ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఈ విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రకారం విద్యాబోధన చేయడానికి అనుగుణంగా పుస్తకాలను మార్చారు. వారికి అవసరమైన పుస్తకాలను కూడా విద్యాశాఖ అధికారులు వారు సరఫరా చేశారు. కానీ కొత్త సిలబస్‌కు అనుగుణంగా విద్యాబోధన చేసే విషయంలో నేటికీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. దీంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
20 రోజుల్లో....
మరో 20 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రా రంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాగానే పదో తరగతి విద్యార్థులకు బోధన కూడా మొదలుపెట్టాల్సి ఉంటుంది. కానీ మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాత సిలబస్ చెప్పడానికి అలవాటు పడిన తాము కొత్త సిలబస్ బోధించాలంటే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సిలబస్ మారితే శిక్షణ ఇచ్చి బోధనలో మెళకువలు నేర్పేవారని, కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదని వారు పేర్కొంటున్నారు.
గతేడాదీ ఇదే తంతు
గత విద్యా సంవత్సరంలో మారిన పుస్తకాలపై డిసెంబర్ మాసంలో విద్యాశాఖ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. పాఠ్యాంశాలు బోధించిన తర్వాత శిక్షణ ఇవ్వడంతో ఈ కార్యక్రమాలు ప్రయోజనం లేకుండా పోయాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దీంతో పాటు సెలవుల్లో శిక్షణలు ఇవ్వకపోవడంతో విద్యాబోధన కుంటుపడింది. ఈ ప్రభావం ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై పడింది. 11వ స్థానం నుంచి చివరి స్థానానికి దిగజారడంలో ఇదో కారణమని చెప్పవచ్చు. ఉపాధ్యాయులు శిక్షణకు వెళ్లడంతో సిలబస్ పూర్తి చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. అయినా విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్వలేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. వేసవి సెలవుల్లోనే శిక్షణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ఆదేశాలు అందలేదు.. - సత్యనారాయణరెడ్డి, డీఈవో ఆదిలాబాద్
పదో తరగతి అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు మారాయి. పదో తరగతికి కొత్త సిలబస్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే విషయంపై మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఇదేశాలు వచ్చిన తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తాం.
ఉపాధ్యాయులకు శిక్షణ ఎప్పుడో..?
Published Sat, May 24 2014 2:21 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement
Advertisement