సాధారణంగా దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కొట్టాల్సిందే. కానీ ఇక మీదట సాదాసీదా డిగ్రీ విద్యార్థులు కూడా ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేయవచ్చు. జాతీయ స్థాయిలో ఈ తరహా కసరత్తు వేగంగా ముందుకెళ్తోంది. కోవిడ్ కాలంలో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు అనేక రూపాల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది.
దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లు 50 వేల లోపే. అందులోనూ ఐఐటీల్లో ఉన్నవి 16 వేలు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా మంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో అవసరమైన కొన్ని కోర్సులను ఐఐటీల ద్వారా సర్టిఫికేట్ కోర్సులుగా అందించాలని ఐఐటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి.
– సాక్షి, హైదరాబాద్
కోవిడ్ కాలంలో..
కోవిడ్ సమయంలో విద్యార్థులు ఆన్‌లైన్ విద్యకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను డిజైన్ చేసినట్లు ఐఐటీలు చెబుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని మద్రాస్ ఐఐటీ ఇటీవల తెలిపింది. ఈ సంస్థ ప్రతినిధులు వివిధ రాష్ట్రాలోని కాలేజీలకు వెళ్లి ఆన్‌లైన్ కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. మిగతా ఐఐటీలు సరికొత్త సర్టిఫికెట్ కోర్సులను తెరపైకి తెచ్చాయి.
ఇవీ కోర్సులు..
ఎంటెక్‌లో ఆన్‌లైన్ కోర్సులకు ఐఐటీ హైదరాబాద్ గతేడాది సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్కెట్ డిమాండ్ కోర్సులను ఈ ఏడాది తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
మరికొన్ని ఐఐటీలు ఈ సంవత్సరం నుంచి మార్కెట్ వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా ఎంటెక్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను తీసుకొస్తున్నాయి. 2020లో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కోర్సులో 18 వేల మంది చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. నాలుగేళ్ల బీఎస్సీ ఎల్రక్టానిక్స్ కోర్సును ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది.
ఐఐటీ బాంబే డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్‌లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెరి్నంగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందిస్తున్నట్లు ప్రకటించింది.
పట్నా ఐఐటీ ఎంటెక్ ఇన్ బిగ్ డేటా అండ్ బ్లాక్‌చైన్, ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను మరింత ఆధునీకరిస్తూ అందిస్తోంది. అయితే వాటిని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అందించాలని నిర్ణయించింది.
ఢిల్లీ ఐఐటీ కూడా జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందించనుంది. ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషీన్ లెరి్నంగ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ స్టార్టప్ బూట్‌క్యాంప్, న్యూ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సులున్నాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సులువు..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడూ నైపుణ్యానికి పదును పెట్టాల్సిందే. ఇలాంటి మళ్లీ వారు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతర్జాతీయ ప్రమాణాలున్న ఐఐటీ సంస్థల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. ఐఐటీ ద్వారా సర్టిఫికెట్ కోర్సు చేస్తే మంచి ఫ్యాకల్టీ ద్వారా పాఠాలు వినడమే కాకుండా ఆ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ ఉంటుంది. మరింత మెరుగైన ఉపాధికి ఆస్కారం ఉండే వీలుంది.
ట్రెండ్ మంచిదే...
అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐఐటీలు మంచి కోర్సులు ఆఫర్ చేయడం మంచిదే. అయితే ఇవి కేవలం సర్టిఫికెట్ల జారీకే పరిమితం కాకూడదు. కోర్సు నేర్చుకొనే విద్యార్థులు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అంతర్జాతీయంగా మంచి ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. –ప్రొ.శ్రీరాం వెంకటేష్ (ఓయూ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్)
Comments
Please login to add a commentAdd a comment