సాక్షి, అమరావతి/నూజివీడు/వేంపల్లె: ట్రిపుల్ ఐటీల్లో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ఉన్న 4,400 సీట్లకు ఈ ఏడాది 38,355 మంది దరఖాస్తు చేశారన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 23,628(83శాతం) మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 14,727(17 శాతం) మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు.
పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా కౌన్సెలింగ్‌కు ఎంపిక చేశామన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినవారి జాబితాను గురువారం మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు ఎంపికైన టాప్–20లో ప్రభుత్వ విద్యార్థులే ఉన్నారని వెల్లడించారు. పదో తరగతిలో 600కి 599 మార్కులు వచ్చిన విద్యార్థి సైతం ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం గర్వకారణమన్నారు.
కౌన్సెలింగ్‌కు ఎంపికైన జనరల్ విద్యార్థుల కటాఫ్ మార్కులు 583గా ఉన్నట్టు చెప్పారు. ట్రిపుల్ ఐటీల్లో ఇప్పటికే పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి పీహెచ్‌డీ కోర్సులనూ ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు. కాగా, ఈ నెల 20, 21 తేదీల్లో నూజివీడు క్యాంపస్‌లో, 21, 22 తేదీల్లో ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ)లో, ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి 24, 25 తేదీల్లో ఆర్కే వ్యాలీలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
శ్రీకాకుళం క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మొత్తం అర్హుల్లో 3,345 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 695 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కార్య క్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి, వైస్ చాన్స లర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment