కావాలనే డుమ్మా! | Teachers absent to the evaluation of tenth | Sakshi
Sakshi News home page

కావాలనే డుమ్మా!

Published Sat, Apr 8 2017 10:27 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కావాలనే డుమ్మా! - Sakshi

కావాలనే డుమ్మా!

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన విధులకు కొందరు ఉపాధ్యాయులు దూరంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే డుమ్మా కొడుతున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మూల్యాంకన విధుల్లో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ నుంచి ఆర్డర్లు జారీ అయిన టీచర్లలో దాదాపు సగం మంది.. అందుకు దూరంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇంత మంది గైర్హాజరవడం వెనక ప్రత్యేక సమస్యలేమీ ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూల్యాంకనంపై ఉన్న నిరాసక్తతే ఇందుకు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలున్నవారు, దివ్యాంగులు, ఏడాదిలోపు శిశువులు ఉన్న మహిళా టీచర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు సాధారణంగా గైర్హాజరవుతుంటారు. దీన్ని పెద్దగా ఎవరూ తప్పుపట్టరు కూడా. వీరంతా కచ్చితంగా స్పాట్‌ వాల్యుయేషన్‌కు హాజరుకావాలన్న నిబంధన ఎక్కడా లేదు. ఇటువంటి టీచర్లు ఉన్నట్లయితే... వారికి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి విజ్ఞప్తులు జిల్లా విద్యాశాఖకు అందాయి.

ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో వారందరికీ అధికారులు మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. ఇదే అదునుగా ఇతర టీచర్లు కూడా సాకులతో డుమ్మాలు కొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఉపాధ్యాయులు తమ విధుల్లో భాగంగా పరీక్షలకు సంబంధించిన పనులకూ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని పెడచెవిన పెట్టడం.. ఒక విధంగా ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించడమే అవుతుందని పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

నోటీసులు జారీ.. బేఖాతరు
వివిధ కారణాల వల్ల మూల్యాంకనంలో ఉపాధ్యాయులు పాల్గొనకపోవడంపై ‘సాక్షి’ ఈనెల 6న ‘దూరం.. పెనుభారం’ శీర్షికన ప్రచురించిన కథనం దుమారం రేపింది. ఉపాధ్యాయుల డుమ్మా వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగాధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి కె.సత్యనారాయణ రెడ్డి రంగంలోకి దిగారు. ఆర్డర్లు పొంది.. హయత్‌నగర్‌లోని స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌లో రిపోర్ట్‌ చేయని ఉపాధ్యాయులకు గురువారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధేయత కనబర్చలేకపోయారని నోటీసులో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా సీసీఏ నియమ నిబంధనలు –1991 ప్రకారం క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో స్పష్టం చేయాలని అడిగారు.

24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దాదాపు 2,900 మంది ఉపాధ్యాయులకు మూల్యాంకన ఆర్డర్లు ఇవ్వగా.. ఇందులో సగం మంది కూడా హాజరుకాలేదని అధికారులు చెబుతున్నారు. వీరందరికీ గురువారం నోటీసులు జారీచేసినా.. పెద్దగా ఫలితం కనిపించలేదు. నోటీసులు అందుకున్న వారిలో దాదాపు 20 శాతం మందే.. శుక్రవారం స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌లో రిపోర్ట్‌ చేశారని తెలిసిందే. మిగిలిన 30 శాతం మంది నోటీసులను బేఖాతరు చేసినట్లే.

రగడ..
మరోపక్క టీచర్లకు నోటీసులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ప్రభుత్వం చేసిన తప్పిదాలను పక్కనబెట్టి.. తమను బలిచేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. మూడు జిల్లాలకు కలిపి.. ఒకే క్యాంపును కేటాయించడమే పెద్ద పొరపాటుగా పేర్కొంటున్నాయి. టీఏ, డీఏ తప్పించుకునే క్రమంలోనే పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఎక్కువ మంది ఉపాధ్యాయులకు విధులు కేటాయించారని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ పేర్కొన్నారు.

అలాగే వికారాబాద్, మేడ్చల్‌ జిల్లాల నుంచి కూడా టీచర్లు మూల్యాంకనంలో పాల్గొనడం లేదంటున్నారు. ఆరోగ్య సమస్యలు, ఇతర అత్యవసరంలో ఉన్న ఉపాధ్యాయులను మూల్యాంకన విధుల నుంచి మినహాయించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు కోరారు.మిగిలిన వారు తప్పకుండా వాల్యుయేషన్‌ విధులకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఒక పక్క బడిబాట.. మరోపక్క వాల్యుయేషన్‌ విధులకు ఎలా న్యాయం చేయాలని టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.రఘునందన్‌ రెడ్డి ప్రశ్నించారు. కొన్ని స్కూళ్లకు చెందిన ఉపాధ్యాయులందరికీ విధులు కేటాయించారని.. మరికొన్ని స్కూళ్ల నుంచి ఒక్కరికీ ఆర్డర్లు అందలేదని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి జిల్లాకు ఒక వాల్యుయేషన్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement