PHD courses
-
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి/నూజివీడు/వేంపల్లె: ట్రిపుల్ ఐటీల్లో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ఉన్న 4,400 సీట్లకు ఈ ఏడాది 38,355 మంది దరఖాస్తు చేశారన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 23,628(83శాతం) మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 14,727(17 శాతం) మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా కౌన్సెలింగ్‌కు ఎంపిక చేశామన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినవారి జాబితాను గురువారం మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు ఎంపికైన టాప్–20లో ప్రభుత్వ విద్యార్థులే ఉన్నారని వెల్లడించారు. పదో తరగతిలో 600కి 599 మార్కులు వచ్చిన విద్యార్థి సైతం ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం గర్వకారణమన్నారు. కౌన్సెలింగ్‌కు ఎంపికైన జనరల్ విద్యార్థుల కటాఫ్ మార్కులు 583గా ఉన్నట్టు చెప్పారు. ట్రిపుల్ ఐటీల్లో ఇప్పటికే పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి పీహెచ్డీ కోర్సులనూ ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు. కాగా, ఈ నెల 20, 21 తేదీల్లో నూజివీడు క్యాంపస్‌లో, 21, 22 తేదీల్లో ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ)లో, ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి 24, 25 తేదీల్లో ఆర్కే వ్యాలీలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మొత్తం అర్హుల్లో 3,345 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 695 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కార్య క్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి, వైస్ చాన్స లర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆర్ట్స్ కోర్సులకే అందలం! దేశంలో యూజీ కోర్సుల్లోనే అత్యధిక చేరికలు
సాక్షి, అమరావతి: దేశంలో వివిధ ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్ట్స్ కోర్సులవైపే మొగ్గుచూపుతున్నారు. బీఏలో ఏకంగా 1.04 కోట్ల మంది చేరగా ఆ తర్వాత బీఎస్సీలో 49.12 లక్షల మంది, బీకాంలో 43.22 లక్షల మంది చేరారు. ఉన్నతవిద్యా కోర్సుల్లో చేరినవారిలో ఏకంగా 78.9 శాతం మంది అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోర్సుల్లోనే ఉండటం గమనార్హం. ఇదే సమయంలో పీజీ కోర్సులు చదువుతున్నవారు కేవలం 11.4 శాతానికే పరిమితమయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హాట్ ఫేవరెట్ కోర్సులు అయిన బీటెక్‌లో 23.20 లక్షల మంది చేరగా, బీఈలో 13.42 లక్షల మంది ఉన్నారు. ఈ మేరకు దేశంలోని వివిధ కోర్సుల్లో చేరికలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదిక–2020–21 విడుదల చేసింది. ఇందులోని గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ కోర్సుల్లో మొత్తం 4,13,80,713 మంది విద్యార్థులు చేరగా.. అందులో 3.26 కోట్ల మంది (78.9 శాతం) యూజీ కోర్సులు చదువుతున్నారు. ఇక పోస్ట్రుగాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో 47.16 లక్షలు (11.4 శాతం) మంది ఉన్నారు. ఇక డిప్లొమా కోర్సుల్లో చేరికలు తక్కువగానే నమోదయ్యాయని.. మొత్తం విద్యార్థుల్లో వీరి సంఖ్య 29.79 లక్షలే (7.2 శాతం)నని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరినవారిలో అత్యధికులు టెక్నికల్, పాలిటెక్నిక్, నర్సింగ్, టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదువుతున్నారు. అలాగే పీజీ డిప్లొమా కోర్సులను కేవలం 2.57 లక్షల మంది మాత్రమే అభ్యసిస్తున్నారు. ఇక సర్టిఫికెట్ కోర్సుల్లో చేరినవారు 1.55 లక్షల మంది మాత్రమేనని ఐష్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం విద్యార్థుల్లో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల వాటా వరుసగా 0.62, 0.38 శాతాలు మాత్రమేనని నివేదిక పేర్కొంది. బీఏ, బీకాంల్లో మహిళలు.. బీటెక్, బీఈల్లో పురుషులు.. జాతీయ స్థాయిలో పలు కోర్సుల్లో చేరికలను గమనిస్తే ఇంజనీరింగ్ కోర్సుల మినహా దాదాపు మిగిలిన అన్ని కోర్సుల్లోనూ పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీఏలో చేరిన వారిలో 52.7 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇక బీఎస్సీలో 52.2 శాతం, బీకాంలో 48.5 శాతం మంది మహిళలేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రం పురుషులతో పోలిస్తే మహిళల చేరికలు 28.5 శాతమే ఉన్నాయి. పీజీ సోషల్ సైన్సెస్ కోర్సుల్లోనూ 56.5 శాతం చేరికలతో మహిళలదే పైచేయిగా ఉంది. అలాగే పీజీ సైన్స్ కోర్సుల్లో 61.5 శాతం, మేనేజ్మెంట్ కోర్సుల్లో 43.1 శాతం, కామర్స్‌లో 66.5 శాతం మంది మహిళలు ఉన్నారు. ఎడ్యుకేషన్ విభాగంలోనూ 64.4 శాతంతో మహిళల చేరికలే అధికమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పీహెచ్డీ కోర్సుల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగంలో 33.3 శాతమే మహిళల వాటా. పీహెచ్డీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీల్లో 48.8 శాతం మంది మహిళలున్నారు. పీహెచ్‌డీలో పెరిగిన చేరికలు కాగా పీహెచ్డీ కోర్సుల్లో చేరికలు పెరిగాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2.11 లక్షల మంది పీహెచ్డీ కోర్సుల్లో చేరినవారున్నారు. వీరిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో 56,625 మంది ఉన్నారు. ఇక మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ వంటి అంశాల్లో 48,600 మంది పరిశోధనలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులు అభ్యసిస్తున్నవారు 2,255 మంది ఉన్నారు. పీజీలో అత్యధికం ఈ కోర్సుల్లోనే.. దేశంలో పీజీ కోర్సుల్లో చేరినవారిలో అత్యధికంగా 9,41,648 మంది సోషల్ సైన్సు కోర్సులను చదువుతున్నారు. సైన్సు కోర్సులు అభ్యసిస్తున్నవారు 6,79,178 మంది ఉన్నారు. 68,60,001 మంది మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్నారు. కామర్స్ కోర్సులో 5,36,560 మంది చేరారు. పీజీ కోర్సుల్లోనే భాషా సంబంధిత కోర్సుల్లో 3,20,176 మంది ఉన్నారు. ఇక ఎడ్యుకేషన్ విభాగం కోర్సులను 2,06,394 మంది చదువుతున్నారు. -
ఆర్‌సెట్‌లో ఏ, బీ కేటగిరీలకు సమానంగా సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్‌సెట్‌లో సీట్ల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. పీహెచ్డీ కోర్సుల్లోని సీట్లలో 50 శాతం ఏ–కేటగిరీలో, బీ కేటగిరీలో 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు జీవో నంబర్–1 విడుదల చేశారు. పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లను గతంలో ఆయా యూనివర్సిటీలే నేరుగా నిర్వహించేవి. కానీ గత ఏడాది నుంచి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉన్నత విద్యామండలి ద్వారా ఆర్‌సెట్‌ను నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. ఈ సీట్లను ఏ, బీ కేటగిరీలుగా భర్తీ చేస్తున్నారు. ఏ–కేటగిరీ సీట్లను జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించే నెట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్స్ (సీఎస్ఐఆర్) యూజీసీ నెట్, ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్), రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్టేట్ లెవల్ ఎలిజిబులిటీ టెస్ట్ (సెట్) తదితర ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన వారితో ఆర్‌సెట్‌లో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తుంటారు. ఇక బీ–కేటగిరీ సీట్లను ఆర్‌సెట్‌లో మెరిట్ సాధించిన పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు కేటాయిస్తుంటారు. గతంలో ఇచ్చిన జీవో నంబర్ 45 ప్రకారం ఆర్సెట్లోని సీట్లలో ఏ–కేటగిరీ అభ్యర్థులతో 25 శాతం సీట్లను, మరో 75శాతం సీట్లను బీ–కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసేవారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన తమకు 25 శాతం సీట్లు ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు విన్నవించడంతో ప్రభుత్వం రెండు కేటగిరీలకు సమానంగా సీట్లు వచ్చేలా 50 శాతం చొప్పున కేటాయింపు చేసింది. ఈ మేరకు గత జీవోను సవరిస్తూ కొత్తగా జీవో నంబర్–1ని విడుదల చేశారు. ఒక కేటగిరీలో మిగిలిన సీట్లను మరో కేటగిరీలోని అభ్యర్థుల ద్వారా భర్తీ చేసే వెసులుబాటు కల్పించారు. -
పీహెచ్డీ ఇక.. ఆషామాషీ కాదు.. నిబంధనలు సవరించిన యూజీసీ
విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన కోర్సుల నిర్వహణ నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరింత కఠినతరం చేసింది. పరిశోధనల్లో సమగ్రత లేమి, నాణ్యతారహితంగా థీసెస్‌ల రూపకల్పన, ఏళ్ల తరబడి కొనసాగింపు వంటి విమర్శలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూజీసీ పీహెచ్డీ కోర్సుల నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. – సాక్షి, అమరావత ప్రవేశాలనుంచే పకడ్బందీ చర్యలు ► అభ్యర్థులు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ, ఒక ఏడాది మాస్టర్ డిగ్రీ, లేదా మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీచేసిన వారు 55 శాతం మార్కులు సాధించి ఉంటేనే పీహెచ్డీ కోర్సుల్లో చేరడానికి అర్హులు. విదేశీ విద్యార్థులకైనా దీనికి సమాన ప్రమాణార్హతలుండాలి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్–క్రీమీలేయర్), విభిన్న ప్రతిభావంతులు, ఆర్థికంగా వెనుకబడినవర్గాలు (ఈడబ్ల్యూఎస్) తదితర కేటగిరీల అభ్యర్థులకు ఐదుశాతం మార్కుల సడలింపు ఇవ్వవచ్చు. ► గతంలో ఎంఫిల్ పూర్తిచేసి ఇప్పుడు పీహెచ్డీ కోర్సుల్లో చేరాలనుకునేవారికి కూడా 55% మార్కులు ఉండాలి. గ్రేడింగ్ విధానం అమల్లో ఉన్న విద్యాసంస్థల అభ్యర్థులకు పాయింట్ల స్కేల్లో సమానమైన గ్రేడ్ ఉండాలి. ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారానే ప్రవేశాలు ► ప్రత్యేక ప్రవేశపరీక్షల ద్వారానే ప్రవేశాలు చేపట్టాలి. ► యూజీసీ, ఇతర సంబంధిత అధీకృత ఉన్నతసంస్థల మార్గదర్శకాలననుసరించి రిజర్వేషన్లను పాటించాలి. ► యూజీసీ–నెట్, యూజీసీ–సీఎస్ఐఆర్, నెట్, గేట్, సీఈఈడీ ఫెలోషిప్, స్కాలర్‌షిప్‌లకు అర్హతపొందిన వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పించవచ్చు. లేదా ఆయా వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ప్రవేశపరీక్షలు నిర్వహించి చేర్చుకోవచ్చు. ► ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్‌లో 50 శాతం రీసెర్చ్ మెథడాలజీ, 50 శాతం సబ్జెక్టు ఉండాలి. ప్రవేశపరీక్షలో 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్–క్రీమీలేయర్), విభిన్న ప్రతిభావంతులు, ఈడబ్ల్యూఎస్ తదితర కేటగిరీల అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఇవ్వవచ్చు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పించాలి. ► ప్రవేశపరీక్ష మార్కులకు 70 శాతం, ఇంటర్వ్యూలకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి అర్హులను ఎంపికచేయాలి. ► మౌలిక సదుపాయాలు, తగినంతమంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉంటే ప్రైవేటు పీజీ కాలేజీలు కూడా పీహెచ్డీ కోర్సులను అమలు చేయవచ్చు. అడ్వయిజరీ కమిటీతో నిత్యం పరిశీలన ► ప్రతి వర్సిటీలో ఒక సీనియర్ ప్రొఫెసర్ కన్వీనర్‌గా యూనివర్సిటీ రీసెర్చి అడ్వయిజరీ కమిటీ ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ రీసెర్చి ప్రతిపాదనలను పరిశీలించి టాపిక్‌ను నిర్ణయిస్తుంది. పరిశోధన పద్ధతి, మెథడాలజీలను పరిశీలిస్తుంది. పరిశోధన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ► అభ్యర్థి తన పరిశోధనపై ప్రతి సెమిస్టర్‌కు ఈ కమిటీకి సంక్షిప్త నివేదిక ఇవ్వాలి. ఈ కమిటీ.. వర్సిటీ లేదా సంస్థకు పరిశోధనపై పురోగతి నివేదిక ఇవ్వాలి. ► పరిశోధన సంతృప్తికరంగా లేకపోతే అభ్యర్థికి కమిటీ సూచనలివ్వాలి. ఆ సూచనల ప్రకారం పరిశోధన చేయలేకపోతే ఆ పీహెచ్డీ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసేలా కమిటీ సిఫార్సు చేస్తుంది. ► అభ్యర్థి థీసెస్‌ను సమర్పించేముందు దానిపై అడ్వయిజరీ కమిటీ, ఇతర ఫ్యాకల్టీ సభ్యులు, పీహెచ్డీ అభ్యర్థుల సమక్షంలో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. థీసెస్ సంతృప్తికరంగా లేకపోతే తిరస్కరణ, పీహెచ్‌డీకి అనర్హత ► ఆయా ఉన్నత విద్యాసంస్థలు థీసెస్‌ను ప్లాగరిజం (కాపీకొట్టడం) కనిపెట్టేందుకు నిర్దేశించిన సాఫ్ట్వేర్ ఉపయోగించి పరిశీలించాలి. ► కాపీకొట్టలేదని, ఇంకెక్కడా సమర్పించలేదని అభ్యర్థి అండర్‌టేకింగ్ తీసుకుని పర్యవేక్షకుల సంతకాలతో థీసెస్‌ను అనుమతించాలి. ► తరువాత పర్యవేక్షకుడితోపాటు ఆయా రంగాల్లో పబ్లికేషన్లలో నిష్ణాతులైనæ ఇద్దరు బయటి నిపుణులతో అభ్యర్థిని పరిశీలన చేయించాలి. వీలైతే అందులో ఒకరు విదేశీ నిపుణులై ఉండాలి. ► బయటి నిపుణుల్లో ఏ ఒక్కరైనా థీసెస్‌ను రిజెక్టు చేస్తే ప్రత్యామ్నాయంగా మరో బయటి నిపుణుడి పరిశీలనకు పంపించాలి. అతను సంతృప్తి చెందితే.. ఫ్యాకల్టీ, పీహెచ్డీ స్కాలర్ల సమక్షంలో వైవా నిర్వహించాలి. ► ప్రత్యామ్నాయ పరిశీలకుడు థీసెస్‌ను ఆమోదించకపోతే దాన్ని ఆ ఉన్నత విద్యాసంస్థ తిరస్కరిస్తుంది. ఆ అభ్యర్థిని పీహెచ్డీ అవార్డుకు అనర్హుడిగా ప్రకటిస్తుంది. ► పీహెచ్డీ అవార్డు ప్రక్రియను ఆయా సంస్థలు ఆరునెలల్లో పూర్తిచేయాలి. ► థీసెస్ సంతృప్తికరంగా ఉండి పీహెచ్డీ అవార్డుకు అర్హత సాధించినవారికి దాన్ని జారీచేసేముందు ఆయా విద్యాసంస్థలు ఆ థీసెస్ సాఫ్ట్‌కాపీ (ఎలక్ట్రానిక్ కాపీ) ఇతర సంస్థలకు అందుబాటులోకి వచ్చేలా యూజీసీ ఆధ్వ2ర్యంలోని ఇన్‌ఫ్లిబినెట్ (ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్)కు సమర్పించాలి. నిర్దిష్ట కాలపరిమితి ► ప్రవేశం పొందిన రోజునుంచి కనీసం మూడేళ్లలో.. గరిష్టంగా ఆరేళ్లలో పూర్తిచేయాలి. ► ఆయా సంస్థల నిబంధనలను అనుసరించి గడువును అదనంగా రెండేళ్ల వరకు పొడిగించవచ్చు. ► 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యమున్న వారికి మరో రెండేళ్లు గడువు ఇవ్వవచ్చు. గరిష్టంగా పదేళ్లకు మించి గడువు ఇవ్వరాదు. ► మహిళలకు 240 రోజులు ప్రసూతి, శిశుసంరక్షణ సెలవులు ఇస్తారు. అదనపు అర్హతలుంటేనే పర్యవేక్షణ బాధ్యత ► పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ లేదా సూపర్వైజర్, సహ సూపర్వైజర్లుగా నియమితులయ్యేవారికి నిర్దేశిత అర్హతలు ఉండాలి. ► వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోని రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు ఐదు, అసిస్టెంటు ప్రొఫెసర్లకు మూడు రీసెర్చి పబ్లికేషన్లు ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమై ఉంటేనే గైడ్లుగా నియమించాలి. ► ఇతర సంస్థల్లో గైడ్‌గా వ్యవహరించేవారికి బాధ్యత ఇవ్వరాదు. అలాంటి వారిని కో సూపర్వైజర్గా నియమించవచ్చు. ► ఇతర సంస్థల నిపుణుల పర్యవేక్షణలోని పరిశోధనలకు పీహెచ్‌డీలను ప్రదానం చేయడం నిబంధనలకు విరుద్ధం. ► ప్రొఫెసర్ ఎనిమిదిమందికి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆరుగురికి, అసిస్టెంటు ప్రొఫెసర్ నలుగురికి పర్యవేక్షకులుగా ఉండవచ్చు. ► మహిళలు పెళ్లి, ఇతర కారణాలవల్ల అదే పరిశోధనను ఇతర విద్యాసంస్థల్లోకి మార్చుకోవచ్చు. ► అభ్యర్థులు తమ పరిశోధనతోపాటు ఆ అంశంపై విద్యాబోధన, రచన అంశాలపైనా శిక్షణ పొందాలి. ట్యుటోరియల్, లేబొరేటరీ వర్కు, మూల్యాంకనాలతోసహా వారానికి నాలుగు నుంచి ఆరుగంటలు బోధన, పరిశోధన అసిస్టెంట్‌షిప్‌లలో పాల్గొనాలి. ► థీసెస్ సమర్పించాలంటే యూజీసీ నిర్దేశించిన 10 పాయింట్ల ప్రామాణికాల్లో 55 శాతం పాయింట్లు సాధించాలి. -
ఓయూ ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, న్యాయశాస్త్రం, వ్యాయామ విద్య, ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాలకు ఆయా కాలేజీల్లో రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంత కాలం కేవలం ఓయూ కాలేజీలకే పరిమితమైన పీహెచ్డీ కోర్సు కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుతో ఇక నుంచి ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా కొనసాగనుంది. రీసెర్చ్ సెంటర్ల అనుమతికి ఆన్లైన్ దరఖాస్తులకు ఈనెల 10 వరకు అవకాశం కలి్పంచారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత వలన క్యాంపస్, అనుబంధ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ సీటు ఒక్కటి కూడా లేదు. దీంతో ఐదేళ్లుగా పీహెచ్డీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయాయి. వర్సిటీ అభివృద్ధికి చేపట్టిన పలు సంస్కరణల్లో భాగంగా పరిశోధన విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన పరిశోధనల కోసం పీహెచ్డీ ప్రవేశాలకు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు సభ్యుల ఆమోదం లభించినందున ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా పీహెచ్డీ కోర్సులకు అనుమతించాలని నిర్ణయించారు. ఓయూ పరిధిలో పలు పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో పరిశోధనలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గైడ్íÙప్ అర్హత గల ఇద్దరు అధ్యాపకులు ఉన్న కాలేజీలకు రీసెర్చ్ సెంటర్‌కు అనుమతి ఇవ్వనున్నారు. ఓయూ ద్వారానే పీహెచ్డీ ప్రవేశాలు, పరీక్షలు: రిజి్రస్టార్ రీసెర్చ్ సెంటర్లకు అనుమతి లభించిన ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్డీ ప్రవేశాలతో పాటు ప్రీ పీహెచ్డీ పరీక్షలు, వైవా (సెమినార్) ఓయూ చేపడుతుందని రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ తెలిపారు. పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఆయా ప్రైవేట్, అటానమస్ కాలేజీల అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్డీ ఫీజులు కూడా ప్రైవేట్, అటానమస్ కాలేజీలకు చెల్లించాలని సూచించారు. ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్డీ చేసే విద్యార్థులకు ఓయూ క్యాంపస్‌లో హాస్టల్ వసతి ఉండదని లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. -
మత్స్యకళాశాలలో పీహెచ్డీ కోర్సులు
–సోమవారం నుంచి తరగతులు ప్రారంభం అభివృద్ధి పనులకు నిధుల వరద ముత్తుకూరు: ముత్తుకూరు మత్స్యకళాశాలలో 2016–17 సంవత్సరం నుంచి పీహెచ్డీ కోర్సులు ప్రారం¿¶భం కానున్నాయి. సోమవారం నుంచి తరగతులు మొదలవుతాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆమోదంతో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ వీటిని మంజూరు చేసింది. మొదటి సారిగా 'అక్వాకల్చర్' విభాగంలో 2 సీట్లకు సంబంధించి ఈ కోర్సులు మొదలవుతాయి. బీఎఫ్ఎస్సీ మొదటి సంవత్సరం సీట్ల సంఖ్య 40కి పెంచారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది విద్యార్థులు చేరారు. త్వరలో జరిగే 3వ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లు కూడా భర్తీ అవుతాయని ప్రొఫెసర్లు భావిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 8 మంది చేరారు. చిత్తూరు, పశ్చిమగోదావరి, అనంతపురం, కడప జిల్లాల నుంచి ఒక్కొక్క విద్యార్థి చేరారు. అభివృద్ధి పనులకు నిధుల వరద: మత్స్యకళాశాల అభివృద్ధికి ఎన్నడూ లేనంతగా నిధులు మంజూరయ్యాయి. ఐసీఏఆర్ ద్వారా రూ.కోట్ల నిధులు విడుదలయ్యాయి. ముఖ్యంగా కళాశాల ప్రధాన భవనంపై అంతస్తు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరుకాగా, మొదటి దశలో రూ.1.20 కోట్లు విడుదలయ్యాయి. విద్యార్థినుల హాస్టల్ భవనం మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.1.50 కోట్లు, అక్వాకల్చర్ అనిమల్ హెల్త్ విభాగం అదనపు భవన నిర్మాణానికి రూ.1.10 కోట్లు మంజూరైంది. ముఖ్యంగా ఆర్నమెంటల్ ఫిష్ రేరింగ్ యూనిట్(రంగు చేపల పెంపక కేంద్రం) నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరైంది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ ఫండ్ ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయి. అలాగే, ఫిషరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ల్యాబ్ భవన నిర్మాణానికి రూ.1 కోటి మంజూరైంది. పీజీ విద్యార్ధుల హాస్టల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. జనవరిలో కళాశాల రజతోత్సవాలు: రాష్ట్రంలో ఏకైక మత్స్యకళాశాల ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయి సందర్భంగా జనవరిలో మూడు రోజుల పాటు రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఇన్చార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ రామలింగయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా వెనామీ రొయ్యల పెంపకం స్థితిగతులపై భారీ స్థాయిలో వర్క్‌షాప్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రజతోత్సవాల నిర్వహణకు అసోసియేట్ డీన్ డాక్టర్ కే ఎస్ కృష్ణప్రసాద్ కన్వీనర్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.