ఇంటర్‌ సిలబస్‌ మార్పు | Inter Syllabus Change | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సిలబస్‌ మార్పు

Published Mon, Oct 7 2024 5:07 AM | Last Updated on Mon, Oct 7 2024 5:07 AM

Inter Syllabus Change

2025–26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి

తొలుత ఇంటర్‌ ఫస్టియర్‌లో అమలు.. ఆపై ఏడాది సెకండియర్‌లో మార్పు

నీట్, ఐఐటీకి సిద్ధమయ్యేలా ఎంపీసీ, బైపీసీ పాఠ్యాంశాలు 

పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా హెచ్‌ఈసీలో రాష్ట్ర చరిత్రకు ప్రాధాన్యం

ఆర్థిక అంశాలకు ఎకనామిక్స్‌లో చోటు

జాతీయ స్థాయి సిలబస్‌కు అనుగుణంగా మార్పు

అధ్యయనానికి ఇంటర్, డిగ్రీ లెక్చరర్లు, వర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీలు  

ఇంటర్మీడియెట్‌లో కొత్త సిలబస్‌ అమలు చేసేందుకు ఇంటర్‌ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్‌ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. 

పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్‌ సిలబస్‌ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి.

వాస్తవానికి ఇంటర్‌ సిలబస్‌పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని వైఎస్సార్‌ సీపీ హయాంలోనే నిర్ణయించగా ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి.          – సాక్షి, అమరావతి 

పుష్కర కాలంగా పాత సిలబస్సే
రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్‌ను మార్చారు. అయితే ఇంటర్మీడియట్‌లో దాదాపు పుష్కర కాలంగా పాత సిలబస్సే కొనసాగుతోంది. 

ఈ క్రమంలో ఎన్‌ఈపీ, వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను సవరించి 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ రెండో ఏడాది సిలబస్‌ను మార్చనున్నారు.

పరీక్షల సరళిలో మరిన్ని మార్పులు
ఇంటర్‌ విద్యా మండలి కమిషనర్, కార్యదర్శిగా కృతికా శుక్లా బాధ్యతలు చేపట్టాక 
కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. యూనిట్‌ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్‌ టెస్ట్‌ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్‌ టెస్ట్‌ మాత్రం రాష్ట్రవాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. 

గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకునేటప్పుడు సిలబస్‌ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్‌ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్‌ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.

సైన్స్‌లో జాతీయ స్థాయి   
ఆర్ట్స్‌లో స్టేట్‌ సిలబస్‌
ప్రస్తుతం ఇంటర్‌లో బోధిస్తున్న సిలబస్‌ను 2011–12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు  పాతబడిపోవడం, సైన్స్‌ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్‌డేట్‌ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్‌ బోధిస్తూ, పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లల్లో 6–10 తరగతుల వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. 

ఈ క్రమంలో ఇంటర్‌ సిలబస్‌ను జాతీయ సిలబస్‌కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇంటర్‌ స్థాయిలో నీట్, ఐఐటీ లాంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్‌ను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఐఐటీ, నీట్‌ సిలబస్‌కు అనుగుణంగా సిద్ధం చేస్తూ సిలబస్‌ మార్చనున్నారు. దీంతోపాటు హెచ్‌సీఈలో ఏపీ చరిత్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 

ఆర్థిక శాస్త్రంలోను వర్తమాన మార్పులు జోడించనున్నారు. సిలబస్‌ అధ్యయన కమిటీల్లో ఇంటర్మీడియట్‌ సబ్జెక్టు లెక్చరర్లు నలుగురు నుంచి ఎనిమిది మంది, డిగ్రీ కాలేజీ సబ్జెక్టు లెక్చరర్, యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఉంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement