విషయ వికాసమే విజయ సోపానం...
సాంఘిక శాస్త్రంలో సీసీఈ (ఇఇఉ) లక్ష్యాలు ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలల్లో నేర్చుకున్న సమాచారాన్ని ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకోగలరనే సామర్థ్యంపై ఆధారపడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్న ఈ పద్ధతి వల్ల పిల్లలు తీవ్రమైన ఒత్తిడి, మానసిక వ్యాకులతకు గురవుతున్నారు. దీన్ని నివారించి శారీరక, మానసిక, ఉద్వేగ వికాసాల ఆధారంగా విద్యార్థులు విద్య నేర్చుకోవాలి. పరీక్షలను ఆహ్లాదంగా రాయాలి. ఇలాంటి వైఖరి విద్యార్థులలో పెంపొందించడ మే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) ముఖ్య ఉద్దేశం.
నూతన సిలబస్ - విశ్లేషణ
గతంలో సాంఘికశాస్త్త్ర పాఠ్యాంశాలను భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అనే విభాగాల కింద విభజించి పాఠ్య పుస్తకంలో పొందుపరిచారు. ఇప్పుడు అలా కాకుండా భూగోళ శాస్త్రం, అర్థ శాస్త్రాలను మొదటి భాగంలో, చరిత్ర, పౌరశాస్త్రాలను రెండో భాగంలో చేర్చి మొత్తం 22 చాప్టర్లను రూపొందించారు.
భాగం-1
భూగోళ, అర్థశాస్త్రాలు (1 నుంచి 12 చాప్టర్లు)
భూగోళ శాస్త్రంలో భారత దేశ భౌగోళిక స్థితిగతులు, శీతోష్ణస్థితి, నదులు, నీటిపారుదల వ్యవస్థ, జనాభా, వ్యవసాయం-పంటలు- ఆహార భద్రత పాఠ్యాంశాలను చేర్చారు. అర్థశాస్త్రంలో స్థూల జాతీయోత్పత్తి, జాతీయాదాయం, తలసరి ఆదాయం, ఉపాధి, ప్రజల వలసలు, విదేశీ వాణిజ్యం-ప్రపంచీకరణ, పర్యావరణ హక్కులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి గురించి వివరించారు.
భాగం-2
చరిత్ర-పౌరశాస్త్రాలు 13 నుంచి 22 చాప్టర్లు
ఈ భాగంలో ఆధునిక ప్రపంచ చరిత్ర (క్రీ.శ. 1900 - 1950 సం॥వివిధ వలస పాలన వ్యతిరేక ఉద్యమాలు, భారత జాతీయోద్యమం గురించి పేర్కొన్నారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాణం, 30 సం॥స్వతంత్ర భారతదేశం (క్రీ.శ. 1947 నుంచి 1977 వరకు), దేశంలో వివిధ రాజకీయ ధోరణులు (క్రీ.శ. 1977 నుంచి 2000 వరకు), ఐక్యరాజ్య సమితి-విదేశాలతో భారత సంబంధాలు,భారత దేశంలో సమకాలీన సామాజిక ఉద్యమాలు, సమాచార హక్కు చట్టం, న్యాయసేవ ప్రాధికార సంస్థల గురించి వివరంగా తెలిపారు.
పరీక్షా విధానం - ప్రశ్నల రూపకల్పన
జవాబులు రాసే తీరు:సీసీఈ విధానంలో నిర్వహించే వార్షిక పరీక్షల్లో కూడా గతంలో మాదిరిగానే రెండు పేపర్లుంటాయి.పేపర్-1లో భూగోళ, అర్థశాస్త్రంలోని పాఠ్యాంశాల నుంచి, పేపర్-2లో చరిత్ర, పౌరశాస్త్రాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. జవాబులను బట్టీపట్టి రాయడానికి అవకాశం లేదు. ఒక ప్రశ్నకు అందరు విద్యార్థులు ఒకేలా సమాధానం రాయాలన్న నిబంధన ఏమీ లేదు. సమాధాన పత్రాల మూల్యాంకన విధానాన్ని కూడా మారుస్తున్నారు. ప్రశ్నలు కూడా బహుళ సమాధానాలు వచ్చే విధంగా ‘ఓపెన్ ఎండెడ్’గా ఉంటాయి. వాటికి విద్యార్థులు బాగా ఆలోచించి, విశ్లేషించి, అన్వయించుకుని, వ్యాఖ్యానిస్తూ జవాబులు రాయాలి.
80 ఎక్స్‌టర్నల్... 20 ఇంటర్నల్ టేబుల్ వేయాలి
పేపర్-1కు 40 మార్కులు, పేపర్-2కు 40 మార్కులు ఉంటాయి. అంటే వార్షిక పరీక్షలో సాంఘిక శాస్త్రానికి రెండు పేపర్లలో కలిపి 80 మార్కులు ఉంటాయి. ఈ రెండింటిలో 35శాతం అంటే 28 మార్కులు సాధించాలి. వీటిని ఎక్స్‌టర్నల్ పరీక్ష మార్కులుగా భావించాలి. ఇవేకాకుండా 20 మార్కులను ఇంటర్నల్స్‌కు కేటాయించారు. ఈ మార్కులను సంబంధిత పాఠశాల సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరంలో నిర్వహించిన నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాల (ఫార్మేటీవ్ అసెస్‌మెంట్ -ఎఫ్‌ఎ)లోని సగటును నిర్ధారించి 20 మార్కులకు కుదిస్తారు. ఈ ఇంటర్నల్స్‌లో కనీసం 7 మార్కులను విద్యార్థులు సాధించాలి. ఆ విధంగా మొత్తం 100మార్కులకు కనీ సం 35 మార్కులు (28 ఎక్స్‌టర్నల్ మార్కులు+ 7 ఇంటర్నల్ మార్కులు) సాధించిన వారే ఉత్తీర్ణులవుతారు.
ఒక్కో పేపర్‌కు సమయం గం. 2.45 ని.
ప్రతి పేపర్‌లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి 2 గం. 45ని.ల సమయాన్ని కేటాయించారు. ఇందులో మొదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి విద్యార్థులు ఉపయోగించుకోవాలి. 15 నిమిషాల తర్వాతనే సమాధాన పత్రాన్ని ఇస్తారు.
మార్కులు:
పేపర్-1లోనూ, పేపర్-2లోనూ ప్రశ్నల సంఖ్య, మార్కులు ఈ విధంగా ఉంటాయి.
ప్రశ్నల రకం ఒక్కోదానికి మార్కులు మొత్తం మార్కులు
4 4 16
6 2 12
7 1 07
1/2 10 05
మొత్తం మార్కులు 40
పైవాటిలో 4 మార్కుల ప్రశ్నలలో మాత్రమే చాయిస్ ఉంటుంది. ఆ నాలుగు ప్రశ్నల్లో ఒక్కోదాని కింద ఎ, బి రూపంలో ప్రశ్నలుంటాయి. ఎదైనా ఒకే ప్రశ్నకు సమాధానం రాయాలి. రెండింటికి సమాధానాలు రాసినా ఎక్కువ మార్కులు వచ్చిన ప్రశ్ననే పరిగణనలోకి తీసుకుంటారు. అలా మొత్తం 8 ప్రశ్నల్లో నాలుగింటికి మాత్రమే జవాబులు రాయాలి. 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నల్లో ఎలాంటి చాయిస్ ఉండదు. అన్నింటికీ తప్పనిసరిగా సమాధానాలు రాయాలి.
ప్రశ్నలకు సమాధానాల పరిధి ఇలా ఉండాలి:
4 మార్కుల ప్రశ్నకు 12 నుంచి 15 వాక్యాల సమాధానం రాయాలి. 2 మార్కుల ప్రశ్నకు 5 నుంచి 6 వాక్యాల సమాధానం రాయాలి. 1 మార్కు ప్రశ్నకు 2 నుంచి 3 వాక్యాల సమాధానం రాయాలి. విద్యా ప్రమాణాలు వాటికి కేటాయించిన మార్కులు
వార్షిక పరీక్షలలో విద్యా ప్రమాణాల వారీగా మార్కుల కేటాయింపు (పేపర్ 1, 2) విద్యా ప్రమాణాలు కేటాయించిన
మార్కులు
విషయావగాహన 16 మార్కులు
ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి,
అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం4 మార్కులు
సమాచార సేకరణ నైపుణ్యం 6 మార్కులు
సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
-ప్రశ్నించడం4 మార్కులు
పట నైపుణ్యాలు 6 మార్కులు
ప్రశంస/ అభినందన -సున్నితత్వం 4 మార్కులు
మొత్తం 40 మార్కులు
విద్యా ప్రమాణాల వారీ ప్రశ్నలు- ఉదాహరణలు
ప్రశ్నలు ఏ రకమైన విద్యాప్రమాణాలను సంతృప్త పరుస్తున్నాయో తెలుసుకోవడానికి మొదటి చాప్టర్ భారతదేశం-భౌగోళిక స్వరూపాలలోని ప్రశ్నలను ఉదాహరణగా తీసుకుంటే....
1.విషయావగాహన ప్రశ్న:
భారత దేశ ప్రధాన భౌగోళిక విభజనలేవి?
2.ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం ప్రపంచ భూభాగమంతా రెండు ప్రధాన భూ ఖండాల నుంచి ఏర్పడ్డాయి. అవి 1. అంగారా భూమి (లోరేసియా), 2. గోండ్వానా భూమి. భారత దేశ ద్వీప కల్పం గోండ్వానా భూభాగంలో ఉంది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి, భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యూరేసియా ఫలకం (అంగారా భూమి)తో ఢీకొంది.
తదేశంలోని విస్తారమైన ఉత్తర సమతల మైదానాలతో కలిగే లాభాలు ఏమిటి?
3.సమాచార సేకరణ నైపుణ్యాలు: శివాలిక్ శ్రేణిలోని పర్వతాలను జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలని, అరుణాచల్‌ప్రదేశ్‌లో మిష్మి కొండలని పిలుస్తారు. ఆఫ్గాన్‌లో కచార్ కొండలని అంటారు. ఈ ప్రాంతంలో పెద్దపెద్దరాళ్లు, ఒండ్రు మట్టి ఉంటుంది. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్‌లు అంటారు. వీటిలో ప్రసిద్ధి గాంచిన డూన్‌లకు ఉదాహరణః డెహ్రాడూన్, కోట్లీ డూన్, పొట్లిడూన్ మొదలైనవి.
డూన్ అనగానేమి?
అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఏవైనా మూడు కొండల పేర్లను పేర్కొనండి?
మన రాష్ట్రంలో ఉన్న ఏవైనా రెండు కొండలను తెలిపి అవి ఏఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయో వివరించండి?
4.సమకాలీన అంశాలపై ప్రతిస్పందన- ప్రశ్నించడం: పశ్చిమాన ఉన్న గుజరాత్‌లో కంటే అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యోదయం రెండు గంటల ముందు అవుతుంది. కానీ గడియారాలు ఒకే సమయం సూచిస్తాయి. ఎందుకు?
5.పట నైపుణ్యాలు:
భారతదేశ పటంలో కింది వాటిని గుర్తించండి?
ఆరావళి పర్వతాలు ఐఐ. లక్ష దీవులు ఐఐఐ. మాల్వా పీఠభూమి ఐగ. థార్ ఎడారి
6.ప్రశంస/ అభినందన -సున్నితత్వం:భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి?
మీ ఉపాధ్యాయుల సహాయంతో అన్ని యూనిట్ల పాఠ్యాంశాలలో విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నలను గుర్తించి, సమాధానం కోసం సాధన చేయాలి. వారి సలహాల ప్రకారం తప్పులను సరిదిద్దుకోవాలి.
అధిక మార్కుల సాధనకు సూచనలు
ుూనిట్ వారీ ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్నంగా చదవాలి. పాఠం చివర ఉన్న కీలక పదాల నిర్వచనాలను ప్రత్యేక దృష్టితో చదవాలి. పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల విశ్లేషణలను సావధానంగా విని, తమ ప్రతిస్పందనలు సరైనవో, కావో నిర్ధారించుకోవాలి. పాఠాలలోని ముఖ్యాంశాలు, ఉదాహరణలు, గణాంకాలు, చిత్రాలు, పటాలపై పూర్తి అవగాహన కోసం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, మిత్రులతో చర్చించాలి. పట నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇంటి దగ్గర, తరగతి గదిలో ప్రపంచ పటాన్ని, భారతదేశ పటాన్ని, అట్లాస్‌ను నిత్యం సాధన చేయాలి. సమకాలీన అంశాల అవగాహన కోసం ప్రతిరోజు ఒక ప్రామాణిక దినపత్రికను చదవాలి.
పాఠ్యాంశాలకు సంబంధించిన అనుబంధ, అదనపు సమాచారాన్ని ఉపాధ్యాయులు లేదా పాఠశాల లైబ్రరీ ద్వారాగానీ సేకరించి నోట్స్ రాసుకోవాలి. పాఠ్యాంశం చివరలో ఉన్న ప్రశ్నలకు సొంతంగా సమాధానం రాయడానికి ప్రయత్నించండి. అలా చేస్తే వ్రాత నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. పాఠశాల నిర్వహించే కమ్యూనిటీ సర్వేలలో, క్షేత్ర పర్యటనలలో విధిగా పాల్గొనాలి. సాంఘికశాస్త్ర పదజాలాన్ని, వాక్య నిర్మాణాన్ని ఉపయోగించి సమాధానాలను రాస్తే ఎక్కువ మార్కులు పొందే అవకాశముంది. సమాధానం రాసేటప్పుడు దానికి సంబంధించిన ప్రాంతాలను గుర్తిస్తూ పటం గీసి విశ్లేషిస్తే గరిష్ట మార్కులు సాధించవచ్చు. సమాచార సేకరణ పని/ప్రాజెక్ట్ పనిని స్వతహాగా, నిబద్ధతతో, పారదర్శకంగా చేపట్టాలి.