానికి తావుండదని, వారి అధ్యయనం సాఫీగా సాగుతుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. పోటీ ఇక తీవ్రం జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సవరించి బోర్డుల సిలబస్‌లోని అంశాలతో సమానమైన మాదిరిగా మార్పులు చేసినందున ఆ పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో బోర్డుల అంశాలకన్నా భిన్నంగా ఒకింత కఠినమైన రీతిలో జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్ ఉన్నప్పుడు వాటిని అధ్యయనం చేసిన వారు మాత్రమే పరీక్షలను బాగా ఎదుర్కొనగలిగే వారు. కానీ.. ఇప్పుడు బోర్డులతో సమానం చేసినందున ఆ సిలబస్‌ను ప్రిపేర్ అయిన వారిలో ఎక్కువమంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధం కాగలుగుతారని, తద్వారా అత్యధిక మార్కులు సాధించగలవారు మాత్రమే ఎంపికవుతారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యేందుకు పోటీ అత్యధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఐఐటీలు సహా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి సిలబస్‌ను ప్రతి ఐదేళ్లకు ఒకసారి సవరిస్తుంటారు. అలాగే పాఠ్యప్రణాళికను పదేళ్లకోసారి పునర్వ్యవస్థీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సవరించారు. 11, 12 తరగతులకు (ఇంటర్మీడియెట్) సంబంధించి ఫిజిక్స్, మేథమేటిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సవరించింది. ఆ సంవత్సరంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సమీక్షించి మార్పులను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) ఈ సిలబస్ రివిజన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో ఏడు ప్రధాన ఐఐటీలు ముంబై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, గౌహతి, రూర్కీలకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ ఫ్యాకల్టీ సభ్యులను నియమించారు. వీరు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సిలబస్ మార్పులపై సిఫార్సులు చేశారు. వారి విభాగాల వారితో పాటు ఇతర ఫ్యాకల్టీల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని ఈ సిఫార్సులు అందించారు. సబ్జెక్టుల వారీగా మార్పులు ఇలా.. భౌతిక శాస్త్రంలో ఇప్పుడున్న ఏ అంశాన్నీ తొలగించలేదు. కొన్ని అధిక స్కోరింగ్ అంశాలు జోడించారు. ఇవి మునుపటి కంటే సులభంగా ఉండేలా రూపొందించారు. ఎలక్ట్రానిక్ వేవ్స్, సర్ఫేస్ టెన్షన్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీని తొలగించారు. బయో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ విభాగాలలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పెరియోడిక్టీ ఇన్ ప్రాపర్టీస్, హైడ్రోజన్, ఎఫ్–బ్లాక్ ఎలిమెంట్స్, క్రిస్టిల్ ఫీల్డ్ థియరీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే, బయో మాలిక్యూల్స్ వంటి అంశాలను జోడించారు. మేథమేటిక్స్‌లో హార్మోనిక్ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్ సొల్యూషన్ అంశాలను తొలగించారు. ఆల్జీబ్రాలో ప్రాథమిక అంశాలు, చతుర్భుజ సమీకరణాలు, సెట్ సిద్ధాంతం, స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ రోఆపరేషన్స్ వంటివి చేర్చారు. మేథ్స్, ఫిజిక్స్‌లో క్లిష్టత స్థాయి తగ్గినట్టే.. సిలబస్ సవరణ వల్ల మేథ్స్, ఫిజిక్స్‌లలో క్లిష్టత స్థాయి గతంలో కన్నా కొంత తగ్గినట్టేనని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులంటున్నారు. ఇంటతో సంబంధమున్న అంశాలను, సైద్ధాంతిక అధ్యాయాలను జోడించడం వల్ల రసాయన శాస్త్రం విభాగం కూడా సులభంగా మారొచ్చంటున్నారు. జేఈఈ మెయిన్ కన్నా భిన్నమైన రీతిలో అడ్వాన్స్డ్ ప్రశ్నల స్థాయి ఉంటున్నందున ఆయా అంశాలను లోతుగా చదవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్కోరు పెంచుకోవచ్చు జేఈఈ మెయిన్‌ను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ స్కోరును పెంచుకోవడానికి ఈ విధానం వారికి ఆస్కారమిచ్చింది. ఇప్పుడు సిలబస్‌ను కూడా సవరించినందున మంచి స్కోరు సాధించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సిలబస్‌ను మార్పు చేసినా ప్యాట్రన్ మాత్రం గతంలో మాదిరిగానే ఉండనుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ నుంచి టాప్ స్కోరులో నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. మెరిట్లో నిలిచిన వారికి రిజర్వేషన్ల ప్రకారం ఆయా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో 11,326 సీట్లు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించడంతో ఆ సంఖ్య 13,376కు పెరిగింది. -
మార్కుల షీట్లు కావు.. ప్రెజర్ షీట్లు
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానంలో మార్కుల ఒత్తిళ్లు విద్యార్థులపై అత్యధికంగా ఉన్నాయని, వాటిని తొలగిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. మార్కుల షీట్లు విద్యార్థులకు ఒత్తిడి షీట్లు అని, తల్లిదండ్రులకు అవే ప్రెస్టేజ్ షీట్లు అని వ్యాఖ్యానించారు. జాతీయ విద్యావి«ధానం 2020లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. కొత్త దిశా నిర్దేశం జాతీయ విద్యా విధానం దేశానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చేలా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వారిలో సృజనాత్మక ఆలోచనలు పెరిగేలా విద్యా బోధన జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగానే సిలబస్‌ను తగ్గించి మానసిక పరిణితి పెంచేలా కొత్త తరహాలో బోధనా పద్ధతులు ఉంటాయన్నారు. విమర్శనాత్మకమైన ఆలోచనలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆసక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందేలా కొత్త సిలబస్ ఉంటుందని చెప్పారు. ఎన్ఈపీపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విద్యా శాఖ వెబ్‌సైట్‌కి ఇప్పటికే 15 లక్షల సూచనలు వచ్చాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అయిదో తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన అత్యంత అవసరమని మోదీ చెప్పారు. -
సీబీఎస్ఈ 11వ తరగతిలో అప్లైడ్ మేథమెటిక్స్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు 11వ తరగతిలో అప్లైడ్ మేథమెటిక్స్‌ను ఐశ్చిక (ఎలక్టివ్) సబ్జెక్టుగా సీబీఎస్ఈ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు స్కిల్ ఎలక్టివ్‌గా ఉన్న ఈ సబ్జెక్టును ఇకపై అకడమిక్ సబ్జెక్టుగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు భవిష్యత్తులో మేథమెటిక్స్ సంబంధ అంశాల్లో అవసరమైన నైఫుణ్యాలను 11వ తరగతిలోనే నేర్పించేలా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులందరికీ ఇది తప్పనిసరి సబ్జెక్టుగా కాకుండా, ఇష్టమైన విద్యార్థులే దీనిని ఎంచుకునేలా ఏర్పాట్లు చేసింది. అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు కలిగిన అనుబంధ పాఠశాలలు దీనిని అమలు చేసేలా చర్యలు చేపట్టినట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. అయితే 11వ తరగతిలో స్కిల్ ఎలక్టివ్ సబ్జెక్టుగా అప్లైడ్ మేథమెటిక్స్‌ను ఎంచుకున్న విద్యార్థులు 12వ తరగతిలో అకడమిక్ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని పేర్కొంది. అలాగే ఇకపై ఇది స్కిల్ ఎలక్టివ్ సబ్జెక్టుగా ఉండబోదని స్పష్టం చేసింది. -
సంతోషం కోసం ఓ పిరియడ్!
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్ కరిక్యులమ్’ (కొత్త తరహా సిలబస్)ను ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆధ్యాత్మిక గురువు దలైలామా సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు. ఈ సిలబస్‌పై ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఈ ‘హ్యాపీనెస్’ పిరియడ్ 45 నిమిషాలపాటు ఉండనుంది. ‘ధ్యానంతో పాటు విలువైన విద్య, మానసిక వ్యాయామాలు ఉంటాయి. 40 మంది ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు, విద్యావేత్తలు అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు. తీవ్రవాదం, అవినీతి, కాలుష్యంలాంటి అధునిక సమస్యలను ఇలాంటి మానవీయ విద్యను అందించడం ద్వారా పరిష్కరించవచ్చని ఆశిస్తున్నాం’ అని సిసోడియా చెప్పారు. ఆధునిక విద్య, ప్రాచీన జ్ఞానం ఏకం చేయడంతో ప్రతికూల భావాల్ని అధిగమించగల్గుతామని దలైలామా అన్నారు. -
ఇంటర్లో కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ అమలులోకి వస్తుందని, నూతన సిలబస్‌తో టెస్ట్ బుక్స్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. లాంగ్వేజెస్‌లో నూతన సిలబస్ ప్రవేశ పెడ్డుతున్నామని చెప్పారు. మిగతా సబెక్టుల్లో కొన్ని కొత్త చాప్టర్లను చేర్చామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోనూ నూతన సిలబస్ ప్రవేశపెట్టనున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు. -
ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ సిద్ధం
రెండు మూడ్రోజుల్లో అధికారిక వెబ్సైట్లోకి సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్‌ను సిద్ధం చేసింది. గ్రూప్-1 మొదలుకొని తక్కిన అన్ని గ్రూపుల పరీక్షలకు సిలబస్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ప్రముఖ విద్యావేత్తలతో కూడిన బృందం రూపొందించిన ఈ ముసాయిదా సిలబస్ నివేదికలు ఇటీవలే ఏపీపీఎస్సీకి అందాయి. నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ఈ కసరత్తు సాగింది. ఉమ్మడి ఏపీపీఎస్సీలోని సిలబస్‌లో స్వల్పంగానే మార్పులు చేసి, కొత్తగా అదనపు అంశాలను జోడించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం పరిస్థితుల్లో ఏపీలోని అంశాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సిలబస్‌ను తయారు చేశారు. ముఖ్యంగా కొత్త రాజధాని అమరావతి చారిత్రక విశేషాలకు ప్రాధాన్యత కల్పించారు. అలాగే 13 జిల్లాల్లోని అంశాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతం అంశాలకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పించేలా సిలబస్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ ముసాయిదా సిలబస్‌ను రెండు, మూడురోజుల్లో ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పెట్టనున్నారు. పదిరోజుల పాటు నిపుణులు ఇతర ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం వాటిని మళ్లీ నిపుణుల కమిటీకి సమర్పిస్తారు. కమిటీలో చర్చించిన తదుపరి తుది సిలబస్‌ను ఏపీపీఎస్సీ ఖరారు చేస్తుందని సంస్థ ఉన్నతాధికారవర్గాలు వివరించాయి. -
సిలబస్ రెడీ.. మార్పు అందుకోని డిగ్రీ‘స్టడీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలను ఉన్నత విద్యా మండలి మార్పులు చేసినా, వాటి అమలును యూనివర్సిటీలు పట్టించుకోకపోవడం తో ఈ విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులు కొత్త సిలబస్‌కు నోచుకోవడం లేదు. ఆయా వర్సిటీల విభాగాధిపతులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల నేతృత్వంలోనే కమిటీలు వేసి సిలబస్ ను మార్పు చేసినా తమ పరిధిలోని కళాశాలల్లో కొత్త సిలబస్ ప్రకారం బోధన కొనసాగించడంపై దృష్టి సారించడంలేదు. వర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేకపోవడం, అకడమిక్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయకపోవడం, ఇన్చార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు ఉండటంతో పట్టించుకునే వారు లేకుండాపోయారు. రాష్ట్రం లో 1,200 వరకు డిగ్రీ కాలేజీల్లో ప్రధానమైన ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలోనే 800కు పైగా కాలేజీలున్నాయి. కొత్త సిలబస్ అమలుపై ఆ రెండు వర్సిటీలు దృష్టి సారించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త సిలబస్ అమల్లోకి తెస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. మరో వైపు తెలుగు అకాడమీ పాఠాలు రాయించలేకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 300కు పైగా కాలేజీలున్న శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహా త్మాగాంధీ వర్సిటీలు మాత్రమే కొత్త సిలబస్ అమలుకు తమ కౌన్సిళ్లలో తీర్మానం చేశాయి. ఇవే ప్రామాణికం: కొత్త రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, తెలుగు, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సిలబన్‌లో ఏపీ అంశాలను తొలగించి, తెలంగాణ అంశాలతో రూపొందించిచారు. దీని అమలుకు అన్ని వర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో తీర్మానం చేస్తే తెలుగు అకాడమీ పుస్తకాలు రాయించి ము ద్రిస్తుంది. రెండు వర్సిటీలు తీర్మానం చేయకపోవడంతో ముద్రణ ఆగిపోయింది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షల్లో తెలంగాణపై ప్రశ్నలు ఉండనున్నా యి. ఈ క్రమంలో వర్సిటీలు సిలబస్ మార్చకపోవడంతో గందరగోళం నెలకొంది. వచ్చే ఏడాది అమలు: ‘పుస్తకాల రచన వంటి పనులు ఆలస్య కావడం వల్లే ఈసారి కొత్త సిలబస్ అమలు చేయలేక పోయాం. వచ్చే విద్యా సంవత్సరంలో దీన్ని అమలు చేస్తాం’ అని ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఎస్.మల్లేశ్ చెప్పారు. -
టెన్త్ పాతసిలబస్ వారు ఇక ఓపెన్ స్కూల్‌కే!
