సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ దివ్య దేవరాజన్
బోథ్(ఆదిలాబాద్) : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతాయని కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. మండలంలోని వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో స్థానిక పరిచయ గార్డెన్‌లో మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు వివరించగా త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రైతుల కోసం కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్1800–120–3244కు ఫోన్ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, రుణాల వంటి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎంపీడీవో, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు గ్రామపంచాయతీ 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను వెచ్చించాలన్నారు. మండలంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారుల కృషి చేయాలన్నారు. జిల్లాలో జైనథ్, బోథ్, ఇచ్చోడ, బేల, ఆదిలాబాద్ మార్కెట్లలో శెనగ కొనుగోలు కేంద్రాలను వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో రాథోడ్ రాజేశ్వర్, ఎంపీపీ గంగుల లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు బండారు సాయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శారద, బోథ్ సర్పంచ్ మంగారపు సునీత, తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్, ఎంపీడీవో బి.అప్పారావ్, వ్యవసాయాధికారి భాస్కర్, ఎఫ్‌ఆర్వో మనోహర్, రైతు సమసన్వయ సమితి అధ్యక్షుడు రుక్మణ్‌సింగ్, వివిధశాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆసుపత్రి తనిఖీ
అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ గది నిర్మాణం పూర్తి కాకపోవడంతో సంబంధిత ఈఈతో ఫోన్‌లో మాట్లాడి సత్వరం పూర్తయ్యేలే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచించారు.
ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి
బజార్‌హత్నూర్(బోథ్): గ్రామాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వివరించగా.. పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రాథోడ్, జెడ్పీటీసీ మునేశ్వర్ నారాయణ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అల్కే గణేశ్, జిల్లా సభ్యులు చిల్కూరి భూమన్న, సహకార సంఘం చైర్మన్ తురాటి భోజన్న, వైస్ ఎంపీపీ శ్రీమతి, సర్పంచ్‌లు సాయన్న, భాస్కర్‌రెడ్డి, విద్యాసాగర్, రాధ, భీంబాయి, పద్మ, రేణుక, కైలాస్, రాజు, ఎంపీటీసీలు నారాయణ, గంగాప్రసాద్, తహసీల్దార్ రాజేందర్‌సింగ్, ఎంపీడీవో శంకర్, ఏవో ప్రమోద్‌రెడ్డి పాల్గొన్నారు.
కస్తూరిబా పాఠశాల, పీహెచ్‌సీ తనిఖీ
మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌వో సెలవుపై ఉండడంతో పర్యవేక్షణ కరువైందని చెప్పగా రెగ్యూలర్ ఎస్‌వోను నియమిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేశారు. ప్రసుతి గది, రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి ప్రహరీకి నిధులు కేటాయిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment