ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ సిద్ధం
రెండు మూడ్రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌లోకి
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్‌ను సిద్ధం చేసింది. గ్రూప్-1 మొదలుకొని తక్కిన అన్ని గ్రూపుల పరీక్షలకు సిలబస్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ప్రముఖ విద్యావేత్తలతో కూడిన బృందం రూపొందించిన ఈ ముసాయిదా సిలబస్ నివేదికలు ఇటీవలే ఏపీపీఎస్సీకి అందాయి. నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ఈ కసరత్తు సాగింది. ఉమ్మడి ఏపీపీఎస్సీలోని సిలబస్‌లో స్వల్పంగానే మార్పులు చేసి, కొత్తగా అదనపు అంశాలను జోడించినట్లు సమాచారం.
ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం పరిస్థితుల్లో ఏపీలోని అంశాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సిలబస్‌ను తయారు చేశారు. ముఖ్యంగా కొత్త రాజధాని అమరావతి చారిత్రక విశేషాలకు ప్రాధాన్యత కల్పించారు. అలాగే 13 జిల్లాల్లోని అంశాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతం అంశాలకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పించేలా సిలబస్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ ముసాయిదా సిలబస్‌ను రెండు, మూడురోజుల్లో ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పెట్టనున్నారు. పదిరోజుల పాటు నిపుణులు ఇతర ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం వాటిని మళ్లీ నిపుణుల కమిటీకి సమర్పిస్తారు. కమిటీలో చర్చించిన తదుపరి తుది సిలబస్‌ను ఏపీపీఎస్సీ ఖరారు చేస్తుందని సంస్థ ఉన్నతాధికారవర్గాలు వివరించాయి.