-
పరీక్షలు రాసేదెలా!!
‘పది’ విద్యార్థులలో ఉత్కంఠ - తల్లిదండ్రులలో ఆందోళన - మారిన సిలబస్‌తో ఇబ్బందులు - సరిగా సాగని విద్యాబోధన - గ్రామీణ ప్రాంతాలలో అవస్థలు బాన్సువాడ : బట్టీ విధానానికి స్వస్తి పలికి సామర్థ్యాల ఆధారంగా, విషయ అవగాహనతో విద్యార్థులు పరీక్షలు రాయాలని విద్యా శాఖ ప్రవేశపెట్టిన నూతన సిలబస్‌కు అనుగుణంగా విద్యాబోధన సాగడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం సిలబస్‌ను మార్చినా, బోధనలో మాత్రం అధికారులు శ్రద్ధ చూపలేదు. పరీక్షల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పదోతరగతి విద్యార్థులలో ఆం దోళన పెరుగుతోంది. నూతన సిలబస్‌తో కుస్తీ పడుతూనే మొదటిసారిగా కొత్త పరీక్షా విధానానికి వారు సిద్ధమవుతున్నారు. మార్చిన సిల బస్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినా, ప్రరుువేటు ఉపాధ్యాయులకు శిక్షణ కరువైంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ తది తర పట్టణాలలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ విధానం అమలవుతున్నా, మారుమూల గ్రా మాలలో మాత్రం కొత్త సిలబస్‌కు అనుగుణం గా బోధన జరలేదని విద్యార్థులే పేర్కొంటున్నా రు. కొత్త విధానంలో బోధించడంతోపాటు వి ద్యార్థులకు ప్రాజెక్టు పనులు అప్పగించడంలో పలువురు ఉపాధ్యాయులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, తమ బిడ్డల భవి ష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. గందరగోళంగా ప్రాజెక్ట్ వర్క్ మారిన సిలబస్ ప్రకారం పాఠ్యాంశం పూర్తి కాగానే విద్యార్థికి ప్రాజె క్టు వర్క్ ఇవ్వాలి. దీనిని పూర్తి చేయడానికి విద్యార్థులు ప్రముఖుల జీవిత చరిత్ర, శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, ఇతర ముఖ్యాంశాల గురించి తెలుసుకోవాల్సి ఉం టుంది. ఇందుకోసం వారు నెట్ సెంటర్లపై ఆధారపడి ప్రాజె క్ట్ వర్క్‌ను పూర్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో నెట్ సౌకర్యం లేని విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రాజెక్టు వర్క్‌కు ఈ సారి 20 మార్కులను కేటాయించనుండడంతో ఉపాధ్యాయులు విద్యార్థి తెలివి అంచనాను బట్టి మార్కులు వేయాల్సి వస్తోం ది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం తెలుగు, ఇం గ్లిష్ మీడియం విద్యార్థులందరికీ ఒకే పరీక్షా వి ధానం అమలు చేస్తోంది. దీనితో ఇంగ్లిష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులు సొంతంగా ఆలోచించి రాయడం కష్టంగా మారింది. సాంఘిక శాస్త్రంలో సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన విద్యార్థులకు మాత్రమే గరిష్ట మార్కులు వచ్చే అవకాశం ఉం ది. గణితంలో కొన్ని అభ్యాసాలు, లెక్కలు చేస్తే పరీక్షల్లో గతంలో అవే తరచుగా వచ్చేవి. ప్ర స్తుత విధానంలో మాదిరి లెక్కలను సాధిం చడం ద్వారా మార్కులు పొందాల్సి ఉంది. పూర్తి కాని సిలబస్ జిల్లాలోని ఇంకా కొన్ని పాఠశాలలలో కొత్త సిల బస్ పూర్తి కాలేదు. మారిన సిలబస్ ప్రకారం ఫిబ్రవరి చివరినాటికి కూడా పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటోంది. పలు పాఠశాలలలో జనవరి సిలబస్ కూడా పూర్తి కాలేదు.ఈ పరిస్థితులలో కొత్త సిలబస్ ప్రకారం విద్యార్థులు పరీక్షలు రాయడం కష్టమేనని విద్యార్థుల తల్లిదండ్రులు చెబు తున్నారు. గతంలో డిసెంబర్ చివరి వరకు సిలబస్ పూర్తి చేసి, ఆ తర్వాత ప్రతి పాఠ్యాంశాలలో ఉన్న కీలక అంశాలు, ప్రశ్నలు, ఖాళీలు పూరించడం తదితర అంశాల పై పునశ్చరణ నిర్వహించేవారు. వెనుకబడినవారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసేవారు. డి-గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారిని కనీస ఉత్తీర్ణతా స్థాయికి తీసుకువచ్చే వారు. ఇదంతా డిసెంబర్ నుంచి మార్చి వరకు పూర్తి చేసేవారు. కానీ, ప్రస్తుతం అలా జరగడం లేదు. సిలబస్ పూర్తయి, మాదిరి పరీక్షల నిర్వహణ కూడా జరగని పా ఠశాలలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల కోసం కొన్ని చిట్కాలు - పిల్లలకు వీలైంత ప్రేమగా చెప్పి చది వించి ఫలితాలు సాధించాలి. తెల్లవారుజామున నిద్ర లేపాలి. - ఈ నెల రోజులు ఇంట్లో టీవీకి కేబుల్ కనెక్షన్ తీసేయిస్తే మంచిది. - పిల్లలు ఏ సబ్జెక్ట్ కష్టమని భావిస్తారో తొ లుత దాన్నే చదివించాలి. మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. - బుల్లెట్ పాయింట్స్, సైడ్ హెడింగ్స్‌తో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. - నెల రోజులకు సంబంధించి టైంటేబుల్ ను తయారు చేసుకొని, తేదీలవారీగా సబ్జెకులకు సమయం కేటాయించాలి. - మ్యాథ్స్ చేయడం వచ్చునని, నిర్లక్ష్యం చేయకూడదు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చే యాలి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో థియరీలను ప్రాక్టీస్ చేయించాలి. - రాత్రి పది గంటల వరకు చదివిస్తే సరిపోతుంది. అంతకు మించి మెలకువగా ఉంచితే పిల్లలు నిద్రలేమితో బాధపడుతారు. సమస్యలు వస్తాయి. - రోజుకు కనీసం ఆరు గంటలు గాఢమైన నిద్ర పోయేలా చూడాలి. - ఉదయం స్నానం చేశాక ఓ 20 నిమిషాలు మెడిటేషన్ లేదా యోగా చేయిస్తే ప్రయోజనం ఉంటుంది. -
ముంచుకొస్తున్న పది పరీక్షల గడువు
కొత్త సిలబస్‌తో కోటి తిప్పలు పత్యేక తరగతులు, పునశ్చరణ లేవు ఫిబ్రవరి నాటికి సిలబస్ పూర్తవడం డౌటే మెరుగైన ఫలితాలు కష్టమంటున్న నిపుణులు ఖమ్మం: పాఠశాలల పనితీరుకు కొలమానం పదో తరగతి ఉత్తీర్ణత శాతం. కానీ ఈ ఏడాది పది ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. మారిన సిలబస్, పరీక్ష విధానం, మార్కుల కేటాయింపు, సిలబస్ పొడగింపు, ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణలో జాప్యం.. ఇవన్నీ ఫలితాలపై ప్రభావం చూపొచ్చని విశ్లేషిస్తున్నారు. మార్చి 25 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించడంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయుల్లో ‘టెన్’షన్ మొదలైంది. సిలబస్ ఇప్పట్లో పూర్తవడం కష్టమే... జిల్లాలో 341 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 384 ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 37,127 మంది విద్యార్థులు ఈ సంవత్సరం మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. డిసెంబర్ నాటికి పదో తరగతి సిలబస్ పూర్తి కావాలి. ఆ తర్వాత పాఠ్యాంశాల్లో కీలకమైనవి, ముఖ్యాంశాలను పునశ్చరణ చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. డీ గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారిని మెరుగుపర్చడం ద్వారా ఉత్తీర్ణత శాతం పెంచాలి. అయితే మారిన సిలబస్ ప్రకారం ఫిబ్రవరి చివరి వరికి కూడా పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది. దీనికి తోడు బట్టీ విధానాన్ని రూపుమాపాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానంతో పాఠ్యాంశం వెనక ఉన్నవి కాకుండా మొత్తం పాఠం నుంచి జనరల్‌గా ప్రశ్నలు వస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశం మొత్తం చదివి, అర్థం చేసుకుంటే తప్ప సమాధానాలు రాయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో చదువులో వెనకబడిన వారిని ఉత్తీర్ణత స్థాయికి తీసుకురావడం కష్టమేనని విద్యా నిపుణులు అంటున్నారు. అందరిలోనూ ఆందోళనే... పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఆధారంగానే ఆ పాఠశాల ఉపాధ్యాయుల , జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరును అంచనా వేస్తారు. అయితే కొత్త సిలబస్‌తో ప్రశ్నపత్రాలు ఏలా ఉంటాయోననే అందోళన ఉపాధ్యాయ, అధికార వర్గాలతో పాటు విద్యార్థుల్లోనూ నెలకొంది. 2010 ఫలితాలలో రాష్ట్రంలో 15వ స్థానం, 2011లో 16, 2012లో 17, 2013లో 19వ స్థానంలోకి జిల్లా పడిపోయింది. దీంతో కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ సంయుక్తంగా పలమార్లు సమావేశాలు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను కనీస ఉత్తీర్ణతా స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక మెటీరియల్ తయారు చేశారు. దీంతో గత సంవత్సరం తెలంగాణలో వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల తర్వాత నాలుగో స్థానంలో, సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో 13వ స్థానంలో నిలిచింది. అయితే ఈ సంవత్సరం అలాంటి చర్యలేమీ చేపట్టే అవకాశం లేదు. దీనికి తోడు ప్రతి ప్రధానోపాధ్యాయుడు పదో తరగతికి కనీసం రోజుకొక పీరియడ్ అయినా తీసుకోవాలని, అలా అయితేనే విద్యార్థుల స్థాయి అంచనా వేయవచ్చని డీఈవో జారీ చేసిన ఉత్తర్వులను సగానికి పైగా పాఠశాలల హెచ్ఎంలు తుంగలో తొక్కినట్లు సమాచారం. దీంతో మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధన కోసం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ఇప్పటికీ పలు పాఠశాలల్లో సగం సిలబస్ కూడా పూర్తి కాలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు నెలల కాలం కీలకంగా భావించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తే తప్ప మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం లేదని విద్యారంగ నిపుణలు అంటున్నారు. -
విషయ వికాసమే విజయ సోపానం...
సాంఘిక శాస్త్రంలో సీసీఈ (ఇఇఉ) లక్ష్యాలు ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలల్లో నేర్చుకున్న సమాచారాన్ని ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకోగలరనే సామర్థ్యంపై ఆధారపడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్న ఈ పద్ధతి వల్ల పిల్లలు తీవ్రమైన ఒత్తిడి, మానసిక వ్యాకులతకు గురవుతున్నారు. దీన్ని నివారించి శారీరక, మానసిక, ఉద్వేగ వికాసాల ఆధారంగా విద్యార్థులు విద్య నేర్చుకోవాలి. పరీక్షలను ఆహ్లాదంగా రాయాలి. ఇలాంటి వైఖరి విద్యార్థులలో పెంపొందించడ మే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) ముఖ్య ఉద్దేశం. నూతన సిలబస్ - విశ్లేషణ గతంలో సాంఘికశాస్త్త్ర పాఠ్యాంశాలను భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అనే విభాగాల కింద విభజించి పాఠ్య పుస్తకంలో పొందుపరిచారు. ఇప్పుడు అలా కాకుండా భూగోళ శాస్త్రం, అర్థ శాస్త్రాలను మొదటి భాగంలో, చరిత్ర, పౌరశాస్త్రాలను రెండో భాగంలో చేర్చి మొత్తం 22 చాప్టర్లను రూపొందించారు. భాగం-1 భూగోళ, అర్థశాస్త్రాలు (1 నుంచి 12 చాప్టర్లు) భూగోళ శాస్త్రంలో భారత దేశ భౌగోళిక స్థితిగతులు, శీతోష్ణస్థితి, నదులు, నీటిపారుదల వ్యవస్థ, జనాభా, వ్యవసాయం-పంటలు- ఆహార భద్రత పాఠ్యాంశాలను చేర్చారు. అర్థశాస్త్రంలో స్థూల జాతీయోత్పత్తి, జాతీయాదాయం, తలసరి ఆదాయం, ఉపాధి, ప్రజల వలసలు, విదేశీ వాణిజ్యం-ప్రపంచీకరణ, పర్యావరణ హక్కులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి గురించి వివరించారు. భాగం-2 చరిత్ర-పౌరశాస్త్రాలు 13 నుంచి 22 చాప్టర్లు ఈ భాగంలో ఆధునిక ప్రపంచ చరిత్ర (క్రీ.శ. 1900 - 1950 సం॥వివిధ వలస పాలన వ్యతిరేక ఉద్యమాలు, భారత జాతీయోద్యమం గురించి పేర్కొన్నారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాణం, 30 సం॥స్వతంత్ర భారతదేశం (క్రీ.శ. 1947 నుంచి 1977 వరకు), దేశంలో వివిధ రాజకీయ ధోరణులు (క్రీ.శ. 1977 నుంచి 2000 వరకు), ఐక్యరాజ్య సమితి-విదేశాలతో భారత సంబంధాలు,భారత దేశంలో సమకాలీన సామాజిక ఉద్యమాలు, సమాచార హక్కు చట్టం, న్యాయసేవ ప్రాధికార సంస్థల గురించి వివరంగా తెలిపారు. పరీక్షా విధానం - ప్రశ్నల రూపకల్పన జవాబులు రాసే తీరు:సీసీఈ విధానంలో నిర్వహించే వార్షిక పరీక్షల్లో కూడా గతంలో మాదిరిగానే రెండు పేపర్లుంటాయి.పేపర్-1లో భూగోళ, అర్థశాస్త్రంలోని పాఠ్యాంశాల నుంచి, పేపర్-2లో చరిత్ర, పౌరశాస్త్రాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. జవాబులను బట్టీపట్టి రాయడానికి అవకాశం లేదు. ఒక ప్రశ్నకు అందరు విద్యార్థులు ఒకేలా సమాధానం రాయాలన్న నిబంధన ఏమీ లేదు. సమాధాన పత్రాల మూల్యాంకన విధానాన్ని కూడా మారుస్తున్నారు. ప్రశ్నలు కూడా బహుళ సమాధానాలు వచ్చే విధంగా ‘ఓపెన్ ఎండెడ్’గా ఉంటాయి. వాటికి విద్యార్థులు బాగా ఆలోచించి, విశ్లేషించి, అన్వయించుకుని, వ్యాఖ్యానిస్తూ జవాబులు రాయాలి. 80 ఎక్స్టర్నల్... 20 ఇంటర్నల్ టేబుల్ వేయాలి పేపర్-1కు 40 మార్కులు, పేపర్-2కు 40 మార్కులు ఉంటాయి. అంటే వార్షిక పరీక్షలో సాంఘిక శాస్త్రానికి రెండు పేపర్లలో కలిపి 80 మార్కులు ఉంటాయి. ఈ రెండింటిలో 35శాతం అంటే 28 మార్కులు సాధించాలి. వీటిని ఎక్స్టర్నల్ పరీక్ష మార్కులుగా భావించాలి. ఇవేకాకుండా 20 మార్కులను ఇంటర్నల్స్‌కు కేటాయించారు. ఈ మార్కులను సంబంధిత పాఠశాల సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరంలో నిర్వహించిన నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాల (ఫార్మేటీవ్ అసెస్మెంట్ -ఎఫ్ఎ)లోని సగటును నిర్ధారించి 20 మార్కులకు కుదిస్తారు. ఈ ఇంటర్నల్స్‌లో కనీసం 7 మార్కులను విద్యార్థులు సాధించాలి. ఆ విధంగా మొత్తం 100మార్కులకు కనీ సం 35 మార్కులు (28 ఎక్స్టర్నల్ మార్కులు+ 7 ఇంటర్నల్ మార్కులు) సాధించిన వారే ఉత్తీర్ణులవుతారు. ఒక్కో పేపర్‌కు సమయం గం. 2.45 ని. ప్రతి పేపర్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి 2 గం. 45ని.ల సమయాన్ని కేటాయించారు. ఇందులో మొదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి విద్యార్థులు ఉపయోగించుకోవాలి. 15 నిమిషాల తర్వాతనే సమాధాన పత్రాన్ని ఇస్తారు. మార్కులు: పేపర్-1లోనూ, పేపర్-2లోనూ ప్రశ్నల సంఖ్య, మార్కులు ఈ విధంగా ఉంటాయి. ప్రశ్నల రకం ఒక్కోదానికి మార్కులు మొత్తం మార్కులు 4 4 16 6 2 12 7 1 07 1/2 10 05 మొత్తం మార్కులు 40 పైవాటిలో 4 మార్కుల ప్రశ్నలలో మాత్రమే చాయిస్ ఉంటుంది. ఆ నాలుగు ప్రశ్నల్లో ఒక్కోదాని కింద ఎ, బి రూపంలో ప్రశ్నలుంటాయి. ఎదైనా ఒకే ప్రశ్నకు సమాధానం రాయాలి. రెండింటికి సమాధానాలు రాసినా ఎక్కువ మార్కులు వచ్చిన ప్రశ్ననే పరిగణనలోకి తీసుకుంటారు. అలా మొత్తం 8 ప్రశ్నల్లో నాలుగింటికి మాత్రమే జవాబులు రాయాలి. 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నల్లో ఎలాంటి చాయిస్ ఉండదు. అన్నింటికీ తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. ప్రశ్నలకు సమాధానాల పరిధి ఇలా ఉండాలి: 4 మార్కుల ప్రశ్నకు 12 నుంచి 15 వాక్యాల సమాధానం రాయాలి. 2 మార్కుల ప్రశ్నకు 5 నుంచి 6 వాక్యాల సమాధానం రాయాలి. 1 మార్కు ప్రశ్నకు 2 నుంచి 3 వాక్యాల సమాధానం రాయాలి. విద్యా ప్రమాణాలు వాటికి కేటాయించిన మార్కులు వార్షిక పరీక్షలలో విద్యా ప్రమాణాల వారీగా మార్కుల కేటాయింపు (పేపర్ 1, 2) విద్యా ప్రమాణాలు కేటాయించిన మార్కులు విషయావగాహన 16 మార్కులు ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం4 మార్కులు సమాచార సేకరణ నైపుణ్యం 6 మార్కులు సమకాలీన అంశాలపై ప్రతిస్పందన -ప్రశ్నించడం4 మార్కులు పట నైపుణ్యాలు 6 మార్కులు ప్రశంస/ అభినందన -సున్నితత్వం 4 మార్కులు మొత్తం 40 మార్కులు విద్యా ప్రమాణాల వారీ ప్రశ్నలు- ఉదాహరణలు ప్రశ్నలు ఏ రకమైన విద్యాప్రమాణాలను సంతృప్త పరుస్తున్నాయో తెలుసుకోవడానికి మొదటి చాప్టర్ భారతదేశం-భౌగోళిక స్వరూపాలలోని ప్రశ్నలను ఉదాహరణగా తీసుకుంటే.... 1.విషయావగాహన ప్రశ్న: భారత దేశ ప్రధాన భౌగోళిక విభజనలేవి? 2.ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం ప్రపంచ భూభాగమంతా రెండు ప్రధాన భూ ఖండాల నుంచి ఏర్పడ్డాయి. అవి 1. అంగారా భూమి (లోరేసియా), 2. గోండ్వానా భూమి. భారత దేశ ద్వీప కల్పం గోండ్వానా భూభాగంలో ఉంది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి, భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యూరేసియా ఫలకం (అంగారా భూమి)తో ఢీకొంది. తదేశంలోని విస్తారమైన ఉత్తర సమతల మైదానాలతో కలిగే లాభాలు ఏమిటి? 3.సమాచార సేకరణ నైపుణ్యాలు: శివాలిక్ శ్రేణిలోని పర్వతాలను జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలని, అరుణాచల్‌ప్రదేశ్‌లో మిష్మి కొండలని పిలుస్తారు. ఆఫ్గాన్‌లో కచార్ కొండలని అంటారు. ఈ ప్రాంతంలో పెద్దపెద్దరాళ్లు, ఒండ్రు మట్టి ఉంటుంది. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్లు అంటారు. వీటిలో ప్రసిద్ధి గాంచిన డూన్లకు ఉదాహరణః డెహ్రాడూన్, కోట్లీ డూన్, పొట్లిడూన్ మొదలైనవి. డూన్ అనగానేమి? అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఏవైనా మూడు కొండల పేర్లను పేర్కొనండి? మన రాష్ట్రంలో ఉన్న ఏవైనా రెండు కొండలను తెలిపి అవి ఏఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయో వివరించండి? 4.సమకాలీన అంశాలపై ప్రతిస్పందన- ప్రశ్నించడం: పశ్చిమాన ఉన్న గుజరాత్లో కంటే అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యోదయం రెండు గంటల ముందు అవుతుంది. కానీ గడియారాలు ఒకే సమయం సూచిస్తాయి. ఎందుకు? 5.పట నైపుణ్యాలు: భారతదేశ పటంలో కింది వాటిని గుర్తించండి? ఆరావళి పర్వతాలు ఐఐ. లక్ష దీవులు ఐఐఐ. మాల్వా పీఠభూమి ఐగ. థార్ ఎడారి 6.ప్రశంస/ అభినందన -సున్నితత్వం:భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? మీ ఉపాధ్యాయుల సహాయంతో అన్ని యూనిట్ల పాఠ్యాంశాలలో విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నలను గుర్తించి, సమాధానం కోసం సాధన చేయాలి. వారి సలహాల ప్రకారం తప్పులను సరిదిద్దుకోవాలి. అధిక మార్కుల సాధనకు సూచనలు ుూనిట్ వారీ ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్నంగా చదవాలి. పాఠం చివర ఉన్న కీలక పదాల నిర్వచనాలను ప్రత్యేక దృష్టితో చదవాలి. పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల విశ్లేషణలను సావధానంగా విని, తమ ప్రతిస్పందనలు సరైనవో, కావో నిర్ధారించుకోవాలి. పాఠాలలోని ముఖ్యాంశాలు, ఉదాహరణలు, గణాంకాలు, చిత్రాలు, పటాలపై పూర్తి అవగాహన కోసం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, మిత్రులతో చర్చించాలి. పట నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇంటి దగ్గర, తరగతి గదిలో ప్రపంచ పటాన్ని, భారతదేశ పటాన్ని, అట్లాస్‌ను నిత్యం సాధన చేయాలి. సమకాలీన అంశాల అవగాహన కోసం ప్రతిరోజు ఒక ప్రామాణిక దినపత్రికను చదవాలి. పాఠ్యాంశాలకు సంబంధించిన అనుబంధ, అదనపు సమాచారాన్ని ఉపాధ్యాయులు లేదా పాఠశాల లైబ్రరీ ద్వారాగానీ సేకరించి నోట్స్ రాసుకోవాలి. పాఠ్యాంశం చివరలో ఉన్న ప్రశ్నలకు సొంతంగా సమాధానం రాయడానికి ప్రయత్నించండి. అలా చేస్తే వ్రాత నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. పాఠశాల నిర్వహించే కమ్యూనిటీ సర్వేలలో, క్షేత్ర పర్యటనలలో విధిగా పాల్గొనాలి. సాంఘికశాస్త్ర పదజాలాన్ని, వాక్య నిర్మాణాన్ని ఉపయోగించి సమాధానాలను రాస్తే ఎక్కువ మార్కులు పొందే అవకాశముంది. సమాధానం రాసేటప్పుడు దానికి సంబంధించిన ప్రాంతాలను గుర్తిస్తూ పటం గీసి విశ్లేషిస్తే గరిష్ట మార్కులు సాధించవచ్చు. సమాచార సేకరణ పని/ప్రాజెక్ట్ పనిని స్వతహాగా, నిబద్ధతతో, పారదర్శకంగా చేపట్టాలి. -
‘పది’లో పాఠ్యాంశంగా మాయాబజార్
ఘట్కేసర్ టౌన్: సాధారణంగా సినిమాలంటే పిల్లలకు మహా సరదా. అలాంటి సినిమాలనే పాఠ్యాంశాలుగా రూపొందిస్తే.. ఈ ఆలోచన బాగుంది కదూ.. ఆలోచనే కాదు.. ఈ ఏడాది పదో తరగతి కొత్త సిలబస్‌లో దీన్ని అమలు చేశారు కూడా. ఇష్టమైన రీతిలో బోధిస్తే కష్టంగా ఉన్నా ఇష్టంగా చదువుతారన్న సత్యాన్ని నమ్మిన సర్కార్ పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగే విధంగా నూతన సిలబస్‌ను అందించింది. తెలుగువారు గర్వించదగ్గ మేటి చిత్రం మాయాబజార్‌ను, మహానటి సావిత్రి జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చింది. ఇక తెలుగు ఉపవాచకంలో రామాయణం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అపురూప దృశ్యకావ్యం 1957లో నిర్మించిన మాయాబజార్ చలన చిత్ర గొప్పదనాన్ని ఇంగ్లిషు పాఠ్యాంశాల్లో వివరించారు. వందేళ్ల సినీ చరిత్రలో మాయాబజార్ కంటే ఉత్తమమైన చిత్రం లేదని ఓ టెలివిజన్ చానల్ నిర్వహించే సర్వేలో వెల్లడైంది. విశ్వవాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు చిత్రం కావడం విశేషం. అప్పుడున్న అతి తక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిత్రాన్ని ఎంత కళాత్మకంగా రూపొందించారో ఈ పాఠంలో పేర్కొన్నారు. కెమెరా టెక్నిక్స్, ఛాయగ్రహణం, కళ, దర్శకత్వం ఇప్పటికీ అం తుచిక్కకపోవడం గమనార్హం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న చిత్రాన్ని భావితరాలకు అందించేందుకు బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న చిత్రాన్ని ఎంతో శ్రమించి కలర్లోకి మార్చారు. ఈ అపురూప దృశ్య కావ్యాన్ని విద్యార్థులకు తెలియపర్చేలా పాఠంలో చేర్చారు. సావిత్రి జీవిత విశేషాలు తెలుగు చిత్రసీమలో మహానటిగా వెలుగొందిన సావిత్రి జీవిత చరిత్రను సైతం ఇంగ్లిషు పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. సావిత్రి తన ఎనిమిదో ఏటనే నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంది. కొత్తలో నటనకు పనికిరాదన్న ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. పట్టుదలతో అవకాశాలు దక్కిం చుకుని 300 చిత్రాల్లో ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించింది. నటనలో గొప్ప కీర్తిని సంపాదించుకుంది. రాష్ట్రపతి అవార్డు సైతం అందుకుంది. ఈ విశేషాలన్నీ పాఠ్యాంశంలో పొందుపర్చారు. ఆకట్టుకునేలా ముద్రణ.. కొత్త పాఠ్యపుస్తకాలను మల్టీకలర్ బొమ్మలతో ఆకర్షణీయంగా రూపొందించారు. తెలుగు పాఠ్య పుస్తకాన్ని తెలుగు దివ్వెలు-2 పేరుతో ముద్రించారు. ఉపవాచకంలో రామాయణాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఆరు ఖండాలను ఇందులో వివరించారు. ఇంగ్లిషు పాఠ్యపుస్తకంలో భారతీయ సినిమా విశేషాలతోపాటు వ్యక్తిత్వ వికాసం పెంపు, హాస్య చతురత, మానవ సంబంధాలు, ఫిలిం అండ్ ఆర్ట్ థియేటర్, బయోడైవర్సిటీ తదితర అంశాల్లో స్ఫూర్తినిచ్చే కథాంశాలతోపాటు పర్యావరణంపై చర్చించారు. జీవశాస్త్రంలో.. జీవశాస్త్రంలో పాఠ్యాంశాలన్నీ చదవడం, చెప్పించడంతోపాటు ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు తదితర అంశాలతోపాటు బోధన, అభ్యసన ప్రక్రియ మరింత మెరుగపడేలా రూపొం దించారు. శిశు వికాస దశలు, మానవ శరీర నిర్మాణం, గుండె నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించే విధంగా పాఠాలు పొందుపర్చారు. సాంఘికశాస్త్రంలో.. సాంఘికశాస్త్రం నాలుగు భాగాలు భూగోళం, చరిత్ర, పౌర, ఆర్థికశాస్త్రంగా ఉండేది. కొత్త సిలబస్‌లో వీటిని ఒక భాగంగా మార్చారు. వనరులు అభివృద్ధి-సమానత ఒక భాగంగా, స మకాలీన ప్రపంచం-భారతదేశం రెండో భాగంగా ఏర్పాటు చేశారు. బజారు, పంచాయతీ, పల్లెసీమల్లోని పొలాలు, వస్తు ప్రదర్శనలు తదితర అంశాలను తెలుసుకునేలా ఈ పుస్తకం ఉంది. విద్యార్థులకు సామాజిక స్పృహ కల్పించడమే కాకుండా వారి మేథోశక్తిని పెంపొందించేందుకు ఈ పుస్తకాలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. -
నర్సింగ్ కోర్సు.. ఇక కొత్తగా...
ఆస్పత్రిలో రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారు సిస్టర్లు. అలాంటి ఈ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే నర్సింగ్ కోర్సు చదవాల్సిందే. రోగులకు సేవలు అందించడంతో పాటు గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరిస్తూ వారిని చైతన్య పరిచేది కూడా సిస్టర్లే కావడం విశేషం. నర్సింగ్ కోర్సు బోధనలో కొంత మేరకు నాణ్యత కనబడకపోవడంతో పాటు, కళాశాలల్లో ప్రవేశం కూడా ప్రతిభకు తగిన విధంగా జరగటం లేదనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కొత్త నిబంధనలను అమలు చేయాలంటూ కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. 2014-2015 విద్యా సంవత్సరం నుంచి సిలబస్, ప్రవేశం, అర్హత, ఫీజుల నియంత్రణ, సీట్ల కేటాయింపును కఠినతరం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్సులు జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్‌లలో నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులు ఉన్నాయి. ఐదు కళాశాలల్లో ఏఎన్ఎం, మూడు కళాశాలల్లో జీఎన్ఎం, ఒక కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో ఇరవై నుంచి న లబై లోపు సీట్లను భర్తీ చేసుకోడానికి అనుమతి ఉంటుంది. కాల వ్యవధి బీఎస్సీ నర్సింగ్ కోర్సు నాలుగున్నర సంవత్సరాలు, జీఎన్ఎం కోర్సు మూడున్నర ఏళ్లు, ఏఎన్ఎం కోర్సు రెండేళ్లు చదవాల్సి ఉంటుంది. ఇంటర్లో బైపీసీ చదవకుండా ఎంపీహెచ్‌డబ్ల్యూ చేసిన వారు జీఎన్ఎం పూర్తి చేస్తేనే బీఎస్సీ నర్సింగ్ చదివే అవకాశం ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధిత యూనివర్సిటీ, జీఎన్ఎం కోర్సుకు మెడికల్ నర్సింగ్ డెరైక్టరు, ఏఎన్ఎం కోర్సుకు ఎంపీహెచ్‌డబ్ల్యూ బోర్డు కార్యదర్శి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తుంది. అర్హత బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులకు కచ్చితంగా ఇంటర్ బైపీసీ చదివి ఉండాలి. ఇంటర్లో 45 శాతం మార్కులు సాధించిన వారే దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. ఏఎన్ఎం కోర్సుకు ఇంటర్లో ఏ గ్రూపులో ఉత్తీర్ణులైనా సరిపోతుంది. మొదటి ప్రాధాన్యం మాత్రం బైపీసీ విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిభ ఆధారంగా ఈ విద్యా సంవత్సరం నుంచి సీటు కేటాయించాలని ఆదేశాలను స్పష్టంగా జారీ చేశారు. గత విద్యా సంవత్సరం వరకు ఇంటర్ ఉత్తీర్ణులైతే చాలు ఫీజు ఎక్కువ ఇచ్చన వారికే సీటు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. వయసు+ఫీజు చదువుతో పాటు వయసును కూడా అధికారులు క్రమబద్ధీకరించారు. 17 నుంచి 30 ఏళ్ల లోపు వారు మాత్రమే ఈ మూడు కోర్సుల్లో చేరడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఐదేళ్ల మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పరిధిలోని సీట్లకు ఈ మూడు కోర్సులకు నెలకు రూ.వెయ్యి రూపాయలు చెల్లించాలి. యాజమాన్యం కోటా కింద సీటు పొందిన వారు నెలకు ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సిలబస్ గత విద్యాసంవత్సరం వరకు కేటాయించిన సిలబస్ వృత్తి వరకే పరిమితమైనది. బీపీ తనిఖీ చేయడం, సూది వేసే విధానం, మందులు ఏ మోతాదులో వేసుకోవాలి, రోగి ఆస్పత్రిలో చేరిన తరువాత నుంచి డిశ్చార్జి అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆస్పత్రి పరిశుభ్రత అంశాలు గత సిలబస్‌లో ఉండేవి. మారిన సిలబస్‌లో వీటితో పాటు అత్యవసర వైద్యసేవలు, ప్రాథమిక వైద్య సేవలు, ప్రజారోగ్య విధి, విధానాలు, పుట్టిన పిల్లలతో పాటు బాలింత, గర్భవతుల ఆరోగ్య పరిరక్షణ అంశాలతో కూడిన సిలబస్‌ను అదనంగా చేర్చారు. -
ఉపాధ్యాయులకు శిక్షణ ఎప్పుడో..?
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఈ విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రకారం విద్యాబోధన చేయడానికి అనుగుణంగా పుస్తకాలను మార్చారు. వారికి అవసరమైన పుస్తకాలను కూడా విద్యాశాఖ అధికారులు వారు సరఫరా చేశారు. కానీ కొత్త సిలబస్‌కు అనుగుణంగా విద్యాబోధన చేసే విషయంలో నేటికీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. దీంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల్లో.... మరో 20 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రా రంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాగానే పదో తరగతి విద్యార్థులకు బోధన కూడా మొదలుపెట్టాల్సి ఉంటుంది. కానీ మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాత సిలబస్ చెప్పడానికి అలవాటు పడిన తాము కొత్త సిలబస్ బోధించాలంటే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సిలబస్ మారితే శిక్షణ ఇచ్చి బోధనలో మెళకువలు నేర్పేవారని, కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదని వారు పేర్కొంటున్నారు. గతేడాదీ ఇదే తంతు గత విద్యా సంవత్సరంలో మారిన పుస్తకాలపై డిసెంబర్ మాసంలో విద్యాశాఖ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. పాఠ్యాంశాలు బోధించిన తర్వాత శిక్షణ ఇవ్వడంతో ఈ కార్యక్రమాలు ప్రయోజనం లేకుండా పోయాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దీంతో పాటు సెలవుల్లో శిక్షణలు ఇవ్వకపోవడంతో విద్యాబోధన కుంటుపడింది. ఈ ప్రభావం ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై పడింది. 11వ స్థానం నుంచి చివరి స్థానానికి దిగజారడంలో ఇదో కారణమని చెప్పవచ్చు. ఉపాధ్యాయులు శిక్షణకు వెళ్లడంతో సిలబస్ పూర్తి చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. అయినా విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్వలేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. వేసవి సెలవుల్లోనే శిక్షణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఆదేశాలు అందలేదు.. - సత్యనారాయణరెడ్డి, డీఈవో ఆదిలాబాద్ పదో తరగతి అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు మారాయి. పదో తరగతికి కొత్త సిలబస్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే విషయంపై మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఇదేశాలు వచ్చిన తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. -
కొత్త సిలబస్‌తో 'ఎంసెట్' స్టడీ మెటీరియల్ పోర్టల్
ఎప్పటికప్పుడు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తోన్న సాక్షిఎడ్యుకేషన్.కామ్ మరో అడుగు ముందుకేసి ఎంసెట్ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో కొత్త సిలబస్‌కు అనుగుణంగా నిపుణులతో రూపొందించిన పూర్తి స్థాయి స్డడీ మెటీరియల్ తో పాటు ప్రిపరేషన్ గెడైన్స్, క్విక్ రివ్యూస్, బిట్ బ్యాంక్, మాక్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్ వంటి సమగ్ర సమాచారం లభిస్తోంది. ఇప్పుడే 'ఎంసెట్' స్టడీ మెటీరియల్ పోర్టల్ లో లాగాన్ అయి ఎంసెట్‌లో మంచి ఫలితాలు పొందండి.