సాక్షి, మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్యాసంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, సినిమా థియేటర్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా, అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా బహుళ అంతస్తులు నిర్మితమవుతున్నాయి. జిల్లాలో కేవలం మూడు భవనాలకే అనుమతి ఉండడం, దాదాపు 665కిపైగా బహుళ అంతస్తులకు అనుమతి లేదు. అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఆఘమేఘాల మీద భవనాలు నిర్మిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉన్నా బేఖాతర్ చేస్తున్నారు. భవన యజమానులకు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొనడం విశేషం.
రోగులకు భరోసా ఏదీ?..
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం..
జిల్లాలో 197 ఆస్పత్రులు అగ్నిమాపకశాఖ అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. రోగుల ప్రాణాలకు భ రోసా కల్పించాల్సిన వైద్యులే వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఏదైన ప్రమాదం జరిగిన వెంటనే రోగులు ఆస్పత్రి నుంచి బయటికి రాలేరు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఇంద్రవెల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మాత్రమే అగ్నిమాపక శాఖ అనుమతితో కొన సాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఒక్క ఆస్పత్రి కూడా అనుమతి తీసుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 297 కాలేజీలు, పాఠశాలలు, వసతి గృహాలు అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోలేదు. మంచిర్యాల, పరిసర ప్రాంతాల్లో 92, ఆదిలాబాద్‌లో 52, నిర్మల్‌లో 49 విద్యా సంస్థలకు అనుమతి లేదు. ప్రమాదవశాత్తూ ఏదైన ప్రమాదం జరిగితే కనీసం విద్యార్థులు బయటకు వెళ్లలేని పరిస్థితి.
వినోదం మాటున ప్రమాదం
జిల్లావ్యాప్తంగా 17 సినిమా థియేటర్లు ఉన్నాయి. రోజు వేలాది మందికి ఆహ్లాదం పంచుతున్నాయి. మంటలు చెలరేగితే వారి ప్రాణాలకూ భరోసా లేదు. జిల్లాలో మంచిర్యాలలో రెండు థియేటర్లు మాత్రమే అనుమతితో కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ , నిర్మల్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లలో ఒక్క సినిమా హాల్‌కూ అనుమతి లేదు.
ఆర్డీవోలు మేమిచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ చూడకుండా థియేటర్లకు అనుమతులు ఇచ్చేశారని జిల్లా అగ్నిమాపకశాఖాధికారి సందయ్య చెప్పారు. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా 59 షాపింగ్ కాంప్లెక్స్‌లు, 33 లాడ్జీలు, 45 కల్యాణ మండపాలు, 19 హోటళ్లు, రెస్టారెంట్లు అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి.
శాఖల మధ్య సమన్వయ లోపం
జిల్లావ్యాప్తంగా నిర్మించిన, నిర్మాణంలో ఉన్న భవంతులకు ముందుగా అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. ఈ శాఖ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసి) చూసిన తర్వాతే మున్సిపల్, రెవెన్యూ అధికారులు సమ్మతించాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడం లేదు. స్థానిక అధికారులు తమ అనుమతిలేకుండానే భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేస్తున్నారని అగ్నిమాపక శాఖాధికారులు చెబుతున్నారు.
మంచిర్యాల పరిధిలో ఉన్న ఏడు ఫంక్షన్ హాళ్లకు నోటీసులు ఇచ్చామని, మున్సిపల్ కమిషనర్‌తో చర్చించామని అయినా ఎవరూ అనుమతి తీసుకోలేదని మంచిర్యాల స్టేషన్‌ఫైర్ అధికారి రాజయ్య చెప్పారు. కేవలం మంచిర్యాలలోనే అనుమతి లేని ఎన్నో భవంతులకు ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చామని.. అయినా అనుమతి తీసుకోలేదని ఈ సారి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా అనమతి తీసుకోని భవన యజమానులపై హైకోర్టులో కేసు వేస్తామని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సందయ్య తెలిపారు.
నిబంధనలు..
230 గజాల స్థలంలో జీ ప్లస్(మూడంతస్తులు) భవనాలు నిర్మించాలి.
భవనాల చుట్టూ ఫైరింజన్ తిరిగే విధంగా ఆరు మీటర్ల చొప్పున ఖాళీ స్థలం వదిలేయాలి.
అపార్ట్‌మెంట్ లోపలి మెట్లు మీటరు, వెలుపలి మెట్లు 1.5 మీటర్ల వెడల్పుతో ఉండాలి.
ఎమర్జెన్సీ లైట్లు తప్పకుండా ఉండాలి. మంటలు ఆర్పేందుకు ఒక్కో అంతస్తులు రెండేసీ చొప్పున ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉండాలి. ఇసుక, నీళ్ల బకెట్లు, డ్రై కెమికల్ పౌడర్ ఉండాలి.
అత్యవసర సమయాల్లో నీటి సరఫరాకు హోజరిల్, డౌన్ కమర్ ఉండాలి. నీరు వెదజల్లే సిస్టమ్ ప్రతీ అంతస్తులోనూ ఉండాలి.
విద్యుత్ ఫైర్, మాన్యూవల్ అలారం తప్పనిసరి. భూగర్భ నీటి ట్యాంకులు తప్పకుండా ఉండాలి. అగ్నిమాపక శటకం లోపలికి వెళ్లేందుకు వీలుండాలి.
అపార్ట్‌మెంట్ అనుమతి పొందిన తర్వాత ప్రతీ ఏడాది సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోవాలి.
విద్యాసంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, ఆస్పత్రులు మీటరుకు రూ.10 చొప్పున రుసుం చెల్లించాలి. సినిమా థియేటర్ల యజమానులు ఏడాదికి రూ.10 వేలు చెల్లించి అగ్నిమాపక శాఖతో రెన్యూవల్ చేసుకోవాలి.
అగ్గి రాజుకుంటే.. బుగ్గి
Published Fri, Aug 23 2013 3:05 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement
Advertisement