సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడంటే అతిశయోక్తి కాదు. అయితే వీటిలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్‌డ్ అత్యంత క్లిష్టమైనవి. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధిస్తేనే ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ర్యాంకులు సాధించడం అటుంచి ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించడమే ఒకప్పుడు కష్టంగా ఉండేది. 15 ఏళ్ల క్రితం ఐఐటీలు, ఎన్‌ఐటీల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
అంతేకాకుండా వీటికి శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. నాణ్యమైన మెటీరియల్ కొరత కూడా ఉండేది. అయితే 2008 నుంచి కొత్త ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా శిక్షణా కేంద్రాలూ పెరిగాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ శిక్షణ కూడా అందుబాటులో కొచ్చింది. దీంతో ఐఐటీల్లో సీటు సాధించేవారి సంఖ్య పెరిగింది.
2007లో ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో కేవలం 3 శాతంలోపు మాత్రమే ఉన్న ఉత్తీర్ణుల సంఖ్య తాజాగా 30 శాతం వరకు చేరడం ఇందుకు నిదర్శనం. గతంలో ఐఐటీ–జేఈఈగా, జేఈఈ మెయిన్‌గా, ఏఐఈఈఈగా వేర్వేరు పేర్లతో కొనసాగిన ప్రవేశ పరీక్షలు ప్రస్తుతం జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి.
ప్రవేశానికి రెండంచెల విధానం..
ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లను ప్రవేశపెట్టారు. ఈ పరీక్షల కోసం ప్రస్తుతం 10 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు. ఏక పరీక్ష విధానం ఉన్నప్పుడు కూడా అభ్యర్థులు లక్షల్లోనే పరీక్ష రాసేవారు. ఐఐటీ ప్రవేశపరీక్షలో క్వాలిఫై అయినవారు 2007లో 2.96 శాతం, 2008లో 2.77 శాతం, 2009లో 2.60, 2010లో 2.87, 2011లో 2.81, 2012లో 5.02 శాతం మంది ఉన్నారు.
2013 నుంచి రెండు విడతల వడపోత విధానం (జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్) అమల్లోకి వచ్చాక మెయిన్ పరీక్ష దాటుకుని అడ్వాన్స్‌డ్ పరీక్ష దాకా వచ్చే అభ్యర్థుల సంఖ్య తగ్గింది. 2013లో అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1,26,749 మంది దరఖాస్తు చేయగా 1,15,971 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 20,834 మంది (17.96 శాతం) అర్హత మార్కులు సాధించారు. 2014లో 22.70, 2015లో 22.47, 2016లో 24.76, 2017లో 31.99 శాతం, 2018లో 20.61, 2019లో 23.99 శాతం, 2020లో 28.64 శాతం, 2021లో 29.19 శాతం మంది అడ్వాన్స్‌డ్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు.
నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నేతృత్వంలో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. జూలైలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 8లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2.5 లక్షలమంది అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత సాధించారు. అయితే, కేవలం 1.60 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఈ పరీక్షకు సంబంధించిన పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎన్‌టీఏ పేర్కొంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. ఈసారి పేపర్–1, పేపర్–2 కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ప్రకటించింది.
సరైన జవాబు రాస్తే 4 మార్కులు, సమాధానం తప్పయితే ఒక మార్కు మైనస్ అవుతుంది. ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వనిధులతో నడిచే ఇతర సంస్థల్లో దాదాపు 50 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా నిట్‌లో, అడ్వాన్స్‌డ్ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment