కొత్త సిలబస్‌తో కోటి తిప్పలు
పత్యేక తరగతులు, పునశ్చరణ లేవు
ఫిబ్రవరి నాటికి సిలబస్ పూర్తవడం డౌటే
మెరుగైన ఫలితాలు కష్టమంటున్న నిపుణులు
ఖమ్మం: పాఠశాలల పనితీరుకు కొలమానం పదో తరగతి ఉత్తీర్ణత శాతం. కానీ ఈ ఏడాది పది ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. మారిన సిలబస్, పరీక్ష విధానం, మార్కుల కేటాయింపు, సిలబస్ పొడగింపు, ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణలో జాప్యం.. ఇవన్నీ ఫలితాలపై ప్రభావం చూపొచ్చని విశ్లేషిస్తున్నారు. మార్చి 25 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించడంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయుల్లో ‘టెన్’షన్ మొదలైంది.
సిలబస్ ఇప్పట్లో పూర్తవడం కష్టమే...
జిల్లాలో 341 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 384 ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 37,127 మంది విద్యార్థులు ఈ సంవత్సరం మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. డిసెంబర్ నాటికి పదో తరగతి సిలబస్ పూర్తి కావాలి. ఆ తర్వాత పాఠ్యాంశాల్లో కీలకమైనవి, ముఖ్యాంశాలను పునశ్చరణ చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. డీ గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారిని మెరుగుపర్చడం ద్వారా ఉత్తీర్ణత శాతం పెంచాలి. అయితే మారిన సిలబస్ ప్రకారం ఫిబ్రవరి చివరి వరికి కూడా పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది.
దీనికి తోడు బట్టీ విధానాన్ని రూపుమాపాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానంతో పాఠ్యాంశం వెనక ఉన్నవి కాకుండా మొత్తం పాఠం నుంచి జనరల్‌గా ప్రశ్నలు వస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశం మొత్తం చదివి, అర్థం చేసుకుంటే తప్ప సమాధానాలు రాయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో చదువులో వెనకబడిన వారిని ఉత్తీర్ణత స్థాయికి తీసుకురావడం కష్టమేనని విద్యా నిపుణులు అంటున్నారు.
అందరిలోనూ ఆందోళనే...
పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఆధారంగానే ఆ పాఠశాల ఉపాధ్యాయుల , జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరును అంచనా వేస్తారు. అయితే కొత్త సిలబస్‌తో ప్రశ్నపత్రాలు ఏలా ఉంటాయోననే అందోళన ఉపాధ్యాయ, అధికార వర్గాలతో పాటు విద్యార్థుల్లోనూ నెలకొంది. 2010 ఫలితాలలో రాష్ట్రంలో 15వ స్థానం, 2011లో 16, 2012లో 17, 2013లో 19వ స్థానంలోకి జిల్లా పడిపోయింది. దీంతో కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ సంయుక్తంగా పలమార్లు సమావేశాలు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను కనీస ఉత్తీర్ణతా స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక మెటీరియల్ తయారు చేశారు.
దీంతో గత సంవత్సరం తెలంగాణలో వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల తర్వాత నాలుగో స్థానంలో, సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో 13వ స్థానంలో నిలిచింది. అయితే ఈ సంవత్సరం అలాంటి చర్యలేమీ చేపట్టే అవకాశం లేదు. దీనికి తోడు ప్రతి ప్రధానోపాధ్యాయుడు పదో తరగతికి కనీసం రోజుకొక పీరియడ్ అయినా తీసుకోవాలని, అలా అయితేనే విద్యార్థుల స్థాయి అంచనా వేయవచ్చని డీఈవో జారీ చేసిన ఉత్తర్వులను సగానికి పైగా పాఠశాలల హెచ్‌ఎంలు తుంగలో తొక్కినట్లు సమాచారం.
దీంతో మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధన కోసం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ఇప్పటికీ పలు పాఠశాలల్లో సగం సిలబస్ కూడా పూర్తి కాలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు నెలల కాలం కీలకంగా భావించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తే తప్ప మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం లేదని విద్యారంగ నిపుణలు అంటున్నారు.
ముంచుకొస్తున్న పది పరీక్షల గడువు
Published Sat, Dec 13 2014 3:39 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement