జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కొత్త సిలబస్‌ | New syllabus for JEE Advanced | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కొత్త సిలబస్‌

Published Mon, Jan 24 2022 4:57 AM | Last Updated on Mon, Jan 24 2022 4:57 AM

New syllabus for JEE Advanced - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ను జాయింట్‌ అడ్మిషన్ల బోర్డు (జేఏబీ) సరళీకరించింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను భవిష్యత్‌ పారిశ్రామిక అవసరాలు, ఇంజనీరింగ్‌ కోర్సుల్లోని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిపుణుల కమిటీ సూచనల మేరకు విద్యార్థులపై సిలబస్‌ భారం తగ్గించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల బోర్డులు రూపొందించిన సిలబస్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌ అంశాల్లో పలు అంశాలను చేర్చారు. సవరించిన సిలబస్‌ 2023 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నుంచి అమల్లోకి రానుంది.  

ప్రస్తుత ఇంటర్‌ విద్యార్థులకు ఊరట 
ఈ మార్పుల వల్ల ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థులకు ఒకింత ఊరట కలగనుంది. వారు చదువుతున్న సబ్జెక్టులకు సంబంధించిన అంశాలే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌లోనూ ఉండటంతో వారు ప్రత్యేకంగా వేరే అంశాలపై సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు. ఇంటర్మీడియెట్‌ సబ్జెక్టులతో పాటే అడ్వాన్స్‌డ్‌ అంశాలను కూడా ఒకే సమయంలో వారు నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఇంటర్మీడియెట్‌కు, జేఈఈకి వేర్వేరుగా ప్రిపేర్‌ అవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఇపుడు రెండింటికీ కలిపి ఒకే సిలబస్‌ను అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు జేఈఈ మెయిన్‌లో బోర్డు పరీక్షలలో ఉన్న అంశాలను కవర్‌ చేసినా, అడ్వాన్స్‌డ్‌లో మాత్రం వాటిని కలపలేదు. వేర్వేరు ఇతర అంశాలను ఉంచగా.. ఇప్పుడు వాటి స్థానంలో బోర్డు అంశాలను, ఇంజనీరింగ్‌ విద్యలో వచ్చే సంబంధిత అంశాలను సిలబస్‌లో చేర్చారు. దీనివల్ల విద్యార్థుల్లో గందరగోళానికి తావుండదని, వారి అధ్యయనం సాఫీగా సాగుతుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. 

పోటీ ఇక తీవ్రం 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ను సవరించి బోర్డుల సిలబస్‌లోని అంశాలతో సమానమైన మాదిరిగా మార్పులు చేసినందున ఆ పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో బోర్డుల అంశాలకన్నా భిన్నంగా ఒకింత కఠినమైన రీతిలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ ఉన్నప్పుడు వాటిని అధ్యయనం చేసిన వారు మాత్రమే పరీక్షలను బాగా ఎదుర్కొనగలిగే వారు. కానీ.. ఇప్పుడు బోర్డులతో సమానం చేసినందున ఆ సిలబస్‌ను ప్రిపేర్‌ అయిన వారిలో ఎక్కువమంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధం కాగలుగుతారని, తద్వారా అత్యధిక మార్కులు సాధించగలవారు మాత్రమే ఎంపికవుతారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యేందుకు పోటీ అత్యధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

వాస్తవానికి ఐఐటీలు సహా ఇంజనీరింగ్‌ విద్యకు సంబంధించి సిలబస్‌ను ప్రతి ఐదేళ్లకు ఒకసారి సవరిస్తుంటారు. అలాగే పాఠ్యప్రణాళికను పదేళ్లకోసారి పునర్వ్యవస్థీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ను సవరించారు. 11, 12 తరగతులకు (ఇంటర్మీడియెట్‌) సంబంధించి ఫిజిక్స్, మేథమేటిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌ను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సవరించింది. ఆ సంవత్సరంలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ను సమీక్షించి మార్పులను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డ్‌ (జేఏబీ) ఈ సిలబస్‌ రివిజన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో ఏడు ప్రధాన ఐఐటీలు ముంబై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, గౌహతి, రూర్కీలకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌ ఫ్యాకల్టీ సభ్యులను నియమించారు. వీరు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సిలబస్‌ మార్పులపై సిఫార్సులు చేశారు. వారి విభాగాల వారితో పాటు ఇతర ఫ్యాకల్టీల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని ఈ సిఫార్సులు అందించారు. 

సబ్జెక్టుల వారీగా మార్పులు ఇలా.. 
భౌతిక శాస్త్రంలో ఇప్పుడున్న ఏ అంశాన్నీ తొలగించలేదు. కొన్ని అధిక స్కోరింగ్‌ అంశాలు జోడించారు. ఇవి మునుపటి కంటే సులభంగా ఉండేలా రూపొందించారు. ఎలక్ట్రానిక్‌ వేవ్స్, సర్ఫేస్‌ టెన్షన్‌ వంటివి ఇందులో ఉన్నాయి. కెమిస్ట్రీలో న్యూక్లియర్‌ కెమిస్ట్రీని తొలగించారు. బయో కెమిస్ట్రీ,  ఫిజికల్‌ కెమిస్ట్రీ విభాగాలలో క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్, పెరియోడిక్టీ ఇన్‌ ప్రాపర్టీస్, హైడ్రోజన్, ఎఫ్‌–బ్లాక్‌ ఎలిమెంట్స్, క్రిస్టిల్‌ ఫీల్డ్‌ థియరీ, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్‌ ఎవ్రీడే, బయో మాలిక్యూల్స్‌ వంటి అంశాలను జోడించారు. మేథమేటిక్స్‌లో హార్మోనిక్‌ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్‌ సొల్యూషన్‌ అంశాలను తొలగించారు. ఆల్జీబ్రాలో ప్రాథమిక అంశాలు, చతుర్భుజ సమీకరణాలు, సెట్‌ సిద్ధాంతం, స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ రోఆపరేషన్స్‌ వంటివి చేర్చారు.  

మేథ్స్, ఫిజిక్స్‌లో క్లిష్టత స్థాయి తగ్గినట్టే.. 
సిలబస్‌ సవరణ వల్ల మేథ్స్, ఫిజిక్స్‌లలో క్లిష్టత స్థాయి గతంలో కన్నా కొంత తగ్గినట్టేనని కోచింగ్‌ సెంటర్ల అధ్యాపకులంటున్నారు. ఇంటతో సంబంధమున్న అంశాలను, సైద్ధాంతిక అధ్యాయాలను జోడించడం వల్ల రసాయన శాస్త్రం విభాగం కూడా సులభంగా మారొచ్చంటున్నారు. జేఈఈ మెయిన్‌ కన్నా భిన్నమైన రీతిలో అడ్వాన్స్‌డ్‌ ప్రశ్నల స్థాయి ఉంటున్నందున ఆయా అంశాలను లోతుగా చదవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

స్కోరు పెంచుకోవచ్చు 
జేఈఈ మెయిన్‌ను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ స్కోరును పెంచుకోవడానికి ఈ విధానం వారికి ఆస్కారమిచ్చింది. ఇప్పుడు సిలబస్‌ను కూడా సవరించినందున మంచి స్కోరు సాధించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ మార్కులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సిలబస్‌ను మార్పు చేసినా ప్యాట్రన్‌ మాత్రం గతంలో మాదిరిగానే ఉండనుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్‌ నుంచి టాప్‌ స్కోరులో నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. మెరిట్‌లో నిలిచిన వారికి రిజర్వేషన్ల ప్రకారం ఆయా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో 11,326 సీట్లు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు కేటాయించడంతో ఆ సంఖ్య 13,376కు పెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement