సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ విధానాల్లో పనిచేసే వారికి వెయిటేజీ ఇవ్వడం చెల్లదని హైకోర్టులో వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం వైద్య శాఖలో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో పనిచేసే వారికి వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్, నల్లగొండ జిల్లాకు చెందిన శేఖర్ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ట్రాన్స్‌కోలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ నోటిఫికేషన్‌లో పేర్కొనడాన్ని వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎం.రఘుమోహన్, సి.క్రాంతికిరణ్‌లు కూడా వేరువేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం తుది విచారణ ప్రారంభించింది.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదిస్తూ, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం వల్ల ప్రతిభ ఉన్న అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నిర్ణయం చెల్లదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెయిటేజీ మార్కుల పద్ధతిని రద్దు చేయాలని కోరారు. సమగ్ర విచారణ నిమిత్తం కేసును 7వ తేదీ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment