Competitive examinations
-
ప్లాట్ ఫామ్ మీది సదువులు!.. కలెక్టర్ చెప్పిన కథ ఇది
వనరులు పుష్కలంగా ఉన్నా.. వాటిని ఎలా వాడుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాం మనం. పైపెచ్చు ‘సొసైటీ మనకేం ఇచ్చింద’ని భారీ డైలాగులు సంధిస్తూ నిందిస్తుంటాం. కానీ, అవసరం మనిషికి ఎంతదాకా అయినా తీసుకుపోతుంది కదా!. పేదరికానికి తోడు అక్కడి పరిస్థితులు.. యువతను రైల్వే స్టేషన్ బాట పట్టించాయి. కొన్నేళ్లుగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న రైల్వే ప్లాట్ ఫామ్స్ కథ మీలో ఎంతమందికి తెలుసు?.. అదే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అనగనగనగా.. బిహార్‌లోని సాసారాం రైల్వే జంక్షన్. రోజు పొద్దుపొద్దునే.. సాయంత్రం పూట వందల మంది యువతీయువకులు ఇక్కడి రైల్వేస్టేషన్‌కు క్యూ కడుతుంటారు. 1, 2 రైల్వే ప్లాట్‌ఫామ్స్ మీద వాళ్ల హడావిడితో కోలాహలం నెలకొంటుంది కాసేపు. అలాగని వాళ్లు ప్రయాణాల కోసం రావట్లేదు. కాసేపటికే అంతా గప్ చుప్. బిజీగా చదువులో మునిగిపోతారు వాళ్లు. వీళ్లలో బ్యాంకింగ్స్ పరీక్షలకు కొందరు, స్టేట్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు మరికొందరు, సివిల్ సర్వీసెస్ పరీక్ష ఇంకొందరు సిద్ధమవుతూ కనిపిస్తుంటారు. కొందరి కష్టానికి అదృష్టం తోడై జాబ్‌లు కొడుతుండగా.. సీనియర్ల నుంచి విలువైన సలహాలు అందుకునేందుకు వచ్చే జూనియర్ల సంఖ్య పోనుపోనూ పెరుగుతూ వస్తోంది. కరెంట్ సమస్యే.. రోహతాస్ జిల్లాలో పేదరికం ఎక్కువ. మూడు పూటల తిండే దొరకడం కష్టమంటే.. పిల్లల్ని కోచింగ్‌లకు పంపించే స్తోమత తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వస్తది?. పైగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అది. చాలా గ్రామాలకు కరెంట్ సదుపాయం లేదు. అదే సాసారాం రైల్వే స్టేషన్లో 24/7 కరెంట్ ఉంటుంది. ఈ ఒక్కకారణం వల్లే చుట్టుపక్కల ఉన్న ఊళ్లలోని యువత అంతా అక్కడికి వస్తోంది. 2002-03లో ఐదారుగురు ఫ్రెండ్స్‌తో మొదలైన బ్యాచ్.. ఇప్పుడు వందల మందితో కొనసాగుతోంది. ప్లాట్‌ఫామ్ లైట్ల వెలుతురులో చదివి తమ నసీబ్ మార్చేసుకోవాలని ప్రయత్నిస్తోంది అక్కడి యువత. విలువైన సలహాలు కొందరైతే ఇంటికి కూడా వెళ్లకుండా చదువుల్లో మునిగిపోతున్నారు. అంతేకాదు వాళ్లలో వాళ్లే పాఠాలు చెప్తూ కనిపిస్తుంటారు అక్కడ. ఇదే ప్లాట్‌ఫామ్ మీద చదివి సక్సెస్ కొట్టిన వాళ్లు సైతం సలహాలు అందించేందుకు అప్పుడప్పుడు వస్తుంటారు. ఈ ఆసక్తిని గమనించే ఇక్కడి అధికారులు సైతం అడ్డుచెప్పడం లేదు. పైగా ఐదు వందల ఐడీకార్డులు సైతం జారీ చేసి వాళ్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇది కొన్నేళ్లుగా కోచింగ్ సెంటర్‌గా నడుస్తున్న.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాసారాం రైల్వే స్టేషన్ కథ. - ఐఏఎస్ అవానిష్ శరణ్ ఛత్తీస్‌గఢ్ కేడర్, 2009 బ్యాచ్ (ట్విటర్ సౌజన్యంతో..) For two hours every morning and evening, both the platforms 1 and 2 of the railway station turn into a coaching class for young people who are aspirants for the Civil Services. Excellent Initiative.👍👏 Courtesy: Anuradha Prasad ILSS. pic.twitter.com/pLMkEn4AOF — Awanish Sharan (@AwanishSharan) October 2, 2021 చూడండి: ఏటీఎం నుంచి డబ్బులు రాగానే యువతి ఏం చేసిందంటే.. -
ప్రభుత్వ ఉద్యోగాల వైపే చూపు
ముంబై: దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత డిమాండ్ ఉందో మనందరికి తెలిసిందే. కానీ సాఫ్ట్వేర్ పరిశ్రమ, ప్రైవేట్ రంగాలలో ఇటీవల కాలంలో కంపెనీలు అత్యధిక వేతనాలు ఆఫర్ చేస్తుండడంతో విద్యార్థులు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కంపెనీలు నియామకాల ప్రక్రియను చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు 6,500మంది ప్రజలతో అడ్డా 247అనే సంస్థ సర్వే నిర్వహించింది. అడ్డా 247 సంస్థ జేఈఈ, నీట్ తదితర ప్రవేశ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రపేరయ్యే వారికి తమ పోర్టల్ ద్వారా అత్యుత్తమ ఫ్యాకల్టీతో మెరుగైన శిక్షణ అందిస్తుంది. అయితే సర్వేలో మెజారిటీ ప్రజలు ఉద్యోగ బధ్రతకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కాగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే వారు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సర్వేలో పాల్గొన్న కొందరు విద్యార్థులు చెప్పినట్లు అడ్డా 247సీఈఓ అనిల్ నగర్ పేర్కొన్నారు. -
పోటీ పరీక్షలకు నిరంతర శిక్షణ: జోగు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా నిరంతరంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి జోగు రామన్న అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ అనితా రాజేందర్, బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర సంచాలకులు గొట్టిపాటి సుజాత, ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, బీసీ అభ్యర్థులు పోటీ పరీక్షల్లో రాణించే విధంగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, లైబ్రరీ, శిక్షణకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాలన్నారు. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లో నిర్మాణాల్లో ఉన్న స్టడీ సర్కిల్ భవనాలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. -
‘వెయిటేజీ’ విధానాన్ని రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ విధానాల్లో పనిచేసే వారికి వెయిటేజీ ఇవ్వడం చెల్లదని హైకోర్టులో వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం వైద్య శాఖలో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాల్లో పనిచేసే వారికి వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్, నల్లగొండ జిల్లాకు చెందిన శేఖర్ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ట్రాన్స్‌కోలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొనడాన్ని వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎం.రఘుమోహన్, సి.క్రాంతికిరణ్‌లు కూడా వేరువేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం తుది విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదిస్తూ, కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం వల్ల ప్రతిభ ఉన్న అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నిర్ణయం చెల్లదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెయిటేజీ మార్కుల పద్ధతిని రద్దు చేయాలని కోరారు. సమగ్ర విచారణ నిమిత్తం కేసును 7వ తేదీ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
పోటీ పరీక్షలు కన్నడలో కూడా నిర్వహించాలి
సీఎం సిద్ధరామయ్య మైసూరు: బ్యాంకుల్లో నియామకాల కోసం జరుగుతున్న పరీక్షలను కన్నడ భాషలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆదివారం మైసూరు నగరానికి చేరుకున్న ఆయన మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల్లో నియమితులయ్యే అధికారులు బ్యాంకులకు వచ్చే వారితో కన్నడ భాషలోనే సంభాషించాల్సి ఉన్న కారణంగా వారికి కన్నడ భాషలో కూడా పరీక్షలు రాయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. క జూన్, జులై నెలల్లో పూర్తిగా ముఖం చాటేసిన వర్షాలు ఆగస్ట్ నెల నుంచి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కురవడంతో రాష్ట్రంలో తాగు,సాగు నీటి సమస్య తీరిపోయిందన్నారు. ఇక బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి కారుపై చెట్టు కూలడంతో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలతో పాటు కాలువలో కొట్టుకుపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలంటూ మంత్రి కే.జే.జార్జ్‌కు సూచించామన్నారు. ఇక గుర్తు తెలియన దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసును తీవ్రంగా పరిగణించామని, కేసుపై జరుగుతున్న విచారణ గురించి ఇప్పుడే మీడియాకు వెల్లడించలేమన్నారు. గౌరీలంకేశ్ హత్య దృష్ట్యా ప్రాణహాని ఉన్న అనేక మంది రచయితలు, సాహితీవేత్తలు, పాత్రికేయులకు రక్షణ కల్పించామన్నారు. ఇక మైసూరు నగరంలోనున్న కర్ణాటక ఓపెన్ యూనివర్శిటీకి యూజీసీ నుంచి గుర్తింపు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసామన్నారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఇదే విషయమై మరోసారి సంబంధిత అధికారులు, మంత్రిని కోరతామన్నారు. కార్యక్రమంలో మంత్రి మహదేవప్ప, కలెక్టర్ డీ.రందీప్ పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ సిద్ధం
రెండు మూడ్రోజుల్లో అధికారిక వెబ్సైట్లోకి సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్‌ను సిద్ధం చేసింది. గ్రూప్-1 మొదలుకొని తక్కిన అన్ని గ్రూపుల పరీక్షలకు సిలబస్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ప్రముఖ విద్యావేత్తలతో కూడిన బృందం రూపొందించిన ఈ ముసాయిదా సిలబస్ నివేదికలు ఇటీవలే ఏపీపీఎస్సీకి అందాయి. నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ఈ కసరత్తు సాగింది. ఉమ్మడి ఏపీపీఎస్సీలోని సిలబస్‌లో స్వల్పంగానే మార్పులు చేసి, కొత్తగా అదనపు అంశాలను జోడించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం పరిస్థితుల్లో ఏపీలోని అంశాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సిలబస్‌ను తయారు చేశారు. ముఖ్యంగా కొత్త రాజధాని అమరావతి చారిత్రక విశేషాలకు ప్రాధాన్యత కల్పించారు. అలాగే 13 జిల్లాల్లోని అంశాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతం అంశాలకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పించేలా సిలబస్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ ముసాయిదా సిలబస్‌ను రెండు, మూడురోజుల్లో ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పెట్టనున్నారు. పదిరోజుల పాటు నిపుణులు ఇతర ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం వాటిని మళ్లీ నిపుణుల కమిటీకి సమర్పిస్తారు. కమిటీలో చర్చించిన తదుపరి తుది సిలబస్‌ను ఏపీపీఎస్సీ ఖరారు చేస్తుందని సంస్థ ఉన్నతాధికారవర్గాలు వివరించాయి. -
పోటీ పరీక్షల్లో మార్పులు.. వచ్చే ఏడాదే
రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ పీఎస్సీ ప్రతిపాదనలు హరగోపాల్ కమిటీ సిఫారసులకు యథాతథంగా ఆమోదం పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడు మార్పులు చేస్తే విద్యార్థులకు నష్టం సిలబస్‌లో మాత్రం తెలంగాణకు అనుగుణంగా సవరణలు గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం వాయిదా వేయాలి అధ్యాపక పోటీ పరీక్షల్లో విద్యా సంబంధ అంశాలతోనే జనరల్ స్టడీస్ రాష్ట్ర స్థాయిలో స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందున పోటీ పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడు మార్పులు చేయవద్దని, తెలంగాణ రాష్ట్రానికి తగిన విధంగా సిలబస్‌ను మాత్రం మార్చి ఉద్యోగ భర్తీ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రభుత్వానికి సూచించింది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయాలన్న జీవో అమలును వాయిదా వేయాలని ప్రతిపాదించింది. లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్-1ను, గ్రూప్-1 మెయిన్స్ ఐదోపేపర్లోనూ పూర్తిగా మార్పులు చేయాలని పేర్కొంది. దీంతోపాటు స్టేట్ సివిల్ సర్వీసెస్ ఉండాలని సూచించింది. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని పోటీ పరీక్షల సమీక్ష కమిటీ చేసిన సిఫారసులను టీఎస్పీఎస్సీ యథాతథంగా ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల విధానంలో మార్పులపై సర్వీసు కమిషన్ శనివారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రొ.హరగోపాల్ నేతృత్వంలోని కమిటీ ఇటీవలే ఈ ప్రతిపాదనలను రూపొందించి, టీఎస్పీఎస్సీకి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అందులోని సిఫారసులపై కమిషన్ శనివారం సమావేశమై చర్చించింది. చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠ ల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీలో హరగోపాల్ కమిటీ సిఫారసులను ఆమోదించి ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. వీటిని ప్రభుత్వం ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సిలబస్‌ను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. రెండింటికి వేర్వేరుగా.. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్చుతూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును... ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒక్కసారికి వాయిదా వేయాలని సమీక్ష కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం పాత పద్ధతిలోనే పరీక్షలను నిర్వహించాలని పేర్కొంది. గ్రూప్-1, గ్రూప్-2లను విడివిడిగానే కొనసాగించాలని తెలిపింది. రెండింటికి వేర్వేరుగా పరీక్షల విధానాన్ని రూపొందించి, అందజేసింది. ఈ సిఫారసులనే టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మెయిన్స్ ఐదో పేపర్లో మార్పులు.. గ్రూప్-1 మెయిన్స్‌లో ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ ఐదో పేపర్‌గా ఉంది. దీని స్థానంలో కొంత గణితంతో పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ను ప్రవేశపెట్టాలని కమిటీ సూచించింది. తెలుగు మీడియం, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారితో పాటు సాంఘికశాస్త్రాలను సబ్జెక్టుగా చదువుకున్న వారు మొత్తం గణితం పేపర్ వల్ల అర్హత పొందలేకపోతున్నారని కమిటీ అధ్యయనంలో తేలిన నేపథ్యంలో ఈ మార్పును సూచించారు. అధ్యాపకుల ‘జనరల్ స్టడీస్’లో మార్పులు గతంలో గెజిటెడ్ అధికారుల నోటిఫికేషన్లలో భాగంగానే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ తదితర పోస్టుల భర్తీ చేపట్టేవారు. అయితే ఇకపై అధ్యాపకుల నియామకాలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని సమీక్ష కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం లెక్చరర్ పోస్టుల భర్తీలో పేపర్-1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ సిలబస్‌లో సమకాలిన అంశాలు, చరిత్ర, అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. ఇకపై లెక్చరర్ పోస్టుల భర్తీ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్-1లో విద్యా విధానం, విద్యా సంబంధ విషయాలు, విద్య, మౌలిక సూత్రాలు, విద్య ప్రాధాన్యం, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలను చేర్చుతారు. అధ్యాపకుడిగా వెళ్లాల్సిన వారికి విద్య సంబంధ అంశాలన్నింటిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని కమిటీ ఈ మార్పులను సిఫారసు చేసింది. అవసరమైతే మార్పులు: చక్రపాణి గ్రూప్-1లో ఎప్పటిలాగానే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ విధానం ఉంటుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. గ్రూప్-2, గ్రూప్-4 ఆబ్జెక్టివ్ విధానంలోని ఉంటాయన్నారు. ప్రతి పరీక్షకు స్కీమ్‌ను, సిలబస్‌ను మార్చే హక్కు టీఎస్ పీఎస్సీకి ఉందని.. పరీక్ష విధానం, సిలబస్‌ను యూపీఎస్సీ తరహాలో నోటిఫికేషన్లోనే ప్రకటిస్తామని చక్రపాణి చెప్పారు. ప్రభుత్వోద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్షలకు పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. డీఎస్సీ తదితర ఏ పరీక్ష అయినా ప్రభుత్వం నిర్ణయిస్తే నిర్వహించడానికి తాము సిద్ధమేనని, అయితే అది ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను పది రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. కాగా తాము సిలబస్‌ను ప్రకటించకముందే కొత్త సిలబస్ ప్రకారం శిక్షణ ఇస్తామంటూ కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని, అలాంటివారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. -
పోటీ పరీక్షలపై నిపుణుల కమిటీ
ప్రొఫెసర్ హరగోపాల్ చైర్మన్‌గా 27 మందితో ఏర్పాటు ప్రొఫెసర్ కోదండరాం, చుక్కా రామయ్య తదితరులకు చోటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల విధి విధానాల్లో మార్పులు, చేర్పులపై అధ్యయనానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) కమిటీని ఏర్పాటు చేసింది. 27 మంది నిపుణులతో కూడిన ఈ కమిటీకే సిలబస్ మార్పుల అంశాన్నీ అప్పగించింది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పోటీ పరీక్షల విధి విధానాలతో పాటు సిలబస్‌లో మార్పులను కూడా ఈ కమిటీ సిఫారసు చేస్తుందని.. అయితే ముందుగా పరీక్ష విధివిధానాలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుందని చక్రపాణి తెలిపారు. సిఫారసులతో కూడిన అధ్యయన నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశామని చెప్పారు. నివేదిక వచ్చిన వెంటనే కమిషన్ దానిని పరిశీలించి ఈ నెలాఖరులో ప్రభుత్వ ఆమోదానికి పంపుతుందని వెల్లడించారు. కమిటీలో సభ్యులు వీరే: కమిటీలో విద్యావేత్త చుక్కా రామయ్య, ఓయూ ప్రొఫెసర్లు ఎం.కోదండరాం, కె.నాగేశ్వర్, రమా మేల్కొటే, జీబీ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, న్యాక్ మాజీ డెరైక్టర్ వీఎస్ ప్రసాద్, కాకతీయ వర్సిటీ మాజీ వీసీ లింగమూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, బీనా, భూపతిరావు, సెస్ నుంచి డాక్టర్ ఇ.రేవతి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ భారత రీజియన్ చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, ఏపీ సెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి.గణేష్, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ వహీదుల్లా సిద్ధిఖీ, డాక్టర్ కనకదుర్గ, అంబ్కేదర్ వర్సిటీ ప్రొఫెసర్ సి.వెంకటయ్య, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిశాంత్ డోంగరి, రిటైర్డ్ లెక్చరర్ నందిని సిధారెడ్డి, సెంట్రల్ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రాజశేఖర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ భద్రూనాయక్, హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ జె.మనోహర్‌రావు, కాకతీయ వర్సిటీ నుంచి డాక్టర్ టి.శ్రీనివాస్, గజ్వేల్ జీఎంఆర్ పాలిటెకి ్నక్ విభాగాధిపతి డాక్టర్ భైరి ప్రభాకర్, నల్సార్ నుంచి డాక్టర్ ఎన్.వసంత్ తదితరులను కమిటీ సభ్యులుగా నియమించారు. -
పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టైం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన కల్పించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఆదిత్యా టవర్స్‌లో ఉన్న టైం సంస్థలో ఆదివారం బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) పోటీ పరీక్షలపై అవగాహన కల్పిం చారు. తిరుపతి టైం సంస్థ నిర్వాహకుడు ఎం.వెంకట్ విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. బ్యాంకు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి? ఉత్తీర్ణులు కావడం ఎలా? అనే అంశాలను వివరించారు. ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే బ్యాంకు ఉద్యోగం సాధించవచ్చన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ పరీక్ష ఎలా రాయాలి? అనే అంశం పై మెళకువలు నేర్పారు. బ్యాంక్ ఉద్యోగాలు పొందాలంటే విద్యార్థులకు కచ్చితత్వం, వేగం అవసరమన్నారు. ఇవి రెండూ పొందాలంటే నిరంతర సాధన అవసరమన్నారు. అలాగే బ్యాంక్ పరీక్షల్లో పరీక్షల విధానం, ప్రశ్నపత్ర సరళిని గురించి విశ్లేషించారు